నిర్భయ ఘటనకు పదేళ్లు... దేశంలో మార్పేది.. మృగాళ్లకు శిక్షలెక్కడ?
posted on Dec 16, 2022 @ 10:34AM
దేశాన్ని కదిలించి కన్నీళ్లు పెట్టిన నిర్భయ సంఘటన జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు. దేశంలో మహిళల భద్రత గాలిలో దీపం అని ప్రపంచానికి చాటిన ఘటన అది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ అమ్మాయిపై సామాహిక అత్యాచారం జరిగింది. తన స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కిన ఆమెపై సామూహిత అత్యాచారం జరిగింది. అత్యంత పాశవికంగా హింసించి ఆమెపై అఘాయిత్యం చేసి బస్సులోంచి తోసేశారు. ఆమె స్నేహితుడిని సైతం కొట్టి బయట పారేశారు. ఈ అత్యాచార ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌ను కుదిపేసింది. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేత కన్నీళ్లు పెట్టించింది. దేశం అంతా కదిలిపోయింది. ఆగ్రహంతో రగిలిపోయింది. ప్రభుత్వమూ స్పందించింది.
నిర్భయ పేరుతో చట్టం తీసుకొచ్చింది. తర్వాతి కాలంలో నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష పడింది. అయితే ఈ ఘటన జరిగి పదేళ్లయినా మహిళల భద్రత విషయంలో దేశంలో పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు వచ్చిన దాఖలాలు లేవు. కఠిన చట్టాలు తీసుకు వచ్చినా మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి.
చాలా ఘటనల్లో దోషులకు శిక్షలు పడటం లేదు. మహిళలపై అఘాయిత్యాల కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి సత్వరమే శిక్షలు పడేలా చేయాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఆ కారణంగానే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఇందుకు జాతీయ క్రైం బ్యూరో రికార్డులే సాక్ష్యం. గత ఏడాది అంటే 2021లో దేశంలో మహిళలపై అత్యాచారాలు 2020తో పోలిస్తే 40శాతం పెరిగాయి. దేశ రాజధాని నగరంలో అయితే 2021 సంవత్సరంలో మహిళలపై నేరాల సంఖ్య 13 వేలు. తాజాగా స్కూలుకు వెళ్లే చిన్నారిపై యాసిడ్ దాడి జరిగింది. మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నంత కాలం తమ కుమార్తె నిర్భయకు న్యాయం జరిగినట్లు కాదని నిర్బయ తల్లిదండ్రులు అన్నారు.
పారామెడికల్ స్టూడెంట్ అయిన నిర్భయ 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి తన స్నేహితుడితో కలిసి ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. అందులో ఉన్న ఆరుగురు కామాంధులు ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సును ఢిల్లీ వీధుల్లో తిప్పుతూ ఒకరి తర్వాత ఒకరు ఆ అమాయకురాలిపై పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడారు. జననాంగాల్లో ఇనుప రాడ్డులు జొప్పించడంతో బాధితురాలి పేగులు చిధ్రమయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న ఆమెను ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డపై విసిరేసి పరారయ్యారు.
ముందుగా ఢిల్లీలో చికిత్స పొందిన నిర్భయను ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం సింగపూర్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘోర ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. దేశ నలుమూలలా ఆందోళనలు, ర్యాలీలు ఒక ఎత్తయితే ఢిల్లీ వేదికగా సాగిన పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించింది. ఈ ఉద్యమానికి యువతే మార్గ నిర్దేశం చేసింది. అనేక యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో వచ్చిన యువతీ యువకులు ఇండియాగేట్‌పై దండెత్తారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించిన ఘటన ఇదే.
అమాయక అబలలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలని..నిర్భయ లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్భయ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ.. ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో రోజుకు సగటున 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అత్యాచార కేసుల సంఖ్య పెరుగుతున్నా ఈ కేసుల్లో నిందితులలో చాలా తక్కువ మందికి శిక్షలు పడుతున్నాయి.ఎన్ని చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు విధించినా మార్పు శూన్యం. మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎప్పటిలానే కొనసాగుతున్నాయి.