కారు దిగిన మంత్రి ఎర్రబెల్లి సోదరుడు.. బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు!
posted on Aug 3, 2022 @ 2:23PM
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసిన చేరికల కమిటీ తన పని ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి చేరికలు షురూ అయ్యాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకీ, శాసనసభ్యత్వానికీ రాజనామా చేశారు. రేపో మాపో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కమలం గూటికి చేరనున్నారు.
ఇటు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేను తమ గూటికి చేర్చుకుంటున్న బీజేపీ అదే సమయానికి టీఆర్ఎస్ నుంచి కూడా ఓ కీలక నేతకు కమలం కండువా కప్పడానికి రంగం సిద్ధం చేసింది. ఏకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కారు దిగి కాషాయ జెండా ఎత్తడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఏకంగా మంత్రి సోదరుడు టీఆర్ఎస్ రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ నెల 7న ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది.
సరిగ్గా అదే రోజు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీలోనే అమిత్ షా సమక్షంలోనే కమలం గూటికి చేరనున్నారు. కోమటి రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ లో ఎంత కలకలం రేగిందో, ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా కూడా టీఆర్ఎస్ లో అంతటి కలవరాన్ని కలిగించింది. ప్రదీప్ రావు స్వయంగా ఎర్రబెల్లి సోదరుడు కావడం, పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన రాజీనామా ఒక్క వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సాహించడమే కాకుండా ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఆ చేరికల కమిటీకి టీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన ఈటల రాజేందర్ ను చైర్మన్ చేసింది. ఈటలకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, అలాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో ఉన్న పరిచయంతో ఎక్కువ మందిని కమలం పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయగలరని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో ఇరత పార్టీల నుంచి బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్న వారి జాబితాను ఇప్పటికే ఈటల అమిత్ షా కు సమర్పించారు. రానున్నరోజులలో కమలం పార్టీలోకి మరింత మంది చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.