పొలిటికల్ గా… స్పెషల్ స్టేటస్ ఇక మీదట నథింగ్ స్పెషల్!
posted on Apr 12, 2017 @ 10:51AM
తెగేదాకా లాగొద్దంటారు. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు వ్యవహారం తెగిపోయినట్టే కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభలో జరిగిన చర్చ చూస్తే ఎవరికైనా అదే అర్థం అవుతుంది! కాంగ్రెస్ నాయకుడు కేవీపీ ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ అంటూ సభలో మాట్లాడారు. ఇంకా కొందరు ఏపీ ఎంపీలు కూడా హోదా కావాలని నినదించారు. కాని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం? స్పెషల్ స్టేటస్ అసాధ్యమని తేల్చి చెప్పేసింది!
జగన్ నుంచీ పవన్ దాకా అందరూ ప్రత్యేక హోదా అంటూనే వున్నాఅందరికీ లోలోన మాత్రం అలాంటి సీన్ లేదని బాగానే తెలుసు. అయితే గియితే సామాన్య జనం, అభిమానులు, కార్యకర్తలు ఆవేశపడ్డారు. అదీ ఇప్పుడు తగ్గిపోయింది. మొన్నటికి మొన్న ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్లు, టీచర్లు అంతా కలిసి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపి పార్టీ అభ్యర్థినే ఎమ్మెల్సీగా ఎంచుకున్నారు. ఇందుకు కారణం, టీడీపీ మద్దతు వుండటం కూడా అని చెప్పుకోవచ్చు. కాని, ప్రత్యేక హోదా విషయంలో జనంలో వుండాల్సినంత ఆగ్రహం ఏం లేదనిపిస్తోంది పరిస్థితి చూస్తోంటే! అందుకే, వైజాగ్ ఆర్కే బీచ్ లో మౌన ప్రదర్శన మొదలు ఎవరు ఏ ఉద్యమానికి, ఏ నిరసనకి పిలుపునిచ్చినా జనం సంస్పదన ఆశించనంత వుండటం లేదు.
పార్లమెంట్ సాక్షిగా దేశం మొత్తం లైవ్ లో చూస్తుంటే మోదీ సర్కార్ నో స్పెషల్ స్టేటస్ అనేసింది. దీని వెనుక ఉద్దేశం ఏంటి? ఒకటి… పైకి చెబుతున్నట్టుగా నీతి ఆయోగ్ రావటంతో ప్రత్యేక హోదాలు ఇవ్వటం ఇక మీదట కుదరదు. ప్రత్యేక హోదాకు తగినంత స్థాయిలో ప్రత్యేక లాభాలు ఏపీకి ఆల్రెడీ సమకూర్చటం జరిగింది. ఇక ఈ కోణమే కాకుండా బీజేపి వ్యవహార శైలికి మరో కారణం కూడా వుంది. తమని భారీ మెజార్టీతో యూపీలో గెలిపించిన ఓటర్లకి భారీ నజరాన ప్రకటించింది. వేల కోట్ల రైతు ఋణాలు మాఫీ చేసింది. కాని, అదే తమకు అధికారం లేని, వచ్చే అవకాశం కూడా లేని తమిళనాడులో రైతుల రుణమాఫి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయటం లేదు. ఎన్నో రోజులుగా తమిళ రైతులు ఢిల్లీ వీధుల్లో దీక్ష చేస్తున్నా వార్ని పట్టించుకోవటం లేదు. కారణం… రాజకీయ లెక్కలే!
తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ బీజేపికి పెద్దగా బలం లేదు. ఓటర్లు ప్రత్యేక హోదా ఇచ్చినా … ఇవ్వకున్నా కమలానికి భారీగా ఎంపీ సీట్లేం కటబెట్టరు. మహా అయితే స్పెషల్ స్టేటస్ క్రెడిట్ మిత్రపక్షం టీడీపీకి దక్కవచ్చు! అందుకే, ఈ కోణంలో ఆలోచించి మోదీ ప్రభుత్వం ప్రత్యేక హాదా ఇంపాజిబుల్ అని తెగేసి చెబుతోంది! ఇక ఇప్పుడు ఆంధ్రాకు మిగిలిన మార్గం… కేంద్రంతో సఖ్యంగా వుంటూ సాధ్యమైనన్ని నిధులు పొందటమే! రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు మొదట్నుంచీ ఇదే చెబుతున్నారు. పవన్, జగన్, ఇతర నేతలే మైకులు ముందు హడావిడి చేసి పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేస్తూ వచ్చారు…