ఆసియా కప్.. ఆడుతూపాడుతూ గెలిచిన పాక్
posted on Sep 3, 2022 6:41AM
ఆసియాకప్ లో శుక్రవారం షార్జాలో పెద్ద కామెడీ సినిమా చూశారు ప్రేక్షకులు. ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ జరిగినట్టుంది కానీ మంచి టగ్గాఫర్ మ్యాచ్‌లా అనిపించలేదు. కేవలం నాలుగో తేదీన భారత్‌తో తలపడేందుకు పాకిస్తాన్ శుక్రవారం హాంకాంగ్ మీద ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినట్టుంది. అసలు ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆలవోకగా గెలవడం అంటే అర్ధం చూపించారు పాకిస్తాన్ ప్లేయర్లు. స్టేడియంలో, ప్రపంచమంతా టీవీల్లోనూ చూసినవారికి మంచి కామెడీసినిమా చూసినట్టే ఉంది. హాంకాంగ్ ఆట చూస్తుంటే వీళ్లు అసలు టోర్నీకి ఎందుకు వచ్చి సమయం వృధా చేయడం అనిపించకపోదు. శుక్రవారం సెప్టెంబర్ 2న జరిగిన గ్రూప్ ఏ చివరిదైన ఆరో మ్యాచ్ ని పాకిస్తాన్ సరదాకబుర్లకి బాగా జ్ఞాపకం ఉంచుకుంటారేమో. ఎందుకంటే, పాకిస్తాన్ హాంకాంగ్‌ను ఏకంగా 155 పరుగుల తేడాతో ఓడించింది. ఆసియాకప్ టోర్నీలో హాంకాంగ్ చేసిన స్కోరే అతి తక్కువ స్కోర్ అవుతుందేమో!
మొదట బ్యాట్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. హాంకాంగ్ 10.4 ఓవర్లలో కేవలం 38 పరుగులకు వెనుదిరిగారు. పాక్ బౌలర్లధాటికి భయపడ్డారో, అసలు బ్యాటింగ్ తెలియక పెవిలియన్ దారి పట్టారో అర్ధంగాలేదు. అంతా పాక్ బౌలర్లను చూడ్డానికి వచ్చినట్టు వచ్చి వరసపెట్టి వెళ్లారు. కెప్టెన్ బాబర్ అజామ్ లోలోపల నవ్వుకున్నాడు. ఇది మ్యాచ్‌లా లేదు.. భారత్‌తో పోటీకి ప్రాక్టీస్ చేస్తున్నట్టుందని. నిజమే మ్యాచ్ మొత్తం అలానే జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిచి తీరాలి. కానీ మరీ ఇంత సులువు అవుతుందని బహుశా అనుకోలేదేమో. పాపం హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్‌కి ఏడుపే తక్కువ. పడక పడక వీళ్లతోనే పడాలా అని బాధపడే ఉంటాడు. ప్రేక్షకులు టిఫిన్ చేస్తూ, బటానీలు తింటూ ఏదో సరదాగా పిల్లల ఆటని చూసినంత కాలక్షేపం ఆటలా చూశారు. ఇళ్లలో టీవీలో చూసినవారిలో దాదాపు అందరూ అన్ని ఇళ్లలో వారూ క్రికెట్ కాకుండా ఇంకేదో చూసినట్టు ఆనందించి ఉంటారు. పొట్టచెక్కలయ్యెట్టు నవ్వుకున్నారు.. భారత్, పాక్ వీరాభిమానులు.
పాకిస్తాన్ మొదట బ్యటింగ్‌కు దిగింది. ఆరంభదశలోనే వికెట్ కోల్పోయింది. అబ్బా హాంకాంగ్ ఇరగదీస్తారనుకున్నారంతా. ఆ తర్వాత మొదలయింది దంపుడు కార్యక్రమం. మొహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్ ఎంతో బాగా బాదారు. రిజ్వాన్ 42 బంతుల్లో అర్ధసెంచరీ చేసి టీ20 టోర్నీల్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. ఇలా చేసిన పాక్ అయిదవ బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. తర్వాత మరింత రెచ్చిపోయి 57 బంతుల్లో 78 పరుగులు చేయడంలో హాంకాంగ్ బౌలర్లకు బంతి ఎలా వెయ్యాలో మర్చిపోయేలా చేశాడు. మొత్తం ఆరు ఫోర్లు, ఒక భారీ సిక్స్ కొట్టాడు. ఇక అవతలవేపున్న ఫకార్ తక్కువేమీ కానట్టు 38 బంతుల్లో అర్ధసెంచరీ చేసి చూపాడు. మొదట పాక్ కెప్టెన్ వికెట్ తీసిన హాంకాంగ్ బౌలర్ ఇషాన్ రెండో వికెట్‌గా ఫకార్ దొరికాడు. అప్పటికి పాక్ పది ఓవర్లలో 64 పరుగులు పూర్తిచేసింది. ఆ తర్వాత అంతా పరుగుల వరదే. బంతి వేయడం ఎలా అని హాంకాంగ్ బౌలర్లు ఆలోచ నలో పడ్డారు. వెర్రిమొహాలేసుకుని చూస్తుండిపోయారు. వీరబాదుడుకి పాక్ బ్యాటర్లు అర్ధం చూపించారు.
193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి హాంకాంగ్ బరిలోకి దిగింది. అంత స్కోర్ అధిగమించడం వారికి కష్టమే. ఆ సంగతి ప్రేక్షకులకూ అర్ధమయింది. వారంత ధాటిగా బ్యాట్‌చేసే సత్తా వారికి లేదన్నది అర్ధమయింది. కానీ మరీ ఇంత దారుణంగా వెనుది రుగుతారని స్టేడియం గేట్ మ్యాన్ కూడా ఊహించలేదు. కేవలం 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత మరింత వరసె ట్టారు. పాక్ బౌలర్లు షాబాద్ ఖాన్, నవాజ్‌లు నిజంగానే సరదా ప్రాక్టీస్‌లా బౌలింగ్ చేశారు. ప్రాక్టీస్‌లో ఒక వికెట్ పెట్టి ప్రాక్టీస్ చేసి నంత సరదాగా బౌలింగ్ చేశారు. ప్రతీ బాల్‌కి వికెట్ తీస్తారన్నంత పదునుగా బౌలింగ్ చేయడం గమనార్హం. షాబాద్ ఖాన్ కేవలం 2.4 ఓవర్లలో మరీ ఎక్కువగా 8 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా, నవాజ్ కేవలం 2 ఓవర్లలో మరీ ఎక్కువగా 5 పరు గులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.