కమలానికి కన్నా గుడ్‌బై?
posted on Dec 15, 2022 @ 3:27PM
ఉభయ తెలుగు రాష్ట్రాలలో, ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయ ముంది. ముందస్తు ఎన్నికలు తధ్యమని ప్రచారం జరుగుతున్నా, ఆ ముచ్చట ముడిపడే సూచనలు పెద్దగా కనిపించడం లేదు. అయినా అటు ఏపీలో, ఇటు తెలగాణ ఎన్నికల సందడి ఉపందుకుంటోంది, పొత్తులు,ఎత్తులు తెరపై కొస్తున్నాయి. రాజకీయ లెక్కలు మారి పోతున్నాయి. ఉభయ రాష్ట్రాల రాజకీయ ‘కుల’ సమీకరణాలు కలగాపులగంగా కలిసి పోతున్నాయి.
ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలలో ఎంతో కొంత సినిమా, రాజకీయ గ్లామర్’ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందనే వార్త సహజంగానే ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఏపీలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం అంటే ... ఎవరికోసం అనే ప్రశ్న సహజంగానే, పై కొచ్చింది. అంతే కాదు అక్కడ ఎపీలోనూ పవర్ స్టార్, బీజేపీతో తెగతెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. నిజానికి, బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా లేనట్లే, ఎవరి దారిలో వారు పోతున్నారు. రోడ్ మ్యాప్ అవీ ఇవీ అని మాట్లాడుతున్నా ఎప్పుడైనా బీజేపీ, జనసేన బంధం పుటుక్కుమనవచ్చనే ఉహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
అదలా ఉంటే, ఇప్పడు బీజేపీ - జనసేన పొత్తు కథ కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ ను వదిలి కమలం గూటికి చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారయణ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్త గుంటూరు జిల్లా రాజకీయాల్లో చాలా కాలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి వచ్చిన కొద్ది కాలానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిని చేరుకున్న కన్నా, గత కొంత కాలంగా పార్టీలో తనకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోతోందనే అసంతృప్తిని అక్కడా, ఇక్కడా వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా తన నుంచి పార్టీ అధ్యక్ష పగ్గాలు పుచ్చుకున్న సోము వీర్రాజుకు కన్నాకు మధ్య దూరం పెరిగింది. సోము వీర్రాజు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కన్నా సన్నిహితుల వద్దనే కాదు మీడియా ముందు కూడా మొరపెట్టుకున్నారు. అయినా బీజేపీ అగ్ర నాయకత్వం కన్నా వేదనను ఏమంత పట్టించుకోలేదు. అందుకే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు, పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
అందుకు తగ్గట్టుగానే బుధవారం(డిసెంబర్14) కన్నా ఇంటికి అనుకోని జనసేన అతిథి వచ్చారు. జనసేన పీఏసీ చైర్మన్, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ మరి కొందరు స్థానిక నాయకులను వెంట పెట్టుకుని కన్నా ఇంటికి వచ్చారు. దీంతో ఇప్పటికే ఆయన పార్టీ మారబోతున్నారని గాల్లో వినిపిస్తున్నవదంతులకు మరింత బలం చేకూరింది. నిజానికి, నాదెండ్ల మనోహర్ ఒకరిద్దరు అనుచరులతో వచ్చి వెళ్లుంటే ఎలా ఉండేదో ఏమో కానీ, అది అలా జరలేదు. మరో వంక అదే సమయంలో కన్నా అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకోవడంతో ఏదో జరుగుతోందనే గుసగుసలు గుప్పుమన్నాయి.
ఈ నేపధ్యంలోనే గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. రెండు మూడు నెలల క్రితం కన్నా పార్టీని నడిపే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆయన పరోక్షంగానే అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కారాలు మిరియాలు నూరారు. అలాగే, రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా కన్నా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన జనసేన ముఖ్యనేతతో భేటీ కావడంతో పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకున్నారా అనే వార్తలు జోరందుకున్నాయి.
అయితే, చివరకు అటు కన్నా, ఇటు నాదెండ్ల కూడా అబ్బే అదేం లేదు. ఒకప్పుడు ఒకే గూటి పక్షులం కదా, పైగా కలిసి చాలా కాలమైంది..ఒకసారి కలసి కూర్చుని కబుర్లాడుకున్నాం.. అంతే అంతకు మించి ఇంకేమీ లేదు. కోడి గుడ్డు మీద ఈకలు పీక్కండి అనే అర్ధం వచ్చేలా చిన్నపాటి వివరణ ఇచ్చారు. కానీ, ఆడవారి మాటలకే కాదు, రాజకీయ నాయకుల మాటలకూ అర్థాలు వేరనే విషయం తెలియంది కాదు. అవునంటే కాదని, కాదంటే అవునని అనే కదా అని అనుకునే వారు అనుకుంటున్నారు. అలాగే, ‘దాల్ మే కుచ్ కాలా హై ..అని కొందరు హిందీలో, నిప్పులేనిదే పొగ రాదుగా అని తెలుగులో ఇంకొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే కన్నా పార్టీ మారడం విషయం ఎలా ఉన్నా కేసేఅర్, జగన్ రెడ్డి సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో, పవన్ కళ్యాణ్ హీరోనా ..? విలనా? అనేది ..అసలు ఆయన నటిస్తున్నారా .. నటిస్తుంటే ... ఇలా చాలా చాలా కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి.