సంక్షేమం పేర లక్ష్మణ రేఖ దాటేశారు..!
posted on Aug 3, 2022 @ 5:27PM
శ్రీలంకలో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపధ్యంలో చెలరేగిన ప్రజాందోళనలు, హింసాత్మక సంఘటనలపై మన దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రం కూడా రాజకీయ అవసరాలు అనివార్యతలను పక్కన పెట్టి రాష్ట్రాల అప్పులపై హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆంక్షలు విధిస్తోంది. లోక్ సభ సాక్షిగానే రాష్ట్రాల ఆర్ధిక క్రమశిక్షణా రాహిత్యాన్ని మందలించడానికి వెనుకాడటం లేదు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై కేంద్రం బహిరంగంగానే విమర్శలు గుప్పించడం, ఆంక్షలు విధించడం విమర్శలకు తావిస్తున్నా.. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందనడంలో సందేహం లేదు.
రాష్ట్రాలు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో, అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంగా విభిన్న కోణాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అధికార పీఠాన్ని అందుకునేందుకు రాజకీయ పార్టీలు సంక్షేమ పథకాలు ఉచిత వరాలను నిచ్చెనలుగా చేసుకుని, అధికారానికి అడ్డ దారిగా, దగ్గరి దారి (షార్ట్కట్) గా భావిస్తున్న నేపధ్యంలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతోందనే వాదన బలాన్ని పుంజుకుంటోంది. నిజమే. సంక్షేమం గీత దాటితే సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలు ‘ఓటు బ్యాంక్’ పథకాలకు పెద్ద పీట వేస్తున్నాయి. అప్పులు చేసి మరీ పథకాలు అమలు చేస్తున్నాయి. మీటలు నొక్కి ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. అందుకే ఇటీవల ఏపీ ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి, నొక్కిన మీటల లెక్కలు చెప్పి, మొత్తం 175 సీట్లు తమవే అన్న ధీమాను వ్యక్తపరిచారు. ఇలా ప్రజలను ఓటర్లుగా ఓటర్లను అమ్ముడుపోయే సరుకుగా భావించి అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఫలితంగా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకు పోవడంతో పాటుగా,ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అలాగే, అప్పుల భారం పెరిగే కొద్దీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయలేక పోతున్నాయి. కోతలు విధిస్తున్నాయి. చేతులేత్తెస్తున్నాయి. మరో వంక అభివృద్ధి, దీర్ఘకాల సుస్థిర ప్రయోజనాలపై ప్రభుత్వాలు దృష్టి నిలపలేక పోతున్నాయి. శ్రీ లంకలో జరిగింది అదే, అందుకే మన దేశంలోనూ శ్రీ లంక తరహా పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఘటికలు వినిపిస్తున్నాయని, హెచ్చరికలు వినవస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, షార్ట్కట్ రాజకీయాలు.. దేశానికి అతిపెద్ద సవాలుగా మారాయని, చేసిన వ్యాఖ్యాలు ఇప్పడు దేశంలో ప్రధాన చర్చనీయంశాలు అయ్యాయి. ప్రధాన మంత్రి మోడీ, ప్రత్యేకించి ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయక పోయినా, షార్ట్కట్ రాజకీయాలపై ఆధారపడితే, షార్ట్ సర్క్యూట్ ఖాయమని చేసిన హెచ్చరిక మాత్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా అందరికీ వర్తిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఝార్ఖండ్లోని దేవ్గఢ్లో రూ.16,800 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ, తెలంగాన స్టేట్ గవర్నమెంట్స్ సీరియస్ గా తీసుకోవాలని అంటున్నారు. ప్రధాని మోడీ ఎక్కడా ఎవరి పేరూ ప్రస్తావించక పోయినా, ఓట్ల కోసం అమలు చేసే ప్రజాకర్షక పథకాలు దేశాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు
అలాంటి పథకాలు ప్రకటించడాన్ని షార్ట్కట్ రాజకీయాలుగా అభివర్ణించారు. వీటిపై ఆధారపడితే షార్ట్ సర్క్యూట్ తప్పదని స్పష్టం చేశారు.. షార్ట్కట్ రాజకీయంతో దేశమే ధ్వంసం అవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి.. మనమంతా కఠోర శ్రమతో నవభారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. ప్రజాకర్షక పథకాలతో ఓట్లు సంపాదించడం సులువే. కానీ.. అలాంటి షార్ట్కట్లు అవలంబిస్తే దీర్ఘకాలిక దుష్పరిణామాలు ఉంటాయి" అని హెచ్చరించారు.
నిజానికి ప్రధాని మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితి గతులు, అప్పులు ఆదాయాలపై దృష్టిని కేంద్రేర కరించింది. ముఖ్యంగా, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు ఉల్లంఘించి, కార్పొరేషన్ల పేరిట అడ్డదారిలో చేస్తున్న అప్పులకు సంకెళ్ళు బిగించేందుకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా అప్పులు చేయకుండా రాష్ట్రాల రుణ పరిమితిని ఎప్పటికప్పుడ్డు సమీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్రం తీసుకున్న కఠిన చర్యలు సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు రుచించడం లేదు.
అయితే, ఆర్థిక నిపుణులు, చివరకు రాష్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అధికారులు కూడా, దీర్ఘకాల ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి సాధించాలంటే,ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరని, బెల్ట్స్ బిగించిక తప్పదని అంటున్నారు. అలాగే, శ్రీలంక పరిణామాల నేపధ్యంలో, ప్రజలు కూడా, సంక్షేమం గీతదాటితే సంక్షోభమే, అనే వాస్తవాన్ని గుర్తిస్తున్నారని అంటున్నారు. ఒక విధంగా శ్రీలంక పరిణామాలను ఒక గుణపాఠంగా తీసుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు విత్త మంతి ఏపీ సర్కార్ లక్ష్మణ రేఖ దాటేసిందనీ, ఈ విషయంపై ఆ రాష్ట్రాన్ని గతంలోనే హెచ్చరించామనీ కుండ బద్దలు కొట్టేశారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితో రాజకీయాలు చేయడం అటు కేంద్రానికి కానీ, ఇటు రాష్ట్రాలకు కానీ ఎంత మాత్రం తగదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.