కరోనా ప్రాణం ఖరీదు..
posted on May 4, 2021 @ 1:20PM
దేశం లో, రాష్ట్రంలో కరోనా సృష్టిన బీభత్సము అంత, ఇంత కాదు. అంతటా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి మరో ఎత్తు. తెలంగాణాలో ఎంతగా విషమంగా మారిందంటే. కరోనా నుండి ఎవరైనా కోలుకుంటేనో, లేదంటే చనిపోతేనో మాత్రమే వెంటిలేటర్ బెడ్ ఖాళీ అవుతోంది. ఈ చికిత్సలో కనీసం రోజుకు 20 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. బాధితుడు తనంతట తానుగా ఊపిరి పీల్చుకునే వరకూ చికిత్స అవసరం ఉంటుంది. ఇదే సమయంలో నాలుగు ఆక్సిజన్ బెడ్లపై ఉన్న రోగులకు ఒక నర్స్ అవసరం కాగా, వెంటిలేటర్ బెడ్ పై ఉన్న రోగి సహాయార్థం ఒక నర్సును నియమించడం తప్పనిసరని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా లక్షణాలు లేకుండా, స్వల్ప లక్షణాలతో ఉన్న వారు వైద్యుల సలహాలను తీసుకోకుండానే ఇంట్లో చికిత్సలు తీసుకుంటూ హోమ్ ఐసొలేషన్ కు పరిమితం అవుతున్నారని, వారిలో పరిస్థితి విషమించడంతోనే వెంటిలేటర్ బెడ్లకు డిమాండ్ పెరుగుతోందని ఒకవైపు వైద్యులు అంటున్నారు.
కట్ చేస్తే.. హైదరాబాద్ కి చెందిన ఒక వ్యాపారి తన కొడుకు వెంటిలేటర్ ఇవ్వండి అని పెద్ద మొత్తం లో నగదు ప్రకటించాడు. నా కుమారుడికి కరోనా సోకింది. వెంటిలేటర్ అత్యవసరం. లేకుంటే వాడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వెంటిలేటర్ ఇచ్చి, మా వాడి ప్రాణాలు కాపాడితే రూ. 50 లక్షలు ఇస్తాను. దానికి బిల్లు కూడా వద్దు. అంత మొత్తం ఎక్కువని భావిస్తే, మిగిలే డబ్బులతో పేదలకు కరోనా వైద్యం చేయండి" ఇది హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి కార్పొరేట్ ఆసుపత్రులకు ఇచ్చిన ఆఫర్. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే, అంత ఆఫర్ ఇచ్చినా, ఆ వ్యాపారి కుమారుడికి దాదాపు 24 గంటల తరువాత మాత్రమే వెంటిలేటర్ లభించింది. దీన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్ లో ప్రాణాలు నిలిపే వెంటిలేటర్ లకు ఎంత డిమాండ్ ఉందన్న విషయం తెలుస్తుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఒక్కో వెంటిలేటర్ కోసం దాదాపు 15 మంది కరోనా బాధితులు పోటీపడుతున్న పరిస్థితి. ఇందుకు కారణం తొలి దశలో వెంటిలేటర్ అవసరమైతే నాలుగు రోజుల్లో కోలుకుని సాధారణ స్థితికి వచ్చే వారు. కానీ, రెండో దశలో వెంటిలేటర్ అవసరమైతే, కనీసం రెండు వారాల పాటు వినియోగించాల్సి వస్తోంది. దీంతో ప్రాణాధార యంత్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక వెంటిలేటర్ అవసరమై, డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధమైన వారు కూడా నిరాశ చెందాల్సిన పరిస్థితి. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారికి తాత్కాలికంగా వెంటిలేటర్ బెడ్లకు బదులుగా ఆక్సిజన్ బెడ్లు ఇస్తామని, రెండు మూడు రోజుల తరువాత ఖాళీ అయితే, వెంటిలేటర్ బెడ్లు ఇస్తామని, ఈలోగా ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు ఖరాఖండీగా చెబుతున్నాయి. వెంటిలేటర్ల కోసం ఇంతగా డిమాండ్ పెరగడం ఇంతవరకూ ఎన్నడూ చూడలేదని వైద్యులే చెబుతుండటం గమనార్హం.
ఏది ఏమైనా కరోనా ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరిని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఎక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రభుత్వాలకు మాత్రం ప్రజల ఆరోగ్యాలు పట్టడం లేదు. వారికీ కావాల్సింది ఎన్నికలు, అధికారం మాత్రమేనని, ప్రజా ఆరోగ్యం వారికి అవసరం లేదని తెలుస్తుంది. ఒక వైపు హై కోర్టు, సుప్రీం కోర్టు సైతం లాక్ డౌన్ పై తన అభిప్రాయాన్ని ఇవ్వమని ప్రభుత్వాలను ప్రశ్నించిన కేంద్ర, రాష్ట్రాలకు న్యాయస్థానం మాట చెవిన పడడం లేదు.