ఆయేషా కేసులో హైకోర్టు ఎత్తిచూపిన లోపాలేంటి? పోలీసుల వెర్షనేంటి?
posted on Apr 5, 2017 @ 5:37PM
ఆయేషా కేసులో సత్యంబాబును ఖాకీలు అన్యాయంగా ఇరికించారంటూ హైకోర్టు తేల్చడం, కేసును దర్యాప్తు చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించడంతో పోలీసులు ఇరకాటంలో పడ్డారు. అసలు నేరస్థులను తప్పించేందుకు, వాస్తవాలను కప్పిపుచ్చి, కోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఆయేషాపై అత్యాచారం జరిగిందన్న వాదనను పోలీసులు తెరపైకి తెచ్చారని హైకోర్టు వ్యాఖ్యానించడం... పోలీస్‌శాఖకే పెద్ద ఎదురుదెబ్బ. అంతేకాదు ఆయేషాను సత్యంబాబే చంపాడనడానికి తగిన ఆధారాలు చూపలేదన్న హైకోర్టు... ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు సాగిందని పోలీసులను కడిగిపారేసింది. నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు... మొత్తం పోలీస్ వ్యవస్థ విశ్వసనీయతనే ప్రశ్నించేలా చేశాయి. సత్యంబాబుపై గతంలో ఉన్న కేసులను కోర్టులు కొట్టేసినప్పటికీ, అతడ్ని కరుడుగట్టిన నేరస్తుడిగానే పోలీసులు చిత్రీకరించడాన్నిహైకోర్టు తప్పుబట్టింది.
సరిగ్గా నడవలేని సత్యంబాబు.... 8 అడుగుల గోడను రెండుసార్లు ఎక్కిదిగి, రెండోసారి రోకలి బండను ఓ చేత్తో పట్టుకుని ఆ గోడను ఎక్కి ఆయేషా గదికి వెళ్లాడన్న పోలీసుల వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తంచేసింది. ఐదున్నర అడుగుల ఎత్తు, 50 కేజీల బరువున్న వ్యక్తి, ఒక చేత్తో రోకలి బండను పట్టుకుని, ఒంటి చేత్తో 8 అడుగుల గోడను ఎక్కడం ఎలా సాధ‌్యమని ప్రశ్నించింది. ఇది సూపర్‌మ్యాన్ మాత్రమే చేయగల ఫీట్ అంటూ పోలీసులకు చురకలేసింది. అలాగే సాక్షుల వాంగ్మూలాలు, ఛార్జిషీట్లోని విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయంది. అంతేకాదు ఆయేషాను చంపాక నిందితుడు ఆమె గదిలోనే కూర్చుని తాపీగా లేఖ రాసినట్లు పోలీసులు చెబుతున్న కథనం నమ్మశక్యం లేదంది.
అయినా అంతసేపు నిందితుడు ఆయేషా గదిలోనే ఉంటే, అక్కడున్న 55మందిలో ఒక్కరైనా గమనించారా అంటూ పోలీసులను ప్రశ్నించింది. మానవనైజం ప్రకారం ఘోరమైన చర్యకు పాల్పడితే, సహజంగా ఎవరైనా ఘటనాస్థలం నుంచి వెంటనే పారిపోతారని వ్యాఖ్యానించింది. అలాగే ఆయేషాను చంపేశాక రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న వాదనను కూడా ధర్మాసనం తప్పుబట్టింది. చనిపోయిన, స్పృహలోలేని స్థితిలో మహిళ ఉన్నప్పుడు మర్మాంగాలకు గాయం కాకుండా సంభోగం జరపడం సాధ్యం కాదని వైద్యశాస్త్రం చెబుతోందని, పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆయేషా శరీరంపై గానీ, మర్మాంగంపై గానీ ప్రతిఘటనకు సంబంధించి ఎటువంటి గాయాలు లేవని తేలిందని, అలాంటప్పుడు ఈ వాదనలోకూడా వాస్తవం లేదని వ్యాఖ్యానించింది.
ఈ కేసు దర్యాప్తులో పోలీసులు సరిగా వ్యవహరించలేదని, సాక్షుల వాంగ్మూలాలు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయంది. అంతేకాదు ఆయేషా తల్లి ఆరోపిస్తున్న వ్యక్తికి, కోర్టు అనుమతించినా పోలీసులు ఎందుకు నార్కో పరీక్ష నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. అసలు నేరస్థులను తప్పించడం కోసం పోలీసులు కట్టుకథలు అల్లారని, దాన్నే కింది కోర్టు నమ్మిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఓవరాల్‌గా సత్యంబాబు నేరం చేసినట్లు ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు చూపలేకపోయారన్న డివిజన్ బెంచ్... ఈ కేసుతో సత్యానికి ఎలాంటి సంబంధంలేదని, అకారణంగా ఇరికించారని అభిప్రాయపడింది. అసలు దోషులను వదిలేసి, ఒక అమాకుడిపై అభియోగాలు మోపి, జైలుపాలు చేయడాన్ని అమానవీయమైన చర్యగా హైకోర్టు అభివర్ణించింది.
హైకోర్టు వ్యాఖ్యలపై ఇరకాటంలో పడ్డ పోలీసులు... కేసు ఎందుకు వీగిపోయిందో తెలుసుకునే పనిలో పడ్డారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. పైగా సత్యంబాబును నిర్దోషిగా విడిచిపెట్టడమే కాకుండా, పోలీసులనే తప్పుబట్టడంతో ఈ కేసు మరింత సవాలుగా మారింది. అయితే సత్యంబాబు నూటికి నూరుపాళ్లు దోషేనంటున్న పోలీసులు... అన్ని ఆధారాలు సమర్పించినా కేసు వీగిపోవడాన్ని జీర్జించుకోలేకపోతున్నారు. పైగా దర్యాప్తు జరిగిన తీరునే హైకోర్టు తప్పుబట్టడంతో.... కేసును తిరగదోడేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు.
తన తల్లిని, చెల్లిని ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించడం వల్లే గత్యంతరంలేక చేయని నేరాన్ని అంగీకరించినట్లు సత్యంబాబు చేసిన ఆరోపణలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. డీఎన్‌ఏ టెస్ట్ ఆధారంగానే సత్యంబాబుని అరెస్ట్ చేశామని, ప్రపంచంలో ఒకరి డీఎన్‌ఏతో మరొకరి డీఎన్‌ఏ సరిపోదని, అంతేకాదు ఆయేషాను తానే చంపినట్లు స్వయంగా సత్యంబాబే అంగీకరించాడని ఆనాడు కేసును ఇన్వెస్టిగేట్ చేసిన స్పెషల్ ఆఫీసర్ రంగనాథ్ చెబుతున్నారు. ఆయేషా కేసులో తాము ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కోలేదన్న రంగనాథ్.... ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందంటున్నారు. సత్యంబాబును ఇరికించామనేది అబద్ధమన్నారు. సాంకేతికంగా కేసును హైకోర్టు కొట్టేసినా సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూడాలన్నారు. ప్రస్తుత విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కూడా సత్యంబాబే నిందితుడు అంటున్నారు. సాంకేతికంగా అన్ని ఆధారాలు కోర్టు ముందుంచామని, అయితే కేసు వీగిపోవడంతో... హైకోర్టు తీర్పుపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే దర్యాప్తు జరిగిన తీరునే హైకోర్టు తప్పుబట్టడంతో బలమైన, సాంకేతిక ఆధారాల కోసం పోలీసులు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అయితే దొంగ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లు ఇఛ్చేందుకు అప్పటి ల్యాబ్ డైరెక్ట్ వెంకన్న లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో సత్యంబాబు నివేదికపైనా అనుమానాలు రేకెత్తాయి. పైగా ఆయేషా హత్య జరిగిన రాత్రి సత్యంబాబు ఇబ్రహీంపట్నంలోని ఓ చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొన్నట్లు అనేకమంది సాక్ష్యమిచ్చారు. దీనికి పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఇక హైకోర్టు కూడా పోలీసుల దర్యాప్తులో డొల్లతనాన్ని, అనేక లోపాలను ఎత్తిచూపింది. అయితే పోలీసులు... సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతుండటంతో ఈ కేసు మళ్లీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.