తెర పైకి మళ్ళీ జమిలి ఎన్నికలు!
posted on Dec 16, 2022 8:41AM
దేశంలో నెక్స్ట్ జరిగేది జమిలి ఎన్నికలేనా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానం కాదనే జవాబు రెండూ ఒకేసారి వస్తున్నాయి. నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ, 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చింది మొదలు, కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సుముఖగానే వుంది. సుముఖంగా ఉండడమే కాదు,అప్పటి నుంచి ఆ దిశగా పావులు కదుపుతూనే వుంది. 2019 బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా’జమిలి’ అంశాన్ని చేర్చారు. 2019ఎన్నికల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జమిలి పై చర్చకు .. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జమిలి ఎన్నికల మంచి చెడులను చర్చించారు.
కాంగ్రెస్,కమ్యూనిస్ట్ పార్టీలు, ఒకటిరెండు ప్రాతీయ పార్టీలు మినహా, తెరాస సహా చాలా వరకు పార్టీలు జమిలికి జై కొట్టాయి.నీతీ ఆయోగ్ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రయాలను రికార్డు చేసింది. మరో వంక జమిలి ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపినా, నిర్దిష్ట సమయంలో లోక్’సభ, అసెంబ్లీలలతో పాటుగా స్థానిక సంస్థలు ఒకే సారి, ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా వుందని, అధికారులు పలు సందర్భాలలో పేర్కొన్నారు.
అంతే కాదు, జమిలి ఎన్నికల అవసరాన్ని, ప్రయోజనాలను వివరిస్తూ నిర్వహించే సెమినార్లు, వర్క్ షాపులలో కేంద్ర ఎన్నికల సంఘం క్రియాశీలక భూమికను పోషిస్తోంది. జమిలి ఎన్నికలకు సానుకూల వాతావరణం నిర్మాణంలో కేంద్ర ఎన్నికల సంఘం తన వంతు పాత్రను పోషిస్తోంది. అదలా ఉంటే, తాజగా కేంద్ర ప్రభుత్వం మరోమారు జమిలి ఎన్నికలకు సానుకులతను వ్యక్తపరిచింది. రాజ్యసభలో ఇందుకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయని తెలిపారు.1968, 69లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగిందని రిజుజు చెప్పారు. విడివిడిగా ఎన్నికల నిర్వహణతో బడ్జెట్ పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిపాలనలో సుస్థిరత కోసం జమిలి ఎన్నికలే మేలంటూ లా కమిషన్ తన 170వ నివేదికలోనూ సూచించిందని కేంద్రం తెలిపింది.
దీంతో మరోమారు జమిలి ఎన్నికలపై చర్చ మొదలైంది. అయితే అది అనుకున్నంత తేలిక కాదని, ముఖ్యంగా కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, జమిలి ఎన్నికల వస్తే, ప్రస్తుతం కేంద్రంలో, సగానికి పైగా రాష్ట్రాలో అధికారంలో ఉన్న బీజేపీని ఒకే సారి ఎదుర్కోవడం కష్టమనే రాజకీయ కోణంలో జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. అయితే, తరచుగా వచ్చే ఎన్నికల వలన నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని, అన్నిపార్టీల ఎంపీలు సభ్యులుగా ఉన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని తెలిపింది.
2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ. 7వేల కోట్లకు పైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చిందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది.అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్ పేర్కొంది. ఈ సవరణలను పార్లమెంట్ ఉభయ సభలతో పాటుగా, సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ లెక్కన మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలున్నాయి. రాజ్యసభలో బలం లేకపోయినా మద్దతిచ్చే పార్టీలున్నాయి. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు ఇదే సరైన సమయం అని ప్రధాని మోడీ భావిస్తే.. జమిలి ఎన్నికలు వచ్చినట్లే అంటున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కానీ, జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో వెనకా ముందవుతోంది. ఓ వంక జమిలి ఎన్నికలకు సై అంటూనే బీజేపీ,గుజరాత్, హిమాచల్ ఫలితాలు వచ్చిన వెంటనే 2023 లో జరగనున్న పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. కమిటీలు, రోడ్ మ్యాపులు సిద్ధచేసుకునే పనికి బీజేపీ రెడీ అయింది. అయితే, బీజేపీ నాయకులు మాత్రం మోడీ, షా నేతృత్వంలో బీజేపీ ఎన్నికల పరుగు నిరంతర ప్రవాహంలాగా సాగుతూనే ఉంటుందని, అంత మాత్రం చేత బీజేపీ, కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల అంశాన్ని అటకెక్కించినట్లు కాదని అంటున్నారు. అయితే, జమిలి ఎన్నికలు 2024 లో వస్తాయా? అంతకు ముందే వస్తాయా? అంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు.