వైసీపీ మంత్రులకు ఎదురుగాలి?.. 60 నియోజకవర్గాలలో వైసీపీ ఓటమి ఖరారేనా?
వైసీపీ మంత్రులకు రాష్ట్రంలో ఎదురు గాలి వీస్తోంది. జగన్ సర్కార్ తీవ్ర మైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పలువురు మంత్రులు తమ తమ నియోజకవర్గాలలో విజయం కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. తమ తమ నియోజకవర్గాలలో వారికి ప్రజాదరణ కరవైందని తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం తమ తమ నియోజకవర్గాలలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మంత్రులలో రోజా, విడదల రజని, ఉషశ్రీ చరణ్ , గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు, జోగి రమేష్, శంకర్ నారాయణ, మెరుగు నాగార్జున ఉన్నారు.
ఒక్క చాన్స్ అంటూ రాష్ట్రమంతా నడిచి వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. నిజమే.. అఖండ మెజారిటీతో ఆయన ఒంటి చేత్తో పార్టీకి అధికారాన్ని సముపార్జించి పెట్టారు. అయితే ఈ మూడున్నరేళ్లలో జగన్ కు ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబు అని జనం వగచేలా ఆయన పాలన ఉంది. రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు నమోదైతే, అది జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో అది మూడు శాతానికి పడిపోయింది. నిజానికి, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అన్నీ ఇన్నీ కాదు. అందుకే, ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు జపం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పర్యటనలకు లభిస్తున్న ఆదరణ చూస్తే, జనం జగన్ పాలనతో ఎంతగా విసిగిపోయారో, అర్థమవుతుంది. జగన్ పార్టీ విజయావకాశాలపై ఇటీవలి కాలంలో వచ్చిన సర్వేలన్నీ ఒకే మాట చెప్పాయి. ఆయన గ్రాఫ్ అతి వేగంగా పడిపోతోందని. కాగా తాజాగా శ్రీ ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో కనీసంలో కనీసం 60 స్థానాలలో వైసీపీ అత్యంత బలహీనంగా ఉందని.. అంటే 175 అవుటాఫ్ 175 అంటున్న జగన్ పార్టీ ఎన్నికలు జరగడానికి ముందే కనీసం 60కి పైగా స్థానాలలో వైసీపీ విజయం కోసం ఎదురీదక తప్పని పరిస్థితులు ఉన్నాయని శ్రీ ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది.
రాష్ట్రంలోని 70 వరకూ నియోజకవర్గాలలో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, మంత్రులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని శ్రీ ఆత్మ సాక్షి సర్వే వెల్లడించింది. ఆయా నియోజకవర్గాలలో మంత్రి రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం, మరో మంత్రి విడదల రజని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరి పేట నియోజకవర్గం, మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిథ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గం కూడా ఉన్నాయి. కూడా ఉండటం గమనార్హం. ఇక పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు, అలాగే విజయనగరం జిల్లా శృంగవరపు కోట, విజయనగరం, బొబ్బిలి, కురుపాంలు ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, అనకాపల్లి, అరకు, పాయకరావు పేల, గాజువాక నియోజవర్గాలలో వైకాపీ అత్యంత బలహీనంగా ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పిఠాపురం, పి.గన్నవరం, అమలాపురం, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, ఉండి, నిడదవోలు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాలలో వైపీపీ పరిస్థితి ఎదురీతగానే ఉందని సర్వే వెల్లడించింది.
అలాగే కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని జిల్లా పరిధిలోని విజయవాడ వెస్ట్, కైకలూరు, నందిగామ, పెడనలలోనూ, గుంటూరు జిల్లాలోని తాడి కొండ, వినుకొండ, చిలకలూరి పేట, తెనాలి, బాపట్ల, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, వేమూరు, పొన్నూరులలో వైసీపీ తీవ్ర మైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
ఇక ప్రకాశం జిల్లాలోనూ వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ జల్లాలోని సంత నూతల పాడు, కనిగిరి, పరుచూరు, అద్దంకి, దర్శిలలోనూ, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ, కావలి, గూడూరు, ఉదయగిరిలలోనూ వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప లో కూడా మైదుకూరు, తాడిపత్రి, పెనుకొండ, కదిరి, కల్యాణ దుర్గం నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది. అదే విధంగా కర్నూలుజల్లాలో కూడా కర్నూలు, నంది కొట్కూరు, పత్తికొండ, పాణ్యం, ఆలూరులలోనూ, చిత్తూరు జిల్లా నగరి, సత్యవేడు, పుతలపట్టు, పలమనేరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు గాలి వీస్తున్నది.
ముఖ్యమంత్రి జగన్ సహా అధికార పార్టీ నాయకుల సభలు జనంలేక వెలవెలబోవడం, అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబు సహా ఆ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టడంతో రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆత్మసాక్షి సర్వే కూడా ఆ విశ్లేషణలకు బలం చేకూర్చేదిగానే ఉంది.