నటుడు అలీకి నామినేటెడ్ పోస్టు ఫిక్సేనా? ఎంద చాట!
posted on Sep 2, 2022 @ 12:31PM
గత ఎన్నికలలో తనకు అండగా నిలిచిన నటులకు జగన్ ఏదో ఒక ప్రయోజనం చేకూరుస్తానని అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ కమేడియన్ అలీ విషయంలో అయితే ఆయనను ఏకంగా రాజ్యసభకు పంపిస్తానని నమ్మించారు.
సినీ పరిశ్రమతో టికెట్ల వివాదం సందర్భంగా జగన్ అలీని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ చర్చించారు. ఆ సందర్భంగా కూడా త్వరలో పిలుపు వస్తుంది, గుడ్ న్యూస్ వింటారు అని మళ్లీ ఊరించారు. ఆ తరువాత షరా మామూలే! పిలుపూ లేదు, మంచి కబురూ లేదు. అయితే గత ఎన్నికలలో వైసీపీ తరఫున పని చేసిన నటులలో కమేడియన్ పృధ్వీరాజ్ కు మాత్రమే పదవి దక్కింది. అయితే అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
ఏదో వివాదంలో ఇరుక్కున్న పృధ్విని పదవి నుంచి తొలగించి, ఆ తరువాత పట్టించుకోవడమే మానేశారు జగన్. ఇక జగన్ కు అనుకూలంగా గత ఎన్నికలలో పని చేసిన నటులు మోహన్ బాబు, అలీ, పోసాని కృష్ణమురళీలకు సదవుల సంగతి దేవుడెరుగు ఇంత వరకూ పార్టీలో సరైన గుర్తింపే దక్కలేదు, దీంతో మోహన్ బాబు బహిరంగంగా ప్రకటించకపోయినా వైసీపీకి దూరమైనట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తన విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవానికి విపక్ష నేత చంద్రబాబును ఆహ్వానించారు. ఇందు కోసం తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తాను తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ఇక అలీ, పోసానిల విషయానికి వస్తే వారు జగన్ కరుణా కటాక్షా వీక్షణాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. జగన్ మాత్రం అదిగో ఇదిగో అంటూ మూడేళ్లు గడిపేశారు. దీంతో జగన్ పార్టీకి మద్దతుగా నిలవడం వల్ల ప్రయోజనం లేదని సినీ పరిశ్రమ మొత్తం భావిస్తున్నది. ముఖ్యంగా అలీ, పోసాని కృష్ణ మురళీ ఇటీవలి కాలంలో వైసీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అలీ అయితే ఒకటి రెండు సందర్భాలలో తనకు పదవి విషయంలో నిర్ణయం తీసుకోవలసింది జగనే అని నిష్ఠూరంగా చెప్పారు కూడా.
ముఖ్యంగా ఈ మూడేళ్ల కాలంలో అలీకి పదవి విషయంలో భారీ ప్రచారం జరిగింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అని ఒక సారీ, రాజ్యసభ సభ్యత్వం అని మరోసారీ బాగా ప్రచారం జరిగింది. అలీకి స్వయంగా జగన్ నుంచి పిలుపు కూడా వచ్చింది. అయితే పదవి మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్ ఫీవర్ మొదలైపోయిన తరువాత, జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతక గూడుకట్టుకుందన్న ప్రచారాల నేపథ్యంలో మళ్లీ సినీ గ్లామర్ అవసరమని జగన్ భావిస్తున్న తరుణంగా మళ్లీ అలీకి పదవి ఇవ్వనున్నారంటూ ప్రచారం జోరందుకుంది.
అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించనున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ప్రచారం పట్ల అలీ పెద్ద సంతోషంగా లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలీ అంత కంటే పెద్ద పదవిని ఆశిస్తున్నారనీ, ఇంత కాలం జగన్ ఆ విషయమే చెబుతూ వచ్చారనిఅంటున్నారు. రాజ్యసభకు అవకాశం ఇప్పుడు లేదు కనుక దానితో సమానమైన హోదా ఉండే పదవిని అలీ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక పోసానికి కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఖాయమని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.