ఆరా సర్వే అర్థ సత్యం.. ముక్కోణం ఖాయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వస్తాయో తెలియదు? అప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. జాతీయ రాజకీయాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలియదు. అన్నిటినీ మించి అప్పటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు.
ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో అసలే తెలియదు. సో... ఇప్పటి కప్పుడు ఎన్నికలు జరిగితే, అంటూ మొదలయ్యే... ఎన్నికల సర్వేలు ఆ కాసేపు ఆనందానికి, కాదంటే, రాజకీయ మేథోమధన చర్చలకు పనికోస్తాయే తప్ప, ఎప్పుడో జరిగే ఎన్నికల ఫలితాలను ఇప్పుడే పక్కా చేసేందుకు అంతగా ఉపకరించక పోవచ్చును. అయితే, అంతమాత్రం చేత, సర్వ్ లన్నీ శుద్ధ దండగ అనికాదు. సర్వేల ప్రయోజనం సర్వేలకు వుంది. ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలు, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుని, వ్యూహాలను అల్లుకుంటాయి. ఆ విధంగా సర్వేల వలన ఎదో ప్రయోజనమా ఉంది కాబట్టే, ఎన్నికల వ్యూహాలను అమ్ముకునే రాజకీయ బేహారి ప్రశాంత్ కిశోర్ మొదలు అదే బాటలో అడుగులు వేస్తున్న ఆరా మస్తాన్ వరకు ఎవరికి వారు వారు ప్రతి రెండు మూడు నెలకోసారి వండి వారుస్తున్న సర్వేలు చర్చనీయాంశం అవుతున్నాయి.
అదుకే, రాజకీయ గీతచార్యులు. సర్వేలన్నీ సత్యం కాదు, అసత్యములును కాదు.. ఆంటారు. నిజం,సర్వే ఫలితాలు సత్యాలు కాకపోయినా, అసత్యాలు కూడా కాదు. ఒక , పాత రైల్వే గైడ్ లాగ .. ఒక సూచికగా మాత్రం పనిచేస్తాయి. అలా చూసినప్పుడు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్’గా డిస్కస్ అవుతున్న ఆరా మస్తాన్ (ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్) సర్వే, నివేదిక, అక్షర సత్యం కాదు, కానీ, భవిష్యత్ రాజకీయ విశ్లేషణకు ఒక సూచికగా అయితే, కొంత వరకు ఉపకరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆరా సర్వే చెప్పిన, ఓట్ల శాతం లెక్కలను పక్కన పెడితే, రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటుందనేది, అందరికీ తెలిసిన విషయమే.కాదనడం కుదరదు. నిజానికి, 2019 ఎన్నికల్లోనే రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. అందుకే, సారు ... కారు .. పదహారు బోల్తా కొట్టింది. కారు 16లో నాలుగు బీజేపీ, మూడు కాంగ్రెస్ పట్టుకు పోయాయి. మిగిలిన తొమ్మిది మాత్రమే తెరాసకు మిగిలాయి. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అధికార తెరాస సిట్టింగ్ స్థానాలను గెలుచుకుంది.
అదే విధంగా జీహెచ్ఎంసి ఎన్నికల్లోనూ బీజేపే నాలుగు నుంచి 48 స్థానాలకు చేరింది. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక, హుజురాబాద్ తోపాటుగా, హుజూర్ నగర్ నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో ఓడి పోయింది. అందులో, హుజూర్ నగర్ అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అలాగే, నాగర్జున సాగర్ లోనూ ఏడెనిమిది సార్లు, అదే స్థానం నుంచి గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఓడిపోయారు. దుబ్బాక, హుజురాబాద్ లలో కాంగ్రెస్ అభ్యర్ధులు డిపాజిట్ కోల్పోయారు. హుజురాబాద్’లో అయితే కాంగ్రస్ అభ్యర్ధికి కేవలం మూడు వేల పైచిలుకు ఒతులు మాత్రం పోలయ్యాయి. సర్వే లెక్కలు పక్కన పెట్టి, వాస్తవ ఫలితాల అధారంగా విశ్లేషణ చేసినా, గతంలో పోల్చితే తెలంగాణలో బీజేపీ బలపడిందన్నది నిజం.ఇంకా బలపడే ప్రయత్నం మరింత బలంగా చేస్తోంది. అది కూడా నిజం.
జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడమే కాకుండా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఇతర సీనియర్ నేతలు, ఒక్కొకరు ఒక్కొక నియోజక వర్గంలో మొత్తం 119 నియోజక వర్గాల్లో రెండు రోజుల పాటు పర్యటించి, పార్టీ క్యాడర్ తో కలిసి పనిచేయడం మాములు విషయం కాదు. తెలంగాణపై పార్టీ దృష్టి పెట్టింది అనేందుకు ఇదొక నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సారథ్యంలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పరుగు లు తీస్తోంది. పార్టీ క్యాడర్లోనూ జోష్ పెరిగిందన్నది నిజం.
అదీ గాక ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్రాస్ రూట్ లెవల్ నుంచి పై స్థాయి వరకు పటిష్ట యంత్రాంగం వుంది. సో.. ఎన్నికలు ఇప్పుడు జరిగినా, ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ తెరాసకు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక తెరాస విషయం అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. తెలంగాణ సెంటిమెంట్ చాల వరకు చల్లారింది. గతంలో లాగా బలంగా పని చేసే పరిస్థితి అయితే లేదు. అయినా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం అయితే నేమీ, మఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ఇమేజ్, రాజకీయ ఎత్తుగడలు ఇతరత్రా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్నీ కలిపినా, తెరాసకు ఉండే అడ్వాన్ టేజీ ఉండనే ఉంటుంది. వుంది కూడా. తెరాస పనైపోయిదని అనుకోవడం, అనుకునేందుకు బాగుటుంది కానీ, అది పూర్తిగా వాస్తవం కాదు. సో.. ఆరా సర్వే ఎందుకు చేసినా, ఎవరి కోసం చేసినా, వండి వార్చిన వంటకమే అయిన, కొంచెం రుచిగానే ఉందని అంటున్నారు. కొంచం కాస్త అటూ ఇటుగా వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలానే ఉందని, విశ్లేషకులు సైతం అంటున్నారు.