వ్యతిరేక ఓట్లను చీల్చే పార్టీలకు స్వాగతం.. తెలుగు రాష్ట్రాల సీఎంల ఉమ్మడి వ్యూహం
posted on Dec 16, 2022 @ 9:53AM
ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు, అనివార్యంగా కనిపిస్తున్న ఓటమి నుంచి బయట పడేందుకు పరస్పర సహకారంతో ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య సఖ్యత ఎంత మేరకు ఉందనేది అనుమానమే, అయినా, నువ్వొకందుకు పోస్తుంటే, నేనోకందుకు తాగుతున్నాను అనే స్నేహ బంధం అయితే వుందనేది మాత్రం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే, ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు అవసరార్ధం చేతులు కలిపారని, ప్రతిపక్షాలు ఆరోపించడమే కాదు, ఆ ఇద్దరి నడక, నడతలను దగ్గరగా గమనిస్తున్న రాజకీయ పండితులు, విశ్లేషకులు సైతం అదే అంటున్నారు.
నిజమే 2019 ఎన్నికల్లోనూ వైసేపీని గెలిపించేదుకు,కేసేఆర్ ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మరీ ముఖ్యంగా ఆర్ధిక వనరులు సమకూర్చడంలో జగన్ రెడ్డికి సంపూర్ణ సహకరం అందించారు. అంతే కాదు, తెలుగుదేశం టికెట్ పై గెలిచి, తెరాసలో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాస యాదవ్ ను తెలుగు దేశం పార్టీకు వ్యతిరేకంగా రంగలోకి దించారు. తెలుగు దేశం పార్టీలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే పనికి తలసానిని ఉపయోగించారు. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన కేసేఆర్ చేతుల్లోకి వెళ్ళిపోయారనే ఆరోపణలు మొదలయ్యాయి. మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి.
అదేదో నాగార్జున సినిమాలో.. బ్రహ్మానందం, ముందు ఆమె నన్ను ప్రేమించింది ఆ తర్వాత నేను ఆమెను ప్రేమిచవలసి వచ్చింది అంటారు చూడండి, అలాగే, కేసీఆర్ వ్యూహత్మకంగా జగన్ రెడ్డిని ముగ్గులోకి లాగి ఉచ్చులో బిగించారని అంటారు. ముందు కేసీఆర్ జగన్ రెడ్డి దంపతులను హైదరాబాద్ కు ఆహ్వానించి, శాలువ కప్పి సన్మానం చేశారు. ఇక ఆతర్వాత ఏమి జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆఫ్కోర్స్ అలాగని జగన్ రెడ్డి అమాయకుడు కేసీఆర్ ఉచ్చులో చిక్కుకు పోయారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఇంతకు ముందే అనుకున్నట్లుగా, ఇద్దరు ఇద్దరే, నువ్వొకందుకు పోస్తుంటే నేనోకందుకు తాగుతున్నాను, అన్నట్లు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ ఆస్తులను, తెలంగాణ సర్కార్ కు సమర్పించి అందుకు ప్రతిఫలంగా హైదరాబాద్ లో తమ అక్రమ ఆస్తులను కాపాడు కోవడంలో కేసీఆర్ ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నారని అంటారు. అయితే, ఇలా ఇద్దరు సార్ల మధ్య సాగుతున్న బేరసారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా ఆంద్ర ప్రదేశ్ ప్రయోజనాలు ‘క్విడ్ ప్రో కో’ టైపులో కొట్టుకు పోతున్నాయని అంటారనుకోండి అది వేరే విషయం.
ఇక ప్రస్తుత ‘ప్యూర్’ పాలిటిక్స్ విషయానికి వస్తే, లక్ష్యం ఏదైనా కావచ్చును, తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కావచ్చును. కాదంటే, కాలం ఖర్మం కలిసోస్తే దేవెగౌడ లెక్క ప్రధాని కావాలనే పగటికలల ప్రభావమే కావచ్చును అదీ కాదంటే చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణలు, సిబిఐ, ఈడీ దాడుల నుంచి రక్షణ పొందే వ్యూహమే కావచ్చును కారణం ఏదైనా తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఏపీలో తెరాస నయా చహారా బీఆర్ఎస్ కు రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక్కడే మరోసారి, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ఉభయకుశలోపరి.. సంభాషణ మొదలైందని అంటున్నారు.
అందులో భాగంగా ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జగన్ రెడ్డి ... తెరాస నయా చహర.. భారత రాష్ట్ర సమితి (భారాస)కు స్వాగతం పలుకుతున్నారు. ఏపీ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు మద్దతుగా స్వాగత బ్యానర్లు వెలుస్తున్నాయి. అటు విజయవాడలో ఆఫీసు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అన్నిటి వెనకా ఎవరున్నారో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పటికే సజ్జల రామకృష్ణా రెడ్డి భారాసకు స్వాగతం పలికారు. మిగిలిన విషయాలు ముఖ్యమంత్రులు ఇద్దరూ మాట్లాడుకుంటారని అన్నారు. అంటే ఆ ఇద్దరి మధ్య ఇప్పటికే ఒక అవగాహన ఉందని సజ్జల చెప్పకనే చెప్పారు. నిజనికి ఇద్దరి మధ్య అవగాహన లేకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకునే ‘రహస్యం’ ఏముంటుంది? అందుకే, ఓటమి నుంచి తప్పించుకునేదుకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడి కుట్రకు పాల్పడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జగన్ రెడ్డి ఇప్పటికే సోదరి షర్మిలను బరిలో దించారు. ఇంతకాలం ఆమె ఎవరు విడిచిన బాణం అనే విషయంలో అనుమానాలున్నా, రీసెంట్ ఎపిసోడ్స్ లో ఆమె కేసీఆర్ కోసం జగన్ రెడ్డి వదిలిన బాణం అనే విషయం స్పష్టమైంది. అదొకటి అలా ఉంటే, ఇద్దరు ముఖ్యమంత్రుల ఉమ్మడి వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, (ఆప్) సహా మరికొన్ని, ప్రభత్వ వ్యతీరేక ఓటును చీల్చే పార్టీలు నాయకులకు స్వాగత తోరణాలు సిద్దం చేస్తునట్లు తెలుస్తోంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో చెప్పకనే చెపుతోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటై ఎన్ని వ్యూహాలు రచించినా, అక్కడ ఏపీలో వైసీపీ, ఇక్కడ తెలంగాణలో తెరాస ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యతిరేక పవనాల్లో కొట్టుకు పోవం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. చూద్దాం. కథ అయిపోలేదు.. సశేషమే!