బీజేపీ తెరాస జుగల్ బందీ
తెలంగణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇతర రాష్ట్రాలకు వెళ్లి, కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు.మోడీ ప్రభుత్వం మహా డేంజర్ అని దేశాన్ని హెచ్చరిస్తున్నారు. అర్జెంటుగా, బీజీపీ సర్కార్ను సాగనంప వలసిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. గుజరాత్ మోడల్ కు పోటీగా తెలంగాణ మోడల్ అభివృద్ధిని తెరమీదకు తెచ్చారు. బీజేపీ ముక్త భారత్ నినాదంతో కమల దళం పై కలిసి పోరాడేందుకు,రండని ప్రజలకు,పార్టీలకు పిలుపు ఇచ్చారు. సరే, కేసేఆర్ రమ్మంటే వచ్చేవాళ్ళు ఎవరు,?బీజేపీని గద్దె దించేది ఎవరు? అసలు మోడీకి ప్రత్యాన్మాయం ఎవరు? అనే పలు ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉందనుకోండి.. అన్నిటినీ మించి, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల జీతాలు ఇవ్వలేని, తెలంగాణ మోడల్ బుజానికి ఎత్తుకునేది ఎవరు? వంటి ప్రశ్నలు ఇంకా చాలాచాలానే ఉన్నాయనుకోండి, అది వేరే విషయం.
అదలా ఉంటే, కేసీఆర్ అలా రాష్ట్రాలను చుట్టి వస్తుంటే, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ఏదో ఒక పేరున తెలంగాణలో పర్యటిస్తున్నారు.కేసేఆర్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నిజానికి, ఇటీవల కాలంలోరాష్ట్రంలో బీజేపే జాతీయ నాయకుల పర్యటన లేని రోజంటూ లేదంటే ఆశ్చర్య పోనవసరం లేదు. అంతలా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రం పై దృష్టిని కేంద్రీకరించింది. అందుకే కావచ్చును, ఇటీవల ముఖ్యమంత్రి కేసేఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ పాత్ర లేదని వివరణ ఇచ్చే సందర్భంలో, బీజేపీ నాయకులు మిడతల దండుల రాష్ట్రంపై దాడి చేస్తున్నారని, తమపై నిరాధారమైనఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు. కవిత చేసింది ఆరోపణే అయినా, నిజంగా కూడా బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రంలో వరసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే పార్లమెంట్ ప్రవాస్ యోజన పేరిట ప్రచారయాత్రను పెద్ద ఎత్తున చేపట్టింది. అయితే, అది ఏదో ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. గత లోక్ సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా దేశం మొత్తంలో ఎంపిక చేసిన 144 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది.
రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. 40 మంది కేంద్ర నేతలకు ఈ క్లస్టర్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు, ఎంపీలు పర్యటిస్తున్నారు. మూడు రోజులపాటు నియోజకవర్గాల్లోనే బస చేస్తారు. అలా గుర్తించిన నియోజక వర్గాలలో తెలంగాణలోని 17 నియోజక వర్గాలు ఉన్నాయి. అందుకే, గత నెలలో ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంఛి, కేంద్ర మంత్రులు ఒకరి వెంట ఒకరు తమకు కేటాయించిన లోక్ సభ నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా జహీరాబాద్ లోక్ సభ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు.అసందర్భంగా ఆమె, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌కు మించి అప్పులు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ రుణ భారం మొత్తాన్నీ తిరిగి ప్రజలపైనే మోపనుందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని.. ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో పుట్టబోయే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు ఉంటుందని.. దీన్నిబట్టి కేసీఆర్ ఏ స్థాయిలో అప్పులు చేశారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తెలంగాణను కేసీఆర్ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపైనే ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతమేర వెళ్తున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకే బీజేపీ అధిష్ఠానం పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
కేంద్ర పథకాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం మార్చేసి, తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పేర్లు మారిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తామని నిర్మల స్పష్టం చేశారు. రాష్ట్ర రైతులకు అన్నీ ఇస్తున్నామని కేసీఆర్ సర్కారు పదేపదే చెబుతోందని.. కానీ, రాష్ట్రంలో 100మంది రైతుల్లో 91.7శాతం మంది అప్పులపాలయ్యారన్నారు. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.పేరు మార్చి.. డబుల్ బెడ్‌రూం అన్నారు..కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణలో ఇళ్లు కట్టించాల్సి ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర పథకం పేరును మార్చి డబుల్ బెడ్‌రూం ఇళ్లు అని ప్రచారం చేసుకుంటోందని నిర్మల మండిపడ్డారు.
అలాగే పీఎం మత్స్య సంపద యోజన, నేషనల్ కో ఆపరేటివ్ డెవల్‌పమెంట్, ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల పేర్లను మార్చేసి.. అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం కింద కేంద్రం గడిచిన 8 ఏళ్లలో తెలంగాణకు రూ.20వేల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలు, నిధుల వ్యయంలో అవకతవకలు జరగడంతోనే కేంద్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మరిచి దేశమంతా తిరుగుతూ తానే ప్రధానమంత్రినని కేసీఆర్ చెప్పుకుంటున్నారని నిర్మల ఎద్దేవా చేశారు. బిహార్ వెళ్లిన కేసీఆర్ నవ్వులపాలయ్యారన్నారు. కాళేశ్వరం నీటి ప్రాజెక్టును డబ్బుల కోసం కట్టారా..? నీటి కోసం కట్టారా..? అని కేసీఆర్‌ను నిర్మల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదట రూ.39,500 కోట్లు ఖర్చు అవుతాయని నిర్ణయించారని, ఇప్పుడు దాని విలువను రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. అయితే, కేంద్ర మంత్రి నిర్మల సీతరామన్ చేసిన ఆరోపణలు లేదా ఇచ్చిన వివరణలో ఎక్కడా కొత్తదనం లేదు. నిజానికి, గత కొంత కాలంగా బీజేపీ, తెరాసల మధ్య ఇదే జుగుల్ బందీ నడుస్తోందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి జుగుల్ బందీ వలన ప్రయోజనం ఉండదని, చర్యలు లేకుడా చేసే విమర్శలు, ప్రతి విమర్సలకు విలువ ఉండదని అంటున్నారు.