అలీ జనసేన వైపు చూస్తున్నారా?
posted on Sep 29, 2022 7:12AM
సినీ నటుడు, కమేడియన్ అలీ జనసేన వైపు చూస్తున్నారా? ఆయన వైసీపీతో విసిగిపోయారా? అసలీ ప్రశ్నలన్నీ ఉత్పన్నం కావడానికి ఆయన పేరుతో విడుదలైన ఒక ప్రకటనే కారణం. అసలు అలీ జనసేన పార్టీలో చేరుతానని కానీ, పార్టీ మారతానని కానీ ఎక్కడా ఎప్పుడూ అన్న సందర్భం లేదు. ఆ దిశగా ఎటువంటి ప్రచారం కూడా జరిగిన దాఖలాలు లేవు. అయినా హఠాత్తుగా ఆ అనుమానాలు కలిగేలా అలీ పేర ఒక ప్రకటన వెలువడింది. జగన్ మైనారిటీల కోసం ఎవరూ చేయనంతగా చేశారంటూ పొగడ్తల వర్షంతో వెలువడిన ఆ ప్రకటన అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆ ప్రకటన నేపథ్యంలోనే అలీకి నామినేటెడ్ పోస్టు వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది.
సినీ నటుడు అలీకి ఇక ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అమరావతి నుంచి అలీ పేరుతో విడుదలైన ప్రకటనలో తాను జనసేనలో చేరడం లేదనీ, మైనారిటీల అభ్యున్నతి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్ చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అందుకే జగన్ ను మరోసారి సీఎం చేయడానికి తన వంతు కృషి తాను చేస్తాననీ అలీ పేర విడుదలైన ఆ ప్రకటన సారాంశం. పదవులు ఆశించి తాను వైసీపీలో చేరలేదననీ, జగన్ పట్ల అభిమానంతో ఆయనను సీఎం చేయాలన్న లక్ష్యంతో పార్టీలో చేరాననీ కూడా అలీ పేర విడుదలైన ఆ ప్రకటన పేర్కొంది.
అంతా బానే ఉంది కానీ.. అసలు అలీ జనసేన తీర్ధం పుచ్చుకుంటున్నారన్న వార్తలు కానీ ప్రచారం కానీ ఇప్పటి వరకూ ఎక్కడా కనిపించలేదు. జనసేనాని నటించే ఓ సినిమాలో అలీ నటిస్తారన్న వార్త మాత్రం.. (అది నిజమో కాదో తెలియదు) బయటకు వచ్చింది. అది కూడా సినిమా వర్గాల నుంచి లీక్ రూపంలో బయటకు వచ్చినదే. జనసేనాని నటించే ఏ సినిమాలో అలీ నటిస్తున్నారన్న స్పష్టత కూడా లేదు. అది పక్కన పెడితే.. అలీ జనసేన పార్టీలో చేరతారని ఆయన స్వయంగా ఎక్కడా ప్రకటించలేదు. అసలు జనసేన ప్రస్తావనే ఇప్పటి వరకూ అలీ నోటి వెంట రాలేదు. అదేమీ లేకుండా అలీ పేరుతో.. ఒక ప్రకటన విడుదల కావడమే అన్ని వర్గాలలోనూ సందేహాలను రేకెత్తిస్తోంది. వైసీపీ వర్గాలే ఆయన పేరుతో ఓ ప్రకటన విడుదల చేశాయా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.
వాస్తవానికి అలీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ పార్టీలో చేరిన సందర్భంలోనే ఆయన ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న తన కోరికను జగన్ కు తెలియ జేశారు. పార్టీలో చేరే వరకూ ఓకే అంటూ వచ్చిన జగన్ ఆ తరువాత హ్యాండిచ్చారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రాకపోతేనేం..రాజ్యసభ పంపించడమో, కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వడమో చేస్తామంటూ ఆశ చూపి ఇంత కాలం అలీని ఆశల పల్లకిలో ఊరేగించారు. ఆ మధ్యలో ఓ సారి అలీని రాజ్యసభకు పంపించేస్తున్నారంటూ వార్తలు, వదంతులూ షికారు చేశాయి. ఆ సమయంలో అలీ కూడా ఇక రాజ్యసభ సీటు గ్యారంటీ అన్న ఆనందంతో సతీసమేతంగా జగన్ దర్శనం చేసుకుని వచ్చారు. ఆ సందర్భంలో కూడా ఓ వారంలో గుడ్ న్యూస్ చెబుతానంటూ జగన్ అలీని ఊరించారు. ఆ సంగతి అలీయే స్వయంగా మీడియాతో కూడా చెప్పారు. అప్పటి నుంచీ గోడమీద రేపు అని రాసి చూసుకుంటున్నట్లుగా ఆ వారం కోసం అలీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ వారం ఇంకా రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ మధ్యలో అలీకి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అనీ, మరొకటనీ ప్రచారం జరిగినా అవేమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే అలీ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అందుకే వైసీపీలో ఈ ఖంగారు. ఈ ప్రకటన అని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.
వాస్తవానికి అలీ వైసీపీ మధ్య బలమైన బంధం ఏమీ లేదు. అలీ రాజకీయంగా చురుకుగా ఉన్న సందర్భం ఏనాడూ లేదు. ఆయన గత ఎన్నికలకు ముందు అన్ని పార్టీల మెట్లూ ఎక్కి పోటీ అవకాశం ఇస్తామన్న హామీని నమ్మే వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారనడంలో సందేహం లేదు. తీరా పార్టీలో చేరిన తరువాత పోటీకి అవకాశం లేదు.. ఏదో ఒకటి చేస్తామన్న హామీతో గత్యంతరం లేక పార్టీలో కొనసాగారే తప్ప అలీ వైసీపీలో చురుకుగా వ్యవహరించిందీ లేదు. జగన్ కు నచ్చేలా, ఆయన మెప్పు పొందేలా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడిందీ లేదు. తన సినిమాలూ, తన షోలు చేసుకుంటూ.. పేరుకు పార్టీలో కొనసాగుతూ ఉన్నారంతే. అయినా వైసీపీ అలీ పార్టీ మారుతారేమోనని ముందుగానే ఊహించేసుకుని ఆయన పేర ప్రకటన విడుదల చేసేయడమే ఆ పార్టీలో ఖంగారు, ఎంతో కొంత జనాకర్షణ ఉన్న అలీ జారిపోతారన్న భయం కనిపిస్తోంది. అందుకే అలీ పేర జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రకటన వెలువడిందని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పుడు ఇక ఇంత వరకూ వచ్చింది కనుక కంటి తుడుపులా ఏదో ఒక పోస్టు అలీకి ఇచ్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఓ ఏడాదిన్నర కోసం నామమాత్రంగా ఓ నామినేటెడ్ పోస్టులో అలీని కూర్చోపెట్టేసి జగన్ మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు అని అలీ చేతే అనిపించేయాలన్న ఆత్రం వైపీపీలో కనిపిస్తోందనడానికి అలీ పేరుతో విడుదలైన ప్రకటనే నిదర్శనమంటున్నారు.