జగన్… సాక్షీ మీడియాకి సాక్షి మాత్రేమేనట!
posted on Apr 7, 2017 @ 5:55PM
గులాబీ పువ్వు అందంగా వుంటుంది! కాని, దానికి ముళ్లు కూడా వుంటాయి! జగన్ కు ఈ విషయం అంతగా తెలిసినట్టు లేదు. స్వంతంగా మీడియాను పెట్టుకుని ఆయన ఇంతకాలం చాలా మంది కథనాలు రాయించుకున్నారు. స్టోరీస్ ప్రసారం అయ్యాయి. కాని, తీరా అదే సాక్షి పేపర్, టీవీ వల్ల ఇప్పుడు ఆయనకి గండం ఎదురుకావటంతో .. తన మీడియాకి తనకి ఎలాంటి సంబంధం లేదనేస్తున్నారు! సాక్షి మీడియాకు తాను కేవలం సాక్షినే తప్ప అందులో తన ప్రమేయం, తన బాధ్యత ఏం లేదన్నట్టు మాట్లాడేశారు!
సాక్షి మీడియాకి మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదం అయింది. దాన్ని ఆధారం చేసుకునే సీబీఐ జగన్ బెయిల్ రద్దు చేయమంటూ కోర్టుకు వెళ్లింది. ఆ ఇంటర్వ్యూ సాక్షుల్ని ప్రభావితం చేసేలా వుందని సీబీఐ వాదన వినిపిస్తోంది. ఈ కేసులో ఏ మాత్రం తేడా వచ్చినా జగన్ మరోసారి జైలుకి వెళ్లాల్సి రావచ్చు. అలా జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం కాని ఆయన తాజా ఢిల్లీ పర్యటన కూడా అందుకే అంటున్నారు కొందరు విమర్శకులు. రాష్ట్రపతిని కూడా కలిసిన జగన్ బెయిల్ రద్దు కాకుండా వుండేలానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, కోర్టులో మాత్రం ఆయన తరుఫు లాయర్లు జగన్ మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూకి , జగన్ కి సంబంధం లేదని చెప్పుకొచ్చారు!
సాక్షిలో వచ్చిన రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఫ్రీల్యాన్స్ జర్నలిస్టు చేసిందనీ, దానికి సాక్షి మీడియాని నడిపే జగన్ కి ఎలాంటి సంబంధం లేదనీ కోర్టు ముందు వాదనలు వినిపించారు లాయర్లు! టెక్నికల్ గా దీన్ని కోర్టు ఒప్పుకుంటుందేమో చూడాలి.కాని, ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఆయన డబ్బుతో నడిచే సాక్షి మీడియాలో ఎవరిది పడితే వారిది ఇంటర్వ్యూ వేసేస్తారా? జగన్ కి ఎంత మాత్రం సంబంధం వుండదా? కానే కాదు! జగన్ కోసం, జగన్ రాజకీయ విజయం కోసమే సాక్షి పని చేస్తుందన్నది జగమెరిగిన సత్యం! అయినా అందులో వచ్చిన రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఒక్క దానికి మాత్రం తనకు సంబంధం లేదంటే ఎలా?
ఇప్పుడు సాక్షిలో వచ్చిన ఇంటర్వ్యూ ముల్లు తనకు గుచ్చుకోకుండా చూసుకుంటోన్న జగన్… నిండు అసెంబ్లీలో సాక్షి పత్రికను బోలెడు సార్లు లైవ్ లో ప్రదర్శించారు! ఆయనే కాదు… వైఎస్ బతికి వుండగా కూడా అసెంబ్లీలో… ఆ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా టీడీపీని, చంద్రబాబును కడిగిపారేసేవారు! అంటే… వైఎస్, జగన్ వ్యతిరేకుల్ని సాక్షి టార్గెట్ చేసినప్పుడు అది వాళ్లకు ఓకే. కాని, దాని వల్లే బెయిల్ రద్దయ్యే గండం దాపురిస్తే మాత్రం … సాక్షికి జగన్ కేవలం సాక్షి మాత్రమే అయిపోతారు! అంతేనా! ఒక్కోసారి మన గన్నే అయినా పొరపాటున పేలిపోయి ప్రమాదానికి దారి తీస్తుంటుంది! అందుకే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటారు పెద్దలు…