తిలా పాపం తలా పిడికెడు!
నిజం. దేశంలో ప్రతిపక్షాలకు అవకాశాలు క్షీణిస్తున్నాయని, ఇది దురదృష్టకర పరిణామంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలో నిజముంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పని తీరు, రోజు రోజుకు, రాను రాను రాజు గుర్రం ... సామెతను గుర్తుకు తెస్తోంది.
నిజానికి, ప్రతిపక్షాల పాత్ర క్షీణించడం ఒక్కటే కాదు, భర్త ప్రజాస్వామ్య వ్యవస్థ అంతకు మించిన సవాళ్ళనే ఎదుర్కుంటోంది. అందుకే, పతనమవుతున్న ప్రజాస్వామ్య విపువల గురించిన ఆందోళన ఆలోచనన పరులు అందరిలోనూ వుంది. అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రాజకీయ వ్యవస్థ దిగజారిపోతున్న తీరు పట్ల ఇదే రీతిన ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నట్లుగా, ప్రతిపక్షాల స్పేస్ తగ్గిపోవడం ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా అనేక రుగ్మతలతో ప్రజస్వామ్య వ్యవస్థ రోజురోజుకు దిగాలవుతోంది. ప్రజాస్వామ్య విలువలు పతన మవుతున్నాయి. నిజమే గతంలో రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య రాజకీయ వైరుధ్యం మాత్రమే ఉండేది. అంతే గానీ, చట్ట సభల లోపల గానీ, వెలుపల గానీ రాజకీయ నాయకుల మధ్య వ్యక్తిగత శతృత్వం అనేది మచ్చుకైనా కనిపించేంది కాదు. ఇదుకు చరిత్రలో చాలా ఉదహారణలు కనిపిస్తాయి.
అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జస్టిస్ ఎన్వీ రమణ అన్నట్లుగా, గతంలో ప్రతిపక్ష నాయకులు కీలక పాత్ర పోషించేవారు. ప్రభుత్వం, ప్రతిపక్షం పరస్పరం గౌరవించుకునేవి. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షానికి అవకాశాలు క్షీణిస్తున్నాయి.ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చట్ట సభలు, రాజకీయ వికృత క్రీడకు వేదికగా మారుతున్నాయి. అందుకే, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నట్లుగా, సమగ్రంగా చర్చలు, పరిశీలనలు లేకుండా బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. చివరకు వేల లక్షల కోట్ల ప్రజాధనంతో ముడిపడిన బడ్జెట్ కూడా చర్చ లేకుందానే ఆమోదం పొందుతోంది.
అందుకే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజకీయ ప్రత్యర్థులను విరోధులుగా భావించరాదన్నారు.
కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులను చూస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమంటే ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయడమన్నారు. బలమైన, శక్తిమంతమైన, చురుకైన ప్రతిపక్షం పరిపాలనను మెరుగుపర్చడానికి, ప్రభుత్వ కార్యకలాపాలను సరిచేయడానికి సహకరిస్తుందన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య సహకారం ఒక ప్రగతి శీల ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందని చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడంలో విఫలమైతే మార్పు రూపంలో ప్రజలు తమ ఇష్టాన్ని వ్యక్తం చేయడాన్ని చరిత్ర చూసిందని గుర్తుచేశారు.
అవును. చీఫ్ జస్టిస్ చెప్పినట్లుగా, ప్రతి పక్షాలకు స్పేస్ లేక పోవడం కానీ, ఇతర ప్రజాస్వామ్య రుగ్మతలు కానీ, ప్రజస్వామ్య వ్యవస్థను, స్పూర్తిని చిన్నాభిన్నం చేస్తున్నాయి. అయితే, ఇందుకు ఎవరు బాధ్యులు? అంటే, నిజం చెప్పాలంటే, అందరూ బాధ్యులే, తిలాపాపం తలా పిడికెడు.