జగన్ సర్కార్ రుణానంద లహరి
posted on Dec 15, 2022 @ 2:35PM
ఎవ్వనిచే జనించు ఋణ
మెవ్వనిచే భ్రమియించు లోకమం
దెవ్వని బుద్ధియే ఋణద
మెవ్వడు నవ్వుచు నప్పులిచ్చు దా
నివ్వగ జాలనంచనక
నివ్వగ జాలక, దిప్పనట్టి వా
డెవ్వడు --- ఆ ఋణాత్ము, ఋణదేశ్వరు
నేను ఋణంబు వేడెదన్
పోతన పద్యానికి ఇది ప్రసిద్ధ రచయత ముళ్లపూడి వెంకటరమణ పేరడీ. ఇప్పుడు ఈ పేరడి జగన్ సర్కార్ తీరుకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ముళ్లపూడి వెంకటరమణ సాహిత్యంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరు అప్పారావు. అవసరం, కారణాలతో సంబంధం లేకుండా అప్పులు చేసుకుంటూ పోవడం ఆ క్యారెక్టర్ తీరు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవరైనా సరే ఈ సర్కార్ ను అప్పారావు క్యారెక్టర్ తో పోల్చకుండా ఉండలేరు. ఎడాపెడా వృధా నియామకాలు, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ఉచిత పందేరాలు, ఇందు కోసం నిధుల లేమిని ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్ అప్పులను అలంబనగా చేసుకుంది. ఎడా పెడా.. ఎక్కడ దొరికితే అక్కడ కోట్లకు కోట్లు అప్పులు చేసేస్తోంది. ఒక కుటుంబ యజమాని ఏదైనా అవసరం కోసం అప్పు చేయాల్సిన అనివార్య పరిస్థితి వస్తే.. ఆ చేసిన అప్పు తీర్చడానికి ఉన్న మార్గాలేమిటి? తన కుటుంబ వ్యయాన్ని ఏ మేరకు నియంత్రించుకోవాలి, తీసుకున్న అప్పుకు నెలనెలా వడ్డీ ఎలా కట్టగలం అన్న అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని ఫరవాలేదు.. అప్పు తీర్చగలను అన్న నమ్మకం కలిగితేనే అప్పు చేస్తాడు.
అలాంటిది ఒక ప్రభుత్వాధినేత అప్పు చేయాల్సివచ్చినప్పుుడు.. ప్రభుత్వానికి ఉన్న ఆదాయవనరులేమిటి? అప్పు తీర్చేందుకు ఆ వనరులు సరిపోతాయా.. లేదా ఆదాయ పెంపు మార్గాలేమిటి? వంటివన్నీ ఆలోచించాలి. రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కుంటు పడకుండా అన్ని విధాలుగా ఆలోచించి ముందడుగు వేయాలి. కానీ డబ్బు కొడితే ఓట్లు రాలతాయి.. అనుకుంటూ.. ఆదాయానికి పొంతన లేకుండా వ్యయాలను పెంచేస్తూ.. అభివృద్ధిని విస్మరించి సాగితే... ఏమౌతుందో ప్రస్తుతం ఏపీ పరిస్థితిని చూస్తే అర్ధమౌతుంది.
ఇక మళ్లీ జగన్ సర్కార్ అప్పోపాఖ్యానం వద్దకు వస్తే.. ఏపీ సర్కార్ అప్పుల పై కేంద్రం కన్నెర్ర చేసింది. బ్యాంకులు ఇక ఇవ్వలేం బాబోయ్ అంటున్నాయి. ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఇంత చేసినా కేంద్రం ఏపీ సర్కార్ కోరడం ఆలస్యం అన్నట్లు అదనపు అప్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆర్బీఐ చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. దారులన్నీ మూసుకుపోయినా కిటికీలు బలవంతంగానైనా సరే తెరిచేసి జగన్ సర్కార్ అప్పుల బాటలో రాష్ట్రాన్ని తిరోగమన బాటలో బ్రహ్మాండంగా పరుగులెట్టించేస్తున్నది.
తాజాగా ఏపీ సర్కార్ మరో 2300 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఎందుకో తెలుసా?... రిజర్వ్ బ్యాంకు అప్పు తీర్చడానికి. ఎందుకంటే ఈ నెల 17లోగా ఓడీ అప్పు చెల్లించకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తామని రిజర్వ్ బ్యాంకు విస్పష్ట హెచ్చరిక జారీ చేయడంతో జగన్ ప్రభుత్వం మళ్లీ అప్పు చేసింది. మూడు కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని ఓ 23వందల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. ఇలా అప్పు చేసి అలా రిజర్వ్ బ్యాంకుకు 200 కోట్లు చెల్లించేసి.. మళ్లీ ఓడీకి లైన్ క్లియర్ చేసుకుంది. తీసుకున్న అప్పులో మిగిలిన 300 కోట్ల రూపాయలతో ప్రభుత్వోద్యోగుల నవంబర్ నెల వేతనాలకు కొందరికి చెల్లించింది. ఇంకా దాదాపు 30 శాతం మందికి వేతనాలు అందనే లేదు. వారికి వేతనాలు చెల్లించాలంటే మళ్లీ ఎక్కడో అప్పుపుట్టాల్సిన పరిస్థితి. జగన్ సర్కార్ ఇలా రుణగొణ ధ్వనితో అప్పులు చేస్తూ పాలనను నెట్టుకొచ్చేస్తోంది. ఇక్కడకు ఇది అలా ఉంచితే..
అసలు కార్పొరేషన్ల ద్వారా ఏపీ సర్కార్ కు రుణం ఎలా లభించిందన్నది సమాధానం రాని మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందు కంటే.. కార్పొరేషన్లద్వారా తీసుకున్న అప్పును ఆయా కార్పొరేషన్ల అభివృద్ది, అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే జగన్ సర్కార్ అందుకు భిన్నంగా వాడేసుకుంటోంది. దీంతో ఏపీలోకి కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వవద్దని, ఒక వేళ ఇస్తే ఆయా కార్పొరేషన్లకు తిరిగి ఆ అప్పు తీర్చే స్తోమత ఉందో లేదో పరిశీలించడంతో పాటు.. ఆ తీసుకున్న అప్పును ఎలా వినియోగిస్తున్నారో కూడా చూడాలని ఆర్బీఐ బ్యాంకులకు విస్పష్ట ఆదేశాలిచ్చింది. అయినా జగన్ సర్కార్ కు యథేచ్ఛగా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందుతున్నాయి. ఆర్బీఐ ఆదేశాలు ఉత్తుత్తినే ఇచ్చిందా? లేక ఆ ఆదేశాలను బ్యాంకులు ఖాతరు చేయడం లేదా? అంతా జగన్మాయ.. జగన్ రుణ లీలలు ఇన్నిన్ని కావు.