ప్రైవేట్ లేక… ఆర్టీసీ రాక… జనానికి తప్పదా కాక
posted on Apr 10, 2017 @ 12:54PM
సంవత్సరం మొదట్లో వచ్చే సంక్రాంతి మొదలు చివర్లో వచ్చే దసరా, క్రిస్మస్ వరకూ మనకు ప్రతీ నెలా పండగలే. కాని, అందరికీ బాగా జ్ఞాపకం వుండేది మాత్రం సంక్రాంతి, దసరా లాంటి పండుగలే. అందుక్కారణం హైద్రాబాద్ నుంచి తమ తమ ఊళ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చేయాల్సి వచ్చే సర్కస్ ఫీట్లే! అసలు పెద్ద పండగ ఏదైనా వచ్చిందంటే చాలు ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే ప్రయాణీకులకి చుక్కలు కనిపిస్తుంటాయి. ఆకాశంలో ఎగిరే విమానాలు మొదలు, ట్రైన్లు, బస్సులు అన్నీ ఫుల్లే! అయినా కూడా అందరూ హాయిగా గమ్యం చేరుకుంటారా అదే లేదు! నానా తంటాలు పడి వెళ్లటమో, లేదంటే వాయిదా వేసుకోవటమో చేయాల్సిందే!
ఇప్పుడు ఏ పండగా లేకున్నా… హైవేలపై బస్సుల్లో రద్దీ లేకున్నా… ఎందుకీ డిస్కషన్ అంటే… తాజాగా మూతపడ్డ కేశినేని ట్రావెల్స్ వల్లే! కేశినేని బస్సుల్ని ఆ సంస్థ యజమాని ఎందుకు ఆపేశారు అనేది ఇక్కడ ప్రధానం కాదు. దాని వెనుక కొందరు రాజకీయ కారణాలు వెదికితే కొందరు ఆర్దిక కారణాలు వెదుకుతున్నారు. అందులో ఏవైనా నిజం అవ్వొచ్చు. కాని, మొన్నా మధ్య కాళేశ్వరీ ట్రావెల్స్ కూడా సర్వీసులు ఆపేసింది. ఇప్పుడు కేశినేని బస్సులు షెడ్డుకు చేరుకున్నాయి. వీటి ఫలితం ఎలా వుండబోతోంది?
సాధారణంగా ప్రయాణీకుల రద్దీ పెరిగినా , వరుస సెలవులు వచ్చిన ప్రైవేట్ బస్సులు కళకళలాడుతాయి. ప్రైవేట్ ట్రావెల్ ఓనర్స్ జనాన్ని దోచుకుంటారని ఆరోపణలు వున్నా … ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లటం ప్రైవేట్ బస్సులు లేకుండా సాధ్యం కాదు. పూర్తిగా రైళ్లు, ఆర్టీసీ బస్సుల మీద ఆధారపడితే తగినన్ని సర్వీసులు, సీట్లు లేక ప్రయాణాలు చేయటం వట్టి మాటే అవుతుంది. అందుకే, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదకరమైనా కూడా జనం ప్రైవేటు బస్సులు ఎక్కేస్తుంటారు. కాని, ఇప్పుడు ఆ ప్రైవేటు ట్రావెల్స్ కూడా చేతులు ఎత్తేస్తే జనం పరిస్థితి ఏంటి?
రాబోయే పండుగల సీజన్లో ఎప్పటిలాగే రద్దీ వుంటుంది. కాని, కేశినేని, కాళేశ్వరీ ట్రావెల్స్ తరహాలో మరిన్ని కంపెనీలు బిజినెస్ కి దూరమైతే జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది ఆర్టీసీకి మంచి అవకాశమే అయినా రెండు రాష్ట్రాల ప్రభుత్వ బస్సులు ఒత్తిడి తట్టుకుంటాయా? డౌటే! కాకపోతే, ఏపీ, తెలంగాణ సర్కార్లు భద్రంగా జనాల్ని గమ్యాలు చేర్చే ఆర్టీసీకి తగినంత ప్రొత్సాహం, సహకారం ఇస్తే గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ మూతపడటానికి కారణాలు ఏవైనా సురక్షితమైన ఆర్టీసీ సేవలు ప్రజలకి పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే అది అందరికీ మంచిదే! ఆదాయం రూపంలో గవర్నమెంట్ కి, ఆర్టీసీ కూడా ఎంతో మేలు జరుగుతుంది!