మిఖాయిల్ గోర్బచెవ్ క‌నుమూత‌

సోవియెట్ చివరి అధ్య క్షుడైన మిఖాయిల్ గోర్బ చెవ్ క‌న్నుమూశారు. గోర్బచెవ్ తన 91వ ఏట దీర్ఘకాలికవ్యాధితో బాధప డుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారని రష్యా సెంట్ర‌ల్ క్లినిక‌ల్ హాస్పిటల్ ఒక ప్రకట నలో తెలిపిం ది.  ప్రచ్ఛన్న యుద్ధా న్ని రక్తపాతం లేకుండా ముగించిన మిఖాయిల్ గోర్బచెవ్ సోవి యట్ యూనియన్ పతనాన్ని నిరోధించడంలో విఫలమయ్యారని మాస్కోలోని ఆసుపత్రి అధికారులు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  గోర్బచెవ్ మరణం  పై తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.   ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడంలో, సోవియట్ యూనియన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలను తగ్గించడంలో, తూర్పున మార్క్సిస్ట్-లెనినిస్ట్ పరిపాలనల పతనం, జర్మనీ పునరేకీకరణ - రెండింటినీ తట్టుకోవడంలో ఆయ‌న‌ కీలక పాత్ర పోషించినందుకు ప్రశంసలు పొందాడు. దీనికి విరుద్ధంగా, సోవియట్ పతనాన్ని ఆపలేక పోయినందుకు రష్యాలో నిందారోపణలకు గురౌతూంటారు. ఈ సంఘటన ప్రపంచంలో రష్యా యొక్క ప్రభావం క్షీణించడానికీ, ఆర్థిక సంక్షోభానికీ దారి తీసింది.  దీనికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు. అణ్వా యుధాలను పరిమితం చేయడానికి, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికీ అప్పటి అమెరికా అధ్య క్షుడు రొనాల్డ్ రీగన్‌తో శిఖ రాగ్ర సమావేశాలను నిర్వహించారు.  సోవియట్ యూనియన్ కు ఎనిమిదవ, చివరి నేత. 1985 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. 1988 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ దేశాధినేతగా, 1988 నుండి 1989 వరకు సుప్రీం సోవియట్ ప్రెసీడియం ఛైర్మన్‌గా, 1989 నుండి 1990 వరకు సుప్రీం సోవియట్ ఛైర్మన్‌గా, 1990 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. సైద్ధాంతికంగా, అతడు మొదట్లో మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడి ఉన్నారు, అయితే 1990 ల ప్రారంభంలో సామ్యవాద ప్రజాస్వామ్యం వైపు వెళ్ళాడు. సోవియట్ యూనియన్ వంటి సోషలిస్ట్ సమాజంలో శత్రుపూరిత వైరుధ్యాలు ఉండవని వారు విశ్వసించారు. అయితే, ఓవైపు సంస్కరణలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తూనే, చాలామంది బ్యూరోక్రాట్లు సంస్కరణల గురించి పై పై కబుర్లు చెబుతున్నారని ప్రజల్లో అభిప్రాయం నెలకొంది.  తాను నాయకుడి గా ఉన్న కాలంలో లోనే గోస్ప్రియోమ్కా (ఉత్పత్తిపై ప్రభుత్వామోదం) అనే భావనను కూడా గోర్బచేవ్ ప్రవేశ పెట్టారు. ఇది నాణ్యతా నియంత్రణను సూచిస్తుంది. 1986 ఏప్రిల్లో, అతడు ఒక వ్యవసాయ సంస్కరణను ప్రవేశపెట్టాడు. జీతా లను ఉత్పత్తితో ముడి పెట్టాడు. సామూహిక సాగుదారులు తమ ఉత్పత్తులలో 30% నేరుగా దుకాణాలకు లేదా సహకార సంస్థలకు విక్రయించడానికి అనుమతించాడు. 1986 సెప్టెంబరులో చేసిన ప్రసంగంలో, పరిమిత ప్రైవేట్ సంస్థలతో పాటు మార్కెట్ ఎకనామిక్స్‌ను తిరిగి ప్రవేశ పెట్టాలనే ఆలోచనను వెలిబుచ్చాడు. ఈ సందర్భంలో లెనిన్ చెప్పిన కొత్త ఆర్థిక విధా నాన్ని ఒక ఉదాహరణగా పేర్కొన్నాడు. 

ఐక‌మ‌త్యానికి నిద‌ర్శ‌నం గ‌ణేష్ ఉత్స‌వ్‌..  గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

రాష్ట్రగ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఖైర‌తా బాద్ మ‌హాగ‌ణ‌ప‌తిని ద‌ర్శించు కుని  తొలి పూజ చేశారు. గ‌ణేషు ని ద‌ర్శ‌నానికి వ‌చ్చిన జ‌న‌సందో హాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, అంద‌రి ఐక‌మ‌త్యానికి ఈ పం డుగ గొప్ప నిద‌ర్శ‌న‌మ‌ని అన్నా రు. అంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభా కాంక్ష‌లు తెలిపారు.  ఈ ఏడాది పంచముఖ మహా లక్ష్మిగణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శన మిస్తు న్నారు. తొలిసారి 50 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష మండపం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహాగణపతి దర్శనానికై భక్తుల కోసం నిర్వాహకులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లో మహా గణ పతి ద‌ర్శ‌నానికి ఉద‌యం నుంచే పెద్ద ఎత్తున భ‌క్తుల తాకిడి మొద‌లు కావ‌డంతో ఆ ప్రాంతంలో  పోలీసు లు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  గణేష్ మండపం ఎదురుగా ఉన్న ప్రదాన నాలుగు రహదారులు నిఘా నీడలోకి వెళ్లాయి.  ప్రధాన మెటల్ డిటెక్టర్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ తరువాతే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.  ఈసారి భారీభద్రత సెక్యూరిటి వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. మూడు షిఫ్ట్‌లో 360 పోలీసులు విధులు నిర్వహి స్తున్నారు. క్రైమ్‌ టీమ్స్‌, షీటీమ్స్‌, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీంమ్స్, ఐడీ పార్టీలు, టీఎస్ పోలీస్ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలతో పాటు షాడో టీంమ్స్  రంగంలోకి దిగాయి. అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని వెల్ నెస్ సెంటర్ హాస్పిటల్‌లో సెంట్రల్ జోన్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసందానం చేశారు.   ఇదిలా ఉండ‌గా, తెలంగాణ  రాష్ట్రం వచ్చాక గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి ని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం తలసాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్  అన్ని పండుగలను ఘనంగా చేయమని ఆదేశాలు ఇచ్చారన్నారు. బోనాలు, బతుకమ్మ, గణేష్ ఉత్సవాలు ఇలా అన్ని పండుగలను ఎంతో ఘనంగా చేస్తున్నామని తెలిపారు. అన్ని పండుగలు నిధులు మంజూరు చేసి పండుగలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ గణేష్‌ను మట్టితో తయ్యారు చేసి అందరికి ఆదర్శం నిలిచారని అన్నారు. నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 

 ఆసియా క‌ప్ ..బాబ‌ర్‌, బ్రాడ్‌కాస్ట‌ర్ల‌పైనా  అక్ర‌మ్ మండిపాటు

ఆసియా కప్‌లో దుబాయ్ ఇంట ర్నేషనల్ స్టేడియంలో భారత్‌తో ప్రారంభమైన బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ వసీం అక్రమ్ ఆదివారం పాక్ జట్టుకు  ప్లేయింగ్ ఎలెవన్‌ను  వూహించిన‌దానికి మ‌రోలా చూప‌డం ప‌ట్ల‌ ప్రసారకర్తలపై ఆగ్ర‌హించాడు.  నిజానికి పాకిస్తాన్ ప్ర‌క‌టించిన‌ ప్లేయింగ్ లెవెన్‌తో అక్రమ్ ఉప్పొంగిపోయాడు. అతను అంగీకరించి నట్లుగా, ఆట ప్రారంభానికి ముందు జట్టు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసుఫ్ ద్వారా అతనికి తెలియజేశారు. అయితే, బ్రాడ్ కాస్టర్లు స్క్రీన్‌పై చూపించిన వాటిని అతను పరిశీలించి నప్పుడు, షానవాజ్ దహానీ స్థానంలో పాకిస్తాన్ హసన్ అలీని ఎంపిక చేయడంపై అతను మండిప‌డ్డాడు. పాకిస్థాన్ లెవెన్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు షానవాజ్ దహానీ జ‌ట్టులో ఉండాల‌నుకున్నాన‌ను...కానీ హసన్ అలీ ఆడుతున్నాడు, రౌఫ్ ఆడుతున్నాడు. నేను దహానీ ని తీసుకున్నార‌నుకున్నప్పటికీ, అతను జట్టులో లేడు. కుర్రాళ్లూ, ఇది ప్లేయింగ్ లెవెన్ అని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? దహానీ ఆడుతున్నాడని యూసుఫ్ నాకు చెప్పాడు. కాబట్టి బ్యాటింగ్ కోచ్‌కు తెలియకపోతే ఎక్కడో తప్పు ఉంద‌ని అక్ర‌మ్ అన్నాడు. టీవీ ప్రెజెంటర్ మయాంటి లాంగర్, కొన్ని నిమిషాల తర్వాత, అక్రమ్‌తో  జ‌ట్టు లెవెన్‌లో లోపం గురించి చెప్పాడు, అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ అక్ర‌మ్ ప్రసారకర్తలపై మరోసారి విరుచుకుపడ్డాడు. నన్ను సంతోషంగా ఉంచవద్దు, తప్పు జట్టును అక్కడ ఉంచే వ్యక్తిని సంతోషంగా ఉంచండి అబ్బాయిలు. ఇది పెద్ద ఆట, ఇది చిన్న తప్పు కాదు. ఇప్పుడు బాగానే ఉంద‌న్నారాయన. దీనికి తోడు భారత్‌పై ఓటమికి కెప్టెన్ బాబరే కారణమని  పాక్ ఫ్యాన్స్ ఇప్పటికే మండిప‌డుతున్నారు. ఇలాంటి టీ20 తరహా పిచ్ తనకు ఇష్టమని అక్ర‌మ్‌ పేర్కొన్నాడు. రెండు వైపులా బౌలర్లు బౌన్సర్లు సంధించడం, వికెట్లు తీయడం చూసి ఆనందించా నన్నాడు. చివరి ఓవర్ వరకు గేమ్ కొనసాగడడం బాగుందన్న అక్రమ్.. 13 లేదంటే 14వ ఓవర్‌లో నవాజ్‌ను దించాల్సింద న్నాడు. అప్ప‌టికే చాలా ఆలస్యమైందని అభిప్రాయపడ్డాడు. చివరి మూడు నాలుగు ఓవర్లలో మరీ ముఖ్యంగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటివారు క్రీజులో ఉన్నప్పుడు నవాజ్‌ చేతికి బంతిచ్చి బాబర్ తప్పుడు చేశాడని అక్రమ్ పేర్కొ న్నాడు.

