నిత్యానందపై నాన్ బెయిలబుల్ వారెంట్
posted on Aug 20, 2022 @ 10:27AM
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైన విషయం విదితమే. నిత్యానంద మాజీ డ్రైవర్ లెనిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసులో విచారణ కొనసాగుతోంది. అయితే 2019 నుంచి విచారణకు హాజరుకాకపోవడంతో బెంగళూరులోని రామనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిత్యానందపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల 23లోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నిత్యానంద ‘కైలాసం’ పేరిట ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రహస్య ప్రాంతం నుంచి నిత్యానంద మాట్లాడిన వీడియోలు అప్పట్లో కలకలం రేపాయి. తాను ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నట్లు నిత్యానంద ప్రకటించారు.
ఆ దీవికే కైలాసం అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే, ఆయన తమ దేశంలో లేరని ఈక్వెడార్ ప్రభుత్వం పేర్కొంది. విచారణకు హాజరు కావాలని గతంలోనూ ఆయనకు బెంగళూరులోని కోర్టు వారెంట్ జారీ చేయగా, ఆయన ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోయారు. గతంలో నిత్యానంద స్వామి అరెస్టయి ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత భారత్ విడిచి పారిపోయారు. దీంతో నిత్యానంద బెయిల్‌ను న్యాయస్థానం 2020లో రద్దు చేసింది. బిడది ఆశ్రమంలో తన మీద నిత్యానందస్వామి అత్యాచారం చేశారని ఆయన ఆశ్రమంలో ఉంటున్న ఓ వివాహిత మహిళ 2010లో బిడది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిత్యానందతో పాటు ఆయన శిష్యులు కొందరిని అరెస్టు చేసి రామనగర జైలుకు పంపించారు. కొంతకాలం పాటు నిత్యానంద జైలు జీవితం గడిపారు.
బెయిల్ మీద బయటకు వచ్చిన నిత్యానంద ఆ తరువాత 2019 వరకు కోర్టు విచారణ హాజరయ్యారు. 2019 వరకు బహిరంగంగా కనిపించిన నిత్యానంద ఆ తరువాత పరారైయ్యారు. కైలాసం అనే దేశాన్ని సొంతంగా స్థాపించుకున్న నిత్యానంద ఆ దేశానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ ప్రకటనలు గుప్పించారు. దేశం వదిలిపారిపోయిన నిత్యానందకు వ్యతిరేకంగా ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.
ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. నిత్యానంద బెయిల్ కు షూరిటీ ఇచ్చిన వ్యక్తికి కోర్టు నోటీసులు జారీ చేసింది. నిత్యానంద కోర్టుకు హాజరుకాకపోతే షూరిటీ ఇచ్చిన వ్యక్తి ఆస్తిని జప్తు చేసే అవకాశం ఉందని న్యాయవాది అంటున్నారు. మొత్తం మీద నిత్యానందకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ కావడంతో ఆయన మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.