Read more!

టిక్కెట్ ఇవ్వలేదు.. చురకలు వేశారు!

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు .. సోమలింగం అన్నారుట వెనకటికో. ‘కుర్ర’ మనిషి. ఇప్పుడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ టికెట్ తమకు ఖరారై పోయిందని, కొందరు నేతలు చేస్తున్న సందడి,‘సోమ లింగం’ సామెతను గుర్తుకు తెస్తోంది. నిజమే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజాతీర్పును కోరేందుకు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, యువ నేత లోకేష్ పార్టీని సన్నద్ధం చేస్తున్నారు.  మహా నాడుతో శంఖారావం పూరించిన టీడీపీ అధినేత ధరల పెరుగుదల, చార్జీల మోతకు వ్యతిరేకంగా, ‘బాడుడే బాదుడు’ వంటి కార్యక్రమాలతో  ముందుకు పోతున్నారు. మహానాడు ఉత్సాహాన్ని ముందుంచి పార్టీని పగులు తీయిస్తున్నారు. 
అలాగే, నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితి స్వయంగా సమీక్షించేందుకు,ఆయా నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జిలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు, నేతలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిజానికి పరిపాలన విషయంలో కానీ, రాజకీయంగా అయినా, సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం, చంద్రబాబుకు కొత్త కాదు. నిజానికి, చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం అయినా అందరినీ సంప్రదించిన తర్వాతనే తీసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, కొందరు నాయకులు, ముఖ్యంగా నియోజక వర్గ ఇన్ చార్జిలుగా ఉన్నకొందరు   తమకు టికెట్ ఖరారై పోయిందని ప్రచారం చేసుకుంటున్నారు.   
అయితే, ఈ సమావేశాలు ప్రధానంగా నియోజక వర్గంలో  పార్టీ పరిస్థితిని సమీక్షించుకుని, ముందుకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే తప్ప, అభ్యర్ధుల ఎంపిక కోసం చేస్తున్న కసరత్తు కాదని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి,  ఎన్నికలు ఇంకా రెండేళ్ళ దూరంలో ఉన్న సమయంలో ఏ పార్టీ కూడా ఇప్పుడే అభ్యర్ధులను ఖారారు చేయదు. ముఖ్యంగా  పొత్తుల విషయంలో స్పష్టత రావలసి ఉన్న నేపధ్యంలో, అలాంటి తొందరపాటు నిర్ణయం ఏ పార్టీ నాయకుడు తీసుకోరు. పొత్తుల విషయంలోనే తొందర వద్దని గట్టిగా చెప్పిన  చంద్రబాబు నాయుడు, ఇప్పుడే అభ్యర్ధులను ఎలా ఖారారు చేస్తారని, ప్రశ్నిస్తున్నారు అందులోనూ, ఆచి తూచి అడుగులు వేసే అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు, అసలే అలాంటి తప్పు చేయరని, పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి, గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు ఇంత ముందుగా అభ్యర్ధులను ప్రకటించలేదని  ముఖ్య నేతలు గుర్తు చేస్తున్నారు. నిజానికి, ఈ ప్రచారం వెనక కొందరు ఇంటి దొంగల కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వీస్తున్న టీడీపీ అనుకూల పవనాలను పసిగట్టి కొందరు  ఉద్దేశపూర్వకంగా వాతావరణాన్ని చెడగొట్టేందుకు, అప్పుడే టికెట్ ఖారరై పోయిందనే ప్రచారం సాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
నిజానికి ఇప్పడు చంద్రబాబు నాయుడు, పని తనం బాగాలేదని భావించిన నియోజక వర్గ ఇంచార్జిలను హెచ్చరించేందుకే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు. అంతే కాదు, మాజీ డిప్యూటీ స్పీకర్,  అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సహా మరికొందరు ఇన్ చార్జిలకు చంద్రబాబు నాయుడు గట్టిగా  చురకలు వేసినట్లు, పని తీరుపై తలంటు పోసినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రకటించిన కార్యక్రమాల అమలులో వెనకబడిన వారిని పేరు పెట్టి మరీ చంద్రబాబు నాయుడు, గట్టిగా హెచ్చరించినట్లు చెపుతున్నారు. 
నిజానికి, మండలి బుద్ధ ప్రసాద్, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయిన నాటి నుంచి తెలుగు దేశం పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. చివరకు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుకు కూడా అయన హాజరు కాలేదు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఊపు తెచ్చిన, బాడుడే బాదుడు కార్యక్రమంలోనూ మండలి బుద్ధ ప్రసాద్  పాల్గొన్న దాఖాలాలు లేవు. అలాగే, పార్టీ సభ్యత్వ కార్యక్రమం, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పార్టీ ఆదేశాలను బుద్ధ ప్రసాద్ అంతగా పట్టించుకోలేదని,పార్టీ నాయకులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, “పార్టీ ఆదేశాలను అందరూ పాటించాలి, ముఖ్యంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల విషయంలో ఉపేక్ష వహిస్తే సహించేది లేదు. మీ నియోజక వర్గంలో కార్యక్రమాలు నిర్వహించక పోతే, మీకంటే ఎక్కువగా పార్టీ నష్ట పోతుంది. మీ పని తీరుకు ఇవన్నీ ప్రామాణికంగా ఉంటాయి..మూడు నెలలలో మరోసారి మీతో మాట్లాడతాను, అప్పటికీ ఇదే పరిస్థితి ఉంటే, కఠిన నిర్ణయాలు తప్పవు”  అని చంద్రబాబు నాయుడు మండలి ముఖం మీదనే చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవం ఇలా, ఉంటే మండలి బుద్ధ ప్రసాద్ కు టికెట్ ఖరారైందని ప్రచారం చేసుకోవడం ఏమిటని స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి, స్వతహాగా కాంగ్రెస్ డీఎన్’ఎ నింపుకున్న  మండలి బుద్ధ ప్రసాద్ మరో దారి లేక తెలుగు దేశం పార్టీలో చేరారే కానీ, ఆయన టీడీపీతో ఏ స్థాయిలోనూ మమైకం కాలేదని ఆయన సన్నిహితులే అంటారు. ఆయన, పార్టీలో చేరి ఇంచుమించుగా పదేళ్ళు కావస్తున్నా, ఇంతవరకు పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసిన, మంచి చెడు పంచుకున్న సందర్భాలు దాదాపుగా లేవని అంటారు. అంతేకాకుండా మరోసారి, ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే, టీడీపీ ఇక అవనిగడ్డఫై ఆశలు వదులుకోక తప్పదని  స్థానిక నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.