ఆజాద్ సొంత రాష్ట్రం కాశ్మీర్ లో కాంగ్రెస్ ఖాళీ?

ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్వంత రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఖాళీ అయిపోతోందా? గులాం నబీ ఆజాద్ కు మద్దతుగా ఆ రాష్ట్రంలో రాజీనామాల పరంపర కొనసాగుతోందా అంటే జరుగుతున్న పరిణామాలను గమనించిన ఎవరైనా ఔనని అనక తప్పదు.   గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ తో తనకున్న అర్ధ శతాబ్దపు అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటూ గత వారం పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. తాను కాంగ్రెస్ ను వీడిన సందర్భంగా గులాం నబీ ఆజాద్ సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ కు రాజకీయాలలో కొనసాగే అర్హత లేదన్నారు. గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన తరువాత  జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ లో సంక్షోభం మొదలైంది. రాష్ట్ర పార్టీ అంతా దాదాపుగా ఆయనకు మద్దతుగా  నిలిచింది.ఆజాద్ రాజీనామా చేసిన నాటి నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతు తెలుపుతు కాంగ్రెస్ ను వీడుతున్నారు. తాజాగా గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్‌తో సహా 50 మందికి  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంగళవారం(ఆగస్టు30) పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో తారాచంద్ తో పాటు మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్‌ తదితరులు ఉన్నారు. ఆజాద్‌కు మద్దతుగా వారంతా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఉమ్మడిగా రాజీనామా లేఖ సమర్పించారు. కాగా గులాం నబీ ఆజాద్ త్వరలో  జాతీయ స్థాయి పార్టీని   ప్రారంభిస్తారని జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. వాటిని వేటినీ ఆజాద్ ఖండించకపోవడంతో గులాం నబీ ఆజాద్ త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నారని పరిశీలకులు అంటున్నారు.   ఆజాద్ మద్దతు దారులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.  

ఈద్గా మైదానంలో వినాయకచవితి ఉత్సవాలకు సుప్రీం నో

కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. బెంగళూరులోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు నిర్వహించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.వినాయక చవితి ఉత్సవాలను ఈద్గా మైదానంలో నిర్వహించుకునేందుకు కర్నాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో దీనిని వ్యతిరేకిస్తూ కర్నాటక వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఈద్గా మైదానం వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలని విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. వక్ఫ్ బోర్డు పిటిషన్ ను అత్యవసరంగా విచారించిన సుప్రీం కోర్టు వినాయకచవితికి సరిగ్గా ఒక్క రోజు ముందే అంటే మంగళవారం(ఆగస్టు30)న తీర్పు వెలువరించింది. ఉత్సవ నిర్వహణపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంతో బెంగళూరులోని చామరాజ్‌పేటలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థివేడుకలను నిర్వహించేందుకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించడంతో కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఐక్య‌తారాగానికి తార‌క మంత్రం .. శ్రీ‌గ‌ణేషం!

గణేష్ చతుర్థి, వినాయక చవితి అని కూడా పిలుస్తారు, ఇది ప్రతి సంవత్సరం ప‌ది రోజుల పాటు జరుపుకునే పవిత్రమైన  పండుగ. ఈ పండుగను   భాద్ర‌ప‌ద‌ మాసంలో జరుపుకుంటారు, ఇది   ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో వస్తుంది.  ఏనుగు తలతో ఉండే గణేశుడు సంపద, శాస్త్రాలు, జ్ఞానం, జ్ఞానం,  శ్రేయస్సు ఇచ్చే దేవుడు అని పిలుస్తారు. అందుకే చాలా మంది హిందు వులు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు ఆయ‌న్ను త‌ల‌చుకుం టారు.   ఆయ‌న ఆశీర్వాదాలను కోరుకుం టారు. గణేషుడిని గజానన, వినాయక, విఘ్నహర్త వంటి అనేకానేక‌ పేర్లతో పిలుస్తారు. గ‌ణేష చ‌తుర్ధి, గ‌ణేష పూజ అన‌గానే వ‌య‌సుతో నిమిత్తం లేకుండా చిన్నా, పెద్ద అంద‌రూ ఎంతో భ‌క్తి, ఉత్సాహంతో పూజ‌చేస్తారు. ఆయ‌న అంద‌రికీ ఇష్టుడు. వినాయకుడిని ప్రార్థించిన భక్తులు తమ కోరికలు  నెరవేరుతారని నమ్ముతారు. గణేష్ చతుర్థి ప్రధాన సారాంశం ఏమిటంటే, ఆయనను ప్రార్థించే భక్తులు పాపాల నుండి విముక్తి పొందుతారు. అది వారిని జ్ఞాన మార్గంలో నడిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో భక్తి, సంతోషాలతో జరుపుకుంటారు. భారతదేశంలో, ఇది మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్య ప్రదేశ్, కర్ణాటక , ఆంధ్ర‌, తెలంగాణ  రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకుంటారు. చారిత్రాత్మకంగా, శివాజీ రాజు కాలం నుండి ఈ పండుగను జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలోనే లోక మాన్య తిలక్ గణేష్ చతుర్థిని ఒక ప్రైవేట్ వేడుక నుండి సమాజంలోని అన్ని కులాల ప్రజలు కలిసి, ప్రార్థనలు చేయ‌డం, ఐక్యంగా ఉండే గొప్ప పబ్లిక్ పండుగగా మార్చారు.  గణేష్‌ను ప్రతి ఒక్కరికీ దేవుడుగా భావించడం, గణేష్‌ను అగ్రవర్ణాలు, అట్టడుగు కులా ల వారు, రాజ‌కీయ నాయకులు వారి అనుచరులు ఒకే విధంగా పూజించారని తిలక్ గమనించారు. అతను గణేష్ చతుర్థిని జాతీయ పండుగగా బ్రాహ్మణులు బ్రాహ్మణే తరుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి తిల‌క్  ప్రచారం  చేశారు. కొంతమంది భక్తులు ఈ పండుగను ఇంటి వద్ద జరుపుకుంటే, మరికొందరు బహిరంగ పందిళ్ల వద్ద గణేశుడిని దర్శించుకుంటారు. ప్రజలు గణేశుడికి తగిన గౌరవం, ప్రార్థనలు,  నైవేద్యాలు సమర్పిస్తారు. గణేశుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాలువంటి వంట కాలు చేసుకుని దేవుని ప్ర‌సాదంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు,  సందర్శకులు తీసుకుంటారు. మొద‌టి రోజు నుంచి ప‌దో రోజు వ‌ర‌కూ అంతా వేడుకే. చిన్నా పెద్ద అంద‌రూ ఎంతో సంబ‌రంగా జ‌రుపుకునే పండుగ. దేశంలో అన్ని ప్రాంతాల్లో దాదాపు ప్ర‌తీ గ‌ల్లీలోనూ గ‌ణేష్ పందిళ్లు అద్భుతంగా అలంక‌రించి, త‌మ స్థోమ‌త‌కి తగ్గ‌ట్టు గ‌ణేషుని విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసుకుని ఎంతో ఆనం దోత్సాహాల‌తో పండుగ‌ను గొప్ప వేడుక‌గా జ‌ర‌పుకుంటారు. భ‌క్తిపాట‌లు, నృత్యాలు, పౌరాణిక నాట‌కాలు కూడా చాలా ప్రాంతాల్లో నిర్వ‌హిస్తుంటారు. ముఖ్యంగా గ‌ణేషు మ‌హ‌త్యం, శివ‌మ‌హ‌త్యం, గ‌ణేష జ‌న‌నం గురించి అనేకర‌కాల పురాణ క‌ధా కాల‌క్షేపాలు  జ‌రుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ప‌దిరోజులూ సంగీత కార్యక్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. పిల్ల‌ల‌కు ఆట‌ల‌పోటీలు, ప‌ద్యాలు చ‌ద‌వ‌డం, శివ‌, గ‌ణేష శ్లోకాల ప‌ఠ‌న పోటీలు కూడా నిర్వ‌హించే సంప్ర‌దాయం ఆంధ్ర ప్రాంతంలో ఇప్ప‌టికీ జ‌రుగుతున్నాయి. ఎక్క‌డ‌యినాస‌రే గ‌ణేష చ‌తుర్ధి అన‌గానే అంద‌రూ క‌లిసి చ‌క్క‌గా నిర్వ‌హించ‌డం ప్ర‌జ‌ల మ‌ధ్య ఐక‌మ‌త్యాన్ని పెంపొందించే దిశ‌గా జ‌రుగుతుంది.  యువ‌కులు మ‌రింత ఉత్సాహంగా ఈ రోజుల్లో సినిమాపాట‌ల స్ట‌యిల్లో గ‌ణేష భ‌క్తి పాట‌లు పాడుతూ స‌ర‌దాగా గ‌డ‌ప‌డం గ‌మ‌నిం చవ‌చ్చు. అదో ఆనందం, దానికి ప్ర‌త్యేకించి పేరు పెట్ట‌లేం. ఎవ‌రి ఆనందం వారిది. కానీ అంద‌రి ల‌క్ష్యం మాత్రం గ‌ణేషుని అపూర్వ ఆశీర్వాదం పొంద‌డ‌మే. పిల్ల‌లు చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న పందిళ్లు వేసుకుని పూజ‌లు చేయ‌డం ఇటీవ‌లి కాలంలోనూ చూడ గ‌లం. ఇదో అద్భుతం.  కాల‌క్ర‌మంలో రాజ‌కీయాల ప‌రంగా కూడా ఈ పండుగ నిర్వ‌హించే ప‌ద్ద‌తుల్లో మార్పులు గ‌మ‌నించ వ‌చ్చు. చాలాప్రాంతాల్లో రాజ‌కీయ‌పార్టీలు, నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను త‌మ పార్టీల వేపు తిప్పుకోవ‌డానికి అనేక కొత్త ప‌ద్ధ‌తుల‌తో పండుగ‌ను నిర్వ‌హించ‌డం కూడా చూస్తున్నాం. ఇటీవ‌లికాలంలో బీజేపీ ఈ విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ‌పెడుతోంది. భ‌క్తితో పాటు రాజ‌కీయ ల‌బ్ధి కూడా పొందే మార్గం ఆలోచిస్తున్నారు. భ‌క్తుల‌తోపాటు ఓట‌ర్ల‌ను కూడా ఆక‌ట్టుకోవ‌డానికి గ‌ణేష్ మండ‌పాలు, ప్రార్ధ‌నా మండ‌పాలు అనేక‌ర‌కాలుగా తీర్చిదిద్ద‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ, గ‌ణేష్ ఉత్స‌వాలు ప‌ది రోజులు దేశంలో ప్ర‌జ‌లు అమితోత్సాహంతో భ‌క్తిపార‌వ‌శ్యంతో నిర్వ‌హించ‌డం, పాల్గొన‌డం గ‌మ‌నిస్తాం.  జై గ‌ణేషా

జ‌గ‌న్ కు  హెడ్‌మాస్ట‌ర్ ఏపీ హైకోర్టు!

ఎవ‌రూ కోర్టు, ఆస్ప‌త్రి మెట్లు ఎక్క‌కూడ‌ద‌నే అనుకుంటారు. కోర్టు మెట్లెక్కితే పేరంటానికి పిలిచిన‌ట్టు విచా ర‌ణ‌కు పిలుస్తూనే ఉంటారు. దానికి స‌మ‌యం, సంద‌ర్భం అన్నీ కోర్టు చేతిలోనే ఉంటాయి. కోర్టు ప‌క్షులు కొంద‌రు ఉంటారు. జీవితాంతం ఏదో ఒక కేసులో కోర్టుకు వెళుతూంటారు, అనేక ప్రాంతాల్లో కూడా కోర్టుల పిలుపులు వ‌స్తూంటాయి. కొన్ని కేసుల్లో మొట్టికాయ‌లు ప‌డుతూంటాయి. ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థి తి ఇదే. ఇప్ప‌టికే హైకోర్టు చేతిలో హెచ్చ‌రిక‌ల దెబ్బలు తిన్నారు.  ఇపుడు తాజాగా కొవ్వూరు బ్యాంక్ ఎన్ని క‌ల కేసులో మ‌ళ్లీ మ‌రో దెబ్బ తిన్నారు.  తూర్పుగోదావ‌రి జిల్లా కొవ్వూరు  కోఆప‌రేటివ్ అర్బ‌న్ బ్యాంక్ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం రచ్చ‌కెక్క‌డం తెలిసిం దే. ఈ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం సంబంధించిన‌వారు ఏక‌గ్రీవంగా ఎంపిక‌య్యారు. కానీ అది స‌హించ‌లేక వైసీపీ వ‌ర్గాలు అస‌లా ఎన్నిక‌లు స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని గోల చేసి ర‌ద్దు చేశారు. ప్ర‌భుత్వం నిర్ణ‌యానికి టీడీపీ మండిప‌డింది. ఎన్నిక ఏక‌గ్రీవం అయిన త‌ర్వాత అవి స‌క్ర‌మంగా జ‌ర‌గ‌లేద‌ని వైసీపీ గొడ‌వ‌చేయ‌డమే వారికి సంబంధించిన‌వారు ఎంపిక కాలేద‌న్న కోపంతోనే ఎన్నిక‌ను ర‌ద్దుచేయ‌డానికి నిర్ణ‌యం తీసుకుం ది. అంటే ఏ ఎన్నిక‌యినా వైసీపీవారికే అనుకూలించాల‌న్న‌ప‌ట్టుద‌ల ఆ పార్టీవారు ప్ర‌ద‌ర్శించ‌డం అర్ధం లేనిది. ఏక గ్రీవం ఎందుకు అయిందీ తెలిసినా అది వైసీపీ స‌హించ‌లేక‌పోతోంది. కోర్టు తీర్పు ప‌ట్ల కూడా వైసీపీ నాయ‌క‌త్వానికి గౌర‌వం లేక‌పోవ‌డం వారి తీరుకు అద్దంప‌డుతోంది.  ఎన్నికలు రద్దు చేసి, పాలకవర్గానికి బదులు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారని టీడీపీ వ‌ర్గీయులు మండి పడ్డారు. ఈ వ్యవ హారం హైకోర్టు వరకు వెళ్లింది. దీనిపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్నికలు రద్దు చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని విమర్శించారు. కొవ్వూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపారు.  హైకోర్టు ఇచ్చి న తీర్పు జగన్ కు చెంప పెట్టు వంటిదని  బాబు అన్నారు. బ్యాంకు పాలకవర్గం స్థానంలో ప్రభు త్వం త్రిసభ్య కమిటీ తెచ్చిందని, త్రిసభ్య కమిటీ చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని చంద్ర బాబు వివరించారు.  అధికార వ్యవస్థలను సైతం జగన్ భ్రష్టుపట్టించారని ఆరోపించారు. న్యాయంగా జరిగిన ఎన్నికలను ఒప్పు కునేందుకు సీఎం సిద్ధంగా లేరని విమర్శించారు. న్యాయవ్యవస్థ ఒకటుందని జగన్ గుర్తించాలని చంద్రబాబు హితవు పలికారు. ఇప్పటికైనా చట్టాలు, నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచిం చారు.

సీఎం జగన్ లో ఓటమి వణుకు?.. అందుకే హిందూపురం టు ఇచ్ఛాపురం టూర్!

మూడున్నరేళ్లకు ముందు ‘ఒక్క చాన్స్’ అంటూ జనం ముందు చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. తీరా ఆయన మాటలు నమ్మి ఓట్లు వేసి అఖండ మెజారిటీ అధికారం అప్పగించిన అదే జనానికి ముఖం చాటేశారు. అడపా దడపా అదే జనం మధ్యకు రావాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు వారికి ఏమాత్రం అందుబాటు లేకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, పరదాలు వేసుకుని లేదా.. గాల్లోనే చక్కర్లు కొట్టేసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు మూడున్నరేళ్ల పాలన తర్వాత జనంలో ప్రభుత్వ వ్యతిరేకత అంటే జగన్ పై వ్యతిరేకత సునామీలా ముంచేస్తుంటే   మరోసారి అదే జనం వద్దకు వచ్చేందుకు జగన్ సిద్ధం అవుతున్నారని వైసీపీ శ్రేణుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.    ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరిని ఎన్నకుంటారంటూ నిర్వహిస్తున్న జనాభిప్రాయం సేకరణలో చంద్రబాబుకు 78.17 శాతం మంది ఓటు వేశారు.  వైఎస్ జగన్ కు అనుకూలంగా కేవలం 18.27 శాతం మందే ఓకే చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ 3.56 శాతం మంది కోరారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల నిర్వహించిన  సర్వేలో కూడా ఇంచుమించు ఇలాంటి ఏకపక్ష ఫలితమే కనిపించడం విశేషం. రఘురామ సర్వేలో 93 స్థానాల్లో టీడీపీ కచ్చితంగా గెలుస్తున్నట్లు తేలడం విశేషం. పోటా పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కూడా 50 శాతం టీడీపీకే అనుకూల ఫలితాలు ఉన్నాయన్నది ఆయన సర్వే సారాంశం. ఏ సర్వే చూసినా   చంద్రబాబే విజయయాత్ర చేస్తారని తేలుతోంది. అంతెందుకు జగన్ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలలో కూడా ఇంచుమించు ఇదే ఫలితం రావడంతో ఆయన నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తానంటూ ఒక జాబితా కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన విడుదల చేసిన జాబితాలో పేర్కొన్న నియోజకవర్గాలన్నిటిలోనూ వైసీపీ ఓటమి ఖాయమని ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలో తేలిందని పరిశీలకులు అంటున్నారు.  దీంతో జగన్ లో ఓటమి వణుకు మొదలైందంటున్నారు. ఈ క్రమంలో జగన్ హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు యాత్ర చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అది కూడా ఏపీలో వైసీపీ పట్ల వ్యతిరేకత బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగించేందుకు రూట్ మ్యాప్ సిద్ధమైందంటున్నారు. గతంలో జనం మధ్యలో ఉన్న తనను ఓటర్లు మెచ్చి ఓట్లు వేశారని, అందుకే 151 స్థానాలు ఇచ్చి తనకు తిరుగులేని మెజారిటీ అందించారని జగన్ గొప్పగా చెబుతుంటారు. అనేక వ్యతిరేకతలు, వైఫల్యాల కారణంగా ఈసారి వైసీపీకి గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోయినా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన సీట్లు వస్తాయని ఆయన నమ్ముతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీకి కావాల్సిన సీట్లు సాధించాలనే వ్యూహంతో జగన్ మరోసారి జనం మధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఒక పక్కన రోజు రోజుకూ తగ్గిపోతున్న వైసీపీ హవా.. మరో పక్కన ఏ క్షణంలో అయినా   జగన్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసే సూచనలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలకు ముందు అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు జగన్ జనం మధ్యనే ఉన్న విషయం తెలిసిందే. తన బెయిల్ గనుక రద్దయితే ఇప్పుడు కూడా జనం మధ్యే ఉండి మరోసారి తనకు ఇబ్బందులు తెలెత్తకుండా తప్పించుకునేందుకే రాష్ట్ర యాత్రకు ఉపక్రమిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఎన్నికల ప్రణాళికలో భాగంగా నియోజవర్గాల వారీగా పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటున్న జగన్ కు గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం పట్టు దొరకడం లేదట. 23 చోట్ల టీడీపీ గెలిచిన  సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాలలో  వైసీపీకి ఇప్పటికీ కాలు మోపే సందు దొరకని పరిస్థితులు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. టీడీపీకి తిరుగులేని ఈ నియోజకవర్గాల్లో ఎలాగైనా తన ఉనికి చాటుకోవాలని జగన్ యత్నిస్తున్నారంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న టీడీపీ నేతలను వైసీపీలోకి ఆపరేషన్ ఆకర్ష్ కూడా ప్రయోగించారు. అయినప్పటికీ   జగన్ ఆటలు సాగలేదంటున్నారు. అందుకే మూడున్నరేళ్లుగా జనానికి ముఖం చాటేసిన జగన్ మళ్లీ జనం మధ్యకు రావాలని నిర్ణయించారని అంటున్నారు. ముక్తాయింపు ఏమింటంటే.. సీపీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని ప్రకటించడంతో జగన్ లో ఆందోళన మొదలైందంటున్నారు. అందుకే.. ఉద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించడమే కాకుండా, అరెస్టులు చేయించారు. అంతటితో ఆగకుండా తాను నివాసం ఉంటున్న  తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నాలుగు అడుగుల ఎత్తు ఐరెన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం. కేవలం రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల అల్టిమేటానికే ఇంతలా భయపడుతున్న జగన్ రేపు ఐదున్నర కోట్ల మంది జనానికి ఏం సమాధానం చెప్పుకుంటారు? ఏం చేశానని చెప్పుకుంటారు? మళ్లీ తనకు ఓటు వేసి గెలిపించాలనే ఎలా అభ్యర్థిస్తారన్నది చూడాల్సిందేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

ప్రాణాలు పోయాక‌ అయ్యో అంటే ఎలా?

ప్ర‌జ‌ల‌కు డాక్ట‌ర్లే దేవుళ్లు. జ‌బ్బు చిన్న‌ద‌యినా, పెద్ద‌ద‌యినా దాన్నుంచీ బ‌య‌ట‌ప‌డేసేది ఈ  దేవుళ్లే. ఆస్ప త్రి పెద్ద‌దా, చిన్న‌దా, అన్ని వ‌స‌తులూ ఉన్నాయా లేదా అనేది సామాన్య ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా అవ‌గా హ‌న ఉం డ‌దు. ద‌గ్గ‌ర‌లో అప్ప‌టిక‌పుడు వెళ్ల‌డానికి  అందుబాటులో ఉన్న ఆస్ప‌త్రికే ప‌రిగెడ‌తారు. అదృ ష్టవ‌శాత్తూ స‌మ‌యానికి డాక్ట‌రు అందుబాటులో ఉండ‌డం, చికిత్స జ‌ర‌గ‌డం అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ప్రాణాలు నిలుస్తాయి. ఒక‌వేళ ఇవేవీ అనుకూలించ‌కుంటే?  అస‌లా ప్ర‌శ్నే భ‌య‌పెడుతుంది. ముఖ్యంగా మ‌హిళ‌ల విష‌యంలో ఆస్ప‌త్రి వ‌ర్గాలు వీల‌యినంత జాగ్ర త్త‌లు పాటిస్తుంటారు. మారుమూల ప్రాంతాల్లో చిన్న‌పాటి క్లినిక్‌లు కూడా మ‌హిళ‌ల్ని కాపాడ‌డానికే కంక ణం కట్టుకుంటాయి. కానీ అన్ని వ‌స‌తులూ, అవ‌స‌ర‌మైన వ‌స్తుసాధనాలు వారికి అందుబాటులో ఉండాలి. ఉంటాయా అంటే న‌మ్మ‌కం ఆట్టే లేదు. కేవ‌లం ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌కే అలాంటి సౌక‌ర్యాలు ఉంటాయి. కానీ ఫీజులు, అనేక ర‌కాల టెస్టుల‌పేరుతో భ‌య‌పెట్ట‌డం ఆయా ఆస్ప‌త్రివ‌ర్గాల‌కు ప‌రిపాటి. దీన్ని ఆయా వ‌ర్గాలు నిస్సందేహంగా వ్య‌తిరేకిస్తారు. కానీ జ‌రుగుతున్న వాస్త‌వం ఇదే.     ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి లో కుటుంబ నియంత్రణ  శస్త్రచికిత్సల్లో దారుణం జరిగింది. మూడు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకే  ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న వీరు అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున మరో మహిళ  లావణ్య మృతి చెందింది. దీంతో ఇప్పటి వరకు నలుగురు మహిళలు మృతి చెందారు.  ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో 34 మంది మహిళలకు వైద్యులు కుటుంబ నియం త్రణ ఆపరేషన్లు చేశారు. ఇందులో కొంతమంది మహిళలు తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్‌తో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతున్న వారిలో మొన్న ఇద్దరు, నిన్న ఒకరు, ఇవాళ మరొకరు మృతి చెందారు. వరుస మరణాలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళలు తీవ్ర భయాందోళన చెం దుతున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యులు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.  అయితే ఇక్క‌డ ఒక్క ప్రశ్న త‌లెత్తుతుంది.. ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌డంతో ప‌ని అయిపో యిందనుకోవ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు?  అస‌లు ప్ర‌సూతి ఆస్ప‌త్రుల మౌలిక స‌దుపాయాల ప‌రిస్థితుల మీద ఒక  ప‌రిశీల‌నా కోణంలో చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కేవ‌లం ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌పుడే ప్ర‌భుత్వం ఆవేశ‌ప‌డి  ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం కాకుండా  ప్ర‌జాసంక్షేమాన్ని సీరియ‌స్‌గా తీసు కుని ఆస్పత్రుల గురించి వారి సేవ‌ల గురించి ఒక ప్ర‌త్యేక నిపుణుల సంఘం ఏర్పాటచేసి నిత్యం ప్ర‌త్యేకదృష్టి సారంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విశ్లేష‌కుల మాట‌. మృతుల బంధువులు దాడి చేశార‌నో, అల్ల‌ర్లుకు దిగార‌నో ఆస్ప‌త్రి వ‌ర్గాలు ప్ర‌చారం చేసుకోవ‌డం కంటే అస‌లు  ఆ  ప‌రిస్థితి ఎం దుకు  త‌లెత్తింద‌నేది తెలుసుకోవాలి. మ‌హిళ‌లు, అందునా గ‌ర్భిణులు చ‌నిపోవ‌డం కంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. మం దులు  చికిత్సా విక‌టించ‌డం చిన్న విష‌యం కాదు. 

పులివెందులలో జగన్ బస్టాండ్ కథ!

ఇంట గెలిచి.. రచ్చ గెలువు అనేది పెద్దలు చెప్పిన మాట. అంటే ముందు ఇంటిని చక్కదిద్దుకుని ఆ తర్వాత ఇతర వ్యవహారాలు చేస్తే మంచిదనేది దాని అర్థం. అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తరచుగా వినియోగించే వ్యంగ్యాస్త్రం ఇది. ఇప్పుడు రాజశేఖరరెడ్డి తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కే ఆయన మాటలు సరిగ్గా సరిపోతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కొనసా...గుతున్న బస్టాండ్ నిర్మాణం కథ అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. నవరత్నాలంటారు.. సంక్షేమ పథకాలంటారు.. ఆంధ్రుల ప్రజా రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడతారు. అభివృద్ధి అంటారు.. స్కూళ్లలో ఇంగ్లీషు మాధ్యమం అని చెబుతారు.  అక్కచెల్లెమ్మలకు అంత చేస్తా ఇంత చేస్తా అంటూ గొప్పలు చెబుతారు. పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇస్తామంటారు. నోటికి వచ్చిన హామీ ఇచ్చేసి.. ఖజానా ఖాళీ చేసి ఆనక ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఓట్లేసిన ప్రజల్ని వారి మానాన వారిని వదిలేస్తారు.  ఏపీకి తానేదో చేశాననే భ్రమలోనే కబుర్లు చెబుతుంటారు. ఇంత చెప్పుకుంటున్న జగన్ తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తున్న పులివెందుల ప్రజలకు ఏమి చేశారనే ప్రశ్న వస్తే.. మాత్రం జనం నోరెళ్లబెట్టడమే సమాధానంగా ఉంటుంది. అందుకు పులివెందుల బస్టాండ్ ప్రత్యక్ష నిదర్శనం అంటారు. నిజానికి సీఎం సొంత నియోజకవర్గం అంటే అభివృద్ధిలో ఎలా ఉండాలి? మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా కనిపించాలి. పులివెందులలోని బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు కూర్చునే సౌకర్యం మాట దేవుడెరుగు.. కనీసం నిలబడేందుకు కూడా అవకాశం లేనట్లు ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ‘ఉన్నదీ పోయే.. తెచ్చుకున్నదీ పోయే’ అనే తీరులో పులివెందులలో అన్ని హంగులతో కొత్త బస్టాండ్ కట్టేస్తామంటూ గొప్పగా చెప్పిన జగన్ సర్కార్ ఉన్న పాత బస్టాండ్ ను   కూలగొట్టేసింది. ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినప్పటికీ కొత్త బస్టాండ్ ను నిర్మించలేదంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. పాత బస్టాండ్ ప్రాంతంలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు.. తీవ్రంగా అవస్థలు పడుతుండడంతో తాత్కాలికంగా తాటాకులతో చిన్న పందిరి వేసినా.. అది ఎండ నుంచి కానీ, వర్షం నుంచి కానీ ఏమాత్రం కాపాడలేకపోతోంది. ఏ కొంచెం గాలి వీచినా దాని టాప్ లేచిపోతోంది. దాంతో పాటు పాత భవనం కూలగొట్టిన బస్టాండ్ ఆవరణలో దుమ్ము ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే.. వారి బాధలు వర్ణనాతీతం.   ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందులలో అత్యాధునిక హంగులతో కొత్త బస్టాండ్ నిర్మాణానికి ఒక డిజైన్ ను ప్రభుత్వం రెడీ చేసింది. ఆ డిజైన్ ఓ రంగుల కలలా, గ్రాఫిక్స్ మాయాజాలంలా రూపొందించింది. కానీ సీఎం అయి, మూడేళ్లయినా బస్టాండ్ నిర్మాణం అతీగతీ లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయినా.. సొంత నియోజకవర్గం ప్రజలకు బస్టాండ్ కూడా కట్టించలేని   జగన్ ఇక ఏపీకి రాజధాని నగరాన్ని అదీ ఒకటి కాదు మూడు ఎలా కట్టగలరు? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా అమరావతి రాజధాని కోసం సిద్ధం చేసిన డిజైన్ ను ప్రతిపక్ష నేతగా జగన్, వైసీపీ నేతలు కూడా దాన్ని ‘గ్రాఫిక్స్ మాయాజాలం’ అంటూ విమర్శించిన విషయం   తెలిసిందే. అయితే.. ఇప్పుడు పులివెందుల కొత్త బస్టాండ్ విషయంలో జగన్ చేసింది గ్రాఫిక్స్ మాయాజాలం కాక మరేమిటనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ డిజైన్ ను కూడా గ్రాఫిక్స్ మాయాజాలంగానే భావించి, దాని నిర్మాణాన్ని గాలికి వదిలేశారంటూ నెటిజన్లు సీఎం జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో పులివెందులలో తాటాకు బస్టాండే ప్రయాణీకులకు గతి అంటూ సోషల్ మీడియా వెక్కిరిస్తోంది. ఒక పక్కన పులివెందులలో పాత బస్టాండ్ కూలగొట్టి, తాటాకులతో వేసిన బస్టాండ్ ఆవరణను, మరో పక్కన ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో నిర్మించిన శాశ్వత బస్టాండ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియా షేర్ చేస్తూ ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటో కుప్పం బస్టాండ్ ను చూసి అయినా జగన్ నేర్చుకోవాలని   హితవు పలుకుతున్నారు.   ప్రజా రాజధాని సంగతి దేవుడెరుగు.. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ కూడా నిర్మించలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అవడం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి పెట్టని కోట పులివెందుల అభివృద్ధిని పట్టించుకోని జగన్ ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175కు 175 అసెంబ్లీ స్థానాలూ గెలుస్తామని జగన్ చెప్పడంలో అతి అనిపించడం లేదా? అంటున్నారు.

ఏమీ సేతురా జ‌గ‌నూ.. ఏమీ సేతురా?!

శ‌తృత్వం ఉండ‌కూడ‌దు. అందులోనూ ఒకే పార్టీవారి మ‌ధ్య అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఒక‌వేళ బ‌య‌ట స‌మ‌స్య‌లు ఉన్నా అది పార్టీ స‌మ‌స్య‌గా మార‌కూడ‌దు. మారితే పార్టీతో పాటు పార్టీ అధినేత ప‌రువు కూడా గంగ‌పాల‌వుతుంది. కానీ ఆగ్ర‌హావేశాల‌తో కొట్లాట‌కు దిగేవారు, కొట్టుకునేవారికి అస‌లా ఆలోచ‌న ఉంటుం దా? ఉండ‌ద‌నే  వింజ‌మూరు సంఘ‌ట‌న తెలియ‌జేస్తోంది. పోలీసు స్టేష‌న్‌దాకా వెళ్లేంత గొడ‌వ‌ల‌తో ఇప్ప టికే కారాలు మిరాయాలూ నూరుతున్న వైసీపీ నేత‌లు, వీరాభిమానులు పోలీసుల స‌మ‌క్షంలోనే కొట్టు కున్నారు.  ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో కాలం, ప్రాంతం, ప్ర‌దేశంతో ప‌నిలేదు. అన్నిచోట్లా ఇలానే ఇరు పార్టీల వారూ ఆగ్ర‌హంతో ఆ ప్రాంతాన్ని క‌ల్లోలం చేయ‌డం జ‌రుగుతూంటుంది. రాజ‌కీయాల సంబంధించిన వ‌యితే చాలామంది ఇలానే గ‌ట్టిగా అరుచుకుంటూ తిట్ల‌పురాణంతో పాటు త‌మ త‌ప్పిదాల‌ను ఒక‌రి మీద ఒక‌రు విసురుకుంటూ క‌ళ్లెర్ర‌చేసుకుని కొట్లాట‌కు దిగుతారు. ఈ మొత్తానికి చిన్న‌దేదో కార‌ణం ఉండ‌వ చ్చు. ఇటీవ‌ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల గురించి కూడా కొట్టుకుంటున్నారు. పార్టీ నేత‌లు ఎలా ఉన్నా పార్టీ వీరాభిమానులు త‌మ‌లో తాము పోటీప‌డ‌టంలో వారి శారీర‌క‌, ఆర్ధిక స్థితిగ‌తులు మ‌ర్చిపోయి మ‌రీ దారుణా ల‌కు పాల్ప‌డుతున్నారు. పార్టీ నాయ‌కులు ఆ త‌ర్వాత వారిని ఎంత‌గా ర‌క్షించుకుంటారో ఏమోగాని  ఆ క్ష‌ణం ఆగ్ర‌హావేశాల‌కు లోన‌యి ర‌క్తం చూడ‌కుండా ఒక్క‌డుగు కూడా వెన‌క్కి వేయ‌డం లేదు. ఇదే సీన్లు ప్ర‌తీ చోటా జ‌రుగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోనూ జ‌రిగింది. కాబోతే ఇది కొంత చిత్ర‌మైన‌ది. ప్ర‌దేశం .. నెల్లూరు జిల్లా వింజ‌మూరు. ఇటీవ‌ల ఇక్క‌డి పోలీస్ స్టేష‌న్ కి వైసీపీ నేత‌లు, ఇద్ద‌రు పార్టీ వీరాభిమానులు వెళ్లారు. అక్క‌డ ఏమ‌యిందో ఏమోగాని హ‌ఠాత్తుగా తిట్టుకున్నారు, మ‌రుక్ష‌ణం నేత‌లు అని చూడ‌కుండా వీరాభిమానులు గొడ‌వ‌ప‌డ్డారు. నేత‌లు రెచ్చిపోయి కొట్టారు. మ‌న పార్టీవారే న‌ని అభిమానులు దెబ్బ‌లు తిన‌లేదు.. వారూ ఎదురుతిరిగి నేత‌ల‌కు చుక్క‌లు చూపించారు.  వాళ్లు తిట్టుకో వ‌డం, అరుచుకోవ‌డం వ‌ర‌కూ చూసి ఆనందించిన పోలీసులు ఏకంగా వారు కొట్టుకోవ‌డం చూసి అమితా శ్చ‌ర్య‌పోయారు. ఒకే పార్టీవారు ఏదో క్ష‌ణంలో క‌లిసిపోతారు, ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చి మ‌నం మ‌నం బ‌రం పురం అనుకుంటారులే అనుకుంటారు. కానీ ఇక్క‌డ సీన్ అందుకు పూర్తి విరుద్ధంగా మారింది. పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చిన‌వారు, కొట్టుకున్న‌వారూ వైసీపీ పార్టీకి చెందిన‌వారే. అధికార పార్టీకి చెందిన‌ వారు కావడంతో పోలీసుల‌కు ఏమి చేయాలో తోచ‌లేదు. ఓర్నాయ‌నో కొట్టుకోకండ్రా.. అనీ అన‌లేక‌, వీరాభిమా నుల ను తిట్టి ఇవ‌త‌ల‌కు లాగేయ‌లేకపోయారు. ఎవ‌రికి ఏం చెబుతారు? ప్రేమించుకున్న‌వారే ఇలా  ప‌క్కా విరో ధుల్లా  కొట్టుకు ఛ‌స్తుంటే ఎన్టీఆర్ సినిమా చూసిన‌ట్టు చూడ్డం త‌ప్ప పోలీసుల‌కు పాలు పోలేదు. కాబోతే పోలీసు స్టేష‌న్, పోలీసుల ప‌రువు పోతుంద‌ని ఎస్సై జంప‌ని కుమార్ మాత్రం ఇరు వ‌ర్గాల మీదా కేసు న‌మోదు చేసుకున్నారు. 

ఇటు చిరంజీవి అటు ఆళ్ల మ‌ధ్య‌లో జ‌గ‌న్‌!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా నేనే పోటీచేస్తాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్న పెద్దోడిని  కాద‌ని  బుజ్జ‌గించి ప‌క్కంటి వాళ్ల‌బ్బాయిని ఒకే అనిపించారు. సాయంత్రానికల్లా పోటీలో ఫ‌లానావారి అబ్బాయిపోటీ చేస్తు న్నాడ‌ని తెలుసుకుని పెద్దోడు ప‌ట్టుప‌ట్టాడు. ఈ ఇంటాయ‌న త‌ల‌ప‌ట్టుకున్నాడు. ఒక‌డు మొండికేసాడు, రెండోవాడిని తెచ్చిపెట్టుకుని  ఆశ‌లు క‌ల్పించిన పెద్దాయన  భ‌గ‌వాన్  ఈ  దుస్థితి పగవాడికి కూడా  రాకూడ‌ద‌నుకున్నాడు. చిత్ర‌మేమంటే స‌రిగ్గా ఇలాంటి సీన్  ఇపుడు వైసీపీలో ఈస్ట్ మన్ కలర్ లో కనిపిస్తోంది. మంగ‌ళ‌గిరి ఎన్నికల విష‌యంలో వైసీపీ పెద్ద స‌మ‌స్య‌నే ఎదుర్కొంటోంది. మంగ‌ళ‌గిరిలో తెలుగు దేశం నుంచి నారా లోకేష్ పోటీచేయడం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆయ‌నను దీటుగా  ఢీకొని గెలిచే అభ్యర్థిని రంగంలోనికి దించాలని వైసీపీ అధినేత జగన్ భావించారు. అనేక వ్యూహాలు, చ‌ద‌రంగ‌పుటెత్తుల త‌ర్వాత గాలం వేసి మరీ గంజి చిరంజీవిని తెలుగుదేవం పార్టీ నుంచి వైసీపీలోకి   లాక్కున్నారు. చిరంజీవిని త‌మ అభ్య‌ర్ధిగా నిలబెడితే సత్ఫలితం వస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు.  మంగ‌ళ‌గిరిలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు కనుక బీసీ అభ్య‌ర్ధికే  అవ‌కాశాలుంటాయనీ, అందుకే  గంజి చిరంజీవి లోకేష్ కు దీటైన అభ్యర్థి అవుతారనీ జగన్ భావించారు. అందుకే అక్కడ సిట్టింగ్ గా ఉన్న  ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ని బుజ్జగించి ఒప్పించి మరీ చిరంజీవిని పార్టీలోకి లాక్కున్నారు. ఇంత వరకూ బానే ఉంది కానీ , అయితే ఎంత బీసీల‌కు చెందిన‌వాడ‌యిన‌ప్ప‌టికీ చిరంజీవి ఇదే మంగ‌ళ‌గిరిలో 2014లో టీడీపీ అభ్య‌ర్ధిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం వేవ్ లోనే గెలవలేక చతికిల బడ్డారు. అప్పుడే జనం తిరస్కరించిన అభ్యర్థిని ఇపుడు నిల‌బెట్ట‌డం వ‌ల్ల పార్టీ ఏమాత్రం ప్ర‌యో జ‌నం పొందుతుంద‌న్న అనుమానాలు త‌లెత్తాయి. అయితే ప్ర‌స్తుతం బీసీ ఓట‌ర్ల ప్రాధాన్య‌త‌ను లెక్క‌లోకి తీసుకుంటే ఆళ్ల కంటే చిరంజీవి బెట‌ర్ అని జగన్ నమ్మారు. అందుకే గాలం వేసి మరీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి గంజి చిరంజీవిని తెచ్చుకున్నారు. అంతే కాదు ఆయ‌న‌కు కించిత్ ఇబ్బందీ లేకుండా చూసుకుంటామ‌ని అనేక హామీలు ఇచ్చారు. అంటే పోటీలో నిల‌బ‌డ‌టం వ‌రకే చిరంజీవి వంతు, ఖ‌ర్చు తదితర  వ్య‌వ‌హారాల‌న్నీవైసీపీయే చూసుకుంటుందన్న  భ‌రోసా ఇచ్చిన త‌ర్వాత‌నే చిరంజీవి చిర్న‌వ్వుతో వైసీపీ పంచ‌న చేరార‌న్న‌ది ప్ర‌చారంలో ఉంది.  మంగ‌ళ‌గిరి సీటు, అందునా నారా లోకేష్‌ను ఓడించ‌డం.. ఈ రెండు వైసీపీకి అత్యంత ప్రాధాన్య అంశా లుగా మారాయి. మంగ‌ళ‌గిరిలో బీసీ ఓట‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. లోకేష్ త‌న చిర‌కాల శ‌తృవు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సుపుత్రుడు.   క‌నుక లోకేష్ పై విజయం సాధించడం ఒక్క టే జ‌గ‌న్   ల‌క్ష్యంగానూ మారింద‌నాలి.   కానీ టీడీపీ మాత్రం మంగ‌ళ‌గిరిలో విజ‌య‌ఢంకా మోగించేది నారావారి అబ్బాయే అన్న   ధీమాతో ఉంది. ఇటీవ‌లి కాలంలో రాష్ట్ర రాజకీయ వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పులు, ప్ర‌జ‌లు వైసీపీ మీద పెంచుకున్న ఆగ్ర‌హం త‌ప్ప‌కుండా లోకేష్‌కు ప్లస్ గా మార‌ను న్నా యి. ప‌థ‌కాలు, హామీలు అన్నీ నీరుగారాయి, ఏకంగా జ‌గ‌న్ మాట‌ను కూడా ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తు న్నారు, ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయుల స‌మ‌స్య ఆయ‌న‌కు త‌ల‌భారంగానే మారింది.  ఆచి తూచి అడుగులు వేయాల్సిన స‌మ‌యంలో దూకుడుగా, అనాలోచితంగా  తీసుకున్న నిర్ణ‌యాలు ఇపుడు మ‌రింత  ఇబ్బందిక‌రంగా మారాయి.  అస‌లే అవ‌మాన‌పు త‌ల‌నొప్పుల‌తో ఇబ్బందిప‌డుతున్న జ‌గ‌న్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల మ‌రో శిరోభారం పెట్టాడు. అస‌లు లోకేష్ మీద పోటీ చేయ‌డానికి, గెల‌వ‌డానికి మంగ‌ళ‌గిరిలో త‌న‌ను మించిన‌వాడు లేడని తానే ఈ సారి పోటీలో నిలుస్తాన‌ని   తెర‌మీద‌కి మొద‌టి  కృష్ణుడిలా రంగప్రవేశం చేసేశారు. త‌న‌పై గ‌తంలో ఓడిపోయిన చిరంజీవికి పార్టీ టిక్కెట్ ఇవ్వ‌డ‌మేమిటి, త‌న‌ను తెర వెన‌క్కి వెళ్ల‌మ‌ని, ప్ర‌చారం చేయ‌మ‌ని అడ‌గడ‌మేమిట‌ని ఆగ్ర‌హిస్త‌ున్నారు. చిరంజీవి కేవ‌లం టీడీపీ నుంచి వ‌చ్చేడ‌న్న ప్రాధాన్య‌త త‌ప్ప మంగ‌ళ‌గిరిలో ఆయనకేమీ  ఫాలోయింగ్ లేద‌న్న‌ది ఆళ్ల వాద‌న‌. చిరంజీవిని పార్టీవారు ఎంతో స‌త్క‌రించి ఆయ‌న‌కు టికె ట్ ఇస్తామంటున్న స‌మ‌యంలో కూడా ఆళ్ల మీడియాతో అబ్బే అదేమీ లేదు, మంగ‌ళ‌గిరిలో పోటీ చేసేది తానే అని చెబుతున్నారు. ఏది వాస్త‌వం, ఎవ‌రిది భ్ర‌మా అనేది ఇపుడు జ‌గ‌న్  తేల్చాల్సి ఉంది. మంగళగిరి లాంటి హాట్ సీట్  విషయంలో వైసీపీలో ఇంత గందరగోళం నెలకొని ఉండటమే ఆ పార్టీ బలహీనతకు దర్పణం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. ఎంత మంది పార్టీలోకి వ‌చ్చి చేరినా తానే మంగళగిరిలో పోటీ చేస్తానని లోకేష్‌ను ఓడించే స‌త్తా త‌న‌కే ఉం ద‌ని ఆళ్ల‌  చెప్పుకుంటున్నారు. ఈ పరిణామంతో  గంజి చిరంజీవికి షాక్ ఖిన్నుడయ్యారు. రెడ్డి సామాజికవర్గం ఆడిన పొలి టికల్ గేమ్‌లో తాను పావునయ్యాయన్న ఫీలింగ్‌కు వచ్చారు. అయితే తాను ఇక దూకేశానని.. తనను జగన్ మోసం చేయరని ఒక దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారు. కానీ మంగళగిరిలో గంజి చిరంజీవి నాయకత్వాన్ని వైసీసీ అంగీక రించడం లేదు.  ముఖ్యంగా గ‌తంలో త‌న‌ను ఓడించిన ఆళ్ల ఇపుడు తెర‌మీద‌కి రావ‌డం నేప‌థ్యంలో చిరంజీ వికి తన రాజకీయ భవిష్యత్ పై బెంగపట్టుకునే ఉంటుందని పరిశీలకలు అంటున్నారు.  అయితే ఇవ‌న్నీ కేవ‌లం ఊహాగానాలే అని కొట్టి పారేసినా,  తాను పోటీ చేస్తున్నాన‌ని ఆళ్ల ప్ర‌క‌టించుకో వ‌డాన్ని జ‌గ‌న్ అడ్డుకోలేదు. ఆళ్ల ప్రకటనను ఖండించనూ లేదు.   అయినా ఇంత వరకూ వచ్చేసిన తరువాత ఆళ్ల తానే పోటీ చేస్తానంటూ ప్రకటించడం సీఎం జ‌గ‌న్‌కు కూడా  ఇబ్బందిక‌రంగానే మారింద‌నాలి. బుజ్జ‌గించి, బామాలి ఇప్పుడు కాదురా నాన్నా.. అని గ‌డ్డం ప‌ట్టుకుని చెప్పిన‌పుడు ఒకే అనేసి ఇపుడు ఎవ‌రో గిల్లిన‌ట్టు   మంగ‌ళ‌గిరిలో పోటీ చేస్తే తానే చేయాలంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వైసీపీ నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.   ఇక  ఇంటి అల్లుళ్ల పోరు తీర్చిన‌ట్టు  జ‌గ‌న్ ఇపుడు చిరంజీవిని, ఆళ్ల‌ను కూర్చోబెట్టి  బుజ్జగించడమే మిగిలింది. అయితే అంత కంటే ముందు మంగళగిరి వైసీపీలో విభేదాలు బట్టబయలై పార్టీ నియోజకవర్గంలో పలుచన అయ్యిందనడంలో సందేహం లేదు. అందుకు తంటా లు ప‌డాల్సింది, లాలిపాట‌లు పాడాల్సింది కూడా జ‌గ‌న్ మాత్ర‌మే. తెచ్చుకున్న‌వాడి కంటే ఉన్న‌వాడు తెచ్చిన తంటా అంతా యింతా కాదు.  

స‌ర‌దా తీర్చిన స‌ర‌దా ఆలోచ‌న‌!

వాళ్లిద్ద‌రికీ స‌ర‌దాగా ఓ రెండు రోజులు వేరే న‌గ‌రంలో గ‌డ‌పాల‌ని స‌ర‌దా. చాలా కాలం త‌ర్వాత  వీలు కుది రింది. ఏదో ర‌కంగా స‌ర‌దా చేసుకున్నారు. మంచి హోట‌ల్ రూమ్ తీసుకుని రెండు వారాలు గ‌డిపారు. తిన్నారు, తిరిగారు, స‌ముద్రం మీద బోటు షికార్లు చేశారు.. అంతా అయి ఇంటికి తిరిగి వ‌చ్చా రు. చాలా గొప్ప ప‌ని ముగించుకున్న‌ట్టు. పాపం వారి స‌తీమ‌ణులు సేవ‌లు చేసి త‌రించారు. వారిద్ద‌రూ లోలోప‌ల ఆ ఆనందాన్ని త‌ల్చుకుంటూ చాలారోజులే ఆనందించారు. వారి స‌తీమ‌ణుల‌కు తెలిసిందా లేదా అన్న‌ది త‌ర్వాతి సంగ‌తి అలా కూడా కొంద‌రు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొంద‌రి విష‌ యంలోనే సీన్ అంత‌గా సినిమాటిక్‌గా పండ‌దు.. పోలీసులూ ఎంట‌ర‌యి చుక్క‌లు చూపుతారు! పేర్లెందుకు గాని, ఇద్ద‌రు వ్యాపారులు త‌మ వ్యాపార ప‌నుల నిమిత్తం బెంగుళూరు వెళుతున్నామ‌ని చెప్పి బ‌య‌లుదేరారు. అమాయ‌క‌పు స‌తీమ‌ణులు అవున‌నే అనుకున్నారు. అన్నీ స‌ర్దిమ‌రీ పంపారు. ఈ మ‌హా ను భావులు సినిమాటిక్‌గా వారి స‌ర‌దాల కోసం ఏకంగా బ్యాంకాక్ వెళ్లారు! అక్క‌డంతా స‌ర‌దాగా గ‌డిపేరు. ఆ స‌మ‌యంలో అన్నీ మ‌ర్చిపోయారు. బిజినెస్ లేదూ వంకాయ‌లేదు.. స‌ర‌దాగా కుర్రాళ్ల‌యి పోదామ‌ని ఇద్ద‌రూ గ‌డిపారు. బ్ర‌హ్మాండంగా అంతా గ‌డిచింది. తీపి జ్ఞాప‌కాల‌తో వారు ప‌ట్ట‌ణానికి  చేరుకున్నారు. వారి స‌తీ మ‌ణులు పాపం భ‌ర్త‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి  ఇంటికోసం, బిజినెస్‌కోసం పెద్ద టూర్ వెళ్లి వ‌చ్చార‌ని సేవ‌లు చేశారు. స‌ర‌దాగా వివ‌రాలూ అడిగే ఉంటారు.. వీరు చ‌క్క‌గా అబ‌ద్దాలే చెప్పి ఉంటారు. ఇదంతా మామూలే.  ట్విస్ట్ ఏమిటంటే వాళ్లు వ‌చ్చిన మ‌ర్నాడు ఉద‌యాన్నే పోలీసులు ఇంటికి వ‌చ్చారు. వాళ్లు చుట్ట‌పు చూపు గా ఏమీ రాలేదు. అస‌లు సంగ‌తి  ఆ క‌ళాపోష‌కుల స‌తీమ‌ణుల‌కు చెప్పి ఇద్ద‌ర్నీ క్వారంటైన్‌కి పంపమ‌ని హెచ్చరించారు. అంతేకాదు అలాగ‌ని ఆ హెచ్చ‌రిక‌ను రిపోర్టు రూపంలో ఇళ్ల గేటుకి అంటించి మ‌రీ వెళ్లా రు. ఇక మ‌న‌వారి ప‌రిస్థితి మీరే ఊహించుకోవ‌చ్చు!

త‌ల్లిని ర‌క్షించిన గెవిన్‌

కొన్ని సంఘ‌ట‌న‌లు ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ఆయా సంఘ‌ట‌న‌ల్లో పిల్ల లూ హీరోల‌యిపోతుంటారు. ఊహించ‌ని సంఘ‌ట‌న‌ల్లో ఒక్క‌సారిగా మెరుపులాంటి ఆలోచ‌న‌ల‌తో వెంట‌నే స్పందించ‌డం అనేది అవ‌త‌లివారికి ఎంతో మేలు చేస్తుంది. గెవిన్ త‌న త‌ల్లిని కాపాడాడు. ప‌దేళ్ల గెవిన్ ఏం చ‌దువుతున్నాడు, బ‌డికి స‌రిగా వెళుతున్నాడా, గుడ్ స్టూడెంటా.. అనే ప్ర‌శ్న‌ల‌తో చుట్టు పక్క‌ల‌వారూ, ప‌క్కంటి పిన్నిగారూ వేధించ‌లేదు. గెవిన్ ని త‌మ ఊరు హీరో అనేశారు. పిల్ల‌వాడ‌యినా ఎంత వేగంగా, చురుగ్గా ఆలోచించాడ‌మ్మా.. అనుకున్నారు వెన‌కింటి బామ్మ‌గారు, ఎదురింటి బాబాయి గారూ .. పిల్ల‌డు ప‌దేళ్ల‌వాడ‌యితేనేమి.. వాళ్ల డాడీ  ఇవ్వాల్సిన ర‌క్ష‌ణ  వాడే చేసేడ‌న్నారంతా.  ఓక్ల‌హామాలో ఓ చిన్న కుటుంబం. త‌ల్లీ, పిల్ల‌డూ స్విమింగ్‌పూల్‌లో ఆడుకోవ‌డం ఓ స‌ర‌దా. కానీ మొన్నీ మ‌ధ్య త‌ల్లి ఒక్క‌తే స్విమింగ్‌పూల్‌లో దిగింది. పిల్ల‌డు ఎక్క‌డో ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆమె మామూ లుగానే పాడుకుంటూ తిరుగుతూంది. పిల్లాడి కోసం ఎదురుచూస్తోంది. పిలుద్దామ‌నే అనుకుంది.  కానీ అంత‌లోనే హ‌ఠాత్తుగా ఆమె ప‌ల్టీకొట్టింది. ఊపిరాడ‌నంత ప‌న‌యింది. నీళ్లు మింగేసింది. నీటిలోకి దిగిపోయేలోగానే అదృష్టం ఆమెను ర‌క్షించింది. స‌రిగ్గా అప్పుడే ఆమె ప‌దేళ్ల పిల్ల‌వాడు గెవిన్ అటుగా వ‌చ్చాడు. త‌ల్లి అరుపులు విని ప‌రుగున స్విమ్మింగ్‌పూల్‌లోకి అమాంతం దూకేశాడు. చిత్రమేమంటే ఆమెను బ‌య‌టికి లాగేయ‌గ‌లిగాడు. అదీ ఆమె మొహాన్ని నీటి పైకి ప‌ట్టుకుని పూల్ చివ‌ర ఉన్న మెట్ల‌మీద వ‌ర‌కూ తీసుకువ‌చ్చి ఆమెను పైకి లాగేడు. అంత‌లో తండ్రి ప‌రుగున వ‌చ్చాడు.  ఇదెలా సాధ్యం.. అన్న ప్ర‌శ్న‌కంటే పిల్లాడు ప్ర‌ద‌ర్శించిన తెలివినే అంద‌రూ మెచ్చ‌కున్నారు. నీటిలో మునిగిపోతున్న త‌ల్లి అర‌వ‌గానే దూక‌డం స‌రే. కానీ అంత మ‌నిషిని వాడు మెడ‌ప‌ట్టుకుని త‌ల‌ను నీటి పైనే ఉంచేట్టు చేసి తీసుకురావ‌డ‌మే గొప్ప విష‌య‌మ‌ని అన్నారంతా. మ‌నూళ్లో అయితే దీన్నే దైవేచ్ఛ అనేవారు. ఏమ‌యిన‌ప్ప‌టికీ ఓక్ల‌హామాలో గెవిన్ నివాస ప్రాంతంలో మాత్రం గొప్ప హీరోగా అంద‌రి మెప్పూ పొందుతున్నాడు.  ఆ త‌ల్లి ఫేస్‌బుక్‌లో త‌న గెవిన్ త‌న‌కు దేవుడు అంటూ రాసింది. వాడివ‌ల్లే మ‌ళ్లీ ఊపిరిపీల్చుతున్నా న‌న్న ది. వాడు నాకు మ‌రో జ‌న్మ‌ని ప్ర‌సాదించాడ‌న్న‌ది. 

మీ కారు కాన్వాయ్ ఇంత చీకాకు పెడితే ఎలా సారూ!

ప్రభుత్వాధినేత ఎవరైనా సరే ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు పాటుపడాలి. గత పాలకులకంటే తన పాలన మెరుగ్గా ఉందని నిరూపించుకోవడానికి పని చేయాలి. అలా కాకుండా స్వయంగా ఆయన వల్లనే జనం తీవ్రమైన ఇబ్బందులు పడేలా వ్యవహరిస్తే ఎలా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ప్రజలు ముఖ్యంగా హైదరాబాదీయులు సరిగ్గా ఇదే అనుకుంటున్నారు.  ఆయన ప్రగతి భవన్ నుంచి తన  ఫాం హౌస్ కు తరచూ చేసే ప్రయాణాలు హైదరాబాదీయులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రగతి భవన్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా ఆయన చాలా తరచుగా చేస్తున్నపర్యటనల పట్ల జనం చీకాకుపడుతున్నారు. ఆయన తిరగడానికి మేం ట్రాఫిక్ లో చిక్కుకుని యాతన పడాలా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆయన ఈ ప్రయాణం హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే సమయాలలోనే సాగుతుంది. ఉదయం విద్యార్థులు పాఠశాలలకూ, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే సమయంలోనూ.. అలాగే సాయంత్రం తిరిగి వారు ఇళ్లకు చేరే సమయంలోనూ కేసీఆర్ కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ ను ఆపేస్తుంటారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జూబ్లీ బస్టాండ్, తిరుమలగిరి చౌరస్తా, అల్వాల్ మీదుగా సాగే ఆయన పయనం.. ఆ దారిలో వెళ్లే వారికి నరకం చూపిస్తోంది. ఈ పరిస్థితి వారంలో కనీసంలో కనీసం రెండు సార్లు ఉంటుంది. అంటే వారంలో రెండు సార్లు ఉదయం, సాయంత్రం జనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తా ట్రాఫిక్ లో ఇరుక్కుని చిక్కులు పడాల్సిందే. అంబులెన్సులు సైతం నిలిచిపోయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ ను ఆపడానికి పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరు వైపులా కనిపించే పోలీసులు సీఎం కాన్వాయ్ వెళ్లిపోగానే మాత్రం కనిపించరు. దీంతో కాన్వాయ్ వెళ్ళిన తరువాత అప్పటి వరకూ నిలిచిపోయిన వాహనాలు ఒకే సారి అన్ని వైపుల నుంచీ కదలడంతో ఆ ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరో గంట, వెరసీ కనీసం రెండు గంటల పాటు సీఎం కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ చిక్కులు ఎదురౌతున్నాయి. గతంలో ఏ సీఎం వల్లా ఇలా ట్రిఫిక్ ఇబ్బందులు ఎదురైన దాఖలాలు లేవు. ఎప్పుడో ఒక సారి ఏదో అత్యవసర పని మీద భారీ కాన్వాయ్ తో సీఎం కదిలారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇలా తరచూ క్యాంపుకార్యాలయానికీ, ఫాంహౌస్ కు తిరగడానికి గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడం ఎంత వరకూ సమంజసమని జనం విసుక్కుంటున్న పరిస్థితి ఆయన కాన్వాయ్ వెళుతున్న ప్రతి సందర్భంలోనూ కనిపిస్తోంది.   దేశానికే ఆదర్శవంతమైన అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్  జనానికి ట్రాఫిక్ చుక్కలు చూపించే విషయంలో మాత్రం ఎవరికీ ఆమోదయోగ్యం కాని విధానాన్ని అవలంబిస్తున్నారు

ఏపీలో కొత్త సమీకరణాలు.. వైసీపీకి ప్రమాద ఘంటికలు

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ నానుడికి అద్దంపట్టేవిగానే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న తెలుగుదేశం, బీజేపీలు మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాయా? ఏపీలో తెలుగుదేశంతో మైత్రి బీజీపీకి తెలంగాణలో రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందా? తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి చెప్పిందా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు.  తెలంగాణ కమలం పార్టీ అధికారం చేపట్టాలంటే తెదేపా సహకారం అవసరం అని  బీజేపీ అగ్రనాయకత్వం కూడా భావిస్తుండటం వల్లనే ఏపీలో హటాత్తుగా వైసీపీపై బీజేపీ ఉద్దేశపూర్వక దూరాన్ని పాటిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వినాయకమండపాలకు ఫీజులపై అటు బీజేపీ-ఇటు టీడీపీ సర్కారుపై ఏకకాలంలో దాడి చేయడం   ఆ రెండు పార్టీలూ దగ్గర అవుతుందనడానికి సంకేతమని పేర్కొంటున్నారు.  అదే కాకుండా బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ  బీజేపీపై ఎంత  ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా  ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా పరిశీలకులు చూపుతున్నారు. అంతే కాకుండా ఉరుము లేని పిడుగులా హఠాత్తుగా  చంద్రబాబుకు   12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం  కూడా ఆ రెండు పార్టీలూ దగ్గర అవుతున్నాయనడానికి నిదర్శనమేనని అంటున్నారు. మోదీ-బాబు భేటీ తర్వాతే ఏపీ బీజేపీ వైసీపీ ఎదురుదాడి తీవ్రతను పెంచిందని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మోడీ, చంద్రబాబు కొన్ని నిముషాల పాటు ముచ్చటించుకోవడాన్ని వైసీపీ వారు జీర్ణించుకోలేకపోవడం కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య సయోధ్య అన్న ఆలోచనే వైసీపీని వణికిస్తోందనడానికి ప్రబల నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి ఇటీవల అమరావతి మహిళా జేఏసీ ఉపరాష్ట్రపతిని కలసి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లింది. ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై ఆయనకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ సందర్భంగా ఉపరాష్ట్రపతి చంద్రబాబు దార్శనికతను   ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో వణుకు పుట్టించాయని చెప్పక తప్పదు.  అందుకే మోడీని విమర్శించిన టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది వాళ్లిష్టం అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామృష్ణారెడ్డి వ్యాఖ్యానించారని అంటున్నారు. నిజానికి పొత్తులు అన్నది పూర్తిగా రెండు పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారం.  ఆ విషయంలో ఎవరైనా ఎందుకు ఉలిక్కిపడాలో, ఎందుకు అభ్యంతరం చెప్పాలో అర్ధం కాని వ్యవహారం. ఇక చంద్రబాబుకు తాజాగా ఎన్ఎస్జీ భద్రత పెంపు విషయంలో కూడా వైసీపీ భుజాలు తడుముకుంటోంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా తయారవ్వడమే భద్రత పెంపునకు కారణమని ఎవరూ విమర్శలు గుప్పించకపోయినా స్వచ్ఛందంగా వివరణలు ఇచ్చుకుంటోంది. కమలం తీర్థం పుచ్చుకున్న ఇద్దరు నేతల వల్లే చంద్రబాబుకు భద్రత పెంచారని వైసీపీ విమర్శించడం బీజేపీ, తెలుగుదేశం పొత్తుపై ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనకు, భయానికీ తార్కానంగా చెబుతున్నారు.

అస్సాంలో మ‌ద‌ర‌సా కూల్చివేత‌

అస్సాం బార్‌పేట జిల్లాలో ఒక మ‌ద‌ర‌సాను బుల్డోజ‌ర్‌తో కూల్చివేశారు. దీనికి ఉగ్ర‌వాద సంస్థ అల్‌ ఖైదాతో సంబంధాలున్నాయ‌న్న‌ది బ‌య‌ట‌ప‌డింది. బార్‌పేట జిల్లాలో బంగ్లాదేశ్ ఉగ్ర‌వాద సంస్థ అస్స‌రుల్లా బంగ్లా టీమ్‌లో సంబంధాలున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై అక్బ‌ర్ అలీ, అబుల్ క‌లాం అజాద్ అనే సోద‌రుల‌ను పోలీ సులు అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత‌నే మ‌ద‌ర‌సాను కూల్చివేశారు.  ధకలియాపరా వద్ద ఉన్న మదరసా  టెర్రరిస్టు హబ్‌గా నడుస్తున్నందున తాము దాన్ని బుల్డోజరుతో కూల్చివేశామని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ  చెప్పారు.  దేశ వ్యతిరేక కార్యకలాపాలు, జిహాదీ సంస్థ ల కార్యకలాపాల్లో పాలు పంచుకోవడంతోపాటు ప్రభుత్వ భూమిలో ఉన్నందున దాన్ని కూల్చామని ప్రభుత్వ అద నపు కమిషనర్ లచిత్ కుమార్ దాస్ చెప్పారు. అంతకు ముందు ఆగస్టు 4వతేదీన కూడా అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఒక మదరసాను కూల్చివేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద రెండు మదర్సాలను కూల్చి వేశామని సీఎం హిమంత శర్మ చెప్పారు. ఈ ఏడాది అసోంలో ఐదు ఉగ్రవాద కుట్రలను ఛేదించి, పలువురి ని అరెస్టు చేశామని అసోం అధికారులు చెప్పారు. 

మ‌ళ్లీ రాజుకున్న క‌డియం, రాజ‌య్య విభేదాలు

ఒకే  ఒర‌లో రెండు క‌త్తులు  ఇమ‌డ‌వు. దీనికి పెద్ద  ఉదాహ‌ర‌ణ‌గా  టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌లు కాపు రాజ య్య‌,  మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిగా చెప్పుకోవ‌చ్చు. చిత్ర‌మేమంటే ఇద్ద‌రిదీ నియోజ‌క‌వ‌ర్గం, రాజ‌కీయంగా ఒకే కారులో ప్ర‌యాణం. కానీ ఎజెండాల్లో తేడా వ‌చ్చింది. చాలాకాలం నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు తెర‌మీద‌కు వ‌స్తూనే ఉంది. ఒక‌రిపై ఒక‌రు అవ‌కాశం దొరికిన‌పుడ‌ల్లా మాట‌ల తూటాల‌తో విరుచుకుప‌డ‌టం తెలంగాణా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. ఇప్పుడిద్దరూ ఒకే పార్టీ కానీ.. ఒకప్పుడు రాజయ్య కాంగ్రెస్‌. కడియం టీడీపీ. అప్పట్లోనే ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. ఇప్పుడు ఒకే పార్టీ జెండా నీడన ఉన్నా నిల‌వ‌లేక‌పోతున్నారు.  కడియం శ్రీహరి పై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  సంచలన వ్యా ఖ్యలు చేశారు. కడి యం శ్రీహరి 361 మంది నక్సలైట్ల ను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలోనే  ఈ హత్యలు జరిగాయన్నారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం లోనే ఇంత మంది చనిపోయారని తెలిపారు.  వైఎస్సార్  నీ గురువైతే,  కేసీఆర్  నా దేవుడు. స్టేషన్ ఘన పూర్ నియో జకవర్గానికి నేను పూజారిని. స్టేషన్ ఘనపూర్ నా అడ్డా, ఎవరినీ అడుగు పెట్టనివ్వబోను అంటూ రాజయ్య శపథం చేశారు.  ఇప్పటికే రాజయ్య, కడియం మధ్య ఉప్పునిప్పుగా పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీలతో అభివృద్ధి జరగదని, ఎమ్మెల్యేలతోనే జరుగుతుందని ఇప్పటికే కడియం శ్రీహరిని ఉద్దేశించి రాజయ్య  వ్యాఖ్యలు చేసిన విష యం తెలిసిందే. ఈక్రమంలోనే తాజాగా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలోని ఓ కార్యక్రమంలో కడి యంను ఉద్దేశించి రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి. నడిచే ఎద్దుకే ముళ్ళు కర్ర.. పండ్లున్న చెట్టుకే రాళ్లు. అంటూ  గ‌తంలో  టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య కడియం శ్రీహరి పై  గ‌తంలో  పరోక్ష విమర్శలు గుప్పించారు.  రాజకీయాల్లో ఎవరి ఎత్తు గడలు వాళ్ళకి ఉంటాయి. కేసీఆర్ సర్వే చూస్తే మీకు తెలుస్తుంది ఎవరు గొప్పనో.. చంద్రబాబు నాయకత్వం లో కడియం పనిచేసినప్పుడు జన్మభూమి లో జరిగితే కొన్ని పనులు జరగొచ్చు. కానీ తాను కేసీఆర్ నాయకత్వంలో అంతకు మించి పనులు చేస్తున్నా,  సాగునీటి రంగంలో స్టేషన్ గన్ పూర్ నంబర్ వ‌న్ గా ఉంద ని, ఇందిరమ్మ ఇళ్లు  త‌న హయంలోనే వచ్చాయ‌న్నారు. ఎవరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారో కాలమే నిర్ణయిస్తుంద‌ని రాజయ్య  వెల్లడించారు. 

అడుగు బయటపెట్టకుండానే అనుకున్నది సాధించారు!

సీపీఎస్ ఉద్యోగుల సెప్టెంబర్ 1 చలో విజయవాడ వాయిదా పడింది. ఈ విషయాన్ని  సీపీఎస్ ఉద్యోగులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ వాయిదా ప్రకటన ఒక లాంఛనం మాత్రమే. ఏపీలో సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జరగకుండా చూసేదుకు ఏపీ సర్కార్ ఏకంగా వారిపై యుద్ధాన్నే ప్రకటించింది. బైండోవర్ కేసులు, ఉద్యోగులకు సెలవులు లేవంటూ నిబంధనలు విధించింది. దాదాపు నెల రోజులుగా ఉపాధ్యాయులపై వేధింపులు తీవ్ర తరం చేసింది. బ్యాస్కట్ బాల్, వాలీబాల్ వంటి ఆటల్లో మేన్ టు మేన్ అని ఒక వ్యూహం ఉంటుంది. సీపీఎస్ ఉద్యోగుల కట్టిడికి వైసీపీ అదే వ్యూహాన్ని అనుసరించినట్లు కనిపిస్తోంది. ఒక ఉద్యోగికి ఒక పోలీస్ అన్నట్లుగా పోలీసు వ్యవస్థను వినియోగించుకుంది. నోటీసులు ఇచ్చింది. విజయవాడ వెళితే ఖబడ్దార్ అని హెచ్చరించింది. ఇవి చాలవని భయపడిందో ఏమో విజయవాడలో వేలాది మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. రాష్ట్రంలో ప్రభుత్వానికి సీపీఎస్ ఉద్యోగులకే మధ్య యుద్ధం జరుగుతోందా అన్న వాతావరణాన్ని కల్పించింది. సామాన్య జనం కూడా టీచర్ల ఆందోళనలను అణచివేయడానికి ఇంత చేయాలా అని భావించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇక జగన్ నివాసానికి వెళ్లే దారులన్నిటినీ ఇప్పటికే మూసేశారు. టీచర్లు ముట్టడించకుండా ఉండేందుకు ప్రభుత్వమే సీఎం ఇంటిని ముట్టడి చేసింది. చీమ కూడా ఆ ముట్టడిని దాటి రాలేని పరిస్థితి ఏర్పరిచింది.   రోడ్ల పక్కన నాలుగైదు అడుగుల ఎత్తున ఇనుప ముళ్ల కంచెలు పెట్టారు.   ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని ప్రకటించినది   రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు మాత్రమే. ప్రభుత్వం మాత్రం మొత్తం రాష్ట్రమంతా ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందా అన్న లెవల్ లో చలో విజయవాడను భగ్నం చేయడానికి ఏర్పాట్లు చేసింది. వారు చివరి క్షణంలో అంటే సెప్టెంబర్ 1కి రెండు రోజుల ముందే వారు చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించినా.. ఇప్పటికే వారు సాధించాల్సింది సాధించేశారు. ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టారు, భయపెట్టారు. వారి చలో విజయవాడ పిలుపునకు ప్రభుత్వం వణికిపోయిందన్న భావన సామాన్య జనాలలో సైతం కలిగించగలిగారు. ఇది సీపీఎస్ ఉద్యోగుల ఘన విజయంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం మాత్రంప్రభుత్వాన్ని వారిలా టెన్షన్ పెట్టడం పెద్ద సక్సెస్. ముందు ముందు దీన్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.