ఇక మిగిలింది రాజే..!!
posted on Sep 29, 2022 @ 9:50AM
అనగనగా ఓ రాజు. ఆయన అతికష్టంమీద రాజయినప్పటినుంచీ మళ్లీ ఛాన్స్ సంగతి ఎలా ఉన్నా దండు కోవాలి, దబాయించి పాలించాలన్నసూత్రాన్నే నమ్ముకుని కోరి కొందరిని దగ్గరికితీసుకుని ఆ పనుల్లో ఉండడ్రా అయ్యా అని పంపాడు. వారు దొరికిన చోటల్లా భజనలు, భోజనాలు చేస్తూ అయ్యవారికి కడుపారా సంతోషం కలిగిస్తూండేవారు. అప్పటికే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చేసింది. ఏటి చేయాలి? అని ఆలోచించుకునే సమయం ఇవ్వకుండానే ఓ రాజుగారు కొందరిని వెంటబెట్టుకుని రాజ ధానికి వచ్చి జనాన్ని, రాజుగారి అనుయాయుల్నీ హెచ్చరించి మరీ వెళ్లారు. అంతే రాజుగారికి మరింత కోపం వచ్చి రాత్రికి రాత్రే కొత్త రూల్స్ పెట్టి ప్రజల్ని ఇబ్బందిపెట్టడం ఆరంభించారు. ఎందుకొచ్చిన గోల ఈయన కాదుగాని మొన్నొచ్చినాయన్నే గద్దె ఎక్కి ద్దామని ఓ గ్రామంలో పంచాయితీ నిర్ణయించింది. అదే తడవుగా అన్ని గ్రామాలూ కలిసాయి. ఇక్కడ రాజుగారు ఏమన్నా పట్టించుకోవడం మానేశారు. దీనికి తోడు మంత్రి ని, సైన్యాధ్యక్షుడిని ఓ పాలి అలా తిరిగిరాండ్రా అని పురమాయించారు.
వారు డాలు, కత్తి సద్దుకుని గుర్రానికి పనిచెప్పి బయలుదేరారు. వారికి అరిటిపళ్లు, నీళ్లు ఇచ్చి వచ్చిన చోటల్లా వారి మాటలు, వాక్చాతుర్యాన్ని పట్టించుకోకుండా ప్రజలు వారి పనులు చేసుకుంటూండి పోయారు. దొరా, ఈళ్లు మారిపోయారయ్యా, మనోళ్లు గాదు..! అన్నాడు సైన్యాధ్యక్షుడు.. అవునేమో అను కున్నారు మంత్రిగారు. మెల్లగా జారుకుని రాజుగారి జరిగినదంతా చెప్పారు. ఆయన ఆశ్చర్య పోయారు. కానీ ఏమీ ఎరగనట్టు నటించి ..ఆళ్లకి అలా చేయమని నేనే సెప్పినాలే.. నీకెలా ఉంటదో చూద్దామని అలా జేసినా.. ఏమనుకోద్దు. ఈసారి ఎడం చేతి వేపు ఎల్లండి ఆడ బాగానే ఉంటారు. అన్నారు ఈసారి మంత్రితో పాటు కొందరు సైనికులనూ పంపారు. ఆయన్ను తిట్టడం, కొట్టడం చేస్తారనే భయంతో! ఆ ముచ్చటా అయింది.
రాజధాని నగరంలో పేద్ధ బంగ్లాలో అందర్నీ పిలిచి మీటింగ్‌పెట్టారు రాజుగారు. సమస్యలు, ప్రజల తీరు అన్ని వివరించి ఇపుడేం చేయాలా అని ప్రశ్నించారు. ఏమి చెబుతామని తల గోక్కున్నారంతా. ఏది చెప్పినా చివరి తన మాటే శాసనం రాజుగదా.. ఏం చెప్పిన వినడాయా.. ఎందుకు చెప్పడమని ఆయనకే ఆ అవకాశం ఇచ్చారంతా. ఒకే.. ఇంకా బాగా పనిచేయండి.. ఆనంద పర్చండి.. మీరు కావల్సింది అడగం డి.. అని విందుపెట్టి పంపించేరు. భుక్తాయాసం తీర్చుకుని ఇళ్లకు వెళ్లారంతే. మర్నాడు తాకీదులు వచ్చాయి..మీ పనేం బాగాలేదు ఉంటారా తీసేయాలా అని. అంతా కంగారుపడి పరిగెట్టుకొచ్చారు రాజు గారి దగ్గరికి. నిన్న భోజనం బాగుందా? అని అడిగి వంటోడిని రావద్దన్నా అన్నారు రాజుగారు. మనపనీ అంతేనేమో అనుకునేలోగానే నలుగురికి తాకీదులు ఇచ్చారు. మీసంగతేంది అని. వారు నవ్వునటించా రు. మీ సంగతేంది అనుకున్నారు!
తాకీదులు అందుకోవడంలో సిద్దహస్తుడు ఇవ్వడంలో ఆతృతా ప్రదర్శిస్తున్నారనుకున్నారంతా. ఏమై న్పటికీ సత్యదర్శనం అయిన తర్వాత ప్రజలే రాజులు. మనం కేవలం సేవకులమే రాజా అన్నా రంతా. అయినా రాజు వినడం లేదు. మళ్లీ తిట్టి పం పారు. తిట్టించుకోవడంలో వారికి ఆనంద మేమోగాని బరువు మోయడానికి ప్రజలు ససెమిరా అంటున్నారు. మొన్నొచ్చి మీటింగ్ పెట్టినాయన్నే కలుస్తు న్నారంతా. రాజుగారికి ఆ సంగతి తెలిసి రెండు విభాగాలకు తాయిలాలు పంచారు. వారు ఆ క్షణం కాస్తంత ఆనం దించారు. కానీ తాయిలాల కంటే రోజూ ప్రశాంతంగా తిండి, నిద్ర కావాలనుకున్నారు. రాజుగారికి విన్న వించుకు న్నారు.. ఆ రెండు తప్ప మరేమయినా కోరుకోండి ..అని మంత్రిచేత చెప్పించారు.
కాలం మారింది, ప్రజలూ మార్పు ఆశిస్తు న్నారు ప్రభూ.. మనం మారడానికి టిక్కెట్లు కొన్నాను..హిమాల యాలకు వెళ దామన్నారు మంత్రి సేనాపతీను. ఏమీ సేతురా నాయనా.. అని ఈసారి తనకు తప్ప అం దరికీ తాకీదులు ఇచ్చారు. .పక్కనే ఉండి ఇష్టమొచ్చిన పాటలు పాడి వినిపించే సన్ని హితుడితో సహా! సదరు సన్నిహితుడు రాజుగారు లెక్కల్లో పూర్.. ఎవరికి ఎన్ని తాకీదులు ఇస్తారో తెలుసుకోలేక పోతున్నా రని నవ్వుకున్నాడు.. గదిలో గద్దె మీద కూచున్న ఒక్కడినే చూసి!