కొత్త పార్టీ వచ్చేస్తోంది ముహూర్తం ఖరార్
posted on Sep 29, 2022 6:22AM
తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయ ప్రస్థానం ఒక ప్రహసనంగా ఆగుతోంది.నిజానికి ముఖ్యమంత్రి మనసులో ఏముందో, ఏమి లేదో కానీ, ఇంచు మించుగా సంవత్సర కాలంగా, సాగుతున్న, జాతీయ సన్నాహాలు, ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు ఆన్నట్లు సాగుతున్నాయి. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్, జాతీయ యాత్ర మొదలైంది. అయితే, ఎన్నికలు ముగిసి అధికారం తిరిగి హస్తగతం అయిన తర్వాత, ఎందుకనో ఆ ఆలోచన అటకెక్కింది.
కానీ, హుజూరాబాద్ ఓటమి తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మరోసారి, జాతీయ ఆలోచనలను తెర మీదకు తెచ్చారు. ఇక అప్పటి నుంచి ఒక చేత్తో కేంద్రంతో యుద్ధం చేస్తూ మరో చేత్తో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, అదేమిటో కానీ, ఆయన జాతీయ రాజకీయాల ఆలోచన ఆయనకు అచ్చిరాలేదో ఏమో కానీ, ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి ఆలోచనతో ఎన్ని రాష్ట్రాలు తిరిగినా, ఎవరిని కలిసినా, ప్రయోజనం కనిపించలేదు. ఎక్కడి కెళితే అక్కడ చుక్కెదురైంది.
ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాక్ మార్చారు. ఫ్రంట్’లేదు టెంట్ లేదంటూ జాతీయ పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చారు. పార్టీ వేదికలు, బహిరంగ్ సభల్లో జాతీయ పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. పెట్టాలా .. వద్దా అంటూ ప్రశ్నించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, చప్పట్లో ఆమోదం తెలిపారు. అయితే, రాజకీయ పండితుల మొదలు సామాన్య ప్రజల వరకు, కేసీఆర్ జాతీయ ఆలోచనలు ముడి పడేవి కాదనే అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసేఆర్ జాతీయ రాజకీయాల చర్చను సజీవంగా ఉంచడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.నిజానికి పార్టీ పేరు రిజిస్టర్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ, బీఆర్ఎస్ ( భారతీయ రాష్ట్ర సమితి/ భారతీయ రైతు సంఘటన) పేరును అయితే ప్రచారంలోకి తెచ్చారు.
ఆ ప్రయత్నాలలో భాగంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ప్రజలు,ప్రజా ప్రతినిధులు, తెలంగాణలో కేసీఆర్ అద్భుత పాలన చూసి మురిషి, ముగ్దులవుతున్నారని, తమ రాష్ట్రంలోనూ, కేసీఆర్ పాలన కావాలని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, చాలా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత పత్రికలలో కథలు, కథనాలు ప్రచురించారు. అయితే, కేసీఆర్ సొంత పత్రికలో వచ్చిన తప్పుడు కథనాలను పొరుగు రాష్ట్రాల ప్రజలు, రైతులు, ప్రజా ప్రతినిధులు ఖండించడమే కాకుండా, ఆ రెండు పత్రికలను తగల పెట్టి నిరసన తెలిపారు. మహారాష్ట్ర రైతులు అయితే, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తమ నోట్లో మట్టి కొట్టారని, మేడిగట్టు బ్యాక్ వాటర్’తో తమ పంట పొలాలు నీట మునిగి పోతున్నాయని మండిపడుతున్నారు. అలాగే, పెట్టుబడి పెట్టి కర్ణాటక, గుజరాత్ తదిర బీజేపీ పాలిత రాష్ట్రాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలను ప్లాన్ చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘీలా ఇటీవల్ హైదరాబాద్ వచ్చి వెళ్ళింది అందుకేనని అంటున్నారు.
అయితే, అదెలాగున్నా, ముఖ్యమంత్రి కేసేఆర్ మాత్రం జాతీయ రాజకీయాల విషయంలో, తగ్గేదే..లే’ అంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి, దసరా రోజున కొత్త పార్టీ ప్రకటన ఉంటుదని ముందు నుంచి ప్రచారం జరుగతున్న విధంగా, అక్టోబర్ 5న దసరా రోజున, జాతీయ పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసేందుకు, రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే రోజున పార్టీ పేరుతో పాటుగా జెండా -అజెండాను ఖరారు చేస్తారని, అంటున్నారు.
అయితే, ఇది ఎంతవరకు ముడిపడుతుందనే విషయంలో మాత్రం ఎవరి అనుమానాలు వారికున్నాయని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ సన్నిహితునిగా పేర్కొంటున్న, విజయ్ నాయర్’ ను ఆయనతో పాటుగా, ఆయనకు సన్నిహితునిగా భావిస్తున్న, మద్యం వ్యాపారి, సమీర్ మహేంద్రను ఎన్ఫోర్స్మెంట్ డైక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో పాటుగా తెరాస కీలక నేతలు కొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి, వాయిదా వేసుకున్న జాతీయ పార్టీ ప్రకటన ముహూర్తాన్ని మళ్ళీ ముందుకు తెచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి, నిన్నటి వరకు కూడా తెరాస నాయకులే, దసరాకు జాతీయ పార్టీ ప్రకటన ఉండదనే సంకేతాలు ఇచ్చారు. అసలు దసరాకు జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని ఎవరు చెప్పారని, మీడియా చర్చల్లో ఎదురు ప్రశ్నించారు.కానీ ఇంతలోనే, మళ్ళీ ఫార్మ్ హౌస్’నుంచి దసరా ముహూర్తం ఖరారైందని ప్రచారం మొదలైంది. అందుకే, ఈ ముహూర్తానికి జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు పార్టీ వర్గాలే వ్యక్త పరుస్తున్నాయి.
నిజానికి గతంలో ఇలా ఒకే రోజున మంత్రి వర్గ సమావేశం, అదే రోజున తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసన సభ పక్షం, పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఒకే రోజున నిర్వహించిన సందర్భాలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే, చివరకు అదేమీ లేకుండా, ఆ రోజు వచ్చి వెళ్ళింది. కానీ, అంతకు మించి ఏమే జరగలేదు.
సో .. ఇప్పుడు అక్టోబర్ 5న దసరా నాడు పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటుగా ఎంపీలు - ఎమ్మెల్సీలు- ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని పార్టీ సూచించింది.దీంతో మళ్ళీ మరోమారు, జాతీయ పార్టీ ప్రకటన మీద ఉహాగానాలు ఉపందుకున్నాయి. కానీ, చివరకు ఏమవుతుంది? అసలు ఈలోగా, ఇంకేమి జరుగుతుంది? ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కాం అరెస్టులు హైదరాబాద్ చేరుకుంటాయా? ఈడీ ఎవరి తలుపు తడుతుంది? ఇవవ్నీ జరిగినప్పుడు కానీ, జరిగింది అనుకోవడానికి లేదు. అందుకే, రాజకీయ విశ్లేషకులు అంతవరకు అన్నీ ఊహాగానాలే, అంటున్నారు.