టీటీడీలో రచ్చ రమణ.. హైకోర్టు నోటీసులు..
posted on May 4, 2021 @ 2:16PM
ఒక వ్యక్తి. అనేక ఆరోపణలు. ఒక అర్చకుడు. అనేక వివాదాలు. ఒక రమణ దీక్షితులు. ఆలయంలో రాజకీయాలకు కారకుడు. ఇలా ఆయన ఎప్పటి నుంచో కాంట్రవర్సీలకు కేరాఫ్. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఫుల్ పాపులర్. ఏళ్లుగా స్వామి వారి సేవలో ఉన్నారు. ఎంత దైవ భక్తో.. అంతకుమించి రాజకీయ భక్తి కూడా ఉందంటారు. అందుకే, నిత్యం ఆయన చుట్టూ ఏదో ఒక వివాదం. తాజాగా, ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులుని నియమించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధర్మాసనం పిల్‌ను విచారణకు స్వీకరించింది. ఏపీ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది.
శతాబ్దాలుగా శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా, భక్తజన సంద్రంగా అలరారుతోంది. ఇప్పటి వరకూ ఎందరో కలియుగ దేవుని సన్నిధిలో ప్రధాన అర్చకులుగా చేశారు. కానీ, రమణ దీక్షితులు పేరు మారుమోగినంతగా మరెవరి పేరూ వార్తల్లో నిలవలేదు. రాజకీయంగా వివాదాస్పదం కాలేదు. ఆలయంలో పూజలు చేసుకునే అర్చకుడికి రాజకీయాలతో ఏం సంబంధమో అస్సలు అర్థం కాదు. రమణ దీక్షితులుకి చంద్రబాబు అంటే అస్సలు గిట్టదని అంటారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ను ఇబ్బంది పెట్టేలా పలు అంశాలు తెర మీదకు తెచ్చారు. అవి అప్పట్లో రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి.
శ్రీవారి ఖజానాలో అత్యంత అరుదైన, విలువైన పింక్ డైమండ్ ఉండేదని.. అదిప్పుడు కనుమరుగు అయిందంటూ వివాదం చెలరేగింది. పింక్ డైమండ్ పగిలిందంటూ కూడా ప్రచారం జరిగింది. మరింత కాంట్రవర్సీ కోసం.. చంద్రబాబే ఆ పింక్ డైమండ్ తస్కరించారంటూ రాజకీయ దుమారం చెలరేగింది. విషయం సుప్రీం కోర్టు కమిటీల వరకూ వెళ్లింది. అలా ఆ ఐదేళ్లూ.. చంద్రబాబు, రమణ దీక్షితులు ఏదో ఒక విధంగా వివాదాల్లో ఉండేవారు.
కట్ చేస్తే.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఓ జీవోతో రమణ దీక్షితులును ప్రధాన అర్చకులు హోదా నుంచి దించేసింది. 65 ఏళ్ల వయసు వారు ఆ స్థానానికి అర్హులు కాదంటూ జీవో జారీ చేసి రమణ దీక్షితులుకి చెక్ పెట్టింది. ఆ జీవో ప్రకారం.. రమణ దీక్షితులు హోదా ఊడిపోగా.. ఆ స్థానంలో వేణుగోపాల దీక్షితులును తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా నియమించింది అప్పటి చంద్రబాబు సర్కారు. జీవోపై రమణ దీక్షితులు కోర్టుకు వెళ్లడం.. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా.. ప్రభుత్వ దాన్ని అమలు చేయకపోవడం.. ఇలా చంద్రబాబు వర్సెస్ రమణ దీక్షితులు ఎపిసోడ్ రాజకీయంగా రచ్చ రాజేసింది.
రమణ దీక్షితులు శ్రీవారి భక్తులు. జగన్‌రెడ్డికి రాజకీయ సేవకుడు. జగన్ మరో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ అప్పట్లో మనసారా ఆశీర్వదించారు రమణ దీక్షితులు. అందుకే, జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక.. మళ్లీ రమణ దీక్షితులుకు మంచి రోజులు వచ్చాయి. అయితే, జగన్ సీఎం అయిన వెంటనే ఆయన్ను పదవి వెతుక్కుంటూ ఏమీ రాలేదు. పూర్వ వైభవం వచ్చేందుకు ఆయనకు ఏడాదికి పైనే సమయం పట్టింది. రమణ దీక్షితులు ఎంత కాంట్రవర్సీయో తెలిసే.. జగన్ సీఎం అయిన వెంటనే ఆయనకు ప్రధాన అర్చకులు హోదా కట్టబెట్టలేదు అంటారు. పదే పదే ఒత్తిడి తెచ్చి.. జగన్‌ను ఒప్పించి మరీ.. ఇటీవలే ఆయన తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడి పదవి తెచ్చుకున్నారు. తనను తొలగించి రమణ దీక్షితులుకి ఆ పదవి కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేణుగోపాల దీక్షితులు తాజాగా హైకోర్టులో పిల్ వేశారు. దీంతో.. రమణ దీక్షితులు మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు.. తాను ఆ పదవిని అలంకరించాక.. మళ్లీ పింక్ డైమండ్ ప్రస్తావన ఎత్తడమే లేదు. నిజంగా పింక్ డైమండ్ ఉండి ఉంటే.. అది పగలడమో, లేక, అపహరణకు గురై ఉంటే.. ఇప్పుడు జగన్‌రెడ్డే కదా సీఎంగా ఉంది.. రమణ దీక్షితులేగా ప్రధాన అర్చకులుగా ఉన్నారు.. విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గు తేలుతాయిగా? నిజంగా చంద్రబాబుది తప్పేమైనా ఉంటే దోషిగా నిలబెట్టొచ్చుగా? ఆలస్యం ఎందుకు? భయం ఎందుకు? ఓహో.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదనే విషయం తేలిపోతుందనా?