యాంటిబయాటిక్స్‌తో చంపేస్తున్నారు...

  యాంటిబయాటిక్స్‌ని కనుక్కోవడం ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. అవే లేని రోజుల్లో చిన్నపాటి చెవిపోటు కూడా ప్రాణాంతకంగా మారేది. కానీ అవే యాంటిబయాటిక్స్‌ని ఇప్పుడు విచ్చలవిడిగా వాడటం ఆందోళన కలిగించే విషయం. అలాంటి వాడకం వల్ల శరీరంలో నానా రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావడం మాట అటుంచితే… అవసరమైనప్పుడు అసలు ఏ మందూ పనిచేయని పరిస్థితి వస్తుంది. దీనినే antibiotic resistance అని పిలుస్తున్నారు.   యాంటిబయాటిక్స్‌ గురించి ఇప్పుడు ఈ కథంతా మళ్లీ చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది. వైద్యులు ఈ యాంటిబయాటిక్స్‌ని రోగులకి ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు లండన్‌ పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 1,85,014 మందిని పరిశీలించారు. వీరంతా కూడా 65 ఏళ్లు పైబడినవారే. అంటే వైద్యులు వీరికి చికిత్సని అందించేందుకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. దురదృష్టవశాత్తూ వీరంతా వైద్యుల దగ్గరకి చిన్నచిన్న అనారోగ్యాలతో వెళ్లినప్పుడు కూడా, వీరికి అనవరసంగా యాంటిబయాటిక్స్‌ను అందించారట. ఇలా సగానికి సగం కేసులలో యాంటిబయాటిక్స్‌ తీసుకోవాలంటూ వైద్యులు తొందరపడినట్లు తేలింది. ఈ యాంటిబయాటిక్స్‌ కూడా మామూలువి కాదు… అలెర్జీలు, విరేచనాలు, గుండెజబ్బులు, కండరాల సమస్యలు వంటి నానారకాల దుష్ప్రభావాలు చూపించేవి. ఇలా ఉత్తిపుణ్యానికే శక్తివంతమైన యాంటిబయాటిక్స్‌ తీసుకోమంటూ వైద్యులు సలహా ఇస్తున్నట్లు తేలింది.   కాస్త విశ్రాంతి, మరికాస్త ఉపశమనంతో తగ్గిపోయే జలుబు, దగ్గు లాంటి చిన్నపాటి సమస్యలకు కూడా యాంటిబయాటిక్స్‌ను సూచించడం చూసి పరిశోధకుల తల తిరిగిపోయింది. ఇంతాచేసి ఈ వైద్యులంతా మహామహా సీనియర్లు! యాంటిబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడకూడదన్న అవగాహన ఉన్నవారు. చిన్నపాటి సమస్యలకు ఆ మందులు అస్సలు అవసరమే లేదని తెలిసినవారు. ఆరోగ్యం మీద అవగాహన ఉండే లండన్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే… ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుందో కదా! అందుకనే యాంటిబయాటిక్స్‌ వాడకాన్ని అదుపు చేసేలా… అటు ప్రభుత్వమూ, ఇటు వైద్య సంస్థలూ కఠినమైన నిబంధనలను విధించాలని కోరుకుంటున్నారు పరిశోధకులు.   -నిర్జర.

వినాయ‌కుని ప‌త్ర పూజ‌లో వైద్య విజ్ఞానం!

  ప‌త్ర పూజ లేకుండా వినాయ‌క చ‌వితి పూర్తికాదు. ఆ గ‌ణేశుని వివిధ పేర్లతో స్తుతిస్తూ ఏక‌వింశ‌తి (21) ప‌త్రాల‌తో పూజించ‌డం సంప్రదాయం. ఆరోగ్యానికి సంబంధించి వినాయ‌క‌చ‌వితి వ‌చ్చే స‌మ‌యం చాలా కీల‌క‌మైంది. వ‌ర్షాకాలం ముగిసి అంటువ్యాధులు ప్రబ‌లే కాలం ఇది. ఈ స‌మ‌యంలో క‌నుక ఔష‌ధుల‌కు ద‌గ్గర‌గా ఉంటే గాలి ద్వారా సోకే క్రిముల తాకిడి త‌క్కువ‌య్యే అవ‌కాశం ఉంది. బ‌హుశా అందుక‌నే మ‌న పెద్దలు ప‌త్రపూజ‌ను ఏర్పరిచి ఉంటారు. ప‌ల్లెల్లో రోజువారీ క‌నిపించే మొక్కల‌లోని ఔష‌ధ గుణాలు ఉన్న మొక్కల‌ను ఎంచుకుని వాటి ప‌త్రాల‌తో పూజ‌ను చేయ‌మ‌ని మ‌న‌కు సూచించారు. అలా పూజించిన ప‌త్రాల‌ను క‌నీసం 3 నుంచి 9 రోజుల వ‌ర‌కూ ఇంట్లోనే ఉంచ‌డం వ‌ల్ల వాటి నుంచి వెలువ‌డే గాలి, చుట్టుప‌క్కల ఉన్న వాతావ‌ర‌ణం మీద ప్రభావం చూపుతుంది. ఇక వినాయ‌కునితో పాటుగా ఆ ప‌త్రాల‌ను కూడా నీటిలో విడువ‌టం వ‌ల్ల నీటిలో కూడా ఔష‌ధిగుణాలు చేకూరుతాయి. ఈ ప‌త్రాల‌లో కొన్నింటిని నేరుగా ఆయుర్వేదంలో వాడ‌తారు, మ‌రికొన్నింటిలో ప‌త్రాల‌ను కాకుండా పళ్లనో, బెర‌డునో, కాయ‌ల‌నో, వేళ్లనో వాడ‌తారు. కానీ ఇలా పూజ‌లో సంబంధింత ప‌త్రాల‌ను వినియోగించ‌డం వ‌ల్ల ఏ చెట్టుని ఏమంటారు, వాటిని గుర్తించ‌డం ఎలా, వాటి ఉప‌యోగం ఏంటి అన్న వైద్య విజ్ఞాన‌మ‌న్నా మ‌న పూర్వీకులు ఒక త‌రం నుంచి మ‌రో త‌రానికి అందించేవారు. మ‌రి ఆ ప‌త్ర పూజ‌లో దాగిన ఔష‌ధాల‌ను ఇప్పుడు చూద్దామా...     సుముఖాయనమః  మాచీపత్రం పూజయామి! మాచిప‌త్రి లేదా ద‌వ‌నం:  కుష్టువ్యాధితో స‌హా ఎటువంటి చ‌ర్మవ్యాధినైనా త‌గ్గించ‌గ‌ల ఔష‌ధి. తల‌నొప్పి మొద‌లుకొని తిమ్మిర్ల వ‌ర‌కూ న‌రాల‌కు సంబంధించి చిన్నాచిత‌కా స‌మ‌స్యల‌న్నింటినీ దూరం చేస్తుంది. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి! వాకుడాకు: ద‌గ్గు, ఉబ్బసం, క్షయ‌లాంటి క‌ఫ సంబంధ‌మైన రుగ్మత‌ల‌కు చ‌క్కటి మందు. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి! మారేడు:  శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఆకు నిజంగానే అందుకు యోగ్యమైన‌ది. ఆయుర్వేదంలోని ముఖ్య ఔష‌దాల‌లో బిల్వం ప్రముఖ‌మైంది. ఇప్పుడంటే పిల్లల్లో అతిసారాన్ని అరిక‌ట్టేందుకు రోటావైర‌స్‌లాంటి టీకాల‌ను వేయిస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు మారేడు ప‌త్రాలు, కాయ‌ల‌తో అతిసారాన్ని ఎదుర్కొనేవారు. జీర్ణాశ‌యానికి సంబంధించిన మ‌రెన్నో స‌మ‌స్యల‌కు కూడా మారేడు చ‌క్కటి మందులా ప‌నిచేస్తుంది. గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి! గ‌రికె:  వినాయ‌కునికి అత్యంత ప్రీతిక‌ర‌మైన ప‌త్రం. త‌న ఒంటి మీద తాపం భ‌రిప‌రానిది అయిన‌ప్పుడు సాక్షాత్తూ ఆ గ‌రికెనే మీద క‌ప్పమ‌న్నార‌ట ఆయ‌న‌. నిజంగానే చ‌ర్మసంబంధ‌మైన వ్యాధుల‌న్నెంటికో ఔష‌ధి ఈ గ‌రికె. ఏద‌న్నా దెబ్బ త‌గిలిన‌ప్పుడు వెంట‌నే గ‌రికెని పిండి దెబ్బ మీద అద్దటం ఇప్పటికీ మ‌న ప‌ల్లెల్లో చూడ‌వ‌చ్చు.   హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి! ఉమ్మెత్త: ఒంటిమీద ఏవైనా సెగ్గడ్డలు వ‌చ్చిన‌ప్పుడు, ఉమ్మెత్త ఆకుల‌కు కాస్త సెగ చూపించి వాటి మీద వేసేవారు పెద్దలు. అప్పుడు గ‌డ్డలలో ఉన్న చీము త్వర‌గా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుందట‌. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి! రేగు:  రేగు ప‌ళ్ల కాలం వ‌చ్చిందంటే పెద్దలెవ్వరూ వాటిని వ‌దులుకోరు. జీర్ణకోశ వ్యాధుల‌కు ఉప‌శ‌మ‌నంగానూ, రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలోనూ రేగు పళ్లు, కాయ‌లు అమిత ఫ‌లితాన్ని అందిస్తాయి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి! ఉత్తరేణి: ఇప్పటికీ ప‌ల్లెల్లో ఉత్తరేణిని పళ్లు తోముకునేందుకు వాడ‌తారు. చెవిపోటు, పిప్పిప‌న్నులాంటి ముఖ‌సంబంధ‌మైన వ్యాధులకి ఔష‌ధిగా దీనిని వాడ‌తారు. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి! తుల‌సి:  తులసి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే క‌దా! ఇంటింటా దేవుళ్లతో స‌మానంగా పూజ‌లందుకునే తుల‌సి నిజంగానే అందుకు అర్హత క‌లిగింది. క్రిమిసంహారిణిగా, చ‌ర్మవ్యాధుల‌కు దివ్యౌష‌ధంగా, క‌ఫానికి విరుగుడుగా తుల‌సి ఓ ఇంటింటి ఔష‌ధం. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి! మామిడాకు:  ఇంట్లో ఏ శుభ‌కార్యం జ‌రుగుతున్నా దానికి తొలి సూచ‌న‌గా మామిడాకుల తోర‌ణాల‌ను గుమ్మాల‌కు క‌డ‌తారు. గుమ్మం ద‌గ్గర మామిడాకు ఉంటే ఇంట్లోకి ఏ క్రిమీ రాలేద‌ని పెద్దల న‌మ్మకం. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి! గ‌న్నేరు: చ‌ర్మవ్యాధుల‌కు ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. తేలుతో స‌హా ఎన్నో విష‌కీట‌కాలు కుట్టిన‌ప్పుడు దీనిని ఉప‌యోగిస్తారు. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి! విష్ణుక్రాంతం:  క‌ఫం వ‌ల్ల ఏర్పడే ద‌గ్గు, జ‌లుబు, జ్వరం వంటి స‌మ‌స్యల‌ను దూరం చేస్తుంది. వటవేనమః దాడిమీపత్రం పూజయామి! దానిమ్మ:  జీర్ణకోశంలో ఉండే క్రిముల ప‌నిప‌ట్టేందుకు దీనిని వాడ‌తారు. ర‌క్తహీన‌త‌ను సైతం దూరం చేయ‌గ‌ల శ‌క్తి దీనికి ఉంది. సర్వేశ్వరాయనమః దేవదారుపత్రం పూజయామి! దేవ‌దారు: క‌ళ్లకు చ‌లువ‌చేసే గుణం ఈ దేవ‌దారు ప‌త్రాల‌తో కాచిన తైలానికి ఉంటుంది. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి! మ‌రువం:  మ‌ల్లె వంటి పూల‌తో స‌మానంతో ఆడ‌వారు ఈ ఆకుల‌ను పూల‌మాల‌లో వాడ‌తారు. అదేమీ వృథా పోదు. ఎందుకంటే మ‌రువంలో ఉండే ఔష‌ధ గుణాలు కేశాల‌కి ఎంతో బ‌లాన్ని అందిస్తాయ‌ట‌. ఈ ఆకుల నుంచి వ‌చ్చే సువాస‌న మాన‌సిక ఒత్తిడిని సైతం త‌గ్గిస్తుంది. మ‌రి వినాయ‌కుడు చ‌ల్లద‌నం కోసం చంద్రుని త‌ల‌మీద ధ‌రించిన‌ట్లు, ఆడ‌వారు మ‌రువాన్ని త‌ల మీద పెట్టుకోవ‌డం త‌ప్పేమీ కాదుగా! హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి! వావిలాకు:  కీళ్లకు సంబంధించిన నొప్పుల‌కు దీనిని ఔష‌ధంగా వాడ‌తారు. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి! జాజి:  చ‌ర్మవ్యాధుల‌లోనే కాకుండా జాజిని నోటిపూత‌, నోటి దుర్వాస‌న‌న నుంచి త‌క్షణం ఉప‌శ‌మ‌నం పెద్దలు వాడుతుంటారు.   సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి! దేవ‌కాంచ‌నం:  జీర్ణాశ‌యంలో నులిపురుగులను సైతం పోగొట్టగ‌ల‌దీ దేవ‌కాంచ‌నం. ఇభవక్త్రాయనమః శమీపత్రం పూజయామి! జ‌మ్మి:  పాండ‌వులు అజ్ఞాత‌వాసానికి వెళ్లే ముందు ఈ చెట్టు మీద‌నే త‌మ ఆయుధాల‌ను దాచిపెట్టారు. దీని నుంచి వీచే గాలి సైతం ఎన్నో క్రిముల‌ను సంహ‌రించ‌గ‌ల‌ద‌ని న‌మ్మకం. అందుక‌నే దీనికి ప్రద‌క్షిణ చేసినా ఆరోగ్యం చేకూరుతుంద‌ని చెబుతారు. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి! రావి:  బుద్ధునికి జ్ఞానోద‌యాన్ని క‌లిగించిన వృక్షమిది. .జీర్ణసంబంధ‌మైన ఇబ్బందులు ఉన్నవారి కోసం ఆయుర్వేదంలో రావిని విరివిగా వాడ‌తారు. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి! మ‌ద్ది: మ‌ద్దిలో రెండు ర‌కాలున్నాయి. తెల్లమ‌ద్ది, న‌ల్లమ‌ద్ది! మ‌నం పూజ కోసం సాధార‌ణంగా తెల్లమ‌ద్ది ప‌త్రాల‌ను వాడ‌తాము. వ్రణాల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేందుకు తెల్లమ‌ద్ది ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి! జిల్లేడు: చ‌ర్మవ్యాధుల‌కే కాకుండా న‌రాల‌కు సంబంధించిన తిమ్మిర్లు, ప‌క్షవాతం వంటి రుగ్మత‌ల‌ను హ‌రించ‌డంలో జిల్లేడుది గొప్ప పాత్ర‌. అయితే జిల్లేడుని కానీ, ఆ మాట‌కి వ‌స్తే ఏ ఇత‌ర ఔష‌ధిని కానీ పూర్తి ప‌రిజ్ఞానం లేకుండా ఉప‌యోగించ‌కూడ‌దు.   -నిర్జర‌      

ఇంట్లో తింటేనే ఆరోగ్యం, పొదుపు

  ఇప్పుడు జీవితమంతా పరుగులమయం. ఈ పరుగుల మధ్య కావల్సినంత డబ్బయితే సమకూరుతోంది కానీ ఇంటిపని చేసుకునేంత తీరిక కానీ ఓపిక కానీ మిగలడం లేదు. దాంతో ఆ డబ్బుతోనే కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాం. రోజంతా ఎలాగూ కష్టపడ్డాం కదా అని బయటే తినేస్తున్నాం. దీని వల్ల డబ్బుకి డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం వృధా అయిపోతున్నాయని నిపుణులు నొచ్చుకొంటున్నారు.   దాదాపు మూడేళ్ల క్రితమే ఇంటి వంట గురించి ఓ పరిశోధన జరిగింది. ఓ తొమ్మిదివేల మంది మీద జరిగిన ఈ పరిశోధనలో ఇంట్లో వండుకునే వంటలో చక్కెర, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. అంటే ఇంటి వంట ఎక్కువ పోషకాలను అందిస్తూ, తక్కువ కెలోరీలని ఇస్తుందన్నమాట. దీని వల్ల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు కదా! ఇంటి వంట అనగానే కాస్త పరిశుభ్రమైన రీతిలో వండుకుంటాం. అందులో ఎంత ఉప్పు పడుతోంది, ఎంత నూనె వేస్తున్నాం, మసాలా వేయాలా వద్దా... లాంటి విషయాలన్నీ మన విచక్షణకు అనుగుణంగానే ఉంటాయి. బయట వండేవారు కేవలం రుచిని, లాభాన్నీ మాత్రమే పట్టించుకుంటారు కదా!   ఇంటి వంట భేషైనది అని చెప్పేందుకు తాజాగా మరో పరిశోధన కూడా జరిగింది. University of Washington Health Sciences చేసిన ఈ పరిశోధన కోసం 437 మందిని ఎన్నుకొన్నారు. వీరు ఒక వారంలో ఇంటి వంట ఎన్నిసార్లు తిన్నారో, అందులో ఎలాంటి ఆహారం ఉంది అని వాకబు చేశారు. ఈ ఆహారాన్ని healthy eating index అనే ఓ జాబితాతో పోల్చి చూశారు.   మన ఆహారంలో పళ్లు, కూరగాయలు, పాలపదార్థాలు, తృణ ధాన్యాలు, ఉప్పు, పప్పులు... ఇలా ఏ పదార్థం ఏ మోతాదులో ఉంటే బాగుంటుందో సూచించే జాబితానే ఈ healthy eating index. దీని ద్వారానే అమెరికా ప్రభుత్వం తమ పౌరుల ఆరోగ్యానికీ- ఆహారానికీ మధ్య సంబంధాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది. వారానికి మూడు రోజులే ఇంట్లో వండుకునేవారితో పోలిస్తే, వారంలో ఆరు రోజులపాటు ఇంటి వంటను తినేవారు healthy eating indexలో ఎక్కువ మార్కులను సాధించినట్లు తేలింది. పోషకాల తక్కువైతే మాత్రమేం! బయట తినడం వల్ల ఖర్చు మాత్రం విపరీతంగా అవుతోందని పరిశోధకులు గ్రహించారు.   బయట తిండికి సంబంధించి పరిశోధకులు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తేల్చారు. - చవకబారు ఫాస్ట్‌ఫుడ్స్ తినడంలో పేదవారే ముందుంటారని అందరూ అనుకుంటారు. నిజానికి పేదాగొప్పా అన్న తారతమ్యం లేకుండా అంతా ఒకేలా ఈ చిరుతిళ్లని తింటున్నారని బయటపడింది. - 1970లతో పోలిస్తే బయట ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు చేరుతున్నాయని గమనించారు. - ఎక్కువమంది పిల్లలు ఉన్న ఇళ్లలో.... ఇంటి వంటకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది.   - నిర్జర.

కొంతమందికి స్వీట్స్ అంటే ఎందుకంత ఇష్టం?

  ‘వీడు అన్నంకంటే చాక్లెట్లే ఎక్కువ తింటాడు?’, ‘వాడు రోజుకి పావుకిలో స్వీట్స్ తింటుంటాడు’... లాంటి మాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. జిలేబీ బండినో, స్వీట్ షాపునో చూడగానే ఆగిపోయే మనుషులూ మనకి తెలుసు. ఇంతకీ మనలో కొందరికి తీపి అంటే ఎందుకంత ప్రాణం. మరికొందరు స్వీట్స్‌ అంటే ఎందుకంత నిస్తేజంగా ఉంటారు. దీని వెనుక కేవలం మన అభిరుచులే కారణమా?   తీపి పట్ల కొందరికి ఎక్కువ ఇష్టం ఉండటానికి జన్యుపరమైన కారణం ఏమన్నా ఉందేమో కనుక్కొనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ఎలుకలలోనూ, కోతుల్లోనూ చేసిన పరిశోధనల్లో FGF21 అనే జన్యువు ఈ విషయంలో చాలా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. కాలేయంలో ఉత్పత్తి అయ్యే ఈ జన్యువుకి తీపి పదార్థాలని దూరంగా ఉంచే సామర్థ్యం ఉందట. అంటే ఈ జన్యువు సవ్యంగా ఉన్నవారు తక్కువ తీపిని తింటారన్నమాట.   తీపి గురించి జంతువుల మీద చేసిన ప్రయోగం మనుషుల విషయంలో రుజువవుతుందా లేదా తెలుసుకోవాలనుకున్నారు డెన్మార్కు దేశపు శాస్త్రవేత్తలు. దీనికోసం వారు Inter 99 study పేరుతో 6,500 మందిని ఎన్నుకొన్నారు. వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు... లాంట వివరాలన్నీ సేకరించారు. వారిలో FGF21 జన్యువు ఏ తీరున ఉందో గమనించారు.   తీపంటే బాగా ఇష్టపడేవారిలో FGF21లో మార్పులు ఉన్నట్లు తేలింది. ఇలాంటివారు 20 శాతం ఎక్కువగా తీపిని ఇష్టపడుతున్నారట. FGF21 జన్యవు సవ్యంగా ఉన్న వ్యక్తులలోనేమో, తీపిపదార్థాలు తినకుండా ఆ జన్యవు ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. ఈ జన్యువులో మార్పు ఉన్న వ్యక్తులు కేవలం తీపిని ఇష్టపడటమే కాదు... మద్యపానం, పొగతాగడం ఎక్కువగా చేయడాన్ని కూడా గమనించారు.   స్వీట్స్ పట్ల వ్యసనానికి మనలోని ఒక జన్యులోపమే కారణం అని తేలిపోయింది. భవిష్యత్తులో ఈ లోపాన్ని మందులతో సరిదిద్దే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అప్పటివరకు ఎలాగొలా తీపి పట్ల వ్యామోహాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయమని సూచిస్తున్నారు. ఊబకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్... లాంటి నానారకాల సమస్యలకూ తీపి కారణం అవుతోందని హెచ్చరిస్తున్నారు. వినడానికి బాగానే ఉంది కానీ... తీపికి అలవాటు పడ్డ నాలుకని అదుపుచేయడం అంత సాధ్యం కాదని శాస్త్రవేత్తలే సెలవిస్తున్నారు కదా!   - నిర్జర.

ఉపాధ్యాయుల ఆరోగ్యం... అంతంతమాత్రమే!

  తనకు తెలిసిన జ్ఞానాన్ని పదిమందితోనూ పంచుకోవాలనుకునేవాడు గురువు. ఆ తపనలోనే తన జీవితాన్ని కరిగించి వేస్తుంటాడు. మన కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమిస్తుంటాడు. తరగతిగదిలో ఉపాధ్యాయుడి తీరుని కనుక గమనిస్తే, రకరకాల రోగాలు ఆయనను చుట్టుముట్టేందుకు ఎలా సిద్ధంగా ఉన్నాయో అవగతం అవుతుంది.   నిలబడే ఉండటం వల్ల: ఒక్క అరగంటపాటు నిల్చొని ఉండమంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అలాంటిది దాదాపు ఆరేడు గంటల పాటు నిర్విరామంగా నిలబడి ఉండటం అంటే మాటలా! నిరంతరం ఇలా నిలబడి ఉంటడంతో మోకాలి నొప్పులు, వెరికోస్‌ వెయిన్స్‌ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అరగంటికి ఒకసారన్నా కాస్త అటూఇటూ తిరగడం, కాలికి సంబంధించిన వ్యాయామాలు చేయడం, వదులైన దుస్తులు వేసుకోవడం, శరీర బరువుని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు.    అందరిలో తిరగడం వల్ల: బడి/ కళాశాలలో అన్ని రకాల మనుషులూ, అన్ని రకాల క్రిములనూ మోసుకువస్తుంటారు. దీనివల్ల సాధారణ జలుబు మొదలుకొని, హెపిటైటిస్‌ వంటి వ్యాధుల వరకూ ఉపాధ్యాయులకు సోకే అవకాశాలు ఎక్కువ. అందుకని తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఏ రోజు దుస్తులు ఆ రోజు వేసుకోవడం వంటి వ్యక్తిగత శుభ్రతకి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. వ్యాయామం చేయడం, పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధకశక్తి అదుపులో ఉంటుంది.   దుమ్మూ ధూళి వల్ల: పాతకాలం బ్లాక్‌బోర్డులు, చాక్‌పీసుల వల్ల ఊపిరితిత్తులలోకి దుమ్ము చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఇక బడిలోని ఆటస్థలం, తరగతి గదులు, ల్యాబొరేటరీ అపరిశుభ్రంగా ఉన్నా కూడా వాటి ప్రభావం ఉపాధ్యాయుల ఆరోగ్యం మీద పడి తీరుతుంది. కాబట్టి తమ అనారోగ్యానికి కారణంగా ఉన్న పరిస్థితులను ఓసారి పాఠశాల అధికారుల దృష్టికి తీసుకురావడంలో తప్పులేదు.   నిరంతరం అరవడం వల్ల: పాఠం అన్న మాట వినిపించగానే ఖంగుమంటూ వినిపించే స్వరాలే గుర్తుకువస్తాయి. విషయం పిల్లలందరికీ సూటిగా, స్పష్టంగా వినిపించాలనే తపనతో ఉపాధ్యాయులు గొంతు చించుకుని పాఠాలు చెబుతూ ఉంటారు. దీని వల్ల 58% ఉపాధ్యాయులలో స్వరసంబంధమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఓ పరిశోధనలో తేలింది. గొంతు పొడిబారిపోకుండా తరచూ నీరు తాగుతూ ఉండటం, గొంతులో ఎలాంటి మార్పులు వచ్చినా వైద్యుని సంప్రదించడం, మైక్రోఫోన్‌ వంటి పరికరాలు వాడటం, అవసరం అనుకున్నప్పుడు తప్ప హెచ్చుస్థాయిలో మాట్లాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే, గురువుగారి గొంతు ఖంగుమంటూనే ఉంటుందని సూచిస్తున్నారు.   ఒత్తిడికి లోనవ్వడం వల్ల: వందల మంది పిల్లలకి చదువు చెప్పాలి, వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలి, పాఠాలను సకాలంలో పూర్తిచేయాలి, వారి మార్కులకి బాధ్యత వహించాలి, వారి ప్రవర్తనను కూడా గమనించుకోవాలి.... ఇలా పిల్లలకు సంబంధించిన ఒత్తిడి ఉపాధ్యాయుల మీద చాలా తీవ్రంగానే ఉంటుంది. అందుకనే ప్రతి పది మందిలో ఎనిమిదిమంది ఉపాధ్యాయులు ఒత్తిడికి లోనవుత్తున్నారంటూ పరిశోధనలు పేర్కొంటున్నాయి. ధ్యానంతో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, చేస్తున్న పనిని ఆస్వాదించడం, విద్యార్థులతో కలివిడిగా ఉండటం, తరగతి గదిలో హాస్యాన్ని పండించడం వంటి మార్పులతో ఈ ఒత్తిడి నుంచి వీలైనంత దూరంగా ఉండవచ్చు. ఇవీ ఉపాధ్యాయుల ఎదుర్కొనే కొన్ని సమస్యలు, వాటికి ఉపాయాలు. ఏవో వారి మీద అభిమానం కొద్దీ మనం ఈ సూచనలు చేస్తున్నాం కానీ వారికి చెప్పేంతటి వారమా!    - నిర్జర.

వెన్నలాంటి ఆరోగ్యం!

  ఒకప్పుడు ప్రతి ఇంటా వెన్న చిలికే అలవాటు ఉండేది. పిల్లలు గోరుముద్దలకంటే ఇష్టంగా వెన్నముద్దలనే తినేవారు. వంట చేయడం దగ్గర్నుంచీ ఒంటికి పట్టించడం వరకూ వెన్నని అన్ని రకాలుగానూ వాడుకునేవారు. కానీ రానురానూ ఒపికలు తగ్గిపోయాయి. ఆహారపు అలవాట్లు మారిపోయాయి. జీవనశైలి తలకిందులైపోయింది. ఇప్పుడు వంటింట్లోంచి వెన్న మాయమైపోయింది. కానీ వెన్న వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలుస్తున్న తరువాత మళ్లీ వెన్నని వాడేందుకు జనం ఉత్సాహపడుతున్నారు. ఆ ఆరోగ్య రహస్యాలు ఏమిటంటారా!   గుండెకు మంచిది! వెన్నలో విటమిన్‌ ఏ చాలా అధికమొత్తంలో ఉండటమే కాదు, చాలా త్వరగా శరీరంలో కలిసిపోతుంది కూడా! గుండె, కండరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ విటమిన్‌ ఏ చాలా అవసరం. పైగా వెన్నలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కూడా గుండెను దృఢంగా ఉంచుతాయి. విటమిన్‌ ఏ వలన కేవలం గుండెకు మాత్రమే కాదు... థైరాయిడ్‌, అడ్రినల్‌ గ్రంథులు సరిగా పనిచేసేందుకు కూడా చాలా అవసరం.   కొవ్వు పెరగదు వెన్న అన్న మాట వినగానే, అది కొవ్వుని పెంచుతుందేమో అన్న అపోహ సహజం! నిజానికి వెన్నలో ఉండే కొవ్వు పదార్థాల నిర్మాణం, త్వరగా కరిగిపోయేలా రూపొందించబడ్డాయి. దీంతో వెన్నని తినడం వల్ల ఆకలి తీరినట్లు అనిపిస్తుందే కానీ, కొవ్వు మాత్రం పేరుకోదు. అంతేకాదు! మంచి కొలెస్ట్రాల్‌ ఉన్న ఈ వెన్నని తినడం వల్ల పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ దృఢంగా రూపొందడానికి దోహదపడుతుంది.   పెరుగుదలకు అవసరం వెన్నలో ఉన్న విటమిన్‌ A,D,E,K2 లు పిల్లల సమగ్రమైన ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లల్లో పళ్లు, ఎముకలు బలంగా ఉండేందుకు ఇవి సాయపడతాయి. గర్భిణీ స్త్రీలలో కనుక విటమిన్‌ ఏ తగినంత లేకపోతే, వారికి పుట్టే పిల్లల్లో అంధత్వం, ఎదుగుదల సరిగా లేకపోవడం.... వంటి అనేక సమస్యలు కలిగే ప్రమాదం ఉంది. వారు కనుక తరచూ వెన్నని తీసుకుంటే, పుట్టే పిల్లల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడవంటున్నారు పోషకాహార నిపుణులు.   కీళ్ల సమస్యలు రాకుండా! ఇప్పుడు ఆడామగా, చిన్నపెద్దా అన్న తేడా లేకుండా అందరికీ ఏవో ఒక కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. వీటికి విరుగుడుగా పనిచేసే ఒక దివ్యౌషధం వెన్నలో ఉందని తేలింది. వెన్నలో ఉండే ‘Wulzen Factor’ అనే ఒక పోషకం కీళ్ల దగ్గరా, రక్తనాళాలలోనూ కాల్షియం పేరుకుపోకుండా కాపాడుతుందట. పైగా ఇందులో ఉండే డి విటమిన్‌, మన శరీరానికి తగిన కాల్షియం అందేలా సాయపడుతుంది.   క్యాన్సర్‌ను సైతం! వెన్నలో రకరకాల విటమిన్లు, ఖనిజాలు ఎలాగూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటికి తోడు ఇందులో ఉండే సెలేనియం అనే అరుదైన యాంటీఆక్సడెంట్‌ మనల్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతుందని తేలింది. ఇక వెన్నలో కనిపించే conjugated linoleic acids అనే పదార్థాలు మనల్ని క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయని నిపుణులు సాధికారంగా చెబుతున్నారు. ఇదీ విషయం! ఇలా చిలుకుతూ పోతే వెన్నతో మరెన్నో లాభాలు ఉన్నాయన్న విషయాలు బయటపడుతూనే ఉంటాయి. కాబట్టి... ఈ కృష్ణాష్టమి నుంచైనా మన నిత్యజీవితంలో ఎంతో కొంత వెన్న ఉండేలా జాగ్రత్త పడదాము.   - నిర్జర.

లైటెనింగ్ రాడ్ - విటమిన్ ఈ

      మన శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే కాని అందులో విటమిన్ 'ఈ' కి పెద్ద పీట వెయ్యాలి. ఇది మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. అందుకే దీనిని లైటెనింగ్ రాడ్ అంటారు. అంతేకాదు యాంటి ఆక్సిడెంట్ లా ఉపయోగపడుతుంది. రక్తకణాలని వృద్ది చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే విటమిన్ ఈ వల్ల వచ్చే లాభాలు ఎన్నెన్నో. విటమిన్ ఈ ముఖ్యంగా కొవ్వులో కరిగిపోయే విటమిన్. స్థూలకాయుల రక్తంలోనూ  విటమిన్ ‘ఈ’ ఉంటుంది, కానీ కొవ్వు అధికంగా నిల్వ ఉండే శరీరాల్లో మాత్రం విటమిన్ ‘ఈ’ లోపించి ఉంటుందని పరిశోధకులు చెప్తునారు. ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే విటమిన్ ఈ వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దామా.     ఊబకాయానికి: కొవ్వు అధికంగా ఉన్నవారికి విటమిన్ ‘ఈ’ అందిస్తే అధిక బరువు సమస్యను నియంత్రించవచ్చునని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.ఎందుకంటే దీనికి కొవ్వుని కరిగించే శక్తి ఉంది. ఇలాంటివారు పొద్దుతిరుగుడు ఉత్పత్తులు, తృణ ధాన్యాలు ఎక్కువ శాతం తీసుకుంటే మంచిది.   చర్మ సంరక్షణకి: సాధారణంగా అన్ని సౌందర్య ఉత్పత్తుల తయారిలోనూ విటమిన్ ఈ ని వాడతారు. ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తి దీనిలో ఎక్కువగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారు విటమిన్ ఈ ని తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. విటమిన్ ఈ కాప్సుల్ ని మొహానికి రాసుకుని పావుగంట తర్వాత మొహం కడుకుంటున్నా మోహంలో నిగారింపు వస్తుందిట.   యాంటి ఆక్సిడెంట్: దీనిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కేన్సర్ కారకాలను దూరం చేస్తాయి. రోగానిరోధకశక్తిని  పెంచుతాయి. మతిమరపు సమస్య కూడా దూరం అవుతుంది. కంటి చూపు స్వస్థతకి కూడా ఉపయోగపడుతుంది.     రక్తకణాల వృద్ధి కోసం: విటమిన్ ఈ తీసుకోవటం వల్ల ఒంట్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రక్త నాళాలలో రక్తం ముద్దగా  కాకుండా చూసుకుంటుంది. అంతేకాదు మెనోపాజ్ స్టేజ్ లో మహిళలకు వచ్చే సమస్యలని కూడా తగ్గిస్తుందిట.   కీళ్ళ నొప్పులకు: ఈ రోజుల్లో ఈ కీళ్ళ నొప్పులు అందరిలోనూ కామన్ అయిపోయాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ ఈ లోపించటమే. విటమిన్ ఈ ఈ నొప్పులను తగ్గించటమే కాదు కండరాలని  కూడా ద్రుఢ పరుస్తుంది. వయసు పైబడుతున్నవారు విటమిన్ ఈ ని ఎక్కువగా తీసుకోవాలాట. అది ఎదిగే పిల్లలకు కూడా ఎంతో అవసర పడుతుందని చెప్తున్నారు నిపుణులు.   ఆలివ్ నూనెలో, ఆకుకూరల్లో, పోద్దుతిరుగుడులో, నట్స్ లో, గుమ్మడికాయలో, చిలకడదుంప లో, రాక్ ఫిష్ లో, బొప్పాయి వంటి వాటిలో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. చక్కగా ఇవన్ని తిని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ హాపీగా జీవిద్దాం. - కళ్యాణి