ఓట్ల కోసం ఉచిత పంపిణీపై ప్రధాని మోడీ ఉచిత హెచ్చరికలు..!
posted on Jul 17, 2022 @ 12:03PM
మాకు ఓటేయండి చాలు... ఇంక మీరేం చేయనవసరం లేదు. మీ అవసరాలన్నీ మేమే ఉచితంగా తీర్చేస్తాం. కాలు బయటపెట్టకుండా మీకు సకల సౌకర్యాలూ ఇంటి ముంగిటకు తీసుకువచ్చి అమరుస్తాం అన్న రీతిలో ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పార్టీలు, ప్రభుత్వాలూ పోటీలు పడి మరీ హామీలు గుప్పించేస్తుండటం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువ అయిపోయింది. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ హామీలు గుప్పించేసి, తీరా అధికారం చేపట్టిన తరువాత వాటి అమలుకు రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా సరే అనివార్యంగా నిబంధనలన్నిటికీ తిలోదకాలిచ్చేసి మరీ అప్పులు చేస్తున్నాయి.
ఇంత చేసినా ఇచ్చిన హామీల అమలుకు సరిపోక.. రాష్ట్రాలకు రాష్ట్రాలు దివాళా ముంగిట నిలబెడుతున్నాయి. అన్నీ ఉచితమంటూనే.. రోజు గడవడానికి ఆదాయం కోసం ప్రజలపైన పన్నులు విధించి ముక్కు పిండి వసూలు చేస్తూ వారి జీవితాలనూ కుదేలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రస్తుత స్థితి ఇందుకు ఉదాహరణగా చెప్ప వచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే.. అప్పులు కూడా చేసి మరీ ఉచితాలకు లక్షల కోట్లు ఖర్చు వ్యయం చేస్తోంది. అదే చేత్తో నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెంచేసి ఆ ప్రజల నెత్తినే బండ పడేస్తోంది. పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ చేయడానికి కూడా సిద్ధమైపోయింది ఏపీ సర్కార్.
ఏపీ దుస్థితికి పరోక్షంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా కారణమే. రాజకీయ ప్రయోజనం ఆశించి కేంద్రం ఏపీ అడ్డగోలు అప్పులకు అంతకంటే అడ్డగోలుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మోడీ ఉచితాలు ప్రమాదకరం అంటూ తనదైన స్టైల్ లో ఓ హెచ్చరిక జారీ చేశారు. యూపీలో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ ఉచిత పథకాలపై రాష్ట్రాలకు సూచన లాంటి హెచ్చరిక చేశారు. ఇది దేశ అభివృద్ధికి విఘాతమని ఉద్ఘాటంచేశారు. దేశ ప్రగతికి ఫ్రీ బీస్ గొడ్డలి పెట్టు వంటివన్నారు. ఉచితాలు అనర్ధదాయకమనీ, వీటిని నియంత్రించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నిర్ణయం తీసుకోవాలని, లేదా కేంద్రం ఈ దిశగా చట్టం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చే పార్టీలను, ప్రభుత్వాలను నియంత్రించే దిశగా చట్టం రావలసిన అవసరం ఉందనడంలో సందేహం లేదు. కేబినెట్ పరిమాణాన్ని నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చిన విధంగానే ఈ ఫ్రీ బీస్ హామీలను నియంత్రించే దిశగా కూడా చట్టం తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యాంగ నిపుణులు గత కొంత కాలంగా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.
అయితే అధికారమే పరమావధిగా భావిస్తున్న రాజకీయ పార్టీలు ఈ దిశగా పడే ప్రతి అడుగుకూ ప్రతిబంధకంగా మారుతున్నారు. రుణ మాఫీ హామీని విమర్శించిన నోటితోనే కేంద్రం కూడా రుణ మాఫీ హామీ ఇచ్చిన సంగతినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అసంబద్ధం కాదు. అయితే ఉచితాలు అనర్ధం అంటూ మోడీ చేసిన వ్యాఖ్య ఏ విధంగా చూసినా హర్షించాల్సిందే. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారు. ఏ వ్యూహంతో ఈ హెచ్చరిక చేశారు అన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ప్రధానిగా మోడీ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆయన అనుసరిస్తున్న విధానాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇరుకున పెట్టేలా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కేటాయింపులు, నియామకాలు, ప్రధాన్యతల విషయంలో దేశానికి ప్రధానిగా కాకుండా గుజరాత్ ప్రధానా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలు రాష్ట్రాలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే సందర్భం ఏదైనా, అవసరం ఎలాంటిదైనా ప్రధాని నోటి వెంట ఓట్ల కోసం ఉచిత పంపిణీలు దేశ భవితకు ప్రమాదకరమన్న మాటలు మాత్రం అక్షర సత్యమని పరిశీలకులు అంటున్నారు. మోడీ ఆశీస్సులు లేకుండానే కుప్ప తెప్పలుగా అప్పులు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు తిలోదకాలిచ్చేసి మూడేళ్లలోనే రాష్ట్ర భవిష్యత్ ను అంధకార బంధురంగా మార్చేసిన ఏపీ గురించి ఆయన ఏం చెబుతారనీ ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు దేశ భవిష్యత్ కు ప్రతిబంధకం కాదా అని ప్రశ్నిస్తున్నారు.ఏపీ అడగడమే ఆలస్యం అన్నట్లుగా అప్పులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఏపీలా అడ్డగోలుగా అప్పులు చేసి మరీ ఓట్ల కోసం పెట్టుబడిగా పెట్టిన రాష్ట్ర్రాల నిగ్గు తేల్చి వాటిని నియంత్రించడమే కాకుండా నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తేనే మోడీ మాటలకు విశ్వసనీయత ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.