మండపేట సభలో పవన్ వ్యాఖ్యలతో పొత్తులపై ఊహాగానాలు
posted on Jul 16, 2022 @ 11:52PM
మండపేటలో జనసేన రైతు భరోసా యాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ ఏపీకి హానికరంగా మారిందన్నారు. మరో సారి జగన్ సర్కార్ అధికారంలోకి వస్తే ఏపీకి అంధకారమేనన్నారు. పాదయాత్ర చేసినంత మాత్రాన జగన్ మహాత్మాగాంధీ అయిపోరని, ఆయన అధికారం కోసమే నడిచారన్నారు.
ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేసిన జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ చైతన్యం ఉన్న తూర్పుగోదావరి జిల్లా నుంచే మార్పు రావాలన్నారు. కోనసీమ విధ్వంసం వెనుక ఉన్నది వైసీపీయే అని ఆరోపించారు. నిజంగా అంబేడ్కర్ మీద ప్రేమతో కాకుండా రాజకీయ దురుద్దేశంతో కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టారని విమర్శించారు. అంబేడ్కర్ ను రాజకీయాలకు వాడు కోవడం సరికాదన్నారు.
ఈ సభ వేదికగా ఆయన పొత్తులపై మాట్లాడే అవకాశం ఉందని అంతా భావించినా ఆయన పొత్తుల గురించి నేరుగా ప్రస్తావించలేదు. ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలకు అండగా ఉంటానని పవన్ కల్యాణ్ అన్నారు. అదే సమయంలో రాష్ట్ర్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే అంధకారమే అని హెచ్చరించారు. అభ్యర్థిని చూసి కాకుండా తనను చూసి ఓట్లేయాలని జనసేనాని అన్నారు.
ఓడినా ప్రజలకు అండగా ఉంటానని అనడం, అదే సమయంలో 2024 ఎన్నికలలో జనసేన విజయం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేయడంపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. తనను చూసి ఓటేయండి అభ్యర్థిని చూసి కాదు అనడం వెనుక పొత్తులకు సంబంధించిన సంకేతమేమన్నా ఉందా అన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద పవన్ కల్యాణ్ జనసేన రైతు భరోసా యాత్రలో ఎన్నికల శంఖారావం మోగించేశారనీ, వైసీపీని గద్దె దించడమే జనసేన లక్ష్యంగా ప్రకటించేశారనీ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ప్రస్తావన తీసుకురాకపోవడం, తెలుగుదేశంపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయకపోవడంతో రాష్ట్ర్రంలో మళ్లీ 2014 ఎన్నికల నాటి పొత్తులకు ఏమైనా అవకాశం ఉందా అన్న కోణంలో కూడా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.