2022 రౌండప్ .. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే కీలకం
posted on Dec 15, 2022 @ 12:42PM
మార్చి 2022
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. మరి కొద్ది రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే ...తెలుగు మాసాల్లో మాసానాం మార్గశీర్షోహం – అన్ని మాసాల్లోకి మార్గశిర మాసం శ్రేష్టమైనది అన్నట్లుగా 2022 సంవత్సరంలో మార్చి మాసానికి, ప్రత్యేక ప్రాధాన్యత వుంది. అంతకు ముందు నెలరోజులకు పైగా జరిగిన ఐదు రాష్త్రాల ఆసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందుకే 2022 మార్చి నెలలో ఎన్నికల ఫలితాలే మీడియా ఫోకస్ గా నిలిచాయి.
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ తేదీవరకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్టాల శాసన సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తర ప్రదేశ్,లో అత్యధికంగా ఎనిమిది విడతల్లో పోలింగ జరిగితే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు విడతల్లో పోలింగ్ జరిగింది.
మార్చి 10 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్’ లో కాంగ్రెస్’ ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ ... ఆప్ అధికారంలోకి వచ్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈ ఓటమి నుంఛి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని అన్నారు.
యోగీ ఆదిత్య నాథ్. మార్చి 25 న వరసగా రెండవ సారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ... ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే, పుష్కర్ సింగ్ ధామి మార్చి 23న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దామి అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా నియోజక వర్గంలో ఓటమి చవిచూశారు. అయినా, బీజేపీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 16 పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. మార్చి 28 న గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపధ్యంగా మార్చి 13...న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీబ్ల్యుసి సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం పట్ల పూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలుతీసుకుంటారని సీడ్ల్యుసి విశ్వాసం వ్యక్త పరిచింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడ్ల్యుసి సభ్యులు మరోమారు విజ్ఞప్తి చేశారు.
మార్చి నెల చివరి రోజు, అంటే మార్చి 31 న రాజ్యసభ పదవీ కాలం ముగిసిన 72 మంది సభ్యులకు వేడ్కోలు పలికింది. అలాగే, పెద్దల సభలో ఇటీవల కాలంలో తొలి సారిగా బీజేపీ సంఖ్యాబలం వంద మార్కు దాటింది.
ఏప్రిల్ 2022 విశేషాలు రేపు