పార్టీయా? ప్రభుత్వమా? ధర్మ సంకటంలో చంద్రబాబు..!
posted on Apr 11, 2017 @ 12:49PM
ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ...విమర్శలు, ఆరోపణలతోపాటు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే పోటీపడి మరీ విమర్శలను తిప్పికొట్టేవారు తెలుగు తమ్ముళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీ ఫస్ట్.. ప్రభుత్వం....నెక్ట్స్ అన్న ధోరణి కనిపిస్తోంది. దీనికి తోడు రెండింటి మధ్య తేడా లేకపోవడంతో.....ఏ విమర్శలు, ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రే అన్నింటికీ కౌంటర్ ఇవ్వాల్సి వస్తోంది. ఒకవైపు 2019 ఎన్నికల టైమ్ దూసుకొస్తుంటే.. తమ్ముళ్ల తగవులు తీర్చడంలోనే చంద్రబాబు సమయమంతా గడిచిపోతోంది.
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లే టైముంది. పైగా ఏం చేసినా ఏడాదిన్నరలోపే చేయాలి. అంతేకాదు ఇటు ప్రభుత్వాన్ని, అటు పాలనను సమన్వయం చేసుకుంటూ సమర్ధవంతంగా పనిచేయాల్సి ఉంటుంది. పాలనను పరుగులు పెట్టిస్తూనే, పార్టీకి కూడా సమయం కేటాయించాల్సి ఉంటుంది, లేదంటే గాడి తప్పే ప్రమాదముంటుంది. ఇప్పుడిదే ఏపీ సీఎం చంద్రబాబుకు సమస్యగా మారిందంటున్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై పెట్టినంత శ్రద్ధ పార్టీపై పెట్టడం లేదని అంటున్నారు. బాబు తన సమయమంతా అసంతృప్తులను అలకలను చక్కబెట్టడానికే సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయ్.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా టీడీపీ నేతలు అధిష్టానంపైనే బహిరంగంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది, వేటుపడిన ఐదుగురు మంత్రులతోపాటు మంత్రి పదవి దక్కలేదన్న కోపంతో ధూలిపాళ్ల, గోరంట్ల, చింతమనేని, బోండా ఇలా అనేకమంది బాహాటంగానే తిరగబడ్డారు. మిగతా జిల్లాల్లో సిఎం నిర్ణయంమీద అసంతృప్తి ఉన్నా బహిరంగంగా వెళ్లగక్కలేకపోయారు. దాంతో నేతలను బుజ్జగించడానికే చంద్రబాబు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలా అసంతృప్తులు, అలకలను చక్కబెట్టుకోడానికే విలువైన సమయాన్నంతా వినియోగిస్తుంటే పాలనపై, పార్టీ పట్టు బిగించడం ఎలా సాధ్యమవుతుందంటున్నారు.
మరో రెండేళ్లలో ఎన్నికలు ముంచుకొస్తుంటే.. ఆ దిశగా పార్టీలో కసరత్తు జరగడం లేదు. పార్టీ-ప్రభుత్వం, రెండూ ఎన్నికలకు సన్నద్ధం కావడం లేదు. సమయమంతా అసంతృప్తులు, బుజ్జగింపులకే కేటాయించాల్సి రావడంతో రెండువైపులా నష్టం జరుగుతోంది. కనీసం ఇప్పుడైనా అలకలు, బుజ్జగింపుల సీన్ కు స్వస్తి చెప్పి.. వెంటనే పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసి, సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ ఇదే సీన్ కంటిన్యూ అయితే.... 2019 ఎన్నికల్లో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోక తప్పదు.