పెద్దల సభల వల్ల పెద్దగా ఉపయోగం వుందా?
posted on Apr 12, 2017 @ 11:51AM
ప్రజాస్వామ్యం అంటే ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్ అంటారు! కాని, కొన్ని వ్యవస్థలు మాత్రం ప్రజస్వామ్యంలో విచిత్రంగా, విషాదంగా వుంటాయి. కేవలం ప్రజాధనం దుబారా చేసేందుకు ఇవ్వి ఉపయోగపడుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటే పెద్దల సభకి కొంత మందిని నామినేట్ చేయటం! నిజానికి డెమోక్రసీ అంటే జనం మద్దతుతో పార్లమెంట్ కు రావటం! దానికి విఘాతం కలిగేలా పని చేసేదే రాష్ట్రాల స్థాయిలో శాసన మండలి, జాతీయ స్థాయిలో రాజ్యసభ! ఈ రెండు సభల్లోనూ నాయకుల్ని జనం ఎన్నుకోరు. ఎమ్మెల్సీల్ని కొందర్ని గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఎన్నుకున్నా సామాన్య జనం అందరూ ఓటు వేసే వీలుండదు. ఇక రాజ్యసభలో అయితే అందరూ పరోక్షంగా ఎన్నుకోబడ్డవారే! అయితే, మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడతారు కాబట్టి వార్ని కూడా మనం ఎంచుకున్నట్టే లెక్కా!
రాజ్యసభ అభ్యర్థుల విషయంలో ఆయా పార్టీల నిర్ణయామే ఫైనల్! అందుకే, దాదాపుగా అన్ని పార్టీలు పెద్దల సభ వ్వవహారాన్ని రాజకీయ పునరావాసంగా మార్చేశాయి! కొంత మంది దమ్మున్న రాజకీయ నేతలు తప్ప మిగతా వారంతా తమకు రాజ్యసభలోకి పార్టీల ప్రాపకాన్ని పొంది వచ్చిన వారే! బిజినెస్ మెన్ , జర్నలిస్టులు, స్పోర్ట్స్ స్టార్స్, సినిమా స్టార్స్… ఇలా అందరికందరూ పెద్దల సభనే ఎంచుకుంటూ వుంటారు. కారణం జనం ముందకు పోయి ఓట్లు అడిగి గెలవాల్సిన పని లేకపోవటమే!
ఎన్నో కీలకమైన బిల్లుల ఆమోదంలో ప్రధాన పాత్ర పోషించే రాజ్యసభ జనం ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎన్నికైనా వారితో వుండవచ్చా? ప్రస్తుతం 2014 నుంచీ పూర్తి మెజార్టీతో వున్న మోదీ సర్కార్ రాజ్యసభ గండాన్నే ఎదుర్కొంటోంది. ఎప్పటికప్పుడు విపక్షాలు అనేక బిల్లుల్ని రాజ్యసభలో అడ్డుకుంటున్నాయి. ఇది జనం నమ్మి అధికారాన్ని ఇచ్చిన ప్రభుత్వాన్ని పని చేయనీయకపోవటమే తప్ప మరోకటి కాదు! గతంలో కాంగ్రెస్ అధికారంలో వుంటే బీజేపి కూడా రాజ్యసభలో అడ్డుకున్న సందర్భాలున్నాయి!
రాజ్యసభలో జనం చేత నేరుగా ఎన్నుకోని నాయకులు బిల్లులకి అడ్డు చెప్పటం ఒక ఎత్తైతే … మరి కొందరు సెలబ్రిటీలు రాజ్యసభ సభ్యత్వాన్ని కేవలం ఒక అవార్డ్ లాగా భావించటం మరింత శోచనీయం! ఈ విషయంలో పదే పదే ప్రస్తావనకు వచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్, బాలీవుడ్ లివింగ్ లెజెండ్ రేఖ! వీరిద్దరూ దేశానికి చేసిన సేవ ఎవ్వరూ కాదనలేనిది! వారి వల్ల భారత్ కీర్తి ఇనుమడించింది. కాని, వీరు ఇద్దరూ రాజ్యసభకి నామినేట్ అయిన వారే. సరిగ్గా 5 ఏళ్ల కిందట ఏప్రెల్ 2012లో సచిన్, రేఖ పెద్లల సభలో కాలుమోపారు. అప్పటి నుంచీ మొత్తం 348 రోజులు సభ నడిస్తే వీరిద్దరూ పాల్గొన్నది పాతిక రోజులు కూడా లేదు! ఏ ఒక్కసారీ ఏ చర్చలోనూ సచిన్, రేఖ పాల్గొనలేదు. రేఖ అయితే కనీసం ఒక్క ప్రశ్న అన్నా అడగలేదు!
సచిన్ , రేఖా లాంటి వారు రాజ్యసభకు రాకపోతే ఏమవుతుంది? వారు సెలబ్రిటీలు కదా …. గౌరవ సూచకంగా వారికి సభ్యత్వం ఇచ్చి వుంటారు… అని కూడా కొందరికి అనిపించవచ్చు! కాని, దేశ అభివృద్ది కోసం ఉద్దేశించిన రాజ్యసభలో మెంబర్ అయి వుండీ ఎలాంటి సలహాలు, సూచనలు చేయకపోవటం, కనీసం అభిప్రాయాల్ని అయినా వ్యక్తపరచకపోవటం … సబబు కాదు. మరో విషాదం ఏంటంటే… సచిన్ , రేఖా లాంటి యాబ్సెంట్ సెలబ్రిటీల జీత, భత్యాలకి భారీగా ఖర్చవుతుంటుంది! రేఖ కోసం ఇప్పటి వరకూ 65 లక్షలు , సచిన్ కోసం 59లక్షలు ప్రజాధనం వృథా అయిందట! ఇది లివింగ్ లెజెండ్స్ గా పరిగణింపబడుతున్న వారికి ఎంత మాత్రం గౌరవం కాదు!
రాష్ట్రాల స్థాయిలోని శాసన మండళ్లనీ . జాతీయ స్థాయిలోని రాజ్యసభని మనం అప్ డేట్ చేసుకోవాల్సిన సమయం వచ్చినట్టే అనిపిస్తోంది. ఈ రెండు వ్యవస్థల్లోని నాయకులు మరింత ఎక్కువగా జవాబుదారీతనంతో వుండేలా, దేశ అభివృద్ధికి చురుగ్గా తోడ్పాటు అందించేలా నియమాలు మార్చాలి. సంస్కరణలు తేవాలి!