Read more!

రామోజీతో అమిత్ షా భేటీ.. ఆంతర్యం ఏమిటి?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో బేటీ కానున్నారు. మునుగోడులో ఈ నెల 21న జరగనున్న సభకు అమిత్ షా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానే సభకు ముందు లేదా తరువాత అమిత్ షా రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇందు కోసం ఆయన షెడ్యూల్ లో ప్రత్యేకంగా మార్పులు కూడా చేశారు.

దాదాపు గంట సేపు రామోజీ రావు, అమిత్ షాల మధ్య భేటీ జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిరువురి భేటీ అజెండా ఎమిటన్నది ఇతమిద్థంగా తెలియరాలేదు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, బీజేపీల మధ్య సత్సంబంధాలు నెలకొనే వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రామోజీరావు, అమిత్ షాలు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

వీరిరువురి మధ్యా భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం బీజేపీ- టీడీపీ మధ్య సంబంధాలే అని అంటున్నారు. బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు పార్టీలకూ అవసరమన్నది విశ్లేషకులు మాట. బీజేపీ ముందున్న లక్ష్యం తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం అయితే.. తెలుగుదేశం ఏకైక లక్ష్యం ఏపీలో వైసీపీని  మట్టి కరిపించి అధికారంలోకి రావడం. ఇందుకు ఏపీలో బీజేపీ అవసరం తెలుగుదేశం పార్టీకీ, తెలంగాణలో తెలుగుదేశం అవసరం బీజేపీకి ఉందన్నది వారు బెబుతున్న  మాట. అది వాస్తవం కూడా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి లీడర్ కొరత ఉన్నా క్యాడర్ మాత్రం చాలా బలంగా ఉందన్నది అందరూ అంగీకరించే మాట.

చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే ఆ ప్రభావం తెలంగాణలోని కనీసం పాతిక నియోజకవర్గాలలో బలంగా ఉంటుంది. ఆ బలమే ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీకి అవసరం. అలాగే ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే.. జనసేన సహకారం అవసరమనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక రాకుండా ఉండేందుకు ఇది అనివార్యమనీ విశ్లేషకులు అంటున్నారు. జనసేన తెలుగుదేశంకు దగ్గర కావాలంటే.. బీజేపీ నుంచి అభ్యంతరాలు ఉండకూడని పరిస్థితి ఉంది. అందుకే బీజేపీ సహకారం ఏపీలో తెలుగుదేశం పార్టీకి అవసరం.

ఆ పరస్పర అవసరాలే అనివార్యంగా రెండు పార్టీలనూ దగ్గరకు చేరుస్తున్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ నేపథ్యంలోనే రామోజీరావుతో అమిత్ షా భేటీ కానుండటం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా ఒకసారి అమిత్ షా రామోజీరావుతో భేటీ అయ్యారు. అప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా  ఉన్నారు. అప్పుడు కూడా అమిత్ షా తాను స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో భేటీ అయ్యారు. ఇప్పుడు కూడా అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీలోనే రామోజీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపై .. రామోజీరావుతో అమిత్ షా ఈ బేటీలో  చర్చ జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.