రాసిచ్చింది చదివేశారు! టీఆర్ఎస్ నేతల పీసీపై రచ్చ
posted on May 4, 2021 @ 3:41PM
తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఈటల రాజేందర్ వ్యవహారంలో ఎట్టకేలకు టీఆర్ఎస్ మౌనం వీడింది. నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై టీఆర్ఎస్ నేతలు స్పందించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మాట్లాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈటల వ్యవహారంలో ముఖ్యమంత్రిని సమర్ధించిన గులాబీ నేతలు... ఈటలపై ఘాటు విమర్శలు చేశారు. రాజేందర్ తో టీఆర్ఎస్ నేతలెవరు లేరని చెప్పారు.
ఈటలను టార్గెట్ చేస్తూ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతల స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ అధినేతల డైరెక్షన్ లోనే మీడియా ముందుకు వచ్చారని తెలుస్తోంది. ముందే రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించారు. సొంతంగా ఒక్క మాట మాట్లాడకుండా అంతా హైకమాండ్ రాసిచ్చిన పదాలనే చెప్పారనే విమర్శలు వస్తున్నాయి. కొప్పుల ఈశ్వర్ కొంత సొంతంగా మాట్లాడినా.. గంగుల కమలాకర్ మాత్రం పూర్తిగా పేపర్లు చదువుతూనే ఉన్నారు. ఈటలపై గంగుల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావాలనే టీఆర్ఎస్ పెద్దలు గంగులతో ఈటలను టార్గెట్ చేయించారని అంటున్నారు.
గంగుల కేబినెట్ లోకి వచ్చాకే ఈటలతో కేసీఆర్ కు గ్యాప్ పెరిగిందనే ప్రచారం ఉంది. ఈటలకు చెక్ పెట్టేందుకే గంగులను కేబినెట్ లోకి తీసుకున్నారని అంటారు. అందుకే గంగుల.. ఈటలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇంతేకాదు గంగుల టీఆర్ఎస్ లోకి మధ్యలో వచ్చారు. అలాంటి నేత.. ఈటల వచ్చేనాటికే... తమ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉందని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. ఈటల టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించిన తర్వాత పార్టీలోకి వచ్చిన గంగుల... ఈటలను విమర్శించడంపై తెలంగాణ వాదులు, ఈటల మద్దతుదారులు భగ్గుమంటున్నారు.
ఈటలకు బీసీ సంఘాల నుంచి మద్దతు వస్తుండటంతో... ఆ అంశంపైనే టీఆర్ఎస్ ఫోకస్ చేసినట్లు కనిపించింది. అందుకే మంత్రిగా ఈటల బీసీల గురించి ఏనాడు మాట్లాడలేదని విమర్శించారు. గంగుల అయితే ఈటల హుజురాబాద్ లో బీసీ.. హైదరాబాద్ లో ఓసీ అంటూ రెచ్చిపోయారు. కేసీఆర్ వల్లే ఈటలకు పదవులు వచ్చాయని మంత్రులు అనడంపై రాజకీయ వర్గాల నుంచి విస్మయం వ్యక్తం అవుతోంది. కేసీఆర్ వల్లే ఈటలకు పదవులు వచ్చాయని చెబుతున్న నేతలు... చంద్రబాబు వల్లే కేసీఆర్ ఈ స్థాయికి ఎదిగాడని చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల పాత్ర జనాలందరికి తెలుసుంటున్నారు. ఇంతకాలం బీసీ నేతగా ఈటలను కీర్తించిన నేతలే.. ఇప్పుడు అతను బీసీలకు ఏమి చేయలేదని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీస్తున్నారు.
ఈటల ఎపిసోడ్ తర్వాత విపక్షాలు, ప్రజా సంఘాలు, రాజకీయ వర్గాల్లో వస్తున్న ప్రధాన చర్చ భూకబ్జాలు. అసైన్డ్ భూములు ఆక్రమించారని ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించిన కేసీఆర్.. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర మంత్రులు, నేతలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. అయితే ఈటల అంశంపై మీడియా ముందుకు వచ్చిన మంత్రులు, టీఆర్ఎస్ నేతలు.. తమపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై మాత్రం స్పందించలేదు. మొత్తంగా హైకమాండ్ ఆదేశాలతో మీడియాతో మాట్లాడారే కాని.. తమ ఇష్టపూర్వకంగా మాట్లాడినట్లు కనిపించలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.