మమతపై రామబాణం ఎక్కుపెట్టిన ఆరెస్సెస్, బీజేపి!
posted on Apr 5, 2017 @ 6:03PM
బెంగాల్ లో భారీ మార్పులే జరుగుతున్నాయి. సాధారణంగా పెద్దగా వార్తల్లో కనిపించని మమత దీదీ సామ్రాజ్యం ఇప్పుడు ఎప్పటికప్పుడు వివాదాలతో న్యూస్ లో వుంటోంది. తాజాగా రామనవమి సెగ మమతమ్మకు బాగానే తాకింది. ఏకంగా హైకోర్ట్ మొట్టికాయలు వేసే సరికి బెంగాల్ పరిస్థితి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకొచ్చింది!
మూడు దశాబ్దాలు కమ్యూనిస్టులు కోల్ కతాని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. వాళ్ల పట్టు నుంచి పట్టుదలతో బెంగాల్ ని విడిపించింది దీదీ. కాని, ఇప్పుడు ఆమె కూడా కమ్యూనిస్టులు చేసిన తప్పే తిరిగి చేస్తున్నట్టు కనిపిస్తోంది! నిజానికి మొదటి సారి అయిదేళ్ల కాలాన్ని చక్కగానే నెట్టుకొచ్చిన మమత రెండోసారి మరింత మెజార్టీతో అసెంబ్లీలో కాలు పెట్టింది. కాని, ఈసారి ఆమెకు ఆరెస్సెస్, బీజేపి తరుఫు నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. అందుక్కారణం మమత స్వయంగా చేసుకుంటోన్న కృతాపరాధలే!
బెంగాల్ లో భారీగా ముస్లిమ్ లు వుంటారు. హిందువులే మెజార్టీలు అయినప్పటికీ అక్కడ మొదటి నుంచి ముస్లిమ్ లు అధికంగానే వుంటారు. ఇప్పుడు మమత వచ్చాక పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి వేల సంఖ్యలో వలసలు కొనసాగుతున్నాయని ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి. ఆ మధ్య బంగ్లా ప్రధాని షేక్ హసీనా కూడా ఇదే మాట చెప్పటం పరిస్థితి తీవ్రతని తెలుపుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఒక పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ ముస్లిమ్ లని బెంగాల్లోకి తీసుకు వచ్చి తన ఓటు బ్యాంక్ లో చేర్చుకుంటోంది. ఇదే ఇప్పుడు బెంగాలీ హిందువుల్లో కొందరికి తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఆరెస్సెస్,బీజేపీ మమత మార్కు ఓటు బ్యాంక్ రాజకీయాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటూ వస్తున్నాయి.
బెంగాల్లో హిందూ పండుగలు జరుపుకోవటంపై ఈ మధ్య పదే పదే వివాదాలు తలెత్తున్నాయి. చాలా చోట్ల మమత ప్రభుత్వం దుర్గా పూజ లాంటి ప్రధాన సంబరాల్ని కూడా సరిగ్గా జరుపుకోనివ్వటం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులతో బెదిరించేస్తున్నారు తృణమూల్ మంత్రులు, కార్యకర్తలు! ఇప్పుడు ఇదే బీజేపికి రామబాణంలా చేతికి దొరికింది. తాజాగా రామనవమి సందర్భంగా కోల్ కతాలో అనేక ర్యాలీలు నిర్వహించింది ఆరెస్సెస్. బీజేపి మద్దతు పలికింది. కాని, మమత తనదైన స్టైల్లో లోకల్ మున్సిపాలిటీల చేత పర్మిషన్లు ఇవ్వనీయలేదు! చివరకు కొందరు రామనవమి ర్యాలీ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్ట్ తృణమూల్ ను తలంటి పర్మిషన్ ఇచ్చింది. రామనవమి ర్యాలీలకి పోలీస్ రక్షణతో సహా అన్ని బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలిని తీర్పునిచ్చింది!
కోర్టులో కూడా చుక్కెదురు కావటంతో ఈసారి రామ నవమి ఉత్సవాల్లో తృణమూల్ క్యాడర్స్ ఉత్సహంగా పాల్గొన్నాయి. మైనార్టీల మెప్పు కోసం దుర్గా, రామ నవమి పూజల్ని అడ్డుకున్న అదే పార్టీ ఈ సారి రూటు మార్చి రాములోరి ర్యాలీలు నిర్వహించింది! కాని, విడ్డూరంగా… అరెస్సెస్, బీజేపి నిర్వహించిన రామ నవమి ర్యాలీల్లో జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తే … తృణమూల్ వారి ర్యాలీల్లో జై మమత అంటూ నినాదాలు వినిపించాయి!
మైనార్టీల హక్కుల్ని కాపాడటం వరకూ సరైందే కాని… ఏకంగా బీజేపి చెబుతోన్నట్టు హిందువుల్ని మైనార్టీల్ని చేసి బంగ్లాదేశీ అక్రమ చొరబాట్లతో ముస్లిమ్ లను మెజార్టీల్ని చేయాలనుకోవటం … దుర్మార్గం అవుతుంది. అదే కాని, మమత బెనర్జీ వ్యూహమైతే మాత్రం రాబోయే ఎన్నికల్లో కమల వికసానికి దీదీయే అద్బుతమైన అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి, ఒకవేళ బెంగాల్లో మతోన్మాదం లాంటి సూడో సెక్యులర్ ఉన్మాదం అమలు అవుతోంటే… గుర్తించి రూపు మాపటం తక్షణ కర్తవ్యం. లేదంటే, అది రాజకీయంగా, సామాజికంగా కూడా అనేక ఘర్షణలకు దారి తీయవచ్చు!