బొత్సపై జగన్ సీరియస్.. సమావేశంలో అందరి ముందే చిన్నబుచ్చిన వైనం
posted on Sep 29, 2022 @ 11:37AM
జగన్ రెడ్డి మరో సారి తన మంత్రివర్గ సహచరులలో కొందరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేసిన వారిలో ఓ సీనియర్ మంత్రి కూడా ఉన్నారు. అయితే ఆయనను తప్పని సరిపరిస్థితుల్లో రెండో కేబినెట్ లో కూడా కొనసాగించినప్పటికీ.. ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకింత ఉక్కపోతకు గురి చేస్తూనే ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ ఆ మంతి అని చెబుతున్నారు. బొత్స సత్యనారాయణను జగన్ తొలి కేబినెట్ లోకి తీసుకున్నారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా బొత్సకు మరోసారి అవకాశం ఉండదనే అంతా భావించారు. అయితే కారణాలేవైనా ఆయన తన మంత్రిపదవిని దక్కించుకున్నారు. అయితే పునర్వ్యవస్థీకరణలో బొత్సకు అప్రధానమైన శాఖను కేటాయించడం పట్ల ఆయన అప్పట్లోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి విదితమే. తొలి కేబినెట్ లో రాజధాని వ్యవహారాలను చక్కపెట్టే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖ నిర్వహించిన బొత్సకు, పునర్వ్యవస్థీకరణలో ఆయనకు ఏమాత్రం ఇష్ఠంలేని విద్యా శాఖను జగన్ అప్పగించారు.
అప్పట్లోనే తనను పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బొత్స బహిరంగంగా కాకపోయినా.. తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విదితమే. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే విషయంలోనూ ఆప్పట్లో ఆయన జాప్యం చేశారు. శాఖ మార్పు కోసం జగన్ ను కలిసేందుకు అప్పట్లో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఎం అప్పాయింట్ మెంట్ దొరకలేదని కూడా అప్పట్లో పార్టీలో గుసగుసలు వినిపించాయి. వీటన్నిటికీ తగ్గట్లుగానే ఆయన విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజులలో విద్యా శాఖ అధికారులు, బొత్సను పక్కన పెట్టేసి తమ పని తాము చేసుకుపోయారు. దాంతో విద్యా శాఖలో ఏమి జరుగుతోందో, విద్యా శాఖ మంత్రికి తెలియని ఒక విచిత్ర పరిస్థితి అప్పట్లో నెలకొందని అంటునారు. మంత్రి ప్రమేయం లేకుండానే అప్పట్లో జీవోలు వచ్చేశాయి.
ఈ విషయంలో అప్పట్లో బొత్స తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగారి ఆదేశాలను అధికారులు అసలు పట్టించుకోని విచిత్ర పరిస్థితి అప్పట్లో విద్యాశాఖలో ఉండేది. పట్టిచుకోవడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో పాఠశాలల విలీనం ప్రక్రియను వెంటనే అపేయాలని మంత్రి బొత్స అధికారులను ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. ఆ సమయంలోనే మంత్రి రివ్యూ మీటింగ్ పెడితే, సగం మంది అధికారులు గైర్హాజరయ్యారు. ఇక వచ్చిన సగం మంది మంత్రి ఆదేశాలు అక్కడే చెత్త బుట్టలో పడేసి చక్కా పోయారని సెక్రటేరియట్ వర్గాలు అప్పట్లో జోకులు కూడా వేసుకున్నాయి. సీఎం ఆదేశాల మేరకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని అప్పట్లో రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
సరే తరువాత తరువాత అదంతా సద్దుమణిగిందనుకుంటుంటే.. బుధవారం (సెప్టెంబర్ 28) జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో సీనియర్ మంత్రి అని కూడా చూడకుండా బొత్స ముఖం మీదే ఆయన పని తీరు బాగాలేదని జగన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసి చిన్నబుచ్చారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.