రజనీకి గవర్నర్ గిరీ ఎర.. దక్షిణాదిలో పాగాకు బీజేపీ ఎత్తుగడ!
వలవేసినవాడు చిన్నచేప కోసమే రోజంతా వేచి ఉండడు. వల వేసిన ప్రతి సారీ ఏదో ఒక పెద్ద చేపను పట్టాలనే పట్టుదలతోనే ఉంటాడు. కచ్చితంగా పెద్ద చేప చిక్కుతుందన్నది అతని నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎంతటి పనైనా సాధించవచ్చన్నది బీజేపీ వ్యూహకారులు ఇటీవలి కాలంలో స్పష్టం చేసింది. దేశంలో తమకు ఎదురులేకుండా చేసుకోవడానికి విపక్షాలను దెబ్బతీయడంలో అనేక వ్యూహ వలలను కమలం పార్టీ వేసింది. ఒక్కటి రెండు తప్ప అన్నీ మంచి ఫలితాలనే ఇచ్చాయి. ఇపుడు దక్షిణాదినా వారి అజమాయిషీ సాధిం చుకోవడానికి తమిళనాట తాజాగా వల విసిరేరు. ఆ వలకు రజనీకాంత్ అనే పెద్ద చేప చిక్కింది.
ఒక్క డైలాగ్‌తో సినీ ప్రేక్షకులను వెర్రెక్కించి తన వీరాభిమానులను చేసుకోగల సత్తా ఉన్న నటుడు రజ నీ. తమిళనాడులో ఎంజీఆర్, శివాజీగణేషన్, కమల్ తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించిన నటుడు రజనీకాంత్. రజనీ సినిమాలంటే పడి చచ్చే జనం ఆయన రాజకీయాల్లోకీ వచ్చి రాజకీయ రంగాన్ని ప్రక్షా ళన చేయాలని వీరాభిమానులు ఆశించారు. ఓకే మీ మాటే నా మాట అని పార్టీని ప్రకటించారు రజనీ. కానీ పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో రేపు, ఎల్లుండీ అంటూ క్రియాశీల రాజకీయాల్లోకి పూర్తిగా కాళ్లూ చేతులూ పెట్టడానికి ముందు వెనుకలాడారు. చివరికి అనారోగ్యం అంటూ రాజకీయ ప్రవేశం చేయకుండానే రాజకీయ సన్యాసం ప్రకటించేవారు. క్రమేపీ సామా జిక పరంగా ఎంతో సేవచేయాల్సి ఉందని అభిమానులకు రజనీ తన మాటగా ప్రకటించి రాజకీయాల సంగతి ఆలోచించకుండా చేయగలిగారు. అయితే తాను వాస్తవానికి కర్ణాటక నుంచి మద్రాసు వచ్చి సినీ నటునిగా స్థిరపడి తమిళుల హృదయాల్లో తిష్ట వేసిన మహా నటుడు రజనీకాంత్.
ఇప్పటికీ తమిళుల భావన అదే. అయితే కాలక్రమంలో రాజకీయాల రంగు కూడా పులమడంతో ఆయన మనవాడు కాదు గనుక ఆయన్ను దూరంగా పెట్టాలన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి. దీంతో పరిస్థితులు రజ నీకి ప్రతికూలంగా మారాయి. రజనీ తన స్థాయిని, జనాల్లో పట్టును, ప్రతిష్టను కాపాడుకోవడానికి బీజేపీ వారి సహాయ సహ కారాలను కోరారు.
ఇలా చాలా కాలం నుంచే రజనీ బీజేపీతో సఖ్యంగా ఉంటూ వచ్చారు. ఇక తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా ఇది బీజేపీ ఆసరాగా ఉపయోగపడుతోంది. తమిళనాట రజనీ ఇంటి దేవతతో సమానం. ఇలాంటి అత్యంత పాప్యులర్ నటుడిని, వ్యక్తిని తమకు గొప్ప అస్త్రంగా దొరకడం, దాన్ని మరింత పదునుపెట్టి ఉపయోగించుకోవడం ద్వారా దక్షిణాదిన తమ రాజకీయ ఎత్తు గడలు విజయవంతంగా వేయవచ్చని, ముందుకు దూసుకుపోవచ్చన్న ఆలోచన చేసింది టీమ్ మోదీ!
రజనీకాంత్ కి తమిళనాట ఉన్న అపార అభిమాన జనం బీజేపీ కీ కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందన్న ఆలోచనలోనే ఆయన్ను వలవేసి పట్టిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆయనకు గనక గవర్నర్ పదవి ఇస్తే, రాష్ట్రంలో తిరుగులేకుండా పోతుందన్నది బీజేపీ వర్గాల నమ్మకం కూడా. అసలే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న ఈ తరుణంలో రజనీని దగ్గరవానిగా మరింత ఆత్మీయునిగా చేసుకుని ఉన్నత పదవిని కట్టబెట్టగిలిగితే తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే ఆలోచనలు మరింత పదునుగా అమలు చేయడానికి ఎంతో ఆస్కారం ఉందన్నది బీజేపీ మేథోవర్గానికి అనిపించి ఉండవచ్చు. మరో విధంగా, రజనీ కూడా ఇటీవల సినిమాలకు కాస్తంత విశ్రాంతి ఇచ్చి రాజకీయపరంగా తన స్నేహితులను దరిచేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారన్నది విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో బీజేపీ ఆహ్వానాన్ని తప్పకుండా స్వీకరించితే తన స్థాయిని పెంచుకోవడంతో పాటు, తనకు తమిళనాట పెరుగుతోన్న రాజకీయ వ్యతిరేకతకు అడ్డుకట్ట వేయచ్చన్న ఆలోచనా చేసి ఉండవచ్చు. కనుక తమిళ నాట రజనీ ఫాన్స్‌కి ఇదో శుభవార్తే అవుతుంది. రజనీ బ్లాక్‌బస్టర్లు అరుణాచలం, భాషా, బాబా,ముత్తు వంటి సినిమాలు రజనీని ఆధ్యాత్మిక గురువుగానూ మరో కోణంలో అభిమానులు దర్శించారు.
ఇదిలాఉండగా, గతంలో ఆధ్యాత్మిక చింతన భారంతోనే రజనీ అనేక రాజకీయ అంశాలమీద ఎలాంటి ఆరోపణలు, విమర్శలూ చేయలేదు. అయితే రాజకీయవిశ్లేషకులు మాత్రం అదంతా నటనే, బీజేపీ, కేంద్ర నాయకత్వాన్ని ఆకట్టుకోవడంలో రజనీ వేసిన ఎత్తుగడే తప్ప మరోటి కాదన్నారు. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ అంశంలో రజనీ ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. కేంద్రంలో బీజేపీ నాయకత్వాన్ని సీనియర్ నాయకులను భజన చేయడం కూడా జరిగింది. చాలా కాలం క్రితమే అమిత్‌షాను పొగడ్తలతో ముంచేత్తారు రజనీ. మీరు పార్లమెంటులో చేసిన భాషణ మహాద్భుతం.. ఎవరివల్లా కాదు మిత్రమా అంటూ పొగిడేశారు. అంతటితో ఆగలేదు.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ల జంట మహాభారతంలో కృష్ణార్జునుల వంటిదని రజనీ పొగడ్తలతో ముంచెత్తారు. వీరిద్దరి వల్లే దేశం ఊహించని అభివృద్ధి దిశలో వెళుతోందని దేశమంతా వినిపించేలా ప్రశంసించారు. 2018లో తూత్తుకుడిలో యాంటీ స్టిరెటైట్ ప్రొటెస్టుల సందర్భంగా జరిగిన గొడవలు, అల్లర్లను రజనీ వ్యతిరేకించారు. ఆ సమయంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఏకంగా 13మంది చనిపోయారు. జూలైలో నెటిజెన్లు శాంతాకుళం లో ఇద్దరు వ్యాపారుల మరణం గురించి నెటిజన్లు హోరెత్తితే ఇక తప్పని స్థితిలో రజనీ కామెంట్ చేయవలసి వచ్చిందే గాని, కేంద్రం ఏమనుకుంటుందోనన్న భీతి ఆయనలో లేకపోలేదన్నది విశ్లేషకుల మాట. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మీద సామాన్యజనులూ విరుచుకుపడుతున్న తరుణంలో, విపక్షాలు మండిపడుతున్న సమ యంలోనూ రజనీ అంతగా స్పందించలేదు. ఆయన ఆధ్యాత్మిక చింతన సారాంశం కేవలం కేంద్రం లోని బీజేపీవారిని ఆకట్టుకోవడానికే అన్న విమర్శలూ రజనీ ఎదుర్కొనవలసి వచ్చింది.
ఏతావాతా తేలిందేమంటే, రజనీకాంత్ కేవలం భారీ డైలాగ్‌లతో పెద్ద ఎత్తున జనాకర్షక నాయకునిగా ఆరాధ్యదైవంగా నిలబడటమే కాకుండా తనలోపలి కమలనాథుడిని కూడా కాపాడుకోవడానికి స్వీయ ఎత్తుగడలు కనిపించి కనిపించకుండా చేపట్టి ఢిల్లీ ప్రయాణాలు, ఆహ్వానాలకు మోదీ, షాలతో ములా ఖత్‌లకు ట్విస్ట్ .. తనకు గవర్నర్ గిరీ అంటగట్టే అనుకూలత సాధించడమేనని విశ్లేషకుల మాట.