హర్యానా అధికారులలో విజిలెన్సు వణుకు

అవినీతి సర్వాంతర్యామి.. ఇందు గలదు అందు లేదను సందేహం వలదు.. అయినా,  అవినీతిని చూసీ చూడనట్లు వదిలేయడమే కానీ, పట్టు పట్టి, తుడిచేసే ప్రయత్నం సహజంగా, ఏ ప్రభుత్వమూ చేయదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల అవినీని జోలికి వెళ్లేందుకు, ఏ ముఖ్యమంత్రీ సాహసించరు. అందుకే ప్రభుత్వ ఉద్యోగుల జోలికి వెళితే, ఏమవుతుందో అనుభవపూర్వకంగా తెలిసిన రాజకీయ పెద్దలు, ఎవరి జోలికైనా వెళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగుల జోలికి మాత్రం వెళ్ళకు, వెళ్ళావో నిన్ను ఇంటికి పంపిస్తారని, రాజకీయ  వారసులకు, జూనియర్  నాయకులకు సలహాలు ఇస్తుంటారని అంటుంటారు.  అయితే అందుకు విరుద్ధంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర లాల్ ఖట్టార్, (బీజేపీ)   ప్రభుత్వం, అవినీతిపై ఏకంగా పెద్ద యుద్ధాన్నే ప్రకటించింది.రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి పచ్చిన ఫిర్యాదుల విచారణకు ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు పూర్తి  స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో విజిలెన్స్ అధికారులు.. ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.వల.. కాదు .. వలలు విసిరారు, ఏకంగా  83 మంది గవర్నమెంట్ ఉద్యోగులను అరెస్టు చేశారు. కౌంట్ ఇంకా  కొనసాగుతోంది. ఇంకో విశేషం ఏమంటే, అరీస్ట్ అయిన వారిలో గుమస్తా చేపలే కాదు, గెజిటెడ్ చేపలు ఉన్నాయని, విజిలెన్స్ అధికారుల సమాచారం. డిప్యూటీ ఎక్సైజ్, టాక్సేషన్ కమిషనర్‌ను కూడా బ్యూరో అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. అలాగే, అరెస్టయిన వారిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ శాఖకు చెందిన 18 మంది పోలీసు సిబ్బందికి చెందిన 23 మంది, విద్యుత్ శాఖకు చెందిన 15 మంది, పట్టణ, స్థానిక సంస్థలకు చెందిన 8 మంది, ఎక్సైజ్, పన్నుల శాఖకు చెందిన ముగ్గురు ఉన్నారు. ఈ అందరినీ కూడా, రూ.5,000 నుంచి రూ.5 లక్షల వరకూ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నమని  హర్యానా విజిలెన్స్ బ్యూరో అధికారి తెలిపారు.  ప్రభుత్వ ఉద్యోగం అంటేనే, జీతం ప్లస్ నిజానికి అందరికీ కాకపోయినా లంచాలకు అలవాటు పడిన ఉద్యోగులు  జీతం పై కంటే ‘ప్లస్’ పైనే ఎక్కువ మక్కువ చూపుతారని అంటారు. చేతులు తడిపే పోస్టుల కోసం పోటీ పడతారు. రాజకీయ నాయకుల చేతులు తడుపుతారు. అంతకు పదితలు సంపాదించుకుంటారు. ఏ చిన్న పని చేయలన్నా, అది వారి బాధ్యతే అయినా, చేతులు చాపడం అనేది ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కామన్ అయిపొయింది. అయితే, ఇప్పుడు హర్యానాలో మాత్రం లంచం ఇస్తామన్నా పుచ్చుకునేందుకు ఉద్యోగులు భయపడుతున్నారట. భయంతో వణికిపోతున్నారట. అంటే కాదు హిట్ లిస్టులో ప్రముఖంగా ఉన్న అధికారులు అయితే సెలవులు పెట్టీ మరీ వెళ్లిపోతున్నారు. అదలా ఉంటే హర్యానా ప్రభుత్వం, లంచమ డిగే అధికారులపై ఫిర్యాదు చేసేందుకు  హర్యానా విజిలెన్స్ బ్యూరో 1800-180-2022, 1064 టోల్ ఫ్రీ  నంబర్ కూడా ఏర్పాటు చేసింది. అవును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో ఎప్పుడో  ఇలాంటి ప్రయోగం ఒకటి చేశారు.. కానీ, ఆ ఫోన్ .. మొదటి కాల్  నుంచి ఇప్పటి వరకు ముగానోములోనే ఉందని,  మౌనవ్రతం చేస్తోందని అంటున్నారు.

ట్విట‌ర్ తాతా.. వాస్త‌వం గ్ర‌హించు!

భారీ వ‌ర్షాలు తెరిపిలేకుండా ప‌డుతున్న‌పుడు ప‌ట్ట‌ణాల్లో, గ్రామాల్లో రోడ్లు నీటికుంట‌లుగా మార‌డం చాలా స‌హ‌జం. ఇది చాలాకాలం నుంచి అంద‌రికీ తెలిసిన‌ది, చూస్తున్న‌దీను. ప్ర‌స్తుతం వ‌ర్షాల దెబ్బ‌కి రోడ్లు మ‌రీ దెబ్బ‌తిన్నాయి. ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. రోడ్ల‌మీద‌కి నీరు చేరుకుపోయి కొన్ని ప్రాంతాల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితుల్లో జ‌నాలు వున్నారు. ఇవ‌న్నీ సామాన్య జ‌నానికి తెలిసిన‌దానికంటే  సీఎంకి, నాయ‌కు ల‌కు, మంత్రులకు, ఎమ్మెల్యేల‌కు తెలియ‌కా కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ వ‌ర్షాల‌కు రోడ్లు బాగా పాడ‌య్యా యి. చాలాకాలం నుంచి రోడ్లు విస్త‌ర‌ణ‌, వాటిని మ‌రింత బాగుచేయాల్సిన అవ‌స‌రం వుంద‌ని ప్ర‌జ‌ల‌తో పాటు సంబంధిత అధికారులు గోడు పెడుతూనే వున్నారు. కానీ ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెడుతూనే వ‌చ్చిం ది. ఇపుడు ఈ దుస్థితికి వ‌దిలేసింది.  అయ్యా ఇవి మ‌న రోడ్లే అని వీడియో తీసి చూపుతున్నా అబ్బే అబ ద్దాలు, మ‌న రోడ్లు మ‌రీ ఇంత దారు ణంగా పాడ‌వ‌లేద‌ని ట్విట‌ర్ తాత విజ‌య‌సాయి రెడ్డిగారి ఉవాచ‌. ఇంత కంటే హాస్యాస్ప‌దం మ‌రోటి వుంటుందా?  మా మాట‌ కాదు ప్ర‌జ‌ల మాటా విన‌కుంటే ఎలా విజ‌య‌సాయీ అంటూ విప‌క్షాలు మండి ప‌డుతున్నాయి.  మ‌రీ విడ్డూర‌మేమంటే గుంట‌ల్లో చిక్కుకుని ప్ర‌మాదానికి గుర‌యిన బండి తెలంగాణాకి సంబంధించిన‌ద న‌డం. పైగా ఆఫోటో నిజామాబాద్‌లో ఎప్పుడో జ‌రిగిన‌ద‌ని దాన్ని ఇపుడు ప్ర‌భుత్వాన్ని దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ట్విట‌ర్ తాత‌గారు ఆగ్ర‌హించ‌డం మ‌రీ దారుణం.  ఆటో ప్రమాదం తూర్పు గోదా వరి జిల్లా రాజమండ్రి కి చెందిన పొన్న వీరబ్బు ది అని అమలాపురం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని రిపేర్ ఖర్చులకి 15000 వరకు అవ్తుందని డ్రైవర్ గోల పెడుతున్నాడు.  చిత్ర‌మేమంటే, ఆటో ప్రమాదం రహదారి లో ఉన్న గుంటల వల్ల జ‌రిగింద‌ని  తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తుంటే,  తెలంగాణా  నిజామాబాద్ లో  గుంటలు టి.డి.పి. వాళ్ళే తవ్వుతున్న రేమో అని తప్పు డు ఆరోపణలు చేసిన  ట్విట్టర్ తాత ని ఎవ‌రు క్ష‌మిస్తారు.  ప్ర‌మాదం జ‌రిగిన‌ది ఎక్క‌డో తెలియ‌కుండానే ఫోటోల‌తో స‌హా చూపుతారా? ఆ ప్రాంతం ఆంధ్రానో, తెలంగాణానో తెలియ‌ని స్థితిలో ప్ర‌జ‌లు లేర‌న్న‌ది విజ‌య‌సాయి రెడ్డి తెలుసుకోవాలి.  అయినా లేనిదాన్ని ఉంది అని ఉన్న దాన్ని లేదు అని చూపించడం లో ఈ ట్విట్టర్ తాత సిద్దహస్తుడని  ప్రజలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

చంద్రబాబు నా అన్నయ్య.. విజయసాయి!

రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాలకు అంతగా ప్రాధాన్యం కనిపించదు. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉండొచ్చు. వేర్వేరు పార్టీల్లోని వేర్వేరు వ్యక్తులు అన్నదమ్ముల్లా మసలుకోనూ వచ్చు. వాస్తవానికి రాజకీయ నేతలందరిదీ ఒకే కుటుంబం.. అదే రాజకీయ కుటుంబం. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు  విజయసాయిరెడ్డి తమ్ముడు.  అవును.. మీరు సరిగ్గానే విన్నారు. చంద్రబాబు నాయుడికి విజయసాయిరెడ్డి వరసకు తమ్ముడు అవుతారు. రాజకీయంగా అనుక్షణం ఉప్పు నిప్పులా విమర్శలు, ఆరోపణలు చేసుకునే చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఉందా అన్న ఆశ్చర్యం అనవసరం. ఎందుకంటే  ఇది నిజంగా నిజం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని విజయసాయిరెడ్డే స్వయంగా బయటపెట్టారు.  అది కూడా చంద్రబాబును, టీడీపీ నేతలను విమర్శించే క్రమంలోనే తమ బంధుత్వాన్ని విజయసాయి వెల్లడించడం గమనార్హం. చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఎలా ఏర్పడిందంటే.. విజయసాయి భార్య సోదరి కుమార్తెని దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు తారకరత్న పెళ్లి చేసుకున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు తనకు వరసకు అన్నయ్య అవుతారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అరబిందో సంస్థకు, అదాన్ కంపెనీకి విజయసాయిరెడ్డి బంధువు ఒకరు కామన్ డైరెక్టర్. దీంతో అడాన్ కంపెనీతో తనకు సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు విజయసాయి ఫైరవుతున్నారు. ఒక డైరెక్టర్ ఎన్నో సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నంత మాత్రాన ఆయా కంపెనీలన్నీ ఆయనవి అయిపోతాయా? అనేది విజయసాయి ప్రశ్న. చంద్రబాబు తనకు వరసకు అన్న అవుతారని.. అలా అయితే.. చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా? అనేది విజయసాయి ప్రశ్న. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అఫీషియల్ ట్విటర్ వేదికగా విజయసాయి రాసుకొచ్చారు. ఉదయం లేచింది మొదలు టీడీపీపైన, చంద్రబాబు, లోకేష్ పైన విమర్శలు, ఆరోపణలు చేసే విజయసాయిరెడ్డికి చంద్రబాబు అన్నయ్య అవుతారన్న వాస్తవాన్ని విమర్శిస్తూనే బయటపెట్టారు. ఇంతకీ విజయసాయి ఇప్పుడీ విషయాన్ని ఎందుకు బయటపెట్టినట్టు. ఒక వైపు విమర్శలు గుప్పిస్తూనే, మరో వైపు అన్న అంటూ బంధుత్వాన్ని ఎందుకు కలుపుకున్నట్లు అన్న ప్రశ్నలకు ముందు ముందు తెలుగుదేశంతో ఏ రాజకీయ అవసరాలు ఉంటాయో అన్న సందేహమే కారణమని సామాజిక మాధ్యమంలో విజయసాయిపై సెటైర్లు పేలుతున్నాయి.

అన్నా.. నువ్వే నా దైవం

సైనికులంటే అంద‌రికీ అపార గౌర‌వ‌మే. దేశ ర‌క్ష‌కులుగానే కాదు దేశ‌ప్ర‌జ‌లు ఎప్పుడు ఘోర ప్ర‌మాదాల్లో చిక్కుకున్నా, ప్ర‌కృతి వైప‌రీత్యాలు భ‌య‌పెట్టినా ప‌రుగున వ‌చ్చి ఆదుకునేది సైనికులే. త‌మ‌ ప్రాణాల కంటే ప్ర‌జ‌ల ప్రాణాలే మిన్న‌గా  భావించ‌డం వారి ప్ర‌త్యేక‌త‌. వారి స‌హ‌జ గుణ నిధి. అందుకే వారికి దేశ మంతా మొక్కాలి.  ఈ పాపా అదే చేస్తోంది. ఈ చిన్నారిలో వారి ప‌ట్ల వున్న భ‌క్తి భావ‌న అంద‌రినీ ఆక‌ట్టు కుంటోంది. ఒక ఆర్మీ జ‌వాను ఎదురుగా వ‌స్తుండ‌టం చూసి కేవ‌లం ప‌ల‌క‌రించ‌డ‌మే కాకుండా అత‌ని పాదాల‌కు న‌మ‌స్క‌రించింది.  ఎక్క‌డా, ఎవ‌రు అనే సంగ‌తి కంటే అస‌లు పిల్ల‌ల్లో కూడా ఇంత‌టి దేశ‌భ‌క్తి వుండ‌టం హ‌ర్ష‌ణీయం అంటు న్నారు తోటి సైనికులు, అధికారులు. దీన్ని ఒక‌రు వీడియో తీసి నెటిజ‌న్ల‌కు అందుబాటులో పెట్టారు.  త‌ల్లిదండ్రులంతా త‌మ పిల్ల‌లకు చిన్న‌త‌నంలోనే దేశ‌భ‌క్తి అల‌వ‌ర్చ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌న్న అభిప్రా యాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఇది నిజంగా ఎంతో ప్రేమ‌, దేశ‌భ‌క్తిని తెలియ‌జేసింద‌ని  ఒక అధికారి ఆనంద భాష్పాల‌తో ఆ చిన్నారిని దీవించారు.

అన్న‌దానం చేస్తే సెంచ‌రీ సాధిస్తావా.. ఇదేం పిచ్చి కోహ్లీ

అభిమానులు, వీరాభిమానులు కేవ‌లం సినీ హీరో హీరోయిన్ల‌కే కాదు క్రికెట్ హీరోల‌కీ వుంటారు. వారికీ, వీరికీ పిచ్చి దాదాపు ఒకే స్థాయిలో వుంటుంది. సినిమా సెంచ‌రీ కొట్టాల‌ని సినీ వీరాభిమానులు, మ‌నోడు సెంచ‌రీ కొట్టాల‌ని క్రికెట్ వీరాభిమానులు ఎంత ప‌నిక‌యినా సిద్ధ‌ప‌డుతున్నారు. టాటూలు వేసుకోవ‌డం చేసి పెద్ద వాళ్లు  కాస్తంత ఖంగారెత్తారు.. ఏకంగా పూజ‌లు, అన్న‌దానాలు.. వీటికి అంతే లేకుండా పోతోంది. వీళ్ల‌ని ఆప‌డం కోహ్లీలాంటి క్రికెట్ హీరో మ‌ళ్లీ సెంచ‌రీ కొట్టాల్సిందే. అస‌లే ఫాన్స్‌కి హీరోగారి బ్యాట్ నుంచీ ప‌రు గుల వ‌ర‌ద లేద‌న్న దిగులు క‌మ్మేసింది. అయితే ఒక్క‌టి ఇలా అన్న‌దానాలు, పూజ‌లు చేసేస్తే  క్రికెట్ వీరుడు సెంచ‌రీ కొట్టేస్తాడా?  భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్‌లో స‌చిన్ ద గాడ్ త‌ర్వాత అంత‌టి క్రేజ్ వుంది. 33 ఏళ్ల కోహ్లీ త‌న 71వ అంత‌ర్జాతీయ సెంచ‌రీ కోసం దేశంలో విదేశాల్లోనూ వీరాభిమానులు వేయిన్న‌ర క‌ళ్ల‌తో ఎదురుచూస్తూనే వున్నారు. క‌ళ్లు కాయ‌లు కాస్తున్నాయేగాని హీరోగారు మాత్రం అర్ధ‌సెంచ‌రీ మించ‌డం లేదు. అంతెందుకు ఈమ‌ధ్య‌మ‌రీ దారుణంగా ఆడుతున్నాడు. అయినా ప్ర‌తి ప్లేయ‌ర్‌కి ఇలాంటి ప్యాచ్ వుంటుంది గురూ, మ‌నోడి విష‌యంలో క్ష‌మించేయండి అంటున్నారు మాజీ క్రికెట‌ర్లు,, కోహ్లీ శిష్య‌గ‌ణం.  కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్‌లో బంగ్లాదేశ్ మీద ఆడిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ చేశాడు. అంతే ఆ త‌ర్వాత అంత‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోతున్నాడు.  అత‌గాడు కెప్టెన్ బాధ్య‌త‌లు వ‌దిలేసుకున్న త‌ర్వాత ఆ ఒత్తిడి త‌గ్గింది గ‌నుక ఇహ మ‌నోడు కొట్టేస్తాడ‌నుకున్నా ఆ ఆనందం ప్రేక్ష‌కులకు, వీరాభిమా ను ల‌కు క‌ల‌గ‌డం లేదు. న‌రాల బ‌ల‌హీన‌త నుంచి కోలుకుని భార‌త వ‌న్ డే జ‌ట్టులోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌రీ దారుణంగా 25 బంతుల్లో కేవ‌లం 16 ప‌రుగులే చేసి నిరాశ‌ప‌రిచాడు. కోహ్లీ లో ఇంకా ఆడే శ‌క్తి వుంద‌ని ప్ర‌స్తుతం కొంత ఇబ్బందిప‌డుతున్నాడే గాని టాప్ స్టార్ స్థాయికి త‌గ్గ‌లేద‌ని, అత‌ని స‌త్తా గురించి ఏ మాత్రం అనుమానించ‌క్క‌ర్లేద‌ని భార‌త్ కెప్టెన్ శ‌ర్మ కూడా కితాబునిచ్చాడు. అందువ‌ల్ల మున్ముందు టెస్ట్ సిరీస్ లో  సెంచ‌రీ చేస్తాడ‌నే ఎదురుచూడాలి. 

దేశం గూటికి కేంద్ర మాజీ మంత్రి?

వైసీపీ అధినేత జగన్ తీరుతో పార్టీలో అసమ్మతి భగ్గుమంటున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన కేబినెట్ లో సీనియర్లు చిటపటలాడడమే కాదు.. పార్టీలో కూడా సీనియర్లు పక్క చూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా.. వైసీపీ సీనియర్లు పార్టీ తీరు పట్లా, అధినేత వ్యవహార శైలి పట్లా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారే స్వయంగా తమ  ఆంతరంగికుల వద్దా ఆ అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నారు. వైసీపీలో జూనియర్, సీనియర్ అన్న తేడా లేదు. అందరి పరిస్థితీ ఒక్కటే ఏరు దాటే వరకూ ఓడ మల్లయ్య... ఏరు దాటేకా బోడి మల్లయ్య అన్న చందమే. మరీ ముఖ్యంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత కేబినెట్ లోనూ, పార్టీలోనూ కూడా సమస్యల చిక్కులు అధికమయ్యాయి. జగన్  అయిష్టంగా అయినా అనివార్యంగా కొనసాగించాల్సిన మంత్రులకు కేబినెట్ లోనే కాదు.. వారి వారి మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులలో కూడా పలుచన అయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే పదవి ఆశించి దక్కక భంగపడిన నేతలు అప్పట్లో అసమ్మతి గళం వినిపించారు. ఆ తరువాత సముదాయించుకుని గతంలోలా పార్టీలో పని చేద్దామనుకున్నా.. అలా చేయలేని పరిస్థి తులను వారికి పార్టీ అధిష్ఠానమే కల్పిస్తోందని వైసీపీ శ్రేణుల్లోనే బలంగా వినిపిస్తోంది. అందుకు పలు ఉదాహరణలను కూడా వారు చూపుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత కిళ్లి కృపారాణిది అయితే మరో ప్రత్యేక సమస్య. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగి.. జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొంది కేంద్ర మంది పదవిని అలంకరించిన ఆమె హస్తం నుంచి వైసీపీలో చేరారు. ఆమెను జగన్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి జిల్లా అధ్యక్ష బాధ్యతలు సైతం అప్పగించారు. అక్కడి దాకా బానే ఉంది. ఆయితే ఆమెకు వాగ్దానం చేసిన విధంగా ఏ నామినేటెడ్ పోస్టూ ఇవ్వలేదు. అయినా సద్దుకుని పార్టీ కోసం పని చేయాలని భావించిన ఆమెకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత కష్టాలు చుట్టుముట్టాయి. పరాభవాలు ఎదురౌతున్నాయి. తనను పొమ్మన లేక పొగబెట్టినట్టుగా పార్టీ సీనియర్లు వ్యవహరిస్తున్నారని ఆమె ఎటువంటి దాపరికం లేకుండానే చెబుతున్నారు. కేబినెట్ పునర్వ్యవ స్థీకరణలో మంత్రి పదవి దక్కించుకున్న ధర్మాన ప్రసాదరావు తనను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తూ అవమానిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవం లేని పార్టీలో ఉండటం కంటే వదిలి వెళ్లడమే మేలని ఆమె తన అనుచరులదగ్గరు ఓపెన్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం ఇటీవల సీఎం జగన్ జిల్లా టూరులో ఆమెకు జరిగిన అవమానమే నంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ఆహ్వానం పలికేందుకు వెళుతున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తాను కేంద్ర మాజీ మంత్రినని.. వైసీపీ సీనియర్ నాయకురాలినని చెప్పినా వారు వినలేదు. లోపలికి అనుమతించలేదు. దీంతో  వెనుదిరిగి వెళ్లిపోయారు. తనకు జరిగిన పరాభవం వెనుక ధర్మాన ఉన్నారని ఆమె ఆరోపించారు. అంతే కాకుండా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి సైతం ఆమెను తొలగించడంతో.. వైసీపీలో ఇక కొనసాగడం తనకు సాధ్యం కాదని ఆమె బహిరంగంగానే చెబుతున్నారు. తెలుగుదేశం గూటికి చేరాలన్న ఆసక్తి ఉన్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.  

విద్యానిధి ప‌థ‌కానికి  జ‌గ‌న్  పేరా!

పేరు మార్చుకోవ‌డం ఈ రోజుల్లో చాలా స‌హ‌జంగా జ‌రిగిపోతోంది. పాత‌కాలం పేర్లు న‌చ్చ‌క  ఈ త‌రం యువ‌త వారి పేర్లు మార్చేసుకుంటున్నారు. స‌రే అది వారి వ్య‌క్తిగ‌తం. కానీ  రాష్ట్రంలో విద్యార్దుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్న విదేశీ విద్యానిధి ప‌థ‌కానికి పేరు మార్చ‌డంలో ఆంధ్రా సిఎం జ‌గ‌న్  దుస్సా హ‌స‌మే చేశారనాలి.  ఈ ప‌థకం అంబేద్క‌ర్ పేరుతో పిల‌వ‌బ‌డుతోంది. కానీ  జ‌గ‌న్‌కి ఎందుకో న‌చ్చ‌లేదు.  రాష్ట్రం లో అన్ని ప‌థ‌కాల‌కు త‌న పేరు పెట్టేసుకున్న‌ట్టే ఈ  ప‌థ‌కానికి  త‌న పేరు పెట్టుకున్నారు.  ఇది  జ‌గ‌న్ అహంకార‌మేన‌ని తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు మండిప‌డ్డారు.  ఆయ‌న  శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ, గ‌తంలో త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో  అంబేద్కర్  ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పిహెచ్ డి,  ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేం దుకు  రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశామని తెలిపారు.  ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద బీసీ, మైనారిటీ విధ్యార్థు లకైతే  రూ.15 లక్షలు,  ఈబీసీ,  కాపు విద్యార్థుల‌కు  రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు. ఐదేళ్ల తెలుగుదేశం హయాంలో మొత్తం 4528 మంది విద్యార్థులు విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందన్నారు.  మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం  ఇప్పుడు  అంబేద్కర్ పేరును తొలగించి జగన్  తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయ నను అవమానించడమే అని అన్నారు. ఇది  జగన్ అహంకారమే అంబేద్కర్‌ను దైవంగా భావించే వారంద రినీ కూడా అవమానించినట్టే అని తెలిపారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరు పెట్టా లని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ఇదిలావుండ‌గా, అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి పథకానికి జగనన్న విదేశీ విద్య దీవెనగా పేరు మార్పుపై అమరావతి దళిత నేతల ఆగ్రహం వ్యక్తం  చేశారు. బీఅర్ అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు  ఎలా పెట్టుకుంటారంటూ నిరసనకు దిగారు.  దళిత రైతులు, నేతలు తుళ్ళూరు  అంబేడ్కర్ విగ్రహానికి నివాళు లు అర్పించి  అక్కడే  బైఠాయించి నిరసన తెలియజేశారు. అంబేద్కర్ పేరు ఈ పథకానికి  కొనసాగిస్తూ మరో ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

చ‌రిత్ర‌లో ఇవాళ‌..

అమెరికా ఫ్లోరిడాలోని జాన్ ఎఫ్‌.కెనెడీ స్పేస్ సెంట‌ర్‌లో  1969 జులై 16న నాసా అపోలో-11 చంద్రుడి మీదికి పంపింది. అలా చంద్ర‌యానం చేసి చంద్రునిపై నిలిచిన‌ తొలి వ్యోమ‌గాములుగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బ‌జ్ ఆల్డ్రిన్ సుప్ర‌సిద్దు ల‌య్యారు. అపోలో 11 జులై 24న భూమికి తిరిగి చేరుకుంది. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచ‌ మంతా టీవీల్లో ఆ దృశ్యాలు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌లో చూసింది.  అమెరికా 1945లో ఇదే రోజున తొలి ఆటం బాంబు ప్ర‌యోగాత్మ‌కంగా ఉప‌యోగించింది.  న్యూ మెక్సికో ఆల్మ‌నోగార్డో స‌మీపంలో ఈ ప్ర‌యోగం చేసింది. ఆగ‌స్టులో  జ‌పాన్ హిరోషిమా, నాగ‌సాకీల‌పై ఆటంబాంబు వేయ‌డంతో రెండో ప్ర‌పంచ యుద్ధం ముగింపు ద‌శ‌కు చేరుకుంది. దాని తాలూకు తీవ్ర  ప్ర‌భావం అనేక శ‌తాబ్దాలు ప్ర‌జ‌లు అనుభ‌వించాల్సి వ‌చ్చింది. ..

తెలంగాణ మరో బెంగాల్ అవుతుందా ?

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి మొదలు సాధారణ రాజకీయ  కార్యకర్త వరకు ఒకటే భాష మాట్లాడుతున్నారు. నిజానికి  సాధారణ రాజకీయ కార్యకర్తల కంటే, పదవులలో ఉన్న పెద్దలే అసభ్యంగా మాట్లాడుతున్నారేమో అనే విధంగా, వారి భాష దిగజారుతోంది.   అదలా ఉంటే .. ఇప్పుడు ఎన్నికల వేడి ఎక్కువయ్యే కొద్దీ, రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య విద్వేషం బుసలు కొడుతోంది. రాజకీయ ప్రత్యర్దులపై భౌతిక దాడులకు కూడా రాజకీయ పార్టీలు సిద్డంవుతున్నాయి. అందుకే సామాన్య జనం ఎన్నికల నాటికి తెలంగాణ మరో బెంగాల్ అవుతుందా, అనే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతానికి దాడులతో మొదలైన హింస రాజకీయం హత్యల వరకు వెళుతుందా, అన్న అనుమానం. భయం సమాన్య జనం వ్యక్త పరుస్తున్నారు.  పశ్చిమ బెంగాల్లో క్రితం సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత కూడా పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయి. హత్యలే కాదు, మానభంగాలు, గృహదహనాలు, ఒకటని కాదు, నేరాలు, ఘోరాలు అన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల కారణంగా కొన్ని వందల కుటుంబాలు ప్రాణ భయంతో రాష్ట్రం వదిలి, అస్సాం తదితర రాష్ట్రాలకు పోయాయి. ఇప్పటికీ, అక్కడే తలదాచుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి.  అంతేకాదు ఇంకా ఈనాటికీ  పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని రాజకీయ హత్యల భయం వెంటాదుతూనే వుంది. ఈ సంవత్సరం (2022) మే నెలలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సమయంలోనే, నార్త్ కొల్కటాలో బీజేపీ కార్యకర్తను ఉరి తీసి హత్య చేశారు.  కొద్ది రోజుల క్రితం కొల్కతాలో ఒకేసారి ఇద్దరు అధికార తృణమూల్ కార్యకర్తలు హుత్యకు గురయినట్లు వార్తలొచ్చాయి.  నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, వ్యూహంలో హింస ఒక భాగంగా ఉంటుందనే ఆరోపణ అయితే రాజకీయ వర్గాల్లో బలగా వినిపిస్తోంది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు కిరాయి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగంగా పెరేపించిన హింస ఇప్పుడు ఎకంగా ముఖ్యమంత్రి అధికార నివాసాని తాకింది. భద్రతా వలయాన్ని సీసీ కెమెరాలను దాటుకుని, ఇటీవల ఒక ఆగంతకుడు, ముఖ్యమంత్రి ఆధికార నివాసంలో ప్రవేశించారు. బంగ్లాదేశ్ దేశస్థుడుగా అనుమానిస్తున్న ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో, ఎందు కోసం అంట రిస్క్ తీసుకుని, ముఖ్యమంత్రి నివాసంలో ప్రవెశించాడో, ఎన్నికల హింసకు ఈ సంఘటనకు సంబంధం ఉందొ లేదో కానీ, రాష్ట్రంలో నెలకొన్న భయంకర పరిస్థితులకు మాత్రం ఈ ఉందనటం అద్దం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు అదే ఎన్నికల వ్యూహకర్తను టీఆర్ఎస్  హైర్ చేసుకుంది. ఎన్నికల సర్వేలు మొదలు తెరాస ఎన్నికల వ్యూహం మొత్తాన్నిఆయనే నిర్నయిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆ కారణంగానూ తెలంగాణలోనూ బెంగాల్ తరహా హింస రచనకు రంగం సిద్డంవుతోందా? అన్న సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి.    ముఖ్యంగా అధికార తెరాస అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ప్రతిపక్షాలపై పోలీసు జులం ప్రదర్శిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలేసు జులుం ప్రత్యక్షంగానూ కనిపిస్తూనే వుంది. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఏ ఆందోళనకు పిలుపు ఇచ్చినా, ఏ నిరసన కార్యక్రమం నిర్వహించినా, పోలీసు యంత్రాంగం ముందస్తు అరెస్టులు,గృహ నిర్భంధాలు రొటీన్ వ్యవహారంగా మారిపోయాయి. మరో వంక. రాష్ట్రంలో  ముక్కోణ పోటీ స్పష్టమైన నేపధ్యంలో రాజకీయాలు రోజురోజుకు  ఉద్రిక్తంగా, హింసాత్మకంగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపధ్యంలో  తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  పై జరిగిన దాడి, రాజకీయ వర్గాల్లో, హింసా రాజకీయాలపై చర్చకు తెర తీసింది.  అరవింద్ పై జరిగిన దానిని రాజకీయ దాడిగానే భావించవలసి ఉంటుందని అంటున్నారు. అలాగే, రానున్న రోజుల్లో జరగబోయే రాజకీయ హింసకు అరవింద్ పై దాడి అంకురార్పణ కావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, అరవింద్ పై దాడి జరగడం ఇది మొదటి సారి కాదు...అయన ముఖ్యమంత్రి కుమార్తె, కల్వకుట్ల కవితను, ఓడించి, ఎంపీ అయింది మొదలు ఇంతవరకు ఆయనపై జరిగిన ఎనిమిదవ దాడి ఇది. ఈ దాడి వెనక తెరాస హస్తం ఉందని అరవింద్ ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ, తెరాస ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ కారణంగా, తాను ఏ అసెంబ్లీ నియోక వర్గం పర్యటనకు వెళ్ళినా స్థానిక ఎమ్మెల్యేల అనుచరులు తనను  అడ్డుకుంటున్నారని, ఈ మేరకు  ఎమ్మెల్యేలకు కేసీఆర్, కేటీఆర్ నుంచి అదేశాలున్నాయని అంటున్నారు.  కాగ, ఎంపీ అరవింద్ పై దాడి జరిగిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి అర్వింద్‌తో మాట్లాారు. దీంతో దాడుల విషయం కేంద్రం దృష్టికి వెళ్ళింది. అయితే, గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఇతర  నాయకులపై దాడులు, నిర్ద్భందాలు జరిగిన సమయంలోనూ అమిత్ షా ఫోన్ చేసి, పరిస్థతి తెలుసుకున్నారే, తప్ప ఆ తర్వాత చర్చ్యలు లేవని, అలాగే, గవర్నర్ ప్రోటోకాల్ కు సంబంధించి చేసిన ఫిర్యాదులపైనా చర్యలు లేవని, బీజేపీ నాయకులే గుర్తు చేస్తున్నారు. చివరకు బెంగాల్లో తమ కళ్ళ ఎదుట బీజేపీ కార్యకర్తను ఉరితీసి హత్య చేసినా, పెద్దగా చర్యలు తీసుకొని కేంద్ర హోం మంత్రి అమిత షా, కేంద్ర ప్రభుత్వం ఇప్పడు ఈ సంఘటనపై ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ... వేరే చెప్పనకక్కర్లేదని అంటున్నారు.

మద్యం షాపులు మళ్లీ ప్రైవేటుకే!

ఆదాయం కోసం జగన్ సర్కార్ నానా తిప్పలూ పడుతోంది. ఇంత కాలం అనుసరించిన  విధానాలతో ఆదాయం సమకూరడం లేదు కనుక విధానాలు మార్చుకునైనా సరే ఆదాయాన్ని పెంచుకోవడమే ఏకైక లక్ష్యంగా ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది. ఆలయాల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడానికీ వెనుకాడటం లేదు. అయినా అప్పులకుప్ప ప్రభుత్వానికి అదే మూలకి.. ఎటు తిరిగి ఎటు వచ్చినా ప్రభుత్వం దృష్టంతా మద్యం విక్రయాల మీదే. మద్యం విక్రయాలను ఎంతగా పెంచుకుంటే అంతగా ఆదాయం వచ్చే బంగారు బాతుగుడ్డు అని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సీఎం జగన్ ఎన్నికల ముందు దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం అని ఇచ్చిన హామీని కన్వీనియెంట్ గా మర్చిపోయి.. దశల వారీగా సంపూర్ణ మద్యపాన పథకానికి తెరతీశారు. సొంత బ్రాండ్లను ప్రభుత్వం చేతే అమ్మించిన ఆయన ఇప్పుడు మద్యం ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి వాటికి ప్రైవేటుకు అప్పగించడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ భారీగా అప్పులు తీసుకున్న జగన్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ దుకాణాలను పూర్తిగా ఎత్తివేసి మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఉన్నత స్ధాయి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరంలో పాతిక వేల కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని విక్రయించిన ప్రభుత్వం 20 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రభుత్వ అధ్వర్యంలో దుకాణాల నిర్వహణ వల్ల పూర్తి స్థాయిలో మద్యం ద్వారా ఆదాయం రావడం లేదా అన్న మధన ప్రభుత్వంలో మొదలైందని చెబుతున్నారు. ఎక్సైజ్ వర్గాలూ ఇదే చెబుతున్నాయి. మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగిస్తే ఇప్పుడొస్తున్న ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నెలకు 19 వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందనీ, అదే ప్రైవేటుకు అప్పగిస్తే ఇది రమారమి 38 వందల కోట్లకు పెరిగే అవకాశం ఉందనీ ఎక్సైజ్ శాఖ అంచనా. దానికి తోడు మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగిస్తూ కొత్త విధానాన్ని అమలులోనికి తీసుకు వస్తే దుకాణాలకు దరఖాస్తుల రూపేణ సొమ్ము వస్తుంది. అలాగే లైసెన్సు ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల రూపాయల తక్షణ ఆదాయం సమకూరుతుందన్నది ప్రభుత్వ భావన. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం ఆదాయం గతంలో పోలస్తే పెరిగినా... మరింత పెరిగేందుకు స్కోప్ ఉందన్న భావంతోనే జగన్ సర్కార్ కొత్త విధానానికి (గతంలో ఉన్నదే) ఉపక్రమిస్తున్నది. ఒక విధంగా జగన్ రివర్స్ విధానానికి ఇది కొనసాగింపే అని చెప్పాలి. ప్రభుత్వ మద్యం దుకాణాల పేర జే బ్రాండ్ అంటూ దేశంలో ఎక్కడా లేని బ్రాండులను తీసుకువచ్చి, అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించేయనుంది. ఇందుకు ప్రభుత్వం చెబుతున్న కారణం ప్రభుత్వ దుకాణాలలో మద్యం విక్రయాలు పెరగడం లేదని. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించుకుని కొందరు, ధరలను భరించలేక నాటు సారాకు అలవాటు పడి మరి కొందరూ ప్రభుత్వ మద్యం దుకాణాల వైపే రావడం లేదని ఇంత కాలానికి ప్రభుత్వం గుర్తించింది. ఆ కారణంగా  ఆదాయానికి గండి పడుతోందని, అందుకే మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే బార్ల విధానాన్ని మూడేళ్లకు పెంచి సంపూర్ణ మద్య నిషేధం అజెండాలోనే లేదని జగన్ సర్కార్ చెప్పకనే చెప్పింది. ఇప్పుడు మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగించేసి.. వాటి సంఖ్యలు విపరీతంగా పెంచేసి మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేసేందుకు రంగం సిద్ధం చేసేసింది. ప్రస్తుతం మద్యం ద్వారా పాతిక వేల కోట్ల ఆదాయం వస్తోంది.. దానిని నలభై వేల కోట్లకు పెంచే లక్ష్యంతో జగన్ సర్కార్ మద్యం పాలసీని మార్చే నిర్ణయం చేసింది. అదే జరిగితే ఇక ఫ్రీ బీస్ అమలు చేయడానికి ఆర్థిక అవరోధాలు ఉండవన్నది జగన్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. 

 ఆధునిక దేవాల‌యాల‌ రూప‌శిల్పి కే.ఎల్‌.రావు

కానూరి లక్ష్మణరావు అంటే ఒక్కరికి కూడా తెలియదుకాని డా.కే.ఎల్రావు గా జగద్విఖ్యాతులు.  ఆయ‌న్ను భార‌త మాజీ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఆధుని దేవాల‌యాల రూప‌శిల్పి అని ప్ర‌శంసించారు.  కృష్ణాజిల్లా కంకిపాడులో జూలై 15, 1902 జన్మించారు. ఆయన సోదరి ప్రముఖ వైద్యులు డా. కొమర్రాజు అచ్చమాంబ. గ్రామకరణం అయిన తండ్రి గారు 9 వ ఏటనే గతించారు. చిన్నతనంలో బడిలో ఆటలాడుతుండగా దెబ్బ తగిలి ఒక కంటి చూపు కోల్పోయారు రావు.  ప్రాధమిక విద్య త‌ర్వాత  మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజిలో చేరి ఇంటర్‌, గిండీ  ఇంజనీరింగ్ కాలేజీ లో మొదటి బాచ్ విద్యార్ధిగా చేరి  ఇంజనీ రింగ్ లో మాస్టర్ డిగ్రీ పొం దారు . లండన్ వెళ్లి బర్మింగ్ హాం యూనివర్సిటి నుంచి 1939 లో పి.హెచ్ .డి .తీసుకున్నారు. కే .సి చాకో మార్గదర్శకంలో ఎంతో పరిశోధన చేశారు. అప్ప‌ట్లో మద్రాస్ యూనివర్సిటి నుంచి మొదటి ఎం.ఎస్ .డిగ్రీ అందుకున్న ఘనుడాయ‌న‌.  అనంత‌రం రంగూన్ బర్మాలలో ప్రొఫెసర్ గా పని చేశారు . లండన్ లో కాంక్రీట్ కు సంబంధించిన అంశాలపై తీవ్ర అధ్యయనం, పరిశోధనలు చేశారు. అమెరికా వెళ్లి సెల్యులర్, కాఫర్ శైలీ నిర్మాణం మీద సాధికారత సాధించి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వానికి సమర్పిం చారు. మద్రాసులో  కూవం నదిపై ఉన్న పురాతన ఇనుప బ్రిడ్జి తుప్పు పట్టి కూలియే స్థితికి రావ‌డంతో  కాంక్రీట్ తో పునర్నిర్మించి  దేశాన్నీ ప్రపంచాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన సమర్ధులైన ఇంజనీర్ ఆయ‌న‌. అప్పటికి ప్రపంచం లో ఒక్క ఫ్రాన్స్‌లోనే  కాంక్రీట్ కట్టడాలు నిర్మించేవారు. ఫ్రాన్స్ వెళ్ళకుండానే, ఆ కట్ట డాలను  చూడకుండానే తన అసాధారణ మేదస్సుతో కాంక్రీట్ వంతెన నిర్మించి , రైల్వే చీఫ్ ఇంజనీర్  ప్రశంసలు అందుకున్న సమర్ధులు . ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యాకనే రావు గారు  ఫ్రాన్స్ వెళ్లి,  ఇంజనీర్ ఫ్రేన్సియనేట్ వద్ద శిక్షణలో  కౌశల్యానికి  మ‌రింత మెరుగులు దిద్దుకున్నారు. అక్కడి నుంచి లండన్ వెళ్లి కాంక్రీట్ ఇంజనీరింగ్ సంస్థలో చేరి పరిశోధనలు కొనసాగించారు .మద్రాసులో జీత జీవితాన్ని వదలి, మళ్ళీ లండన్ వెళ్లి  కాంక్రీట్ పరిశోధన చేశారు. లండన్  థేమ్స్ నది పై కట్టిన వంతెనను  సాకల్యంగా పరి శీలించి తన సృజనాత్మక శక్తితో నూతన పరిశోధనలు చేశారు . ప్రముఖ ఇంజనీర్ జే.ఏ. సాలేజ్ వద్ద అసిస్టెంట్ గా చేరి వంతెనల నిర్మాణాలకు సలహాలిస్తూ సహాయ మందించారు. ఆంధ్రుల చిరకాల  కల శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ  ప్రణాళిక  కోసం మద్రాసు ప్ర‌భుత్వ  చీఫ్ ఇంజనీర్ గోవిందరాజు అయ్యంగార్ కలిసి లండన్ ప్రాజెక్ట్ డిజైనింగ్  పై విస్తృత అధ్యయ నం చేసి ఒకే ఒక్క ఏడాదిలో డ్యామ్‌ డిజైన్ రూపొందించారు. ఆ డిజైన్ లపై  ప్రభుత్వానికి  శ్రద్ధ లేకపోవ టం వలన అవి దుమ్ము కొట్టుకుపోయి అప్ప‌ట్లో సాకార‌మ‌వ‌లేదు.  నాగార్జున సాగర్ నిర్మాణంలో రాతి కట్టడం నమూనాను అమెరికా డెన్మార్క్ ప్రయోగశాలలకు పంపి, పరిశోధనా ఫలితాలను తెప్పించారు.    విశాఖ , రంగూన్, మద్రాస్ లలో నీటి పారుదల శాఖ లో పని చేశారు. లండన్  ఇంజనీరింగ్  కాలేజి లెక్చ రర్ గా చేశారు. మద్రాస్ ప్రభుత్వ డ్యామ్‌లను రూపొందించే ఇంజనీర్ గా సేవలందించారు 1962 లో  కేంద్ర జ‌ల విద్యుత్‌ మంత్రిత్వ శాఖ లో డిజైన్ అండ్ రిసెర్చ్ విభాగ సభ్యుడిగా సేవ‌లు అందిం చారు. అలాగే  కేంద్ర జ‌ల‌,విద్య‌త్‌ శక్తి  సహాయ మంత్రిత్వ శాఖ ఇంజనీర్ గా ,ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ  డైరెక్టర్  ఆఫ్ డిజైన్ గా, చీఫ్ ఇంజనీర్ గా చిరస్మరణీయ సేవలందించారు. 1954 లో కేంద్ర జ‌ల‌,విద్యుత్‌ కమీషన్  చీఫ్ ఇంజనీర్ ,1959 లో విద్యుచ్చక్తి , నీటి పారుదల కేంద్ర మండలి అధ్యక్షులుగా ఉన్నారు. ప‌ద్మ‌విభూష‌న్  డాక్ట‌ర్ కే.ఎల్ రావుగారు 1986 మే 18న త‌మ 86వ యేట హైద‌రాబాద్‌లో మృతి చెందారు. 

ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో తనిఖీలు కారణమదేనా?

రెడ్డొచ్చె మొదలాడు అన్న సామెతలాగే ఉంది జగన్ సర్కార్ తీరు. మూడేళ్లుగా ఆ పార్టీ ఘనంగా చెప్పుకుంటున్న సంక్షేమ ఫథకాలపై ఆ పార్టీ అధినేతకే అంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ కే అనుమానం కలిగిందా అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. గత మూడేళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా.. సర్కార్ పై ఇంతటి వ్యతిరేకత ఏమిటన్నది జగన్ కు అంతుబట్టడం లేదంటున్నారు. తాజాగా విడుదలైన ఒక జాతీయ స్థాయి సర్వేలోనే ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని వెల్లడి కావడంతో జగన్ లో  అంతర్మథనం మొదలైందని అంటున్నారు. ఇటీవల వాహన మిత్ర లబ్ధిదారులకు సొమ్ము పందేరం చేసిన కార్యక్రమంలో ఆయన తన భుజాలను తానే చరుచుకుంటూ.. అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది జగనన్న ప్రభుత్వమేనని తనకు తానే కితాబిచ్చుకున్నారు. అంతలో ఏమైందో ఏమో.. సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు సైతం సంతృప్తి వ్యక్తం చేయకపోవడానికి తన మానస పుత్రికగా జగనే చెప్పుకుంటున్న సచివాలయ వ్యవస్థేకారణమన్న అనుమానం ఆయనకు కలిగిందా అని వైసీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే జగన్ సచివాలయాలలో ఆకస్మిత తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారని అంటున్నాయి. సంక్షేమ పథకాల లబ్దిదారులు ఏమనుకుంటున్నారు, సచివాలయాల్లో వారికి అందుతున్న సేవలు ఎలా ఉన్నాయి ? లోటుపాట్లు  ఏమిటి అన్న విషయాలు తెలుసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని జగన్ నిర్ణయించారు. తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంఘనంగా ప్రారంభించిన గ్రామ,వార్డు సచివాలయాలకే   ప్రతీ సంక్షేమ పథకాన్నీ లింక్ చేసిన ప్రభుత్వం. ఇప్పుడు అలా చేసి తప్పు చేశామా అని మధన పడుతున్నట్లు పార్టీ శ్రేణులు అంటున్నాయి. అందుకే సచివాలయాల పని తీరు ఎలా ఉంది? సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా జరుగుతోంది.  వాటిపై ప్రజల గ్రామ,వార్డు సచివాలయాలల్లో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లుకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఈ తనిఖీల కోసం ప్రభుత్వం ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగించింది. తహసీల్దార్ మునిసిపల్ కమిషనర్, మూడు జాయింట్ కలెక్టర లకు ఈ తనిఖీల బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపడుతున్న తనిఖీల్లో ఏయే అంశాల్ని పరిశీలించాలన్నది కూడా కలెక్టర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది.  ఇందులో సచివాలయాల్లో ప్రతి రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు...!!

ఏమ‌ని సూచించుదు ప్ర‌భూ..!

మ‌న‌సులోని కోరిక‌..వినిపించుమా వ‌సంత మాలికా..అంటూ అబ్బాయికి త‌న మ‌న‌సులో మాట  తెలియ జేయమ‌ని అమ్మాయి పూల‌ను వేడుకుంటుంది.. మ‌న ప్ర‌ధాని మోదీగారు జ‌నానికి  ఇచ్చే సందేశంలో  దేన్ని కీల‌కంగా ప్ర‌స్తావించాల‌న్న‌దీ ప్ర‌జ‌ల్నేచెప్ప‌మ‌ని అంటున్నారు. సాధార‌ణంగా మ‌న్ కీ బాత్ పేరుతో  దేశ ప్ర‌జ‌ల‌కు సుదీర్ఘ ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం ప్రధాని అన‌వాయితీగా పెట్టుకున్నారు. తాను రాబోయే  కొద్ది కాలంలో ఏం చేయ‌బోతున్న‌ది, జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, సంద‌ర్బాల గురించి వివ‌రిస్తూ ప్ర‌జ‌ల‌కు కొంత రాజకీయ జ్ఞానం ప్ర‌సాదించేవారు. పాపం దేశంలో రాజ‌కీయ‌ప‌రిస్థితుల‌తో హ‌డావుడి ప‌డుతున్న ప్ర‌ధానికి ఈ సారి ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా సందేశం ఇవ్వ‌డానికి  ఏమీ లేక  ప్ర‌జ‌ల నుంచే  స‌ల‌హాలు, సూచ‌న‌లూ అడుగుతున్నారు.  ఇంత‌కీ ప్ర‌జ‌ల నుంచి ఏమి ఆయ‌న ఏమి ఆశిస్తున్న‌ట్టు? త‌మ పాల‌న అద్భుతంగా వుంద‌న్న అన‌కూల త‌ను ఆశిస్తు న్నారా, దేశ‌మంతా కాషాయం చేయ‌డానికి సూచ‌న‌లు అడుగుతున్నారా అన్న‌ది బిజెపీ వ‌ర్గాల‌న్నా తెలి యజేయాలి. ప్ర‌జ‌ల్ని త‌మ పార్టీవైపు తిర‌గాల‌ని, త‌మ సిద్ధాంతాన్నే శిరోధార్యంగా చేసుకుని  అంద‌రూ బిజెపీ ఘ‌న విజ‌యానికి, పాల‌నా సౌల‌భ్యానికి వీలుక‌ల్పించాల‌న్న ఆకాంక్ష‌నే వ్య‌క్తం చేయాల‌ని కోరుకుం టున్నారా? ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల్లోనూ బిజెపి వ‌ర్గాలు, వీరాభిమానులు ఆయా ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో అడ్డంకులు సృష్టిస్తూ కేంద్రాన్ని బ‌లోపేత చేయ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. విభేదాలు, తిర‌స్కర‌ణ‌లు, ఆరోప‌ణ‌లు బొత్తిగా స‌హించ‌లేని త‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దేశంలో క‌మ‌ల‌నాధులు మోదీ విజ‌యానికి, బిజెపి విజ‌యానికి అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఎన్నిక‌ల్లో రెడ్ కార్పెట్ ప‌ర‌చ‌డానికే పూనుకున్నారు. ఇందుకోసం అక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ధ్వంసం చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. ఇంత‌టి మ‌హా గ‌ణం ఫాలోయింగ్ వుండ‌గా మామూలు ప్ర‌జ‌ల నుంచి ప్ర‌ధాని సూచ న‌లు, స‌ల‌హాలు అడ‌గ‌డం దేనికి?  అంటే, రాష్ట్రాల్లో త‌మ పార్టీ ప‌రిస్థితిని, రాజ‌కీయ నిబద్ధ‌త‌ను ప్ర‌జ‌ల నోటినుంచే ప్ర‌ధాని విన‌ద‌ల‌చుకున్నా రేమోన‌న్న అనుమానాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఉత్త‌రాది కంటే ఇపుడు ద‌క్షిణాదివైపే క‌మ‌ల‌నాధులు ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌న్న ల‌క్ష్యం మాటి మాటికీ బిజెపీ వ‌ర్గీయులు వ్య‌క్తంచేస్తున్నారు. కానీ అందుకు ప‌రిస్థిలులు ఎంత‌వ‌ర‌కూ అనుకూలిస్తున్నాయి, ప్ర‌జ‌లు ఏమేర‌కు న‌మ్ముతున్నార‌న్న‌ది అంచ‌నాలు అంత సానుకూలంగా లేవు. ఇటీవ‌ల అనేక‌ర‌కాల స‌ర్వేల‌న్నీ రెండు రాష్ట్రాల్లో బిజెపి స‌త్తా ఏమిట‌న్న‌ది తేటతెల్లం చేశాయి. ఆంధ్రా మాట ఎలా వున్నా, తెలంగాణాలో మాత్రం ఇప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల్లో, మారుతూన్న లెక్క‌ల ప్రకారం కాంగ్రెస్ బిజెపీ కంటే మేలుగా వుంద‌న్న‌ది తెలిసింది. ఇప్ప‌టి కిప్పుడు ఎన్నిక‌లు పెడితే త‌ప్ప‌కుండా కేసీఆర్ దిగిపోతార‌న్న ప్ర‌చారం గ‌ట్టిగా చేయించుకున్న బిజెపి, ఇపుడు స‌ర్వేల్లో మూడ‌వ స్థానంలో నిలిచింది. ఇది తెలంగాణా బిజెపీ వ‌ర్గాల‌కు  కాస్తంత ఇబ్బందిక‌ర స‌మాచార‌మే. మొన్న‌టివ‌ర‌కూ అనేక చ‌ర్చా వేదిక‌ల మీద బిజెపి నేత‌లు ఊక‌దంపు ఉప‌న్యాసాల్లో టిఆర్ ఎస్‌, కాంగ్రెస్ ల మీద విరుచుకుపడ్డారు. కానీ  ఈ వీరుల‌కు అంత సీన్ లేద‌ని స‌ర్వేలు  తేట‌తెల్లం చేశా యి.  ఈ నేప‌థ్యంలో మ‌రి ప్ర‌ధాని మోదీ రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుంచి ఏమ‌న్నా వీరాభిమానం కోరుకుం టున్నారేమో తెలియాలి.  ప‌రిపాల‌న సుభిక్షంగా వుంటే, అందరిచేతా శ‌భాష్ అనిపించుకుంటే, ప‌థ‌కాలు, ఆలోచ‌న‌లు స‌వ్యంగా వుండి అమ‌లులోనూ ప్ర‌జాహితం ప్ర‌ద‌ర్శిస్తే ప్ర‌ధాని త‌మ మ‌న్ కీ బాత్ లో ఏ అంశాన్ని ప్ర‌త్యేకించి ప్ర‌స్తా వించాల‌న్న‌ది ప్ర‌జ‌లనుంచి కోర‌న‌క్క‌ర్లేదేమో!  పోనీ ఎవ‌ర‌యినా ఇదుగో ఈ అంశం గురించి ప్ర‌స్తావిం చండి సార్ అని చెప్పాల‌నుకుంటే  MyGov, Namo App. అనేదానికి షేర్ చేయ‌వ‌చ్చు.

దేవుడి సొమ్ముకూ జగన్ సర్కార్ ఎసరు!

ఎవరేమనుకుంటే నా కేంటి.. అంతా నా ఇష్టం..ఎడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా  ఇష్టం చెడ మడ చేలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం అన్నట్లుగా జగన్ సర్కార్ చెలరేగిపోతోంది. చివరికి  జగన్ సర్కార్ దేవుడి సొమ్మకు కూడా ఎసరు పెట్టేసింది. మహాకవి శ్రీశ్రీ  కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. త‌లుపు గొళ్లెం.. కాదేదీ కవిత కనర్హం అంటే జగన్ మాత్రం వాటి సంగతి ఎందుకు దేవుడి మన్యం, దేవుడి సొమ్ము, దేవాలయాల ఆదాయం ఇవేవీ స్వాహాకి అనర్హం కాదని చెబుతున్నారు. అడవులు, కొండలు కరిగించేసి సొమ్ము చేసుకున్న సర్కార్ ఇప్పుడు దేవుడి సొమ్ముపై కన్నేసింది. దేవాలయాల డిపాజిట్లను రద్దు చేయాలని ఎండోమెంట్ కమిషనర్ ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేవాలయాల బ్యాంకు ఖాతాలు వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ఈ నెల 1 వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి 45 కోట్ల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్లను ఈవోలు క్యాన్సిల్ చేశారు. మొత్తంగా దేవాలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడం ద్వారా 500 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ టార్గెట్ గా చెబుతున్నారు. ఆయా దేవాలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడం ద్వారా వచ్చిన నగదును ఆలయ అధికారులు కామన్ గుడ్ ఫండ్ (సీజెఎఫ్)కు జమ చేస్తున్నారు. సీజేఎఫ్ నిధులను ఆలయాల జీర్ణోద్ధరణకే ఉపయోగించాల్సి ఉండగా దేవాదాయ శాఖ మాజీ మంత్రి వాటిని ఇష్టానుసారం బదలాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆలయాల ఫిక్సెడ్ డిపాజిట్లను క్యాన్సిల్ చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు కూడా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అభ్యంతరాలూ, ఆందోళనలను పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 వేల దేవాలయాలలో ఎఫ్ డీలను రద్దు చేయడానికి జగన్ సర్కార్  సిద్ధమైపోయింది. ఇలా ఎఫ్ డీల రద్దు ద్వారా 500 కోట్ల రూపాయలు సమీకరించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రోజువారిగా ఆలయాల డిపాజిట్ల రద్దుపై దృష్టి సారించారు దేవాదాయ శాఖ అధికారులు. గతంలో అవినీతి కేసులో ఏసీబీకి చిక్కిన ఒక దేవాదాయ శాఖ ఉన్నతాధికారి సూచన మేరకు జగన్ సర్కార్ ఈ డిపాజిట్ల రద్దుకు తెరతీసిందని చెబుతున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లా అయినివిల్లిలంక వినాయక టెంపుల్, నెల్లూరు జిల్లా మూలస్థానేశ్వరస్వామి దేవాలయం, విజయవాడ యనమలకుదురు శివాలయం  30లక్షల రూపాయల చొప్పున ఎఫ్ డీలను రద్దు చేయగా,  సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి 20 లక్షల రూపాయల డిపాజిట్లు క్యాన్సిల్ అయ్యాయి. కాగా అత్యధికంగా వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి 60 లక్షల రూపాయల డిపాజిట్లను ఉప సంహరించారు. ఎన్టీఆర్ జిల్లా కోటిలింగాల ఆలయం డిపాజిట్లు 40 లక్షల రూపాయలను ఉపసంహరిం చారు. రానున్న రోజులలో ఈ డిపాజిట్ల క్యాన్సిలేషన్ మరింత వేగం పుంజుకోనుందని దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు. మరి దేవాల‌యాల అత్య‌వ‌స‌ర భారీ ఖ‌ర్చుల‌కు మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని దేవాల‌య అధికారులు ప్రాధేయ‌ప‌డ‌వ‌ల‌సిందేనా?

ఎందుకు న‌మ్మాలో మీరే చెప్పండి జ‌గ‌న్‌

త‌ల‌చి ఒక్క మేలు చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు, ఒక్క మేలు చేస్తే అభిమానం వెల్లువెత్తు తుంది. కానీ ఏ మేలు చేశార‌ని త‌న‌ను న‌మ్మాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తెలియ‌జేయాల‌ని మాజీ మంత్రి టిడిపి నేత జ‌వ‌హ‌ర్ ప్ర‌శ్నించారు. అస‌లు పాల‌నా కాలం స‌గం వ్య‌ర్ధ‌మ‌యింద‌న్న అరోప‌ణ‌లే రాష్ట్ర‌మంతా విన‌ప‌డుతున్నాయి. కేవ‌లం విప క్షాలే కాదు, తెలుగు ప్ర‌జ‌లంతా జ‌గ‌న్ ది సుభిక్ష‌మైన పాల‌న అని ఏ సంద‌ర్భంలోనూ భావించండం లేదు.  రైతాంగానికి ఇచ్చిన భ‌రోసా కేవ‌లం ప్ర‌చార‌ఘ‌ట్టంగా మారింది. పంట రుణాల స‌బ్సిడీలో రైతుల‌కు అన్యా య‌మే జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌తున్నాయి. రైతుల‌కు ధాన్యం కొనుగోలు సొమ్ము ఇవ్వ లేదు. రైతాంగం  ఇక  ఏ విధంగా న‌మ్మాలో ప్ర‌భుత్వం తెలియ‌జేయాలి. రుణాల స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బంది వుండ‌ద‌ని, బ్యాంకుల నుంచీ ఎలాంటి ఒత్తిడీ వుండ‌ద‌ని ప్ర‌చారం చేసిన‌ట్టుగా వాస్త‌వంలో ఏదీ జ‌ర‌గ లేదు.  మ‌రోవంక‌, విద్యారంగంలో తీసుకున్న నిర్ణ‌యాలు విద్యార్ధుల‌కు ఏమేర‌కు ప్రయోజ‌న‌క‌ర‌మ‌న్నది అంద రూ ప్ర‌శ్నిస్తున్నారు.  ఇంగ్లీషు మీడియం పేరుతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యాబోధ‌న‌, పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ విష‌యాల్లో సందిగ్ధ‌త క‌ల్పించారు. త‌క్కువమంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు వున్న‌వి, త‌క్కువ అటెం డెన్స్‌తో న‌డుస్తున్న‌వి ఒక్క‌టిగా చేయ‌డ‌మ‌న్న నిర్ణ‌యాలు ఉపాధ్యాయుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. అన్నింటికీ మించి విడ్డూర‌మేమంటే,  శుక్ర‌వారంనాడు విశాఖ ప‌ర్య‌ట‌న‌కు జ‌నాన్ని తోల‌డానికి స్కూలు బ‌స్సులు వినియోగించుకోవ‌డం. అందుకు స్కూళ్ల‌కి  సెల‌వ ప్ర‌క‌టించ‌డం. ఇంత‌కంటే చోద్యం వుంటుం దా?  ఇలాంటి పిచ్చిప‌నుల‌తోనే న‌మ్మ‌కాన్ని కోల్పోతున్న‌ది వైసీపీ స‌ర్కార్‌.  ఒక‌టేమిటి అన్నింటా జ‌గ‌న్ ప్ర‌భు త్వం ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కోల్పోయింది. దీన్ని గురించి విప‌క్షాలే కాదు ప్ర‌జ‌లూ విసిగెత్తి కామెంట్లు చేయ డం జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ఇంకా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని న‌మ్మ‌డం ఎలా అన్న‌ది పెద్ద ప్ర‌శ్నే. దళితు లపై దమనకాండ కొనసాగిస్తున్నందుకు నమ్మాలా? దళితుల సంక్షేమ పధకాలు 27 రద్దు చేసినందుకు నిన్ను నమ్మాలా? అని విప‌క్ష నేత జ‌వ‌హ‌ర్ నిల‌దీస్తున్నారు.  వెయ్యి అబద్ధాలు లక్షల వాగ్దాన భంగం చేస్తున్నందుకు నమ్మాలా? మధ్యపాన నిషేధాన్ని నినాదంగా మార్చి ప్రజలను ఏమార్చినందురు నిన్ను నమ్మాలా? వారంలో రద్దు చేస్తానని సీపీయస్ ఉద్యోగులను మోసగించి నందుకు ఎలా న‌మ్మాలో చెప్పాల‌ని జవహర్ ప్రశ్నించారు. ఇదిలా వుండ‌గా, జూలై 15 నాటికి రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేసి ఒక్క గుంట కూడా కనిపించకుండా మర మ్మత్తు చేసి ఆ ఫొటో లు కూడా ప్రదర్శిస్తానని సీఎం జగన్‌రెడ్డి ఘనంగా చెప్పారు. ఆ తేదీ వచ్చింది, పోయింది. రోడ్లు ప‌రిస్థితి అలానే వుంది.  ప్రజలకు మొహం చూపించడానికి సిగ్గనిపించడం లేదా? అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. శుక్రవారం ఆమె ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కాని వాగ్దానాలు చేయ‌డం, ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్ట‌డం మానుకోవా ల‌న్నారు. 

ఎంపీ అర్వింద్ పై దాడి.. ఫోన్ చేసి వివరాలు కనుక్కున్న అమిత్ షా

సర్వేలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండగా.. రాష్ట్రంలో ముక్కోణపు పోరు తథ్యమని పరిశీలకులు చెబుతున్నారు. గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుతం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని, అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు తెరాసకు దీటుగా బలోపేతమయ్యాయనీ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితే రాష్ట్రంలో రాజకీయ అసహనం పెచ్చరిల్లడానికి దోహదపడుతున్నదని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం విమర్శను సహించలేకుంటే.. బీజేపీ కూడా అదే స్థితిలో రెచ్చిపోతున్నది. విమర్శలు రాజకీయ మర్యాద హద్దు దాటి చాలా కాలమైంది. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాల్సిన పార్టీలు రాజకీయ శత్రు శిబిరాల్లా మోహరిస్తున్నాయి. దేశంలో అసహనం పెచ్చరిల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో అంతకు మించి అన్నట్లుగా రాజకీయ అసహనం పెచ్చరిల్లిన పరిస్థితి నెలకొంది.   తాజాగా వరద సహాయ కార్యక్రమాల పరిశీలనకు వెళ్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడి జరిగింది. ఈ దాడి వెనుక టీఆర్ఎస్ కుట్ర ఉందని బీజేపీ ఆరోపిస్తున్నది. కుట్రలు, హస్తాల సంగతి పక్కన పెడితే ఒక ఎంపీపై ఈ స్థాయిలో దాడి జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో అవగతమౌతుంది. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలో  సహాయ కార్యక్రమాల పరిశీలనకు వెళ్లిన ఎంపీ అర్వింద్ పై   కొందరు దాడికి పాల్పడ్డారు. ఆయన మెడలో  చెప్పుల దండ  వేయడానికి ప్రయత్నించారు. కాన్వాయ్‌ ని అడ్డుకొని అద్దాలు పగల కొట్టారు. అత్యంత పకడ్బందీగా ఈ దాడి జరిగిందని బీజేపీ ఆరోపిస్తున్నది.   సకాలంలో పోలీసుల  జోక్యం చేసుకుని ఎంపీని అక్కడ నుంచి సురక్షితంగా పంపేశారు.  ఈ దాడి వెనుక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి  కుట్ర  ఉందని ఎంపీ అర్వింద్ ఆరోపిస్తున్నారు. కాగా  టీఆర్ఎస్ బీజేపీపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహమే దాడులకు కారణమని చెబుతోంది. ధర్మపురి అర్వింద్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల కారణంగానే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ శ్రేణుుల అంటున్నాయి. విమర్శలను సహించలేని టీఆర్ఎస్ రాష్ట్రంలో గూండాగిరి చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ దాడి తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంపి అర్వింద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా తెలంగాణలో ఇటీవలి కాలంలో ఇటువంటి దాడులు పెచ్చరిల్లాయి. ఎంపీ బండి సంజయ్ పై కూడా గతంలో ఓసారి దాడి జరిగింది. ఆయన కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణుులు దాడికి పాల్పడ్డాయి. అలాగే ఎంపీ అర్వింద్ పై దాడి కూడా ఇదే మొదటి సారి కాదు.   

ముందస్తు ముచ్చట ఇక ముగిసినట్టేనా?

ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారా? వరసగా మూడవసారి ముఖ్యమంత్రి అవుతారా? అంటే, ఎవరి విషయం ఎలా ఉన్నా, మంత్రి కేటీఆర్‌ మాత్రం, అనుమానమే లేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారు, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని చాలా  ధీమాగా ఉన్నారు. అంతే కాదు, మా సర్వేలే కాదు, కాంగ్రెస్, బీజేపీ సుర్వేలు కూడా అదే చెపుతున్నాయని, కేటీఆర్ చెప్పుకొచ్చారు. గత మూడు నాలుగు రోజులుగా, రాష్ట్రంలో సాగుతున్న సర్వేల సంవాదానికి ముక్తాయింపు అన్నట్లుగా ఆయన తమ సొంత సర్వే ‘కేసీఆర్ 90’  అంటోందని చెప్పు కొచ్చారు.   అయితే, అదే క్రమంలో కేటీఆర్, ముందస్తు ఎన్నికల విషయంలో మాత్రం వెనకడుగు వేశారు. అసెంబ్లీ రద్దుకు ముందే, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటించాలని, అలా ప్రకటిస్తేనే ముందస్తుకు వెళతామని, కండిషన్ పెట్టారు. అయితే, అది ఎటూ అయ్యేది కాదని తెలిసే, కేటీఆర్ ఈ చిత్రమైన కండిషన్ తెర మీదకు తెచ్చారని, విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. కేటీఆర్  తీరు చూస్తుంటే ఆడలేక మద్దెల ఓడన్నట్లుందని విపక్ష నేతలు అంటున్నారు. ముందస్తుకు వెళ్ళాలా వద్దా అనేది తేల్చుకోవలసింది, అధికార తెరాస. అంతే కానీ, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం లేదా రాష్ట్రంలోని ప్రతిపక్షాలో కాదని, దమ్ముటే  గెలుస్తామనే ధీమా ఉంటే ముందస్తుకు వెళ్ళాలి  లేదంటే చేతకాదని చేతు లెత్తేయాలని  ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. నిజానికి, కేసీఆర్, కేటీఆర్ జోడీకి ముందస్తుకు వెళ్ళే ధైర్యం లేదని, అందుకే చేసిన సవాలు వెనక్కి తీసుకునేందుకు తెరాస నాయకులూ తంటాలు పడుతున్నారని అంటున్నారు.   నిజానికి, కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్, బీజేపీలకు సవాలు విసిరారు. ఆ రెండు పార్టీలు ఓకే అంటే  వెంటనే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు తాము సిద్దంగా ఉన్నామని  ప్రకటించారు అయితే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ముఖ్యమంత్రి సవాలును స్వీకరించడతో తెరాస నేతలు ఒకరొకరు బయటకొచ్చి  మెలికలు పెట్టడం మొదలు పెట్టారని అంటున్నారు. ఆ క్రమంలోనే కేటీఆర్ ఇప్పడు, ముందస్తుకు ముచ్చటే లేదని తేల్చేశారు. ఈ నేపధ్యంలో గత రెండు మూడు రోజులుగా సాగుతున్న, సర్వే డ్రామాలపై కూడా  స్టేజి మ్యానేజ్డ్  షోలు కాదు కదా  ఆనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే  కేటీఆర్ ఓ వంక తమ సర్వే ప్రకారం తెరాసకు తిరుగేలేదని, 90 సీట్లు వస్తాయని చెపుతూనే, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో కొంత మేరకు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అంగీకరించడం అధికార పార్టీ బలహీనత అడ్డం పడుతోందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, కేటీఆర్ లో కానీ,ఆ మాట కొస్తే ఈ మధ్య ప్రెస్ మీట్లో  రెండున్నర గంటలు మాట్లాడిన కేసీఆర్ లో కానీ, ముందున్న విశ్వాసం కనిపించ లేదని అంటున్నారు.  అలాగే పార్టీలో కొట్లాటలు ఉన్నాయని అంగీకరించడం ద్వారా కేటీఆర్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఫేస్ చేసే పరిస్థితి లేదని   అంటే, తెరాసలో అంతా బాగుందనుకునేందుకు లేదని చెప్పకనే చెప్పారని అంటున్నారు.   అలాగే ప్రజల్లో రోజు రోజుకూ పెరుగతున్న ప్రభుత్వ వ్యతిరేకతను కూడా కేటీఆర్ అంగీకరించారు, అందుకే ఆయన కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్ష‌న్లు త్వరలో ఇస్తామ‌ని ప్రకటించారు. రాష్ట్రంలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు నిలిపివేశారు. ఆసరా పెన్షన్ల విషయం అయితే  చెప్పనే అక్కరలేదు. అలాగే, ప్రభుత్వఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ అన్నిట్నీ మించి ధరణి పోర్టల్ పెద్ద సమస్యగా మారింది. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అందుకే కావచ్చును. ధరణిలోనూ మార్పులు చేస్తామని చెబుతున్నారు. సో,  కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమని ఏంత గట్టిగా చెప్పినా, ఆయన మాటల్లో ముందున్న విశ్వాసం మాయమై పోయినట్లే కనిపిస్తోందని, అందుకే, ముందస్తు ముచ్చటకు ముగింపు పలికారని, పరిశీలకులు భావిస్తున్నారు.

భద్రాచలం వంతెన పై నుంచి వరద ప్రవాహం

కుండ‌పోత వ‌ర్షాలు, భారీ వ‌ర‌ద‌లతో  భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌ది మ‌హోగ్ర‌రూపం దాల్చింది. గోదారి తల్లిగా జనం పూజలందుకునే గోదావరి ఇప్పుడు జనాన్ని భయపెడుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం  75 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వంతన పై నుంచి గోదావరి ప్రవహిస్తున్నది. న‌దీ ప్ర‌వాహ ఉధృతి చూసి స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు. భ‌ద్రాచ‌లం ప‌రిస‌రాల్లో ఎటు చూసినా గోదావరే. దీంతో భ‌ద్రాచ‌లం రామాల‌యంతో పాటు స‌మీప కాల‌నీలు నీట మునిగాయి. గోదావరి వరద ఉధృతిని అంచనా వేసిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా భద్రాచలం వంతెనపై నుంచి రాకపోకలను నిషేధించారు. కాగా 36 ఏళ్ల కిందట భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 75.6 అడుగులకు చేరింది. అప్పుడూ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. ఆ తరువాత ఇన్నేళ్లకు మళ్లీ ఆ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్మీని రంగంలోనికి దింపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  

విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న పడవ.. భద్రాచలంలో ఒకరి గల్లంతు

ఊరేదో ఏరేదో తెలియని పరిస్థితి. భారీ వర్షాలు వరదలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అనేక ప్రాంతాలు నీట మునిగాయి. నిన్న మొన్నటి దాకా కార్లూ మోటార్ బైకుల మీద తిరిగిన రోడ్లు ఇప్పుడు నదులుగా మారాయి. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడానికి రోడ్లపై పడవలు తిరుగుతున్నాయి. రోడ్ల మీద వాహనాలు తిరుగుతున్నప్పుడు మానవ తప్పిదాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. అవే రోడ్లపై పడవలపై వెళుతుంటే కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి ఊహించని ప్రమాదాలు. ఎవరి పొరపాటూ, తప్పిదం లేకుండానే జరుగుతున్న ప్రమాదాలు. అలాంటి యాక్సిడెంట్ ఒకటి తీవ్ర విషాదాన్ని నింపింది. గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తుండటంతో భద్రాచలం వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భద్రాచలంలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పడవలపై తరలిస్తున్నారు. అలా తరలిస్తుండగా ఓ పడవ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొంది. అవును నిజమే నీటిలో ప్రయాణిస్తున్న పడవ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొంది. ఎందుకంటే ఆ పడవ వెళుతున్నది నదిలో కాదు... నడి రోడ్డుపై. పూర్తిగా ముంపునకు గురైన రహదారిపై జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పడవ ఒకటి రోడ్డు పక్కన నీటిలో మునిగి పోయిన విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని తిరగబడింది. ఈ సంఘటనలో పడవలో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నా ఓ వ్యక్తి మాత్రం గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నదుల్లో తిరగాల్సిన పడవలు ఇప్పడు భద్రాచలంలో నడిరోడ్డుపై తిరుగుతున్నాయి. రోడ్డుపై వాహనంలో ప్రయాణిస్తుంటే ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో కనిపిస్తుంది. అదే నీట మునిగిన రోడ్డుపై పడవలో ప్రయాణిస్తుంటే నీటి కింద ఎక్కడ విద్యుత్ స్తంభం ఉందో( మునిగిపోయి), ఎక్కడ ఇళ్లు ఉందో, ఎక్కడ చెట్టు ఉందో కనిపించదు. కనుచూపు మేరంతా గోదారే. ఇప్పుడు భద్రాచలంలో పరిస్థితి అదే.