గుంజీలు తీస్తే బస్ టికెట్ ఫ్రీ.. ఎక్కడంటే?
posted on Dec 15, 2022 6:21AM
ఇప్పటి పిల్లలకు తెలియదు కానీ.. గతంలో స్కూళ్లలో హోంవర్క్ చేయకపోయినా, అల్లరి చేసినా గుంజీలు తీయించే వారు. గోడ కుర్చీ వేయించేవారు. అవి పిల్లలకు అప్పట్లో విధించే శిక్షలు. కానీ గుంజీలు తీయడం వ్యాయామంలో అతి కీలకమన్న విషయం అప్పట్లో శిక్షలు విధించిన టీచర్లకు కానీ, వాటిని అనుభవించిన విద్యార్థులకు కానీ తెలియదు. ఇప్పుడు అందరిలోనూ హెల్త్ కాన్షస్ నెస్ పెరిగింది.
జిమ్ములనీ, మార్నింగ్ వాక్ లనీ, సిట్అప్స్ (గుంజీలు) అని ఎక్కువ మంది ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు. కానీ చాలా మందికి వ్యాయామాలంటే బద్ధకం. లేదా పని ఒత్తిడిలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి వారి కోసం గుంజీలు తీస్తే బస్ టికెట్ ఫ్రీ అని బంపరాఫర్ ప్రకటించిందో ప్రభుత్వం. ఔను నిజమే రొమేనియా నగరంలో స్పెర్ట్స్ ఫెస్టివల్ అనే ఒక హెల్త్ మిషన్ లో భాగంగా రొమేనియా ప్రభుత్వం ఈ బంపరాఫర్ ఇచ్చింది.
గుంజీలు తీసి పొందిన ఫ్రీ బస్ టికెట్ కు ఓ పేరు కూడా పెట్టేసింది. దాని పేరు హెల్త్ టికెట్. అయితే ఈ టికెట్ పొందాలంటే రెండే రెండు నిముషాల్లో 20 గుంజీలు తీయాలి. అలా తీస్తేనే హెల్త్ టికెట్ అనే ఫ్రీ బస్ టికెట్ ఇస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.
ఆ విడియోలో ఓ అమ్మాయి టికెట్ మిషన్ ఎదుట నిలబడి 20 గుంజీలు తీసింది. ఆమె గుంజీలు తీయడం పూర్తి కాగానే టికెట్ మిషన్ నుంచి టికెట్ బయటకు వచ్చింది. మన దేశంలో కూడా ప్రజలలో వ్యాయామం పట్ల ఆసక్తినీ, అవగాహనను పెంపొందించడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.