కోదండరాముడు…. గులాబీని ఎదుర్కోటానికి కమలాన్ని ఎంచుకున్నాడా?
posted on Apr 5, 2017 @ 6:04PM
బీజేపికి రాముడి అనుగ్రహం మిగతా పార్టీల కంటే ఎక్కువే! ఆయన దయతోనే రెండు సీట్ల నుంచి ఇవాళ్ల రెండు వందల ఎనభై సీట్లకు చేరుకుంది కమలం! అయితే, తెంగాణలోనూ బీజేపి ఒక రాముడితో క్లోజ్ అవుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ కోదండ రాముడు దేవుడు కాదు. అయోధ్య రాజు అంతకన్నా కాదు. మన ఉద్యమ వీరుడు ప్రొఫెసర్ కోదండరామ్!
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత వేగంగా ఫేమస్ అయిన వారిలో కోదండరామ్ ఒకరు. మరీ ముఖ్యంగా, డిసెంబర్ తొమ్మది ప్రకటన చేసి కాంగ్రెస్ వెనక్కి వెళ్లాక ఆయన జేఏసీ చైర్మన్ గా ఇంతింతై అన్నట్టు ఎదిగారు. అసలు ఒక క్లాసులో పాఠాలు చెప్పుకునే లెక్చరర్ కి అంత పేరు రావటం మామూలు విషయం కాదు. కాని, ఉద్యమం కోదండరామ్ ని నాయకుడ్ని చేసేసింది. కాని, తీరా రాష్ట్రం సిద్ధించాక సీన్ రివర్స్ అయింది!
కేసీఆర్ తో భుజం భుజం కలిపి ఆంధ్రా పాలకుల్ని ఎదుర్కొన్న కోదండరామ్ పత్యేక రాష్ట్రం వచ్చాక మాత్రం గులాబీ పార్టీకి దూరంగా వుండిపోయారు. మూడేళ్లు పూర్తి కావొస్తోన్న తరుణంలో ఇప్పుడు ఆయన కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థిగా కూడా నిలబడతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వారు టీ కాంగ్రెస్ కన్నా సీరియస్ గా ప్రొఫెసర్ సాబ్ నే తీసుకుంటున్నారు. ఎంపీల వద్ద నుంచి చోటా మోటా నాయకుల వరకూ కూడా అందరూ కోదండరామ్ పై గుర్రుగా వున్నారు. అందుకు ఆయన యువతకు ఉద్యోగాలు ఏవీ అంటూ తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తటడమే కారణం!
కోదండరామ్ ధర్నాలు, రాస్తారోకోలు అంటూ రోడ్లపైకి రావటంతో కేసీఆర్ ఇందిరా పార్కు వద్ద నుంచి ధర్నా చౌక్ నే తొలగించారు. ఇది చాలా మందికి నచ్చటం లేదు. అందులో ప్రతిపక్ష బీజేపి కూడా వుంది. అందుకే, ధర్నా చౌక్ అంశం పై చర్చించటానికి కోదండరామ్ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తో భేటీ అయ్యారు. ఇది నిజంగా పెద్ద ఆశ్చర్యకర విషయం కాదు. కాని, బాగా లెఫ్ట్ ఓరియెంటెడ్ థింకింగ్ వు్న కోదండరామ్ బీజేపితో కూడా చర్చలు జరపటం అందర్నీ ఆకట్టుకుంది. అంతే కాదు, త్వరలో యూపీ సమరోత్సాహంతో వున్న అమిత్ షా హైద్రాబాద్ లో మకాం వేయనున్నారు. మూడు రోజులు ఇక్కడే వుండి తెలంగాణ బీజేపి స్థితిగతులు అంచన వేసి, కార్యకర్తలు, నాయకులకి దిశా నిర్దేశనం చేస్తారట! అంటే… 2019 ఎన్నికలే లక్ష్యంగా ఏం చేయాలో చెబుతారని అర్థం! సరిగ్గా ఇటువంటి నేపథ్యంలో కోదండరామ్ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడితో భేటీ కావటం రాజకీయంగా ప్రాముఖ్యం కలిగిన విషయమే!
కోదండ రామ్ తన పేరు చివరన రెడ్డి అని పెట్టుకోకున్నా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని అందరికీ తెలిసిందే! బీజేపికి టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా బలమైన శక్తి కావాలంటే తెలంగాణలో రెడ్డి నాయకులే శరణ్యం. ఆ కోణంలో కూడా బీజేపి కోదండరామ్ ని తమ వేపుకు తిప్పుకోవటం టీఆర్ఎస్ జాగ్రత్తపడాల్సిన పరిణామం. తెలంగాణలో బీజేపికి రెడ్డి సామాజిక వర్గం ఎంత దగ్గరైతే అంత ఆందోళన చెందాల్సి వుంటుంది టీఆర్ఎస్, కాంగ్రెస్ లు!