ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ కర్
posted on Jul 16, 2022 @ 12:10AM
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. శనివారం రాత్రి మోడీ అధ్యక్షతన సమవేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో జగదీప్ ధన్ కర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించింది.
ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. 1989 నుంచి 1991 వరకూ లోక్ సభ సభ్యుడిగా, ఆ తరువాత 1993 నుంచి 1998 వరకూ కిషన్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న జగదీప్ దినకర్ 2019 జులై 30న పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారం (జులై 19)తో ముగియనున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్ ను ఖరారు చేశారు. ఉప రాష్ట్ర పతి ఎన్నిక పోలింగ్ ( ఒక వేళ అవసరమైతే) ఆగస్టు 6న జరుగుతుంది. అదే రోజున ఫలితం వెలువడుతుంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు విపక్షాలను సంప్రదించే అవకాశాలున్నాయని జేపీ నడ్డా తెలిపారు. అయితే విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాలు ఆదివారం (జులై 17) సమావేశం కానున్నాయి.
రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి విపక్ష నేతలంతా హాజరౌతారని భావిస్తున్నారు. అయితే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో జగదీప్ ధన్ కర్ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంఛనమే అవుతుంది. ప్రస్తుత ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టనున్నారు.