మద్యం మృతులకు నో ఎక్స్ గ్రేషియా.. బీహార్ సీఎం
posted on Dec 15, 2022 @ 4:41PM
సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ లో కల్తీ మద్యం కాటేసింది. ఈ కాటుకు 30 మంది బలయ్యారు. రాష్ట్రంలోని సారన్ జిల్లా ఇసువాపూర్ పరిధిలో బుధవారం మద్యం తాగిన వారిలో 30 మంది మరణించగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు.
మద్యం తాగిన వారిలో 21 మంది బుధవారం మరణించగా, మరో తొమ్మిది మంది మరణించారు. కాగా కల్తీ మద్యం కాటుకు 30 మంది మరణించిన ఘటనపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నా.. కల్తీ మద్యం విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కల్తీ మద్యం యథేచ్ఛగా ఏరులై పారుతోందనీ, ఇది ప్రభుత్వ వైఫల్యమేననీ విమర్శించాయి.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే విపక్షాల విమర్శలను తిప్పి కొట్టిన బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్ లో మద్య నిషేధం అమలులో ఉందని, అలాంటి రాష్ట్రంలో మద్యం తాగడం కూడా నేరమేనని అన్నారు. తాగితే చస్తారు. అలా చనిపోయన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేది లేదని స్పష్టం చేశారు.