సీతక్కకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
posted on Jul 17, 2022 8:13AM
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏటూరు నాగారంలో భారీ వర్షాలు, వరదలతో ముంపునకు గురైన ప్రాంతాలలో ఆమె పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఆమె పర్యటన అంతా వరద ప్రవాహంలో పడవపైనే సాగింది.
బాధితులకు నిత్యావసర వస్తువులు అందించి తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న పడవలో ఇంధనం అయిపోయింది. ప్రవాహ వేగానికి కొంత దూరం ప్రయాణించిన పడవ వరద నీటిలో ఒక చెట్టును ఢీ కొంది. ఆ తరువాత ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేశారు. ఆ పడవ లోనుంచి ఆమె బయటకు వస్తున్న వీడియోను కూడా ఆ పోస్టుకు జత చేశారు. ఇంత ప్రమాదం జరిగినా ఆమె తన పర్యటన కొనసాగించారు. బాధితులను ఆదుకొనే విషయంలో తగ్గేదే లే అని మరోసారి నిరూపించారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా బాధితులను ఆదుకునే విషయంలో సీతక్క ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా పనులు లేక పస్తులుంటున్న పేదలను ఆదుకోవడానికి ఆమె నిత్యావసర వస్తువులను ఒక బుట్టలో పెట్టుకుని ఆ బుట్టను నెత్తిన పెట్టుకుని మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లి మరీ సహాయం అందించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు వరద బాధితులను ఆదుకోవడానికి కూడా ప్రమాదకర పరిస్థితులను లెక్క చేయకుండా వరదనీటితో పడవపై వెళ్లి మరీ బాధితులకు సహాయం అందించి, వారికి ధైర్యం చెబుతున్నారు. సీతక్క ప్రమాదం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.