పొడిబారే కళ్లు – Dry Eyes Syndrome

పొడిబారే కళ్లు – Dry Eyes Syndrome

 


కంటి నీరు కేవలం మన బాధనో సంతోషాన్నో వ్యక్తం చేసేందుకే ఉపయోగపడదు. దాని వెనక బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. కంటికి కావల్సిన తేమని అందించడం, కంట్లో ఏర్పడే దుమ్మూధూళి కణాలను బయటకి పంపేయడం, కనుపాపని సూక్ష్మక్రిముల నుంచి కాపాడటం... ఇలా కళ్లు చెమ్మగిల్లుతూ ఉండటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కానీ కొంతమందికి కంట్లో తేమే ఏర్పడదు. అదే DRY EYE SYNDROME.

 

ఇవీ లక్షణాలు
- కంట్లో ఏదో పడినట్లు గరగరలాడుతూ ఉండటం.
- తేమ లేకపోవడం వల్ల కళ్లు ఎర్రబారిపోవడం.
- చూపులో స్పష్టత లేకపోవడం, కాంతిని చూడలేకపోవడం.
- కళ్లు లాగుతున్నట్లుగా దురదగా అనిపించడం.
- అకస్మాత్తుగా కళ్లవెంబడి నీరు కారడం.

 

ఇవీ కారణాలు
- వయసు పైబడే కొద్దీ Dry Eyes సమస్య ఏర్పడే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా మెనోపాజ్ దశని దాటిన స్త్రీలలో ఈ సమస్య   అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో శరీరంలోని హార్మోనుల పనితీరులో మార్పులు రావడం వల్ల ఇలా జరుగుతుంది.
- అలెర్జీల కోసం వాడే యాంటీహిస్టామిన్స్ వంటి మందుల వల్ల.
- కీళ్లజబ్బులు వంటి వ్యాధులు కూడా ఒకోసారి ఈ Dry Eyesను కలిగిస్తాయి.
- సుదీర్ఘకాలం కాంటాక్ట్‌ లెన్స్‌లను పెట్టుకోవడం.
- గంటల తరబడి కంప్యూటర్‌ స్క్రీన్‌ను చూస్తూ ఉండటం.
- కళ్లు ఆర్పే అలవాటు తక్కువగా ఉండటం.
- ధైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తగిన చికిత్స తీసుకోకపోవడం.
- విటమిన్‌ ఏ లోపం.
- తేమ తక్కువగా ఉన్న ప్రదేశాలలో నివాసం.
- చలికాలంలో నిరంతరం రూం హీటర్లు వేసుకుని ఉండటం.
 

 

చికిత్స
Dry Eyesకు శాశ్వతమైన నివారణ అంటూ ఏమీ లేదు. కాకపోతే తాత్కాలిక ఉపశమనం కోసం వైద్యులు ఐడ్రాప్స్‌ను వాడమని చెబుతారు. పాశ్చాత్య దేశాలలో అయితే Tear plugs, lipiflow వంటి చిన్నపాటి శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ మన దేశంలో ఇలాంటి చికిత్సలు తక్కువ. విటమిన్ ఏ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కొంతకాలానికి ఉపశమనం కలగవచ్చు.

 


Dry Eyes సమస్య కంటిచూపుని దెబ్బతీసేంత ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ దీని వలన కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. కాబట్టి ఈ సమస్య రాకుండానే జాగ్రత్తపడాలి. కంప్యూటర్‌ స్క్రీన్‌ వంక కళ్లని ఆర్పకుండా తదేకంగా గంటల తరబడి గడిపే అలవాటు మానుకోవాలి. దీంతో పాటుగా మంచి ఆహారం, తగినంత నీరు తీసుకుంటూ ఉంటే సమస్య అసలు మన దరికి చేరకపోవచ్చు.

 

- నిర్జర.