ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు
posted on Aug 3, 2022 @ 12:13PM
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు మహాప్రస్తానంలో ముగిశాయి. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె పెద్ద కుమార్తె బుధవారం ( ఆగస్టు 3) తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె రాక కోసమే రెండు రోజులుగా ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
అలాగే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ, ఎన్టీఆర్ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి కళ్యాణ్‌రామ్ తదితరులు జూబ్లీహిల్స్‌లోని ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.
అలాగే పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతిక కాయానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నటుడు, ఉమామహేశ్వరి సోదరుడు నందమూరి బాలకృష్ణ పాడె మోశారు. ఉమామహేశ్వరి భర్త కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ ఆమె చితికి నిప్పంటించారు.