ఉచితాలపై మోడీ వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ ఫైర్..జగన్ మౌనానికి కారణమదేనా?
posted on Jul 17, 2022 @ 12:18PM
ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు చేశారో, ఎవరిని టార్గెట్ చేసి పేల్చారో తెలియదు కానీ ఓట్ల కోసం ఉచిత పంపిణీల(పథకాలు) పై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కచ్చితంగా ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూనే మోడీ పరోక్షంగా ఫ్రీ బీస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని విపక్షాలు గట్టిగా నొక్కి చెబుతున్నాయి.
అయితే మోడీ వ్యాఖ్యల టార్గెట్ జగన్ అని విపక్షాలు అంటున్నా.. ఏపీ సీఎం జగన్ మాత్రం ఇప్పటి వరకూ మోడీ వ్యాఖ్యలపై స్పందించలేదు. దేశలో ఏ రాష్ట్ర్రం చేయని విధంగా ఏపీలో సంక్షేమానికి పెద్ద పీట వేశామనీ, దేశం మొత్తం తన ప్రభుత్వ విధానాలను అనుసరించడమే మిగిలి ఉందనీ తన భుజాలను తానే చరిచేసుకుంటూ సంక్షేమ లబ్ధిదారులకు సొమ్ముల పంపిణీ సభలలో ప్రసంగాలు చేసే జగన్ ఇప్పుడు మోడీ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే మోడీ లక్ష్యం ఒకటి అయితే ఆయన విమర్శ బాణం మరొక చోట తగిలిందా అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మోడీ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ మౌనంగా ఉంటే... ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్ మాత్రం ఘాటుగా స్పందించారు. నేరుగా ప్రధాని పేరు ప్రస్తావించకుండానే.. ఉచిత విద్య, ఉచిత విద్యుత్ పథకాలు కేవలం ఉచిత పథకాలు కావని కేజ్రీవాల్ అన్నారు. అవి భవిష్యత్ తరాల బాగు కోసం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి లాంటివన్నారు. ఉచిత విద్య వల్ల పేదలు చదువుకుని దేశ ప్రగతిలో, ఉత్పాదకతలో భాగస్వాములౌతారని అన్నారు. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయనీ వివరించారు.
నిజమైన ఉచితాలనేవేమైనా ఉంటి అవి బడా వ్యాపారులకు చేసే వేల కోట్ల రూపాయల మాఫీలేనని రిటార్డ్ ఇచ్చారు. అంతే కానీ ఢిల్లీ ప్రభుత్వం 18 లక్షల మందికి ఉచిత విద్య, రెండు కోట్ల మంది పేదలకు ఉచిత వైద్యం ఉచిత పథకాల కిందకు రావని అన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య ద్వారా దేశ ప్రగతిని మా వంతు సహకారం అందిస్తున్నట్లేఅన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో మొహల్లా క్లినిక్ లు అద్భుత పాత్ర్ వహిస్తున్నాయని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చి, బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న బడా వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలకు చేసే రుణ మాఫీ నిజమైన ఉచిత పథకమని కేజ్రీవాల్ అన్నారు. శ్రీలంక పర్యటనలో అదానీకి కోట్లాది రూపాయల కాంట్రాక్టు కోసం మీరు చేసిన దౌత్యం నిజమైన ఉచిత పథకమని మోడీని ఉద్దేశించి కేజ్రీవాల్ విమర్శించారు.
అయితే ఉచితాలపై మోడీ చేసిన సంచలన వ్యాఖ్యలపై నిజంగా భుజాలు తడుముకుని స్పందించాల్సిన జగన్ మౌనంగా ఉండటానికి కారణమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. నోరెత్తి మాట్లాడితే.. కేసుల దొంతర కదులుతుందన్న భయమా.. భవిష్యత్ లో అప్పుపట్టదన్న బెరుకా అని ప్రశ్నిస్తున్నారు.