వంద గ్రాముల కందిపప్పు.. నాలుగు టమాటాలు.. నాలుగు ఆలుగడ్డలు.. వరద బాధితులకు జగన్ సాయం

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించి ప్ర‌జ‌ల‌కు, పంట‌ల‌కు తీవ్ర నష్టం వాటిల్లినప్పుడు ప్ర‌భుత్వాలు ముంపు బాధితులకు తక్షణం నిత్యావసరాలు అందించి ఆదుకోవడం కనీస ధర్మం, బాధ్యత.   కానీ జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. వ‌ర‌ద బాధితుల‌కు వంద గ్రాముల కందిప‌ప్పు, నాలుగే నాలుగు ట‌మాటాలు,ఆలూ ఇవ్వ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు విమర్శించారు.    ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌లి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో భారీ వరదలు తీవ్ర‌ న‌ష్టం కలిగించాయి గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు చేరి ప‌లు చోట్ల లోత‌ట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వ‌ర్షాలు తెరిపివ్వ‌గానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే చేప‌ట్టి ప‌రిస్థితులు తెలుసుకున్నారు. ప్ర‌జ‌లను వెంట‌నే ఆదుకోవ‌డానికి బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు.. ఒక్కోకుటుంబానికి  2 వేల రూపాయల నగదు తాగునీరు, రేషన్, పశుగ్రాసం అందించాలని  అధికారులను ఆదేశించారు.  లంక గ్రామాల్లో బాధితులకు అధికారులు చేసిన వరద సాయం  ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆవేదన కలిగిస్తుంది.  జగన్ ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా  ముంపునకు గురై సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన లంక గ్రామాల ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వం తరఫున వంద‌ గ్రాముల కంది పప్పు.. నాలుగంటే నాలుగు టమాటాలు, నాలుగు ఉల్లిపాయలు, నాలుగు బంగాళాదుంపలు అందిస్తున్నారు. అస‌లీ లెక్క‌లేమిటో, ఎవ‌రు చెప్పారో తెలీదు. కానీ   ఖ‌చ్చితంగా అంతే ఇస్తున్నారు. ఈ మాత్రం దానికే ఎంతో గొప్పగా బాధితులను ఆదుకుంటున్నామంటూ ప్రచారం చేయంచుకుంటున్న ప్రభుత్వం విమర్శల పాలౌతోంది.  వరద బాధితులకు ఇదేనా సాయం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇక వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్ర బాబు నాయుడు ట్విట్టర్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు.  అల్లూరి జిల్లా చింతూరు మండలం చట్టిలో గోదావరి వరద సాయంపై మీడియాలో వచ్చిన కథనంపై చంద్రబాబు ట్వీట్ చేశారు.   నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు!.ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం....లెక్క చూసుకో జగన్ రెడ్డి... నాలుగంటే నాలుగే!. అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.   మరోవైపు చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈనెల 21న కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటిస్తారు. 22వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంటలో వరద బాధితులను పరామర్శించ నున్నారు.

జ‌గ‌న్ సర్కార్ నిర్ల‌క్ష్య‌మే పోల‌వ‌రానికి శాపం

ఏపీలోని జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యూహాత్మక ప్రణాళికా లోపం, తగిన రీతిలో నిధులను విడుదల చేసే సామర్థ్యం లేకపోవడమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కారణమని  కేంద్రం స్పష్టం చేసింది. సభలో తెలుగుదేశం రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బదులిచ్చారు. పోలవరం పూర్తికి గడువు పెంచినట్లు పేర్కొన్నారు.  ఎవ‌రన్నా ఇబ్బందిలో ఉంటే స‌హాయం కావాలంటే చేస్తాన‌నేవారు చాలా అరుదుగా దొరుకుతారు. కానీ త‌ప్ప‌కుండా స‌హాయం చేస్తామ‌న్న‌వారికి కావ‌ల‌సిన స‌మాచారం అందించ‌డంలో నిర్ల‌క్ష్యం క్షంత‌వ్యం కాదు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి అస్స‌లు క్షంత‌వ్యుడు కారు.   పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో   అడిగిన స‌మాచారం స‌మ‌యానికి అందించ‌డంలో  జగన్ సర్కార్ నిర్లక్ష్యమే పోలవరం నిర్మాణంలో జాప్యానికి కారణమని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టును రాష్ట్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. కానీ ముఖ్య‌మంత్రి నిర్ల‌క్ష్య ధోర‌ణితో రాష్ట్రం కేంద్రంతో మొట్టికాయ‌లు వేయించుకుంటూ అప్ర‌తిష్ట‌పాల‌వ‌డం గ‌మ‌నిస్తున్నాం. ఉభ‌య‌ స‌భ‌ల్లోనూ దీన్ని గురించి ఎప్పుడు చ‌ర్చ త‌లెత్తినా ఎంపీల‌కు అక్షంత‌లు త‌ప్ప‌డం లేదు. ఇపుడు తాజాగా క‌న‌క‌మేడ‌ల పోలవరంపై వేసిన ప్రశ్రకి సమాధానమిస్తూ కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ మంత్రి  జగన్ సర్కార్ వైఫల్యమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం  నిర్వాకంతోనే అన్నీ వెన‌క్కి పోతున్నాయ‌న్న‌ది కేంద్ర మంత్రిగారి స‌మాధాన సారాంశం.  పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి మంగళవారం రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎంపీ క‌న‌క‌మేడ‌ల కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి బిశ్వేశ్వ‌ర తుడూను   పోల‌వ‌రం ప్రాజ‌క్టు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను నిర్ధారించ‌డానికి ప్ర‌భుత్వం ఏద‌యినా అంచ‌నా లేదా త‌నిఖీ చేసిందా అని ప్ర‌శ్నించారు. ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం 2014లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోల‌వ‌రం నీటిపారుద‌ల ప్రాజెక్టును పూర్తి చేయ‌డంలో తీవ్ర జాప్యం జ‌రిగింది. అయితే ప్ర‌భుత్వ స‌లహా రూపంలో ఏద‌యినా స‌మాచారం ఇచ్చిందా, ఏపీ ప్ర‌భుత్వాన్ని మంద‌లించారా అని అడిగారు. అంతే కాకుండా పిఐపి(పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు) అమ‌లు చేసే ప్ర‌క్రియ‌లో దాని మిన‌హాయింపు లేదా క‌మిష‌న్ చేప‌ట్టిన చ‌ర్య‌లేమిట‌ని రాజ్య‌స‌భ‌లో క‌న‌క‌మేడ‌ల ప్ర‌శ్నించారు. అందుకు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడు లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇస్తూ,ముందుగా  నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టును ఏప్రిల్ 2022 నాటికి పూర్తి చేయాలనీ అయితే అయితే ప్ర‌స్తుతం హెడ్‌వ‌ర్క్స్, కుడి ప్ర‌ధాన కాలువ, ఎడ‌మ ప్ర‌ధాన కాలువ‌ల పురోగ‌తి వ‌రుస‌గా 77 శాతం, 93 మరియు 72 శాతం  మాత్రమే పూర్తయ్యాయన్నారు. అందువలన ప్రాజెక్ట్  ఏప్రిల్, 2022 నాటికి పూర్తి చేయాలన్న గడువు దాటిపోయిందన్నారు.  ఏప్రిల్ 2022 తర్వాత పైప్‌ల అమలుకు సంబంధించి ప్ర‌భుత్వ సమాచారం మేరకు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపిఏ, ప్రస్తుత నిర్మాణ షెడ్యూల్‌ను సమగ్రంగా పరిశీలించడానికి , విశ్లేషించడానికి 2021 నవంబర్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను ఏప్రిల్, 2022లో సమర్పించింది, జూన్, 2024 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సవరించిన లక్ష్యాన్ని సూచించిందని కేంద్రం మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవసరమైన రీతిలో వ్యయసామర్ధ్యం లేకపోవడం, సరైన వ్యూహాత్మక ప్రణాళికా లోపం, ప్రణాళిక లేకపోవడమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేశారు. అలాగే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సమన్వయ లోపం, కోవిడ్ సమస్యలు కూడా ప్రాజెక్టు జాప్యం అవడానికి కారణమని మంత్రి స్పష్టం చేశారు.

హోదా హుళ‌క్కే.. తేట‌తెల్లం చేసిన కేంద్రం

ఊరించి ఊరించి ఊర‌గాయ‌ బెట్టి ఆఖ‌రికి ముక్క‌లేదు త‌ర్వాత చూద్దాం అని నూనె జాడీ చూపించింది వెన‌క‌టికి ఓ బామ్మ‌గారు. అదుగో అలా మారింది ఆంధ్ర‌ప్ర‌ధేశ్ ప్ర‌త్యేక హోదా తంతు. 2014లో ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌కుండా ఇస్తామ‌న్న హామీ ఇచ్చార‌నే ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణా విడిపోవ‌డానికి  అప్ప‌టి నాయ‌కులు అంగీక‌రించారు. ప్ర‌భుత్వం ఏర్పాట‌యింది. అప్ప‌టి నుంచి హోదా గురించి ఎప్పుడు చ‌ర్చ లేదా ప్ర‌శ్న‌లు త‌లెత్తినా ఏదో మాయ‌మాట‌లు చెప్పి తెలుగు ప్ర‌జ‌ల, ప్ర‌భుత్వ ఆవేశాన్ని చ‌ల్లా ర్చ‌డం కేంద్రం పెద్ద ప‌నిగా పెట్టుకుంది. కాలం గ‌డిచిపోయింది రాష్ట్రానికి వీల‌యినంత ఆర్ధిక సాయం చేస్తామ‌ని ఊరించి అస‌లు హోదా మాట‌నే మ‌ర్చిపోయేలా చేశారు కేంద్రంలోని బిజెపీ పెద్ద‌లు.  జ‌గ‌న్ రెడ్డి అధికారంలోకి రాగానే ముందుగా ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో ప్ర‌త్యేక హోదా సాధించుదామ‌నే అన్నారు. కానీ క్ర‌మేపీ కేంద్రానికి దాసోహం అన‌డంతో ఆ  మాట‌ను మార్చి ఏవేవో క‌బుర్లు చెబుతూ, జ‌గ‌న్‌ని అస‌లా అంశాన్ని ఎత్త‌కుండా చేశారు. జ‌గ‌న్ కేవ‌లం కేంద్రంలో నాయ‌కుల చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేయ‌డం త‌ప్ప ప్ర‌త్యేక హోదా గురించి ఇత‌ర అంశాల గురించి ప‌ల్లెత్తు ఏమీ మాట్లాడ‌టం లేదు. జ‌నం పూర్తిగా దాని సంగ‌తే మ‌ర్చిపోయార‌న్న భ్ర‌మ‌లో కేంద్రం, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు ఉన్నాయి.  ఈ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా అంశం చ‌ర్చ‌కు తెర‌లేపింది. లోక్‌స‌భ‌లో టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు హోదాపై అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రప్రభుత్వంమళ్లీ పాత పాటే పాడింది. లోక్‌స‌భ‌లో కేంద్ర‌మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందన్నారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను ఆర్థిక సంఘం కేటాయించిందని, 15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫార్సులను కొనసాగించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏపీకి  ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు.  విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చిందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ అన్నారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా పదేళ్ల కాలంలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి..ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు. ... హోదా సాధ‌న‌కు ఒక  సుధీర్ఘ పోరాటాన్ని  వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీలతో సహా అన్ని పార్టీలు తమ విభేదాలను వీడి ఎస్సీ ఎస్‌ఎస్‌ సాధనకు ఐక్య పోరాటానికి సిద్ధ‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమకు అత్యధికంగా ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కోసం పాటుపడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఇప్పుడు మౌనంగా ఉండ‌టం ప‌ట్ల రాష్ట్రంలో విప‌క్షాల‌తో పాటు ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఈ విష‌యంలో బిజెపీని దీటుగా ఎద‌ర్కోవ‌డంలో వైసీపీ ని పూర్తిగా న‌మ్మి మోస‌పోయామ‌న్న అభిప్రాయాలే అంత‌టా విన‌వ‌స్తున్నాయి.  కేంద్రంతో కొంత స‌హ‌చ‌ర్యం వున్న జ‌గ‌న్ హోదా విష‌యంలో మాత్రం వారిని ఒప్పించ‌డంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. పైగా కేంద్రం మ‌న‌సులో మాట జ‌గ‌న్‌కు తెలిసి కావాల‌నే అస‌లు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్ట‌క కాల‌క్షేపం క‌బుర్ల‌తో ప్ర‌జ‌ల్ని మోసం చేశార‌న్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. 

ఆ  త‌ల్లి  ప్రేమ ఆకాశ‌మంత‌!

చంద‌మామ రావే.. జాబిల్లి రావే.. వెన్న‌ముద్ద తేవే.. అంటూ చంటిపిల్ల‌ల‌కు ప్ర‌తీ త‌ల్లి పాల‌బువ్వ పెడుతుంది. అదో ఆనందం, అదో అనిర్వ‌చ‌నీయ అనుభూతి. పిల్ల‌ల‌కు చంద్రుడిని చూపించ‌డం అందులో పిల్లి ఉంద‌ని క‌థ‌లు చెప్ప‌డం మాత్రం త‌రాలు మారినా ఆ క‌థ‌లు మాత్రం మార‌వు. అదుగో అలా క‌థ‌లు వినే ఉంటాడు మాథ్యూ గాల‌గ‌ర్‌. అత‌నికి చంద‌మామ అంటే మ‌హా యిష్టం. పెద్ద‌య్యాక చంద్రుడి మీద‌కి వెళ్లి నిజంగానే పిల్లితో ఆడాల‌ని మ‌హాకోరిక‌. కానీ అనుకున్న‌వేవీ జీవితంలో జ‌ర‌గ‌వు. జ‌ర‌గాల్సిన‌వే జ‌రుగుతాయి. మాథ్యూకీ అంతే. అత‌ని ప‌ద‌కండో ఏట జ‌బ్బు చేసి చ‌నిపోయాడు. అత‌ని త‌ల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసిన‌పుడ‌ల్లా పోనీ అక్క‌డ‌కి వెళ్లాల‌నే వెళ్లాడ‌నే అనుకుంటోంది.. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభ‌స్మాన్ని చంద్రుడి మీద‌కి పంప‌డానికి సిద్ధ‌ప‌డింది కోరి. వ‌చ్చే ఏడాది ఆమె కోరిక ఫ‌లించ‌వ‌చ్చు. ఫ్లారిడాకి చెందిన స్కాట్‌, కోరి ల పిల్ల‌వాడు మాథ్యూ. పిల్లాడు ఊహించ‌నివిధంగా ప‌ద‌కండేళ్ల‌కే క‌నుమూశాడు. వారి దుఖానికి అంతే లేదు. వాడికి అంత‌రిక్షం, చంద‌మామ గురించి తెలుసుకోవ‌డం మ‌హా స‌ర‌దాట‌. వాడు మ‌మ్మ‌ల్ని విడిచి చంద‌మామ‌తో ఉండ‌డానికే ముందుగా వెళిపోయాడు.. అంటున్నారు మాథ్యూ బంధుగ‌ణం. అయితే వాడి చితాభ‌స్మం పంపితే మేము వాడిని పంపిన‌ట్ట‌వుతుంద‌ని ఆ త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు.  అయితే అలా మ‌నిషి అయినా, చితాభ‌స్మం పంపించాల‌న్నా చాలా క‌ష్టం. దానికి భ‌రించ‌లేని ఖ‌ర్చ‌వుతుంది. కానీ మాథ్యూ ప‌ట్ల ఆ త‌ల్లిదండ్రుల ప్రేమ కంటే అదేమంత పెద్ద ఖ‌ర్చుకాదు. కోరీ మాత్రం ఆమె బంధువులు, స్నేహితులు చెప్పిన‌ట్లు  ఆర్దిక స‌హాయం చేసేవారిని తిర‌స్క‌రించ‌వ‌ద్ద‌నే అనుకుంది. నాసా వారి స్పేస్ ఎక్స్‌లో పంప‌డానికి ఏర్పాట్ల గురించి నెట్‌లో స‌మాచా రాన్ని సేక‌రించింది. సంబంధిత అధికారుల‌ను క‌లిసింది. లూనా ప్ల‌యిట్‌లో పంపాల‌ని నిశ్చ‌యించుకున్నారు. కానీ దానికి 12,500 డాల‌ర్లు అవుతుంది. ఆ సంగ‌తి తెలుసుకుని మాథ్యూ బంధువులు, స్నేహితులు, కోరి దంప‌తుల  స్నేహితులు అంద‌రూ తోచినంత ఎక్కువగానే స‌హాయం చేశారు.  ఇప్ప‌టికి 14వేల డాల‌ర్లు స‌మ‌కూరాయి. ఫ్ల‌యిట్ వ‌చ్చే ఏడాది వెళుతుంది. మా పిల్ల‌వాడి బంగారు క‌ల వ‌చ్చే ఏడాది ఫ‌లించ‌నుంది అని స్కాట్ అంద‌రితో చెబుతున్నాడు.  అన్ని స‌న్న‌ద్ధం చేశారు. చితాభ‌స్మాన్ని పంప‌డ‌మంటే పిల్లాడి ఆశ‌లు ఫ‌లించిన‌ట్టేన‌ని కోరీ అన్న‌ది. ఇంత‌కంటే ఏ త‌ల్లీ ప్రేమ‌ను ప్ర‌క‌టించ‌లేదేమో!

కేటీఆర్ కోరికలకు కేసీఆర్ కళ్ళెం ?

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్  అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచి కూడా త్వరలోనే కేటీఆర్ పట్టాభిషేకం తద్యమనే వార్తలొచ్చాయి. ముహూర్తాలు ఖరారయ్యాయి. బహిరంగ వేదికల నుంచి మంత్రులు, తెరాస ముఖ్య నేతలు, అయన సమక్షంలోనే  కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా సంభోదించారు. అయితే, అక్కడక్కడా వినిపిస్తున్నట్లుగా  కుటుంబ కలహాలు కారణమా,ఇంకేదైనా కారణమా, ఏమో కానీ, విఘ్నేశ్వరుని పెళ్లి ముహూర్తం లాగా, కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తానికి బ్రేకులు పడుతూనే ఉన్నాయి,  రామన్న పట్టాభిషేక ముహుర్తం ఇంతవరకు ముడిపడలేదు.   అదలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం, ఇక ఈసారికి కేటీఆర్ కి ముఖ్యమంత్రి యోగం లేనట్లేనని అంటున్నారు. అదే విషయాన్ని వాళ్ళు వీళ్ళూ కాకుండా మంత్రి కేటీఆరే స్వయంగా వెల్లడించారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆరే అని స్వయంగా ప్రకటించారు.ఇటీవల మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్  వచ్చే ఎన్నికల్లోనూ తెరాస 90 ప్లస్ సీట్లు తెచ్చుకుని. అధికారంలోకి వస్తుందని చెప్పు కొచ్చారు. అది ఎంత నిజమో  ఏమో కానీ కేటీఆర్ అక్కడితో ఆగకుండా, దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డ్ సృష్టిస్తారని ఇంకో మాట జోడించారు. సరే మళ్ళీ తెరాస అధికారంలోకి వస్తుందా, రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, వస్తే మాత్రం మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, కేటీఆర్  స్పష్టంగానే చెప్పారు. ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. నిజానికి కేటీఆర్ ఒక్కరే కాదు, గతంలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని పబ్లిక్ గా చెప్పిన నాయకులతో సహా తెరాస నాయకులు గత కొంత కాలంగా ఇదే విషయం చెపుతూ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు  కొత్త సచివాలయంలోకి ముఖ్యమంత్రిగా ఆయనే కాలు పెడతారని తెరాస నేతలు టీవీ చర్చలలో ఇతరత్రా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కేటీఆర్ స్వయంగా అదే విషయాన్ని శంఖంలో పోశారు.  సో .. అప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పటికైతే కేటీఆర్ ముఖ్యమంత్రి ‘కుర్చీ’ కోరికకు కళ్ళెం వేసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.పార్టీలోనూ అదే చర్చ జరుగుతోందని అంటున్నారు.  అయితే ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? కొద్ది రోజుల క్రితం వరకూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళతారని ఫ్రంట్ కాదంటే జాతీయ పార్టీ పెట్టేసి, ఢిల్లీ వెళ్లి పోతారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కి అప్పగిస్తారని, అదనీ, ఇదనీ చాలా చర్చ జరిగింది. చాలా చాలా  ఉహాగానాలు వినిపించాయి. ఉహాగానాలు కూడా కాదు స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు జాతీయ ఆలోచనలను బహిరింగంగానే వినిపించారు.  మరోవంక  ఎక్కడా పెద్దగా ఖండనలు రాలేదు. తెరాస నాయకులు  ఎవరూ ఉహాగానాలను  కాదనలేదు. ఖండించలేదు. మరోవంక, అవును అది నిజమే అనే సంకేతాలు ఇస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ కూడా దూకుడు పెంచారు. వేషం కాకపోయినా భాష మార్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు స్వయంగా అయనే తీసుకున్నారని, తీసుకుంటున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి.   కానీ, ఇప్పుడు కేటీఆర్ ఎందుకు  ‘యు’ టర్న్ తీసుకున్నారు? అంటే  అందుకు సర్వేలే కారణమని అంటున్నారు. ముఖ్యంగా  ప్రశాంత్  కిశోర్ బృందం పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం ఏమిటి? అనే విషయంగా నిర్వహించిన ‘ప్రత్యేక’ సర్వేలలో, తెరాసను వ్యతిరేకిస్తున్న వారిలో అత్యధిక శాతం ప్రజలు, కుటుంబ పాలనకు వారసత్వ రాజకీయాలకు పెద్ద పీట వేశారు.  పీకే సర్వేతో పాటుగా ఇతర  సర్వేలలోనూ, తెరాసను వ్యతిరే కిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది, ప్రదానంగా కుటుంబ వారసత్వ రాజకీయాలను. కుటుంబ అవినీతిని  వ్యతిరేకిస్తున్నట్లు తేలిందని అంటున్నారు. అలాగే, కేంద్ర సంస్థలు నిర్వహించిన సర్వేలలోనూ కుటుంబ పాలన, కుటుంబ అవినీతిని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున విషయం తేట తెల్లమైందని  తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ప్రధాన మంత్రి నరెంద్ర మోడీ కూడా, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలపై దృష్టి పెట్టాలని, రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు, రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా వినవస్తోంది.  ఈ నేపధ్యంలోనే, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, కుటుంబ అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు,ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే కేటీఆర్ ముఖ్యమత్రి  రేసు నుంచి తప్పుకున్నారని అంటున్నారు. అంతే కాకుండా, మహారాష్ట్ర పరిణామాల అనంతరం, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనే మాట బహిరంగంగా వినిపిస్తున్న నేపధ్యంలో  ఇప్పడు నాయకత్వ మార్పు జరిగితే,  బీజేపీ సహకారంతో  తెరాసలో షిండేలు పుట్టుకు రావచ్చనే అనుమానాల చేతనూ  ప్రస్తుతానికి, యథాతథ స్థితి కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ మేరకు  కేసీఆర్, కేటీఆర్ ఒక అంగీకారానికి వచ్చారని అంటున్నారు. అదొకటి అలా ఉంటే, నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలంగా కుటుంబంలో ఎంతగా వత్తిడి వచ్చినా, కేటీఆర్ కి పగ్గాలు అప్పగించక పోవడానికి కూడా ఇదే కారణంగా అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కోరుకున్నదే ప్రశాంత్  కిశోర్  సర్వేలు చెప్పాయి. మరో వంక, మహారాష్ట్ర పరిణామాలు కూడా కలిసొచ్చాయి. అలా కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపి, కేటీఆర్ నోటి నుంచే ‘హ్యాట్రిక్’ పలుకులు పలికించారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. అవును  కేసీఆర్  రాజకీయ చతురత గురించి, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన  అవసరం లేదు. కానీ, చెప్పుకోక తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఅర్  చాలా కాలంగా కుటుంబంలో చాలా చాలా సమస్యలు ఎదుర్కున్నా, చివరాఖరుకు కుటుంబ రాజకీయాల్లోనూ పై చేయి సాధించారని, కేటీఆర్  కోరికలకు కళ్ళెం వేయడంలోనూ అయన సక్సెస్ అయ్యారని అంటున్నారు.

 ధిక్క‌ర‌ణ‌ కేసుల‌కు ప్ర‌భుత్వ న్యాయ‌వాదులా.. కోర్టు ఆగ్ర‌హం

అధికారంలో వున్నామ‌ని కుర్చీలు, బ‌ల్లలూ, ప‌రిక‌రాలు వాడిన‌ట్టు ప్ర‌భుత్వ లాయ‌ర్ల‌ను వాడేయ‌చ్చ‌ని తెలంగాణా ప్ర‌భుత్వం అనుకుంది. కానీ అదంతా న‌డ‌వ‌దు.. ప్ర‌భుత్వాధికారులైనంత మాత్రాన ప్ర‌భుత్వ లాయ‌ర్ల‌ను వినియోగించుకోరాద‌ని హైకోర్టు తెలంగాణా ప్ర‌భుత్వాన్ని మంద‌లించింది. అధికారుల కోర్టు ధిక్కారం కేసుల్లో సొంత ఖ‌ర్చుల‌తో న్యాయ‌వాదుల‌ను నియ‌మించుకోవాల్సిందేన‌ని మంద‌లించింది. ప్ర‌భుత్వాధి కారుల త‌ర‌ఫున అడ్వ‌కెట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యానికి చెందిన ప్ర‌భ‌త్వ న్యాయ‌వాదులు హాజ‌రు కావ‌డంపై హైకోర్టు ఆగ్ర‌హించింది.   ఒక  కోర్టు ధిక్కరణ కేసులో అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకావడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.  అధికారుల ధిక్కరణ కేసులకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమిని సేకరించి.. నాలుగేళ్లుగా పరిహారం చెల్లించడం లేదంటూ రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నాగాహిల్స్‌లోని సర్వే నంబర్‌ 66లో ఉన్న 276 చద రపు గజాల ప్లాట్‌ విషయంలో ఆ భూమి యజమాని మహమ్మద్‌ ఖాజం అలీ  కోర్టులో ధిక్కరణ  పిటిషన్‌ వేశారు. జీహెచ్ ఎంసీ అధికారులు ఆ భూమి వివాదాస్పదమైనదని చెప్పడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసే కరణ చేసి.. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక.. ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని చెప్ప డాన్ని తప్పు బట్టింది. ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది.  జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ వెంకన్న కొవిడ్‌ కారణంగా విచారణకు హాజరుకాలేక పోయారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల తరఫున ఏజీ కార్యాలయం ప్రాతినిధ్యం వహించ డంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదంలో ఉన్న భూమి గవర్నమెంట్‌ స్థలమని ప్రభు త్వం తరఫు న్యాయవాది పేర్కొనగా.. అయితే భూసేకరణ ఎందుకు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసులో భూమి టైటిల్‌ను తేల్చడం తమ పనికాదని.. పరిహారం అందిందా? లేదా? అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని స్పష్టంచేసింది. 

 ఇంటింటికీ రేష‌న్‌.. జ‌గ‌న్ స‌ర్కార్‌కు కోర్టు మ‌రో మొట్టికాయ‌

భ‌గవంతుని లీల‌లు ఎవ్వ‌రికీ అర్ధంగావంటారు మ‌త‌ప్ర‌చార‌కులు. ఎప్పుడు ఏది జ‌రుగుతుంద‌న్న‌ది ప‌ర‌మాత్మున‌కే ఎరుక అని బోధ‌చేస్తుంటారు. అందువ‌ల్ల సామాన్య‌మాన‌వులం పెద్ద‌గా దాన్ని గురించి ఆలోచించ‌వ‌ద్ద‌ని, నీతిగా బ‌త‌క‌మ‌నీ బోధిస్తుంటారు గురువులు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి  ప‌రిపాల‌నా లీల‌లు ఆయ‌నంత‌ట ఆయ‌నే ప్ర‌జ‌ల‌కు అర్ధమ‌య్యేలా చేస్తుంటారు. వ్య‌ర్ధానికి అస‌లు అర్ధం ఆయ‌నే ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డం మ‌రెవ్వ‌రివ‌ల్లా ఏ ప్ర‌భుత్వం వ‌ల్లా కాలేదు. రాష్ట్రంలో పాఠ‌శాల‌ల విలీనం పేరుతో విద్యార్ధుల‌ను పక్క వీధికి కాకుండా ప‌ది కిలోమీట‌ర్ల ప్ర‌యాణానికి సిద్ధ‌ప‌డేలా చేశారు. అందుకు పూర్తి విరుద్ధంగా గ్రామాల్లో ప్ర‌జ‌లు ప‌క్క‌నే వున్న ప‌చారీ కొట్టుకు వెళ్ల‌లేర‌ని రేష‌న్ స‌రుకునంతా బండ్ల మీద ఇళ్ల వ‌ద్ద‌కే తోలుతున్నారు. ఇది వింత విడ్డూరమా.. జ‌గ‌న్ మ‌తి భ్ర‌మించిందా.. అన్న అనుమానాలు యావ‌త్  ఆంధ్రా చ‌ర్చించుకుంటోంది. ఒక్క ఆలోచ‌న జీవితాన్నే మారుస్తుందంటారు.. జ‌గ‌న్  ఒక్కో ఆలో చనా ఒక్కోర‌కం ఇబ్బందికి గురిచేస్తోంది.  జ‌గ‌న్ ఆలోచ‌న‌తో రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప‌చారీకొట్టుకు వెళ్ల‌లేని బ‌ద్ధ‌క‌స్తులా అనే అనుమానం త‌లెత్తుతోంది. వాహ‌నాలుపెట్టి రేష‌న్ సామాన్లు అందించే వ్యాపారంతో ఎవ‌రికి ల‌బ్ధి క‌లుగుతుందో గానీ, ఆ వాహ‌నాలేవో పిల్ల‌ల్ని బ‌డికి తీసికెళ్లేందుకు క్యాబ్‌లుగా పెడితే త‌ల్లిదండ్రులు వేనోళ్ల కీర్తించేవారు క‌దా జ‌గ‌న‌న్నా!  ఈ స‌ల‌హాదారులెవ‌రూ ఇటువంటివి చెప్ప‌రేమో! జ‌గ‌న్ ఈ విధంగా ప్ర‌జ‌ల ధ‌నం వృధా చేస్తున్నార‌ని హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దానిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌మ‌ని కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌  ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలకు వెళ్లకుండానే ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. సరకులు పంపిణీ చేసినందుకు వాహనాల ద్వారా ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని కోర్టు పేర్కొంది. వీలు చూసుకుని ప్రజలు అరగంట కేటాయిస్తే రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని, ఆ స్థితిలో కూడా పేదలు లేరా అని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రేషన్ సరుకుల పంపిణీకి డీలర్ కు ఇచ్చే కమీషన్ కంటే డోర్ డెలివరీ ద్వారా ప్రజాధనం భారీగా దుర్వి నియోగం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. రేషన్ షాపులకు రాకుండా డోర్ డెలివరీ చేయడానికి చేసే ఖర్చుతో పేదలకు మరిన్ని రేషన్ సరుకులు అందించ‌వ‌చ్చని కోర్టు సూచించింది. సరకుల సరఫరా, చౌకదుకాణాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నదని.. మరి కేంద్రం నుంచి రేషన్ డోర్ డెలివరీకి అనుమతి తీసుకున్నారా, ఏ  నిబంధన లను అనుసరించి వాహనాల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి సిబ్బందిని నియమించారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు వివరణ ఇస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.  వాహనాల ద్వారా ఇంటివద్దకే సరకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ‘ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం’ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ పథకం కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఉద్దేశం సక్రమంగా నెరవేరుతున్నట్లు కనిపించడం లేదన్నారు. మొబైల్‌ వాహనం ఎప్పుడొస్తుందో తెలీక నిరుపేదలు, రోజుకూలీలు పనులు మానుకొని ఇంటి వద్దే ఎదురుచూడాల్సి వస్తుం దన్నారు.  ఇంటింటికీ రేషన్ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం దాదాపు 92 వేల మందిని నియమించగా, వాహన దారుకు ఒక్కొక్కరికి నెలకు రూ.21 వేలు చెల్లిస్తున్నారని కోర్టుకు తెలిపారు. రేషన్ డెలివరీ వాహనాల కోసం సైతం రూ.600 కోట్లు ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటి గిరిజనులు సరకులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటి చోట రేషన్ డోర్ డెలివరీ చేస్తే అర్థం ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వివరాలు సమర్పించాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వాలు పలు విధానాలు అమలు చేస్తాయని అందులో భాగంగా రేషన్ సరుకులని పేద ప్రజలకు ఇంటింటికీ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఏజీ శ్రీరామ్‌. ఇలాంటి ప్రభుత్వ విధాన నిర్ణయాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదన్నారు. అయితే న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.

ఇది ప్రకృతి విపత్తు మేమేం చేయలేం.. అంబటి

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వ పెద్దలైనా ఏం చేయాలి? కాలికి బలపం కట్టుకుని మరీ బాధిత ప్రాంతాల్లో తిరగాలి. బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు సరిగా జరిగేలా చూడాలి. గతంలో విశాఖపట్నంలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు అలాగే చేశారు. ప్రత్యేక బస్సులో విశాఖ వెళ్లి, సహాయ కార్యక్రమాలు సజావుగా జరిగేలా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. బస్సులోనే  బస చేసి మరీ రేయంబవళ్లు   బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూశారు. తుపాను ధాటికి ధ్వంసమైపోయిన సుందర విశాఖ నగరాన్ని కొద్ది రోజుల వ్యవధిలోనే యథా పూర్వస్థితికి వచ్చేలా చేశారు. అంతకు ముందు కూడా పలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఈ విధంగానే స్పందించాయి. అయితే.. తాజాగా ఏపీలో     గోదావరికి  భారీ వరదలు వచ్చాయి. ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి  జనం సురక్షిత ప్రాంతాలకు, సహాయక శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ఇంతలా గోదావరి నది విరుచుకు పడితే.. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మాత్రం  ‘ఇది ప్రకృతి విలయం. మనమేం చేయలేం’ అంటూ చేతులెత్తేశారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలోనే చెప్పి తన చాతకాని తనాన్ని చాటుకున్నారు. జులై నెలలో గోదావరి నదికి భారీ వరదలు రావడం అరుదన్నారు. సాధారణంగా జులై నెలాఖరులోనో, ఆగస్టులోనో వరదలు వస్తాయి. కానీ ఇంత భారీ స్థాయిలో వరదలు జులై నెల మధ్యలోనే రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇంతలా వరదలు విరుచుకుపడతాయని అస్సలు ఊహించలేదని ఆయన చెప్పారు. జనం దీనినే తప్పుపుడుతున్నారు.  వరదలు ముంచుకొస్తాయని ముందే హెచ్చరించాల్సిన వాతావరణ విభాగం పనిచేయలేదా? ముసుగుదన్ని పడుకుందా? అని నిలదీస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని వందలాది లంక గ్రామాలు వరదనీటిలో మునిగిపోయి బాధితులు అల్లాడిపోతుంటే.. స్పందించి సహాయం అందించాల్సిన ప్రభుత్వం  మొద్దు నిద్రపోతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.  బాధితులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, సహాయక శిబిరాల్లో ఆహారం, పాలు, తాగునీరు లాంటి సౌకర్యాల కల్పించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకొల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పలు లంక గ్రామాల్లో గుండె లోతు నీటిలో నడిచి వెళ్లి మరీ బాధితులకు సహాయం అందించారు. లంక గ్రామాల్లోనే రాత్రిళ్లు బస చేసి మరీ వారికి అండగా నిలిచారు. అయితే అధికార వైసీపీ నేతలు  ఎవరూ వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పలకరించిన వైనం, పరామర్శించిన దాఖలాలు లేవంటున్నారు. పైగా అంబటి తీరిగ్గా విజయవాడలో మీడియా సమావేశం పెట్టి మరీ ‘మనమే చేయలేం’ అనడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్కన వరద విలయ తాండవం చేస్తుంటే.. బాధితులను ఆదుకోకపోగా.. ఈ సందర్భాన్ని కూడా రాజకీయం చేయడానికి మంత్రి అంబటి ప్రయత్నించడాన్ని తప్పుపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు ఏకమై వచ్చినా ఒంటరిగానే ఎదుర్కొనగల ప్రజాదరణ గల నేత జగన్ అని చెప్పుకున్నారు. వరదలు, జనం బాధలు, నష్టం గురించి పట్టించుకోని మంత్రి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ప్రధాన కారణం టీడీపీ ప్రభుత్వమే అని నింద వేస్తుండడం ఏంటని అంటున్నారు. కాఫర్ డ్యామ్ కట్టకపోయినా ఫర్వాలేదని ఇంజనీర్లు చెబుతున్నారంటూనే.. అనుకున్న సమయానికి దిగువ కాఫర్ డ్యామ్ ను పూర్తిచేయలేకపోయామని తప్పు ఒప్పుకోవడం గమనార్హం. వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న బాధితులను స్వయంగా పరామర్శించకుండా గాల్లోనే తిరిగి గాల్లోనే తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయిన జగన్ ఎక్కడ? హుద్ హుద్ తుపాను బీభత్సం సమయంలో విశాఖలోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలను పరుగులు పెట్టించిన చంద్రబాబు ఎక్కడ? అంటూ జనం చెప్పుకుంటున్నారు.

 ఎంత అంద‌మో.. అంత భయానకం

జాబిల్లీ రావే పాల బువ్వ తేవే  అంటూ త‌ల్లి బిడ్డ‌కి అన్నం త‌నిపిస్తుంది. అచ్చం చంద‌మామే అంటూంది పెద్దామె త‌న మ‌న‌వ‌రాల్ని.. వెన్నెల్లో ఆడుతూ పాడుతూ.. అంటూ హీరోగారు. హీరోయిన్‌తో అనేక నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లిస్తుంటాడు.. అదంతా కాదు అస‌లు ఆకాశంలో చూడాల్సిన‌వి న‌క్ష‌త్రాల వింత‌లు, సూప‌ర్ మూన్ వంటి అపుడ‌పుడూ సంభ‌వించే వింత‌లు అని ఖ‌గోల‌శాస్త్ర‌వేత్త‌లు అంటూంటారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే వుంది. కానీ ఇటీవ‌లి తుపానులు, భారీ వ‌ర్షాలు.. ఇవ‌న్నీ సూప‌ర్ మూన్ ప్ర‌భావ‌మే అని శాస్త్ర‌వేత్త‌లే అంటున్నారు. మ‌రి అంద‌ర‌మ‌యిన సూప‌ర్‌మూన్ మాన‌వాళికి ఇంత‌టి దారుణాన్ని ఎలా ఒడిగ‌ట్టింది?  గులాబీని చూసి ఆవేశ‌ప‌డితే ముళ్లు గుచ్చుకుంటాయి బ్రో!  ఆకాశంలో అద్భుతాల‌న్నీ భీక‌ర ప‌రిస్థితుల‌నూ సృష్టిస్తాయన్న నిజం ఇటీవ‌ల అనుభ‌వంలోకి వ‌స్తేగాని పూర్తిగా అర్ధం కాలేదు. ఎందుకంటే ఇలాంటివి సంఘ‌ట‌న‌ల మ‌ధ్య శ‌తాబ్దాల అంత‌రం ఉండ‌ట‌మే. అపు డపుడూ ఆస్ట్రాయిడ్స్ కూడా భ‌య‌పెడుతూంటాయి. ఆమ‌ధ్య ఒక‌టి భూమికి స‌మీపంలోకి వ‌చ్చి వెళిపో యింద‌న్న‌ది శాస్త్ర‌వేత్త‌ల‌కు శాస్త్ర‌ప‌ర‌మైన అంశ‌మే కావ‌చ్చుగానీ, మామూలు మ‌న‌లాటి వాళ్ల‌కి ప్రాణ భీతి క‌ల్పించింది. ఒక్క‌సారి ఉల్కాపాతం జ‌రిగితే భూమి ఏం కావాల‌న్న భ‌యం వెన్నులో ఒణుకు పుట్టిస్తుంది.  చిత్ర‌మేమిటంటే.. ఈ అందాలు, భ‌యోత్పాతాల విష‌యాల‌న్నీ నాసా వారే క‌నుగొని భ‌యాన్ని బాగా ప్ర‌చా రం చేయ‌డం. వారి వ‌ద్ద వున్న అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం మ‌రెవ్వ‌రికీ అంత‌గా అందుబాటు లో లేక పోవ‌డం, నిత్యం అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతూండ‌డంతో అమెరికా శాస్త్ర‌వేత్త‌లే ప్ర‌పంచ మాన‌వాళిని ఆనంద‌ప‌రుస్తున్నారు, చిన్న‌పాటి హెచ్చ‌రిక‌తో మ‌రింత నిద్ర‌లేకుండానూ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఎంతో శ‌క్తివంత‌మైన సౌర తుపాను భూమిని తాక‌బోతోంద‌ని నాసా ప్ర‌క‌టించింది. ఓర్నాయ‌నో.. అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తారాజువ్వ‌నో, గాలిప‌టాన్నో చూస్తున్న‌ట్టు చాలామంది ఆకాశం వంకే చూస్తున్నారు. అదేమ‌న్నా విజ‌యా స్టుడియోవారి చంద‌మామా.. చ‌క్క‌గా ఆనంద‌ప‌ర‌చ‌డానికి! అయితే ఈ  సౌర తుపాను  ప్రభావంతో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశముందని పేర్కొంది. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలో మీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవ కాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.   అయితే, అది భూవాతావ‌ర‌ణంలోకి ఎప్పుడు స‌రిగ్గా ప్ర‌వేశిస్తుంద‌న్న‌ది ఖ‌చ్చితంగా ఇంకా ప్ర‌క‌టించ‌ లేదు. దీనివల్ల ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లోని ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడగలరని తెలిపారు. సౌర తుపాను ప్రభావంతో భూగోళపు  బాహ్య వాతావరణం వేడెక్కే  అవకాశముందని  శాస్త్రవేత్తలు వివ రించారు. ఈ ప్రభావం ఉపగ్రహాలపై పడి.. నేవిగేషన్‌, మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయే ముప్పుందని హెచ్చరించారు. మానవ ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.  మాన‌వాళికి మ‌రింత ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని కోరుకుందాం. 

చావు అంచుకెళ్లి తిరిగి వచ్చిన మృత్యుంజయులు!

మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని నదలు, వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కొందరు ప్రమాదవశాత్తున వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి పలు సంఘటనల్లో కొందరు అదృష్ట వశాత్తూ మృత్యు ముఖం నుంచి బయట పడ్డారు. అటువంటి సంఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిని జిల్లా మహిద్‌పూర్‌లో ఓ బొలెరో వాహనం వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.   బొలెరో వాహనం బ్రిడ్జి పైకి రాగానే నీటి ప్రవాహ తీవ్రతను అంచనావేయడంలో విఫలమైన డ్రైవర్ మొండిగా వాహనాన్ని ముందుకు కదిలించాడు. కొంత దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయింది.  వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో  వాహనం కొట్టుకపోయింది. వాహనంలోని ముగ్గురు వ్యక్తులు చివరి క్షణంలో బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు.  క్షణాల వ్యవధిలోనే ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో కారు కొట్టుకుపోయింది.  క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనను మరో గట్టుపై ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. 

 జుడా గ్రేస్ జ‌న‌నం.. యాదృచ్ఛికం!

అద్భుతాల‌న్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. వాటిలో కొన్ని యాదృచ్ఛికం. ఊహకే అంద‌ని విధంగా జ‌రిగిపోతుం టాయి. అలాంటిదే అమెరికా అల్మాన్స్ రీజియ‌న‌ల్ మెడ‌క‌ల్ సెంట‌ర్‌లో. ఇక్క‌డ అబెర్లీ అనే మ‌హిళ‌కు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన మ‌ధ్యాన్నం స‌రిగ్గా 2.22 నిమిషాల‌కు బిడ్డ పుట్టింది. అదీ చాలా విచిత్రంగా ఆస్ప‌త్రి రెండ‌వ వార్డులో! ఉత్త‌ర క‌రోలినా కుటుంబం ఆనందానికి అంతేలేదు. అక్క‌డి వారంతా ఇంకా గ్రేస్ జ‌న‌నం గురించి చెప్పుకుంటున్నారు.. క‌థ‌లు క‌థ‌లుగా.  ఉత్త‌ర క‌రోలినా వాసులు, ముఖ్యంగా జూడా ఇంటి ప‌రిస‌రాల‌వారంతా ఆశ్చ‌ర్య‌ప‌డుతున్న‌ది ఆ బిడ్డ త‌ల్లి అబెర్లీకి కేన్స‌ర్‌. ఆమె చికిత్స పొందుతోంది. అయినా గ‌ర్భందాల్చ‌డం బిడ్డ పుట్ట‌డం వారెవ‌రూ ఊహిం చ‌నే లేద‌ని అంటున్నారు.  ఆ ఆస్ప‌త్రి వ‌ర్గాలు త‌ల్లీ బిడ్డ‌లు క్షేమంగానే ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నారు. ఎందుకంటే, ఇన్ఫె క్షన్ తో పోరాడే శరీర సామర్థ్యాన్ని నిరోధించే శోషరస వ్యవస్థ అబెర్లీలో ఉండ‌టం విశేషమ‌ట‌. పైగా ఇలా చిత్రంగా అన్నీ రెండు అంకెలు క‌లిసే రోజున జ‌న్మించ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం అంటున్నారు ఆస్ప‌త్రి సీనియ‌ర్ డాక్ట‌ర్లు.  వారేకాదు అబెర్లీ ప‌క్కింటి బామ్మ‌గారూ అదే మాట అంటున్నారు. ఆ అమ్మాయి ప్రార్ధన‌లు భ‌గ వంతుడు విన్నాడు. అందుకే చ‌రిత్ర సృష్టించింది ఆ బంగారు త‌ల్లి అని న‌వ్వుతూ అంద‌రికీ చెబుతోం దామె.  ఇలా జ‌రగ‌డం చాలా అరుదు అని వారి సంబంధిత చ‌ర్చ్ ఫాద‌ర్ కూడా ఆశీర్వ‌దించి వెళ్లారుట‌.  మ‌రి ఇలాంటి జ‌న‌నాలు మీ ప‌రిస‌రాల్లో జ‌రిగాయేమో గుర్తు తెచ్చుకోండి.

తెరపైకి మళ్లీ పాత పంచాయతీ!

తెలుగు రాష్ట్రాల మద్య పాత పంచాయితీ  మళ్లీ కొత్తగా మొదలైంది. పోలవరం ఎత్తు  అంశాన్నిమళ్ళి తెరమీదకి తీసుకు వచ్చింది తెలంగాణా ప్రభుత్వం. ఇటీవలి గోదావరి  వరదలతో ఈ చర్ఛ పోలవరంపై చర్చ మళ్ళి మొదలైంది. పోలవరం పూర్తయితే భద్రాచలానికి ముంపు ముప్పు పెరుగుతుందన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అయితే మంత్రి పువ్వాడ వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి ఖండించారు. పోలవరంపై అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందన్న అంబటి రాంబాబు  వరదలు వచ్చినప్పుడల్లా పోలవరం ఎత్తుపై రాజకీయం చేయడం సరి కాదన్నారు ఆయనకు హితవు పలికారు.  పోలవరం  గేట్లు   ఎత్తడంలో జాప్యం  వల్లే ఈసారి వరద తీవ్రత పెరిగిందని విమర్శించిన పువ్వాడ, గోదావరికి ఎప్పుడు వరద వచ్చినా ఇదే పరిస్ధితి పునరావృతమౌతుందనీ అందుకే పోవలరం ఎత్తు తగ్గించాలన్నదే తమ డిమాండ్ అని పునరుద్ఘాటించారు పోలవరం స్పిల్ వెల్ 50,000 క్యుసేక్కులకి పెంచారు .ప్రాజెక్ట్ లో గరిష్టం గా 15 రోజులు నీటి మట్టం నిలవ ఉండే అవకాశం ఉంది. అందు వల్ల భద్రాచలాని కి ఎలాంటి ముప్పు ఉండదు. భద్రాచలం లో 80 అడుగుల కరకట్ట నిర్మాణం జరిగింది. పోలవరం తో సంభందం లేకుండా ప్రస్తుతం 50నుంచి60 అడుగుల నీటిమట్టం నమోదు అవుతోంది. పోలవరం నుంచి వచ్చే నీటి మట్టం 43 అడుగులని దాని వల్ల భద్రాచలానికి ఎటువంటి ముప్పు  ఉండదన్నది ఏపీ వాదన. పనిలో పనిగా పువ్వాడ కొత్త డిమాండ్ ను కూడా తెరమీదకు తీసుకువచ్చారు. భద్రాచలాన్ని ఆనుకుని  ఉన్న ఐదు గ్రామాలనూ తిరిగి తెలంగాణలో కలిపేయాలన్నారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.   ఎటపాక, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల పంచాయతీలను తెలంగాణలో కలపాలని, వరద వచ్చినప్పుడల్లా ఈ గ్రామాలలో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌ చేశారాయన. రాజకీయంగా ఇబ్బంది వచ్చిన ప్రతి సారీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాల అంశాన్ని తెరమీదకు తేవడం పరిపాటిగా మారిందని ఏపీ విమర్శిస్తోంది. పోలవరం కారణంగా భద్రాచలంకు ముప్పు ఏర్పడుతుందన్న వాదనకు ఎలాంటి హేతుబద్ధత, శాస్త్రీయత లేదని చెబుతోంది. గతంలో కూడా గోదావరికి భారీ వరదలు వచ్చాయని,కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండానే పోలవరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని,కేంద్రం నిధులు సమకూరుస్తోందని,ఏదైనా కేంద్రం చేతిలోనే ఉందని ఏపీ చెబుతున్నది. రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చే ఇటువంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమజంసం కాదని అంటోది.

రఘురామ ఇంప్లీడ్ పిటిషన్ ను అనుమతించిన హైకోర్టు

అస‌లే పాల‌నా లోపాల‌తో ఉక్కిరిబిక్కిర‌వుతున్న జ‌గ‌న్ స‌ర్కార్‌కు రిషికొండ రిసార్ట్ పున‌రుద్ధ‌ర‌ణ కేసు త‌ల‌కుచుట్టుకుంది. విశాఖలోని రుషికొండ రిసార్ట్‌ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పర్యావరణ ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చట్టపరమైన అనుమతు లన్నీ తీసుకున్న తరు వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించామని, కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలిపింది.  ఆర్థిక, పర్యాటక అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను అడ్డుకోవా లన్న దురుద్దేశంతోనే ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని పేర్కొంది. తప్పుడు ఆరోపణలతో దాఖలైన వ్యాజ్యాలను భారీ జరిమానాతో కొట్టి వేయాలని న్యాయ స్థానా న్ని అభ్యర్థించింది. జాతీయ హరిత ట్రిబ్యు నల్‌ (ఎన్‌జీటీ) నియమించిన నిపుణుల కమిటీ సైతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి చట్ట ఉల్లం ఘనలు జరగ లేదని తేల్చినట్లు గుర్తు చేసింది.  రుషికొండ వ్యవహారాల కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు.  కాగా ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో  రెండు  ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖ లయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల మేరకు రఘురామ పిటీషన్ ను అనుమతించాలని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. ఆయ‌న‌ వాదనలను పరిగణలోకి తీసుకుని రఘురామరాజు పిటిషన్ ను సి.జే నేతృత్వంలోని ధర్మాసనం  విచారణకు అనుమతించింది.   రుషికొండలో పర్యవరణ ఉల్లంఘనలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యూనల్ కు రఘురామకృష్ణం రాజు లేఖ రాసిన సంగతి విదితమే. దీంతో రుషికొండపై తవ్వకాలు పర్యవరణ కాలుష్యంపై స్టే విధిస్తూ హరిత్ర ట్రిబ్యూలన్ ఆర్డర్ దీంతో దీనిపై ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ కు వెళ్ళింది. సుప్రీకోర్టు దీనిపై స్పందిస్తూ దీనిపై ఏపి హైకోర్టులో పెండింగ్ ఉన్న పిటిషన్లతో ఇంప్లీడ్  అవ్వమని చెప్పింది. దాన్ని అనుస‌రించి ఇంప్లీడ్ పిటీషన్ హైకోర్టులో దాఖలు చేశామని న్యాయవాది ఉమేష్ చంద్ర  తెలిపారు. దీనిపై న్యాయస్ధానం స్పందిస్తూ అనుబంధ‌ పిటిషన్ ను అనుమతించింది. కాగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని  కోర్టు అన్నిపిటిషన్ల విచారణను ఈ నెల 27కు వాయిదావేసింది రఘురామ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన సి.జే నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.

వర్షాభావ దేవేంద్రుడే కారణమంటూ తాశిల్దార్ కు రైతు ఫిర్యాదు

ఎవరైనా నగలు పోయాయనో, మొగుడు కొట్టాడనో, ఆస్తిగొడవలనో ఫిర్యాదులు ఇవ్వడం సహజం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ రైతు ఏకంగా ఇంద్రుడి మీదే ఫిర్యాదు చేశాడు. వర్షాలు సరిగా పడక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనీ వర్షాభావ పరిస్థితికి దేవతల దేవుడైన ఇంద్రుడే కారణమనీ, అతగాడిపై చర్యలు తీసుకోవాలనీ కొరుతూ ఏకంగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ అధికారులు సంపూర్ణ సమాధాన్‌ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే. మూడు రోజుల క్రితం అంటే శనివారం గోండా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కల్నల్‌గంజ్ తహసిల్దార్‌ నరసింహ నారాయణ్ వర్మకు ఝాల గ్రామానికి చెందిన సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు ఇంద్రుడిపై ఫిర్యాదు చేశాడు. అయ్యా, కొన్ని నెలలుగా మా జిల్లాలో వానలు కురవడం లేదు. కరువు తాండవించడం వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, జంతువులు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెలల పాటు వానలు కురిపించని ఇంద్ర దేవుడిపై తగిన చర్య తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని సుమిత్  ఫిర్యాదు అందుకున్న తహసిల్దార్‌ దానిని చదవకుండానే తగిన చర్యలు తీసుకోవాలంటూ  ఓ ముద్ర వేసి జిల్లా మెజిస్ట్రేట్‌కి పంపించేశారు. ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో పాలక యంత్రాంగం కనీసం ఫిర్యాదు కూడా చదవకుండా ఈ స్థాయిలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం సిగ్గుచేటు అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఈ ఫిర్యాదు ఏంటి? ఇందులో ఏం రాశారు? ఇది ఏ విభాగానికి పంపించాలని? అనే విషయాలను కూడా తెలుసుకోకుండా తహసిల్దార్‌ ప్రవర్తించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఈ కంప్లైంట్‌కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కంప్లైంట్‌లో తహశీల్దార్‌ సంతకం, స్టాంపు కూడా ఉన్నాయి.ఈ వ్యవహారం మొత్తం స్థానికంగా ప్రభుత్వ అధికారులను నవ్వుల పాలు చేసింది. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ డా.ఉజ్వల్ కుమార్ తహసిల్దార్‌పై విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని కలెక్టర్ అన్నారు. కేసు విచారణ నిమిత్తం చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ జయ యాదవ్‌కు అప్పగించినట్లు తెలిపారు. విచారణ కోసం యాదవ్ కల్నల్‌గంజ్ చేరుకోనున్నారు.అయితే సదరు తహసిల్దార్‌ ఈ ఫిర్యాదు గురించి స్పందించారు. ఈ కంప్లైంట్ చూసి నేను షాక్ అయ్యా. ఇది ఫోర్జరీ చేశారు. అసలు అలాంటి ఫిర్యాదు నా వద్దకు రానే లేదు. ఆ ఫిర్యాదుపై కనిపించే ముద్ర నకిలీది. సంపూర్ణ సమాధాన్ దివస్‌లో వచ్చిన ఫిర్యాదులు సంబంధిత విభాగాలకు నామినేట్ చేస్తాం. ఈ ఫిర్యాదులు ఏ ఇతర కార్యాలయాలకు పంపించం.ఇదంతా ఎవరో కావాలనే పుట్టించారు. దీనిపై విచారణ జరుగుతోంది అని చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చారు. చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఎంక్వయిరీ చేసి ఏం రిపోర్ట్ ఇస్తారో చూడాలి.

హ‌మ్మ‌య్య‌.. శాంతించిన వ‌రుణుడు

ఎడ‌తెరిపి లేకుండా ప‌డుతున్న వ‌ర్షాలు కాస్తంత త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గింది. ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 54వేల అడుగుల‌కు చేరుకుంది. కానీ ఇక్క‌డ మూడో  ప్ర‌మాద హెచ్చరిక మాత్రం కొన‌సాగుతోంది. 53 అడుగుల లోపు త‌గ్గితేగాని ఈ హెచ్చ‌రికను అధికారులు ఉపసంహ రించ‌రు.   మొత్తంమీద జిల్లాలోని ఏడు మండ‌లాల్లో 71 గ్రామాలు ఇంకా జ‌ల‌దిగ్భంధంలోనే ఉన్నా యి. 12వేల‌కు పైగా ఇళ్లు ముంపున‌కు గురికాగా సోమ‌వారానికి 11 వేల ఇళ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని రప్పించి, పారిశుధ్య చర్యలను వేగవంతం చేశారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాలకు రహదారి లేకపోవడంతో ఆర్మీ హెలికాప్టర్‌ ద్వారా నిత్యావసర సరుకులను తీసుకెళ్లారు. 114 గ్రామాలకు చెందిన 27,778 మంది వరద బాధితులకు 79 పునరావాస కేంద్రాల్లో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. గోదావరి వరద ఉగ్రరూపం దాల్చి తిరిగి తగ్గుముఖం పట్టినా రామాలయం పడమర మెట్లు, విస్తా కాంప్లెక్స్, నిత్యాన్నదాన సత్రం, పలు దుకాణాలు ఇంకా గోదావరి వరద నీటలోనే మునిగి ఉన్నాయి. ఉత్తర ద్వార ప్రాంగణం, మిథిలా స్టేడియం వద్ద కూడా ఇంకా వరద నీరు నిలిచిపోయింది. సీఎం కేసీఅర్ రివ్యూలో మందలించినా జిల్లా యంత్రాంగం తీరు మారలేదు. స్పెషల్ అధికారులు భారీ ఎత్తున వ‌ర‌ద‌ వస్తోందని తెలిసినా ముందే సింగరేణి మోటార్లను తెప్పించడంలో నిర్లక్ష్యం వహించారు. సీఎం కేసీఅర్ సూచన చేసినా వరద నీరు ఎత్తి పోయడంలో అధికారులు విఫలమయ్యారు. ఇలా వుండ‌గా, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 6,24,610 క్యూసెక్కులకు చేరింది. 85 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. సరస్వతీ బ్యారేజ్ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 17,744 క్యూసెక్కులు కాగా.. దీనికి చెందిన 66 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తు న్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి  తీవ్రస్థాయిలో వరదలొచ్చిన నేపథ్యంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని బొమ్మాపూర్‌ శివారులో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కర కట్ట కోతకు గురైంది. 30 మీటర్ల మేర గండి పడింది. దీంతో సుమారు 25 ఎకరాల్లోని పంటల్లో ఇసుక మేట లు వేసింది. బ్యారేజీ కరకట్టకు వినియోగించిన మట్టితోపాటు రివిట్‌మెంట్‌కు వినియోగించిన బండరాళ్లు పంట చేలల్లో వచ్చి చేరాయి.  ఇప్పుడు వ‌ర‌ద‌ తీవ్రత తగ్గి.. చేను వద్దకు చేరుకున్న రైతులు ఇసుక మేట లను చూసి ఆందోళనకు గురయ్యారు. ఇసుక మేటల కారణంగా పత్తిమొక్కలు పూర్తిగా చనిపోయాయని బాధ‌ప‌డుతున్నారు.  రెండు రోజుల క్రితం బ్యారేజీ ఇదే కరకట్ట  బెగ్లూర్‌ శివారులోని  ఆంజనేయస్వామి ఆలయం వద్ద 50 మీటర్ల మేర కోతకు గురైంది. వరదలు తగ్గితే  ఇంకా ఎన్నిచోట్ల  కోతకు గురై ఉంటుం ద‌నే విషయం బయటపడుతుందని రైతులు అంటున్నారు.

ఐక్యత విచ్ఛిన్నం.. కమలానిదే ఆధిపత్యం

విపక్షాల ఐక్యత విచ్ఛిన్నమైపోయింది. రాష్ట్రపతి ఎన్నికలో అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావడంలో విఫలమయ్యాయి. విపక్షాలన్నీ కలిపి నిలబెట్టిన అభ్యర్థికి తామే పూర్తిస్థాయి మద్దతును అందివ్వలేకపోయాయి. అంతే కాకుండా ముందు ముందు కూడా తాము ఏకతాటిపైకి రావడం, కలిసి కమలాన్ని ఢీకొనడం సాధ్యమయ్యే పని కాదని చెప్పకనే చెప్పేశాయి. దీంతో ఎవరు ఎన్ని కబుర్లు చెపపినా విపక్షాల ఐక్యత ఎండమావి వంటిదేనని తమ చేతలతో మరోసారి రుజువు చేసేశాయి.   జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలిసి సమావేశం నిర్వహించినా.. అభ్యర్థిని ప్రకటించినా.. ఆ అభ్యర్థి తనకు మద్దతునిచ్చే పార్టీలను కలిసినా.. అవి చివరికి వచ్చే సరికి ఎవరిదారి వారిదే అన్నట్లుగా చీలిపోయాయి.  ఎంతలా అంటే  బిజెపి నాయకత్వంలని ఎన్డీఏ కూటమి నిలిపిన రాష్ట్రపతి అభ్యర్థికే తమ మద్దతు అంటూ విపక్షాల్లోని కొన్ని పార్టీలు బహిరంగంగా ప్రకటించేశాయి.   2024లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలలో కూడా కాషాయ పార్టీని గట్టిగా ఎదుర్కొనే విషయంలో విపక్షాలు కలిసి సాగుతాయన్న నమ్మకాన్ని ఆ పార్టీలన్నీ కలిసికట్టుగా వమ్ము చేశాయి.    రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడకముందే విపక్షాల నేతలు పోటా పోటీగా బిజెపియేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రయత్నాలు ఎవరికి వారు వేర్వేరుగా చేశారు. బిజెపిని నిలువరించాలన్న ఉద్దేశం కంటే విపక్షాల ఐక్య కూటమికి నాయకత్వం వహించాలన్న తహతహే వాటిలో అధికంగా కనిపించింది.  బిజెపియేతర పార్టీలతో కూటమి, అని థర్డ్ ఫ్రంట్ అని సంకేతాలిచ్చారు.  ముఖ్యమంత్రులతో డిల్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. కానీ, నిర్వహించలేదు. చివరకు బిజెపి అభ్యర్థికే మద్దతు ప్రకటించి తమ మధ్య సఖ్యతలేదంటూ పరోక్షంగా వెల్లడించారు. చివరకు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ముందు ప్రతిపక్షాలతో అధికార పక్షం ఓ మారు సంప్రదిస్తే మేము ఆలోచించే వాళ్ళం.. అని ప్రకటన చేసి తమలోని సమన్వయలోపాన్ని కనిపించకుండా  జాగ్రత్త పడ్డాయి.  విపక్షాల తరపు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సయోధ్య కుదరలేదు. శరద్ పవార్ ను అభ్యర్థిగా పలువురు ప్రతిపాదించినా.. ఆయన పోటీకి ససేమిరా అన్నారు. దీంతో మరో అభ్యర్థి కోసం వేట సాగించారు. జూన్ నెలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు దాదాపు 17 రాజకీయ పార్టీలతో డిల్లీలో పశ్చిమ బంగాల్ సిఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, డీఎంకే, ఆర్‌‌జేడీ, శివసేన, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్, ఆర్‌‌ఎస్‌పీ, ఐయూఎంఎల్, ఆర్‌‌ఎల్‌డీ, జేఎంఎం పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, జైరామ్ రమేశ్, జేడీఎస్ నుంచి హెచ్‌డీ దేవెగౌడ, కుమారస్వామి, ఎన్సీపీ నుంచి శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్, ఎస్పీ నుంచి అఖిలేశ్ తదితరులు పాల్గొన్నారు. శిరోమణి అకాళీదళ్, ఆప్​, టీఆర్ఎస్, టిడిపి, వైఎస్సార్‌‌సీపీ, బీజేడీ పార్టీలు హాజరుకాలేదు. జెఎంఎం, శివసేనలు సమావేశంలో పాల్గొని అనంతరం బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. తటస్థంగా ఉన్న పార్టీలు బిజెపి నిలిపిన అభ్యర్థికి మద్దతును ప్రకటించాయి. దీంతో బిజెపియేతర పార్టీల్లోని కొన్ని పార్టీలు బిజెపికి సానుకూలంగానే నిర్ణయం తీసుకుంటాయనేది పరోక్షంగా సంకేతాలను వెల్లడించినట్టుగా ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ అవగాహనతో ఏర్పడిన ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తన మద్దతును బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రం విపక్షాల అభ్యర్థిగా మమతాబెనర్జీ నిలిపిన యశ్వంత్ సిన్హాకు ప్రకటించిది. మహారాష్ట్రలోనూ శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ పార్టీలు ఒక జట్టుగా ఉన్నాయి. ఇటీవలి వరకు కూడా ఈ మూడు పార్టీలు కలిపి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సిఎంగా ఉండేవారు. కానీ, కాంగ్రెస్, ఎన్సీపిలు మద్దతిచ్చిన అభ్యర్థికి కాదనీ బిజెపి అభ్యర్థికి రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ప్రకటించింది శివసేన. దీంతో భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు బిజెపితో స్నేహగీతం పాడటం ఖాయమనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో విపక్షల మధ్య సఖ్యత లేదనీ, విపక్షాల్లోని కొన్ని పార్టీలు బిజెపితో కలిసి రాజకీయ ప్రయాణం సాగించే అవకాశలు లేకపోలేదనేది సర్వత్రా వ్యక్తమవుతోన్న అభిప్రాయం. మరి ఏ పార్టీలు కాంగ్రెస్ తో ఉంటాయో..? ఏ పార్టీలు ఒంటరిగా ఉంటాయో..? ఏ పార్టీలు బిజెపితో సాగుతాయో వేచి చూడాలి.

వ‌ర‌ద క‌ష్టాలు.. ఒడ్డునే ప్ర‌స‌వం

అకాల వ‌ర్షాలతో వాగులు, వంక‌లూ పొంగి పొర్లుతూన్న‌వేళ‌, గ్రామాలు, కుగ్రామాల్లో ప్ర‌జ‌లు ప్రాణ‌భీతితో వ‌ణుకుతున్న‌వేళ ఓ శిశువు జ‌న‌నం ఓ గ్రామాన్ని భ‌యాందోళ‌న‌ల నుంచి ఆనందోత్సాహంలోకి తెచ్చింది. క‌న్నీళ్ల నుంచీ ఆనంద‌భాష్పాలు పంచుకునేలా చేసింది. క‌ష్టాల మ‌న‌సుకు ర‌వ్వంత ఊర‌ట‌నిచ్చింది.  గాంధారి వాగు దాటుతోన్న‌స‌మ‌యంలో ఓ గ‌ర్భిణి ప్ర‌స‌వించింది. అస‌లే ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల‌తో వాగులూ అడ‌వి బిడ్డ‌ల‌ను ఖంగారెత్తిస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న వారి ప‌రిస్థితి మ‌రీ దారుణం.. ఆస్ప‌త్రేలేవీ ద‌గ్గ‌రా దాపు ఉండ‌వు. వాగులు దాటి వెళ్లాల్సిందే. ఈమ‌ధ్య‌ భారీవ‌ర్షాలు అటుగా దాటి వెళ్ల‌డానికీ చాలా ఆలోచించి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సిన ప‌రిస్థితుల్లో ఉన్నా రంతా. స‌రిగ్గా ఈ ప‌రిస్థితులు, ఈ ఆందోళ‌న స‌మ‌యంలోనే ఓ గ‌ర్భిణికి నొప్పులు వ‌చ్చి ఆస్ప‌త్రికి తీసికెళ్లాల్సి వ‌చ్చింది. ఆమె ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర‌వెల్లి మండ‌లం హ‌ర్కాపూర్ పంచాయ‌తీ మామిడి గూడు  గ్రామానికి చెందిన ఉయిక.  ఆమెను  గాంధారి వాగు దాటించి ఆస్ప‌త్రికి తీసికెళ్లాలి. గ్రామస్థులు  ఆమెను ఇంద్ర వెల్లి పీహెచ్‌సీకి  తరలించేందుకు సిద్ధమయ్యారు. వారిలో ఆమెను, బిడ్డ‌ను కాపాడ‌గ‌ల‌మ‌న్న ధైర్యం, వారిలో ఆ త‌ల్లి ఆనందాన్ని చూడ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం.. వెర‌సి వాగును దాట‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌న్న ప‌దింత‌ల ధైర్యాన్నిచ్చింది. అంతే  రెండ‌ డుగులు వేసారో లేదో ఆమెకు భ‌రించ‌లేని నొప్పులు  ఆరంభ‌మ‌య్యాయి. అంతే  ఆమె మ‌రుక్ష‌ణం గ‌ట్టు మీద‌నే  ప్ర‌స‌వించింది. సమాచారం అందుకున్న పిట్టబొంగరం పీహెచ్‌సీ హెచ్‌ఈవో అశోక్‌, వాల్గొండ  ఏఎన్‌ఎం  జానా బాయి, ఆశా కార్యకర్త  మైనాబాయి వాగు దాటి వెళ్లారు.   గ్రామస్థుల సహాయంతో తల్లీ, బిడ్డలను క్షేమంగా వాగు దాటించారు. అంతేకాదు బాలింత ఆస్పత్రికి చేరేందుకు ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు నడిచింది. అక్కడినుంచి అంబులెన్స్‌లో ఇంద్రవెల్లి పీహెచ్ సీ కి తరలించారు.  త‌ల్లీ బిడ్డా క్షేమ‌మ‌ని తెలిసి మామిడిగూడు గ్రామ‌స్తుల్లో ఆనందం ఆకాశాన్నంటింది. 

వరద ముంపునకు శాశ్వత పరిష్కారమేది?

గోదావరి నదిలో ఉవ్వెత్తున వరదనీరు పోటెత్తి ప్రహిస్తోంది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు వరద ముంపుతో అల్లాడిపోతున్నారు. వరద విలయంతో వందలాది లంక గ్రామాల వాసులు గజగజలాడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగేందుకు నీరు లేక, తలదాచుకోవడానికి చోటు లేక తల్లడిల్లిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయల పంటలు నీటమునిగాయి. వేలాది పశువులు, పెంపుడు పక్షులు, సామాగ్రి వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. తెలంగాణలోని పవిత్ర పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వెళ్లేందుకు నిర్మించిన శబరినదిపై వంతెన పైనుంచి కూడా వరదనీరు ప్రవహిస్తోంది. భద్రాచలం క్షేత్రంలో వరదనీరు ముంచెత్తేసింది. భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం అత్యంత ప్రమాదకర స్థాయిలో 71 అడుగులకు చేరుకుంది. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద గోదావరి ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దిగువన తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద పోటెత్తి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరదనీరు సుమారు 21 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 బ్యారేజీ గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి  23 లక్షల 94 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వందేళ్ల చరిత్రలో 41 పర్యాయాలు గోదావరి నదిలో భారీ వరదలు ముంచెత్తాయి. వరద పోటెత్తినప్పుడల్లా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అన్నింటినీ పోగొట్టుకుని అతలాకుతలం అయిపోతూనే ఉన్నారు. 1853 నుంచీ చూసుకుంటే.. ధవళేశ్వరం వద్ద రికార్డు స్థాయిలో అత్యధికంగా 1986 ఆగస్టు 16న 35.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించినట్లు రికార్డయింది. అంతకు ముందు 1953 ఆగస్టు 19న రెండో అత్యధిక వరదగా నమోదై 30 లక్షల క్యూసెక్కులు ప్రవహించింది. 2006 ఆగస్టు 7వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 28.5 లక్షల క్యూసెక్కుల వరద రికార్డయింది. 1990 ఆగస్టు 25న 27.8 లక్షల క్యూసెక్కుల వరదనీరు, 2010 ఆగస్టు 9న 20.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు నమోదైంది. ఇక తాజాగా గోదావరికి వచ్చిన వరద 21 నుంచి 22 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. అంటే.. గోదావరి నది చరిత్రలో 41 సార్లు వచ్చిన వరదల్లో ఈసారా నాలుగో లేదా ఐదో అతిపెద్ద వరదగా రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. పదుల సార్లు గోదావరి వరదలు పోటెత్తి గ్రామాలకు గ్రామాలనే ముంచేసి, లక్షల కోట్ల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నా.. వేలు, లక్షల మూగజీవాలు మృత్యువాత పడుతున్నా ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు ఏమి చేశాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంటికి చుట్టం వచ్చిన తర్వాత పొయ్యి వెలిగించినట్టు ఏవో తాత్కాలిక చర్యలే తప్ప వరదలతో జననష్టం, ఆస్తి నష్టం జరగనివిధంగా ప్రభుత్వాలు శాశ్వతంగా చేసిన ప్రయత్నాలేవీ లేవనేది బాధితులందరి నోటా వినిపిస్తున్న విమర్శ. వరదలు ముంచెత్తుకు వచ్చిన తర్వాత నది కరకట్టలపై కొన్ని ఇసుకబస్తాలు వేయడమే తప్ప ఏటి గట్లను పటిష్టంగా ఏర్పాటు చేసే దిశగా ఏ ఒక్క ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదనేది వాస్తవం అంటున్నారు. వరదనీరు ఊళ్లను ముంచెత్తిన తర్వాత బాధిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి అరకొరగా భోజన, వసతి సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. వరదపోటు ఎక్కువైనప్పుడు ఆర్మీని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతున్నాయి తప్ప బాధితుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపెట్టకుండా ఉపేక్షిస్తున్నాయంటున్నారు. ఇప్పటికైనా వరద కష్టాల నుంచి తమను శాశ్వతంగా బయటపడేసేందుకు సరైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను బాధితులు వేడుకుంటున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి హైకోర్టు జెల్ల 

జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై మంగళగిరి సీఐడీ పోలీ సులు నమోదు చేసిన కేసును కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  ఈడీబీ సీఇవోగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారంటూ  జాస్తి కృష్ణ కిషోర్‌పై గతంలో వివిధ సెక్షన్ల కింద మంగళగిరి సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈడీబీ  సీఈవోగా ఉన్న ప్పుడు అవకతవకలకు పాల్పడ్డారని గతంలో సర్కార్  ఆయనపై  సస్పెన్షన్  వేటు వేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల పదవీ కాలానికి ఆర్థిక అభివృద్ధి మండలి  సీఈవోగా కృష్ణకిషోర్ పని చేశారు.  పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని కేసు నమోదు చేశామ‌ని, అలాగే కృష్ణ కిశోర్‌పై కేసు నమోదు చేయాలని సీఐడీకి  వైసీపీ ప్ర‌భుత్వం ఆదే శాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సీఐడీకి సూచించిన ప్రభుత్వం విచారణ పూర్తయ్యే వరకు అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణ కిశోర్‌కు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై సెక్షన్ 188, 403, 409, 120 బీ కింద  సీఐడీ  కేసులు నమోదు చేసింది. తనపై నమోదైన కేసుపై జాస్తి కృష్ణకిషోర్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు కేసులపై ఆధారాలు సమర్పించ డంలో సీఐడీ విఫలమైందని పేర్కొంది. తాజాగా ఈ కేసులన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.