మల్టీప్లెక్స్ లలో రూ.75లకే సినిమా చూడొచ్చు.. ఎప్పుడంటే..?
posted on Sep 3, 2022 7:01AM
అభిమాన హీరో సినిమాను వెండి తెరమీద చూడటం అ కిక్కే వేరు. ఇప్పటి వారికి తెలియకపోవచ్చు కానీ మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లి టూరింగ్ టాకీసులలో సినిమా చూసి వచ్చి ఆ కథ నెలల తరబడి చెప్పుకునే వారు పూర్వం. ఆ తరువాత థియేటర్లు పెరిగాయి. 35ఎంఎం, 70ఎంఎంలు వచ్చాయి. ఇప్పుడందరికీ సినిమా థియేటర్లు పరిచయమే. తరచూ సినిమాలు చూడటమూ మామూలే.
అయితే మల్టీ ప్లెక్స్ లో సినిమా చూస్తే మాత్రం ఆ కిక్కే వేరప్పా అంటారు. కానీ మల్టీ ప్లెక్స్ లలో సినిమా టికెట్ల ధరలకు దడిసి చాలా మంది వాటిలో సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలన్న కోరికను, ఆశనూ చంపేసుకుంటారు. అలాంటి వారి కోసం మల్లీ ప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్త చెప్పింది.
కేవల 75 రూపాయలకే మల్లీప్లెక్స్ లో సినిమా టికెట్ కొనుక్కొని హాయిగా ఆ ఎక్స్ పీరియెన్స్ ఎంజాయ్ చేయమంటోంది. అయితే ఇది ప్రతి రోజూ సాధ్యం కాదు. కేవలం ఒకే ఒక్క చాన్స్. అదీ ఎందుకంటే ఈ నెల 16న జాతీయ సినిమా దినోత్సవం (నేషనల్ సినిమా డే). ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా అన్ని మల్లీప్లెక్స్ ధియేటర్లలో ప్రేక్షకులు కేవలం 75 రూపాయలకే సినిమా టికెట్ కొని సినిమా చూడొచ్చు.
అంటే సెప్టెంబర్ 16న మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ రేటు 75 రూపాయలకు కుదించాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని నగరాలలో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటును అమలు అవుతుంది. థియేటర్ వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రేక్షకుల కోసం మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.