కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ప్రియాంక?!
posted on Sep 29, 2022 @ 10:55AM
కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. త్వరలోనే నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఇదంతా ప్రతి పార్టీలోనూ మామూలుగా జరిగే వ్యవహారమే. కానీ కాంగ్రెస్ పార్టీ విషయం మాత్రం ప్రత్యేకం. పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటుండటం, ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు మోస్తున్న సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం.. గాంధీ కుటుంబం వినా మరో వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నిక గడువు సమీపిస్తున్న సమయంలో కూడా పార్టీ చీఫ్ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించడం లేదు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో గందరగోళం రోజు రోజుకూ చిక్కనౌతోంది.
పార్టీ అధినేత్రి ఏరి కోరి ఎంపిక చేసిన అభ్యర్థి గెహ్లాట్ నామినేషన్ వేయకుండానే తోక జాడించారు. తన వర్గానికి చెందిన వ్యక్తిని రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అంగీకరిస్తేనే అంటూ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసినంత పని చేశారు. ఆ తరువాత తమాయించుకుని సారీ చెప్పినా.. ఇక గెహ్లాట్ నమ్మే పరిస్థితి కాంగ్రెస్ అధిష్ఠానంలో కనిపించడం లేదు. కమల్ నాథ్ అనుకుంటూ ఆయనా ఆసక్తి చూపడంలేదు. దీంతో దిగ్విజయ్ సింగ్ పేరు తెరమీదకు వచ్చింది. నామినేషన్ దాఖలుకు ఒక్కరోజే గడువు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రసకందాయంలో పడిందని అంటున్నారు.
అసలు వాస్తవం చెప్పాలంటే.. 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటి నుంచీ ఆ పదవి ఖాళీగా ఉన్నదనే అనాలి. అనివార్య పరిస్థితిలో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా, ఆమె గతంలోలా పకడ్బందీగా, కచ్చితంగా ఆ బాధ్యతలను నిర్వర్తించలేకపోయారనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ తాత్కాలిక బాధ్యతలు కూడా తన వల్ల కాదని సోనియా తేల్చేశారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె విశ్రాంతి కోరుకోవడం సహజమే. అందుకే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ ను అంగీకరింపచేయడానికి పార్టీ వర్గాలు, సీనియర్ నేతలు, ఆఖరికి సోనియా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే అనివార్యంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్డింది.
గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వారిని ఎన్నుకోవాలన్న రాహుల్ సూచన మేరకు సోనియాగాంధీ గెహ్లాట్ ను ఎంపిక చేశారు. అయితే ఆయన తీరుతో ఇంకెంత మాత్రం గాంధీ కుటుంబం బయటవారికి అవకాశం ఇవ్వకూడదన్న నిర్ణయానికి సోనియా వచ్చేశారని చెబుతున్నారు. దీంతో రాహుల్ ఎటూ సుముఖంగా లేరు కనుక ప్రియాంకకు ఆ బాధ్యతలు కట్టబెట్టాలని సోనియా నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ శ్రేణులు, సీనియర్లు కూడా రాహుల్ కాకుంటే ఆమే ఆ పదవికి అన్ని విధాలుగా అర్హురాలని అంటున్నారు. ఆమెలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయని చెబుతుంటారు. ప్రియాంక గాంధీ కూడా ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రత్యక్ష ఆందోళనల్లో సైతం పాలు పంచుకుంటున్నారు. దీంతో ఆమెకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. దీంతో ప్రియాంక గాంధీ వాద్రా పేరు తెరపైకి వచ్చింది.
భారతీయసంప్రదా యం ప్రకారం ఆడబిడ్డకు పెళ్లయిన తర్వాత పుట్టింటి పేరు ఉండదని, అత్తంటి పేరే ఇంటిపేరు అవుతుందని, ఆమెను ఇంకెంత మాత్రం గాంధీ కుటుంబ సభ్యురాలిగా పరిగణించరాదని కాంగ్రెస్ ఎంపీ ఒకాయన తాజాగా ట్వీట్ చేశారు. అంటే ఆమెను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకుని పగ్గాలు అప్పగిస్తే గాంధీ కుటుంబేతర వ్యక్తికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లౌతుందని ఆయన తాత్పర్యం. .మరోవైపు, పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్వేసేందుకు సీనియర్ నేత శశిథరూర్ సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు.రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వైపు పార్టీ అధిస్థానం మొదటి నుంచీ మొగ్గుచూపుతూ వచ్చింది.అయితే ఊహించని విధంగా రాజస్థాన్లో తలెత్తిన పరిణామాలతో అధ్యక్ష పదవికి గెహ్లాట్ అభ్యర్థిత్వం డోలాయ మానంలో పడింది.
రాజస్థాన్లో తనఅనుచరగణానికే నచ్చచెప్పలేనిగెహ్లాట్... పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు ఎలాచక్కబెడతారనే ప్రశ్నలు మొదలయ్యాయి. సీనియర్ నేత కమల్నాథ్ ఢిల్లీకిచేరుకున్న ప్పటికీ ఆయనఅధ్యక్షుడి పదవిపై పెద్దగామొగ్గుచూపడం లేదు.మరో సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ సైతం పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన ఆచూతూచివ్యవహ రిస్తున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికలనామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో ఇంకా సందిగ్ధత తొలగలేదు. ప్రియాంకా గాంధీ యేతర కుటుంబ వ్యక్తిగా పరిగణించి ఆమెనే పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీలో దింపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఇది ఉభయతారకంగా ఉంటుందని సోనియా కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. గాంధీ కుటుంబం బయటి వ్యక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ అధినేత్రిగా ఎన్నుకుందని చెప్పుకోవచ్చునూ, అలాగే పార్టీ పగ్గాలు కుటుంబం చేతి నుంచి జారిపోకుండా చూసుకోవచ్చునని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు.