డాలర్ నోటు తీసింది.. ఆస్పత్రిపాలయింది!
posted on Jul 17, 2022 @ 12:19PM
ఇంటి బయటో, అలా రోడ్డుమీద వెళుతూంటనేనో పది రూపాయల నోటో, వందనోటో కనపడగానే ఠక్కున తీసి ఎవరూ గమనిం చక ముందే జేబులో పెట్టేసుకుంటాం. ఇది చాలా సహజం. ఎవరో బొత్తిగా స్పృహలేకుండా పడేసుకున్నారు అనీ అనుకుంటాం. ఎవరన్నా గమనిస్తే మాత్రం మర్యాదగా వెళ్లి అడుగుతాం మీదా, మరెవరిదయినానా అని. ఇదుగో ఇలా కిందపడినది, రోడ్డుమీద కనిపించిందనీ తీసిన నోటే రెనీ పార్సన్ కొంప ముంచింది. అనారోగ్యానికి గురై ఆస్పత్రిపాలయింది.
అదేమిటి రోడ్డుమీద నోటు తీస్తే అంత అస్వస్థతకు గురయిందా అని అనుమానం వచ్చింది గదూ? నిజమే. నేష్‌వలీ, టెన్నిసీ కి చెందిన రెనీ పార్సన్ తన భర్త జస్టిన్, కుటుంబ సమేతంగా వారి ప్రాంతంలోని మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ కి వెళ్లింది. అక్కడి రెస్ట్ రూమ్‌కి వెళ్లిందామె. చంకలో మూడు నెలల పాప కూడా వుంది. అక్కడ ఆమెకు కొంత దూరంలో నేలమీద ఒక డాలర్ నోటు కనపడింది. అంతే మరో ఆలోచనలేకుండా ఠక్కున తీసింది. మానవ సహజం.. అమలాపురమైనా, అమెరికా అయినా!
కొంతసేపటి తర్వాత ఆమె తన బిడ్డను తీసుకుని మళ్లీ ప్రయాణానికి కారులో ఎక్కింది. కొద్ది దూరం వెళ్లినప్పటి నుంచి ఏదో తెలియని ఇబ్బందులు మొదలయ్యాయి. హఠాత్తుగా బుజాలనొప్పులు మొదలై శరీరమంతా నొప్పులు మొదలయ్యాయి. ఒక్కసారిగా శరీరాన్ని కదపలేని స్థితి ఏర్పడిందిట. అది గమనించిన ఆమె భర్త వెంటనే ఆమెను ఏమయిందని పలకరించాడు. ఆమె బాధపడుతోంది, ఒక్క మాటా మాట్లాడలేకపోతోంది. అంతేకాదు శ్వాస తీసుకోవడమూ కష్టమైపోయింది. కళ్లు మూసుకు పోతున్నాయి. ఆమె భర్త జస్టిన్ ఆమెను నిద్రలోకి జారకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఫోన్ తీసి వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి ఫోన్ చేశాడు. అంతకుముందే ఫైర్‌వర్క్ ఉద్యోగులతో మాట్లాడాడు. వారు కారు దగ్గరకి పరుగున వచ్చి ఆస్పత్రికి తీసికెళ్లడానికి అన్ని ఏర్పాట్లు నిమిషాల్లో చేశారు. ఆమె క్షణాల్లో స్పృహ కోల్పోయి, పడిపోయింది.
అతనికీ ఆమె వలె శ్వాస ఇబ్బంది మొదలైంది. కానీ మాట్లాడగలుగుతున్నాడు. అసలు దీనంతటికీ కారణం ఆమె తీసిన నోటు వల్లనే అని తేలింది. ఆ నోటుకి ప్రమాదకరమైన ఫెంటానిల్ అనే మందు రాసి వుందని డాక్టర్లు తెలుసుకున్నారు. రెనీ పార్సన్ ఓ వారం రోజుల తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లగలిగింది. చూశారా నోటు ఎంత పనిచేసిందో. అంటే ఎవరో ఆ నోటు మీద పూసిన ప్రమాదక రసాయనం మరెవరి మీదనో ఉపయోగించాలనుకున్నారు. బహుశా అంతకు ముందే వారికి తెలీకండా ఆ నోటు కిందపడి వుండవచ్చు. పోలీసులు ఆ నోటు రహస్యం తెలుసుకునే పనిలోనే వున్నారు.