తెలంగాణాను ఆదుకోండి..ప్రధానికి రేవంత్ లేఖ
posted on Jul 16, 2022 @ 5:46PM
గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో జనజీవనం అస్త వ్యస్తంగా మారింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుండి వస్తున్న వరదతో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. గోదావరికి వరద పోటెత్తడంతో అనేక గ్రామా లు నీట మునిగి, ప్రజలు నిరాశ్రయులయ్యారు. పంట నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. తెలంగాణ లో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోడీకి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో నెలకొన్న పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని వెంటనే పంపించాలని ప్రధాని మోడీ కి రాసిన లేఖలో లేఖలో విజ్ఞప్తి చేశారు. అంతేగాక పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలని కోరా రు. రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం ఇవ్వాలని, పంటలను తిరిగి సాగు చేసేందుకు విత్తనా లు , ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి తక్షణ ఉపశమన ప్యాకేజీగా 2 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించా లని లేఖలో కోరారు. రోడ్లను మరమ్మతు చేయడానికి పునర్నిర్మించడానికి, నిత్యావసర వస్తువుల సరఫరా ను పునరుద్ధరించటానికి కేంద్రం సహాయం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాదు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వరద ముంపునకు గురయ్యాయని లేఖలో పేర్కొన్న రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వరద పరిస్థితిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఆరోపించారు.
రాష్ట్రంలో కుండ పోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారితే, గ్రామాలన్నీ చెరువులను తలపిస్తూ ఉంటే కెసిఆర్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వందేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో కుంభవృష్టి వర్షం కురిసి ఉత్తర తెలంగాణ జిల్లాలో పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వరి, పప్పు ధాన్యాల పంటలు పూర్తిగా నీట మునిగి సర్వనాశనమై పోతే ఒక ఎకరం కూడా పంట నష్టం జరగలేదని ట్విట్టర్ పిట్ట కూతలు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగి నట్టు సమాచారం లేదని తెలిసి తెలియక మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించడం అవివేకమని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం ఒక లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడుతున్నారని, కానీ వాటి నిర్వ హణకు నయాపైసా విడుదల చేయడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు, కమిషన్ ఇచ్చేవారికి ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి కానీ ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఇవ్వడానికి మాత్రం ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవని రేవంత్ రెడ్డి ఆరోపించారు